సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శ్రీనీలకంఠ రామచంద్ర సహస్రబుద్ధే



శ్రీసాయిబాబా సశరీరులుగా ఉండగా వారిని దర్శించుకుని సేవించుకున్న భాగ్యశాలి శ్రీనీలకంఠ రామచంద్ర సహస్రబుద్ధే అలియాస్ బాబాసాహెబ్ సహస్రబుద్ధే. మొదట్లో అతనికి బాబాపట్ల విశ్వాసం ఉండేది కాదు. 1910వ సంవత్సరం డిసెంబరు నెల ప్రారంభంలో ఒక శనివారం రాత్రి అతను బాంద్రాలోని ఒక సోదరుని ఇంట్లో పంచదశి పారాయణ చేస్తుండగా, సుమారు 11 గంటల ప్రాంతంలో కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చందోర్కర్‌లు ముంబాయి నుండి విల్లేపార్లే వెళుతూ ఆకస్మికంగా అక్కడికి వచ్చారు. కాసేపు కుశల సమాచారాలు మాట్లాడుకున్నాక, “మీరు ఎప్పుడు శిరిడీ వెళతారు?” అని సహస్రబుద్ధేను అడిగాడు చందోర్కర్. అందుకతను, “ఏదో ఒకరోజు వెళ్తాను" అని బదులిచ్చాడు. నిజానికి వాళ్ళు ‘శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకోమ’ని సహస్రబుద్ధేకు అదివరకు చాలాసార్లు చెప్పారు. కానీ అతను వెళ్ళలేదు. ఇప్పుడు అతనిచ్చిన సమాధానాన్ని బట్టి ఈసారి కూడా అతనికి శిరిడీ వెళ్లే ఉద్దేశ్యం లేదని గ్రహించిన చందోర్కర్, దీక్షిత్‌లు, "రేపే బయలుదేరి శిరిడీ వెళ్ళమ"ని పట్టుబట్టారు. "నేను సోమవారం పెన్షను తీసుకొని శిరిడీ బయలుదేరుతాను” అని సమాధానమిచ్చాడు సహస్రబుద్ధే. అయితే దీక్షిత్, చందోర్కర్‌లకు అతనిని శిరిడీకి పంపించాలని ఎంతో ఆరాటం. ముఖ్యంగా నానాసాహెబ్ చందోర్కర్ ఆరాటం ఎంత విలక్షణంగా ఉందంటే, అతనికి సహస్రబుద్ధేతో పెద్దగా పరిచయం లేకపోయినప్పటికీ వెంటనే శిరిడీ ప్రయాణానికయ్యే ఖర్చుల కోసం అతనికి పది రూపాయలిచ్చి, "మీ పెన్షన్ అన్నాసాహెబ్ దభోల్కర్ తీసుకొనేలా ఏర్పాటు చేస్తాను" అని చెప్పాడు. అలా డబ్బు తీసుకోవడం సరైన పద్ధతి కాదని సహస్రబుద్ధేకు అనిపించినప్పటికీ, చందోర్కర్ సదుద్దేశ్యాన్ని గ్రహించిన మీదట అందుకు అంగీకరించాడు. కానీ “శిరిడీలో ఎక్కువ రోజులు ఉండవలసి వస్తే పది రూపాయలు ఎలా సరిపోతాయ”నే ప్రశ్న అతని మదిలో తలెత్తింది. అంతలో, సహస్రబుద్ధేను పరిచయం చేస్తూ, అతను శిరిడీలో ఉండటానికి అవసరమైనంత డబ్బివ్వమని మాధవరావు దేశ్‌పాండే(షామా)కి ఒక లేఖ వ్రాసి, ఆ లేఖను సహస్రబుద్ధే చేతికి ఇచ్చాడు దీక్షిత్. ఇక సహస్రబుద్ధేకు వేరే దారిలేక, వారివురికి ఎదురుచెప్పలేక వాళ్ళు చెప్పినట్లు శిరిడీ వెళ్ళడానికి అంగీకరించి మరుసటిరోజు సాయంకాలం బయలుదేరి, మన్మాడ్ వెళ్లే మెయిల్ ఎక్కి కూర్చున్నాడు. ఆ బోగీలో MA పూర్తిచేసి, ఎల్.ఎల్.బి పరీక్షలకు హాజరుకాబోతున్న కోపర్‌గాఁవ్‌కి చెందిన ఒక యువకుడు ఉన్నాడు. మాటల సందర్భంలో సహస్రబుద్ధే అతనిని, “శిరిడీలోని సాయిబాబా గురించి నీకేమైనా తెలుసా?” అని అడిగాడు. అందుకతను, “ఆ పిచ్చిఫకీరు గురించి నాకు బాగా తెలుసు” అని బదులిచ్చాడు. అది విన్నాక అప్పటివరకు ‘శిరిడీ వెళ్లడం పిచ్చి పని’ అన్న సహస్రబుద్ధే భావన మరింత దృఢపడింది.


మరుసటిరోజు, అనగా 1910, డిసెంబరు 5, సోమవారం ఉదయానికి సహస్రబుద్ధే కోపర్గాఁవ్ చేరుకొని రైలులో కలిసిన నూతన మిత్రునితో కలిసి టీ త్రాగి, టాంగా ఎక్కి సుమారు 9-10 గంటలకు శిరిడీ చేరుకున్నాడు. టాంగావాడు అతన్ని సాఠేవాడా వద్దకు తీసుకువెళ్ళాడు. అక్కడ మాధవరావ్ దేశ్‌పాండే గురించి విచారిస్తుండగా, లోపల హాలులో కూర్చొని ఉన్న శ్రీలక్ష్మణ్ కృష్ణాజీ ఉరఫ్ తాత్యాసాహెబ్ నూల్కర్ మీద అతని దృష్టి పడింది. వారివురు పూనా హైస్కూలులో సహాధ్యాయులు, సన్నిహిత మిత్రులు. కానీ స్కూల్ విడిచిన తర్వాత సుమారు 25-30 సంవత్సరాలపాటు వాళ్ళు ఒకరినొకరు కలుసుకోలేదు. అంతకాలం తరువాత తన మిత్రుని చూసినంతనే సహస్రబుద్ధే ఆనందంతో నూల్కరును పేరు పెట్టి పిలిచి పలకరించాడు. కానీ నూల్కర్ అతన్ని గుర్తుపట్టలేకపోయాడు. ఆ కారణంగా వారివురి మధ్య కాసేపు వినోదపూరితమైన సంభాషణ నడిచింది. నూల్కర్ అతనితో, "మీరు నన్ను గుర్తించారనడంలో సందేహం లేదు. కానీ నేను మిమ్మల్ని గుర్తుపట్టలేనందుకు నన్ను క్షమించండి" అని అన్నాడు. అప్పుడు సహస్రబుద్ధే, "ఒక్కసారి మీ శరీరాకృతిని (నూల్కర్ పొట్టిగా, లావుగా ఉండేవాడు.) చూసినవారెవరూ మిమ్మల్ని మరచిపోలేరు. కానీ నాలాంటివాళ్ళు వందల సంఖ్యలో ఉంటారు. పైగా మనం కలుసుకుని సుమారు 25-30 సంవత్సరాలు అవుతోంది. అందువల్ల మీరు నన్ను గుర్తుపట్టలేకపోవడం చాలా సహజం. కానీ, ‘పూనా హైస్కూల్లో మీకు బాగా తెలిసిన నీలకంఠ సహస్రబుద్ధేను నేను’ అని చెప్పినట్లైతే మీరు వెంటనే నన్ను గుర్తుపట్టగలరు చూడండి" అని అన్నాడు. ఆ మాటలు వింటూనే నూల్కర్ పట్టలేని ఆనందంతో ఒక్క ఉదుటన లేచి సహస్రబుద్ధేను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఒకరి క్షేమసమాచారాలు ఒకరు విచారించుకున్న తర్వాత సహస్రబుద్ధే తను శిరిడీకి ఎలా వచ్చిందీ నూల్కరుకు వివరిస్తూ, చందోర్కర్ మరియు దీక్షిత్‌లు పట్టుబట్టి ప్రయాణ ఖర్చులకు డబ్బులివ్వడమే కాకుండా మాధవరావు దేశ్‌పాండేకి పరిచయలేఖ కూడా ఇచ్చినట్లు చెప్పాడు. అయితే, స్నేహితుని బాధ్యతను తాను తీసుకోవడం తన హక్కుగా భావించిన నూల్కర్, "నేను తప్పకుండా మాధవరావు దేశ్‌పాండేకు కబురుపెడతాను. అయితే నీవు నా అతిథివి. శిరిడీలో నీవు సుఖంగా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం నా బాధ్యత" అని చెప్పి, సహస్రబుద్ధేను తన వద్దనే కూర్చోబెట్టుకుని, మాధవరావు దేశ్‌పాండేని పిలిపించి, సహస్రబుద్ధేని పరిచయం చేసి, విషయమంతా వివరించాడు. ఇంతలో బాపూసాహెబ్ జోగ్ అక్కడికి రావడంతో జోగ్‌ను సహస్రబుద్ధేకు పరిచయం చేశాడు నూల్కర్.


ఆ తర్వాత సహస్రబుద్ధే స్నానపానాదులు ముగించిన మీదట నూల్కర్ అతనిని వెంటబెట్టుకొని బాబా దర్శనార్థం మధ్యాహ్న ఆరతి సమయానికి మసీదుకు వెళ్లాడు. ముందుగా నూల్కర్ బాబా చరణాలపై శిరస్సునుంచి నమస్కారం చేసి ఒకప్రక్కన నిల్చున్నాడు. అతనిని అనుసరిస్తూ సహస్రబుద్ధే కూడా బాబా పాదాలకు నమస్కరించాడు. వెంటనే బాబా అతనితో, "తాత్యాబాకు(నూల్కర్‌ను బాబా ఆప్యాయంగా ‘తాత్యాబా’ అని పిలిచేవారు.) నమస్కరించు, బాపూసాహెబ్‌(జోగ్)కు నమస్కరించు! అందులో మనకు చిన్నతనమేమీ లేదు” అని అన్నారు. బాబా చెప్పిన విధంగా సహస్రబుద్ధే వారిద్దరికీ నమస్కారం చేశాడు. తరువాత బాబా అతనితో, "తాత్యాబాను సేవించుకో!” అని అన్నారు. అలా వరుసగా రెండోరోజు, మూడోరోజు కూడా మధ్యాహ్న ఆరతి సమయంలో సహస్రబుద్ధేను ఉద్దేశించి బాబా అవే మాటలు ("తాత్యాబాను సేవించుకో!”) అన్నారు. ఒకే స్థాయికి చెందిన ఇద్దరు స్నేహితులలో, ఒకరు మరొకరిని సేవించుకోమనడంలోని అంతరార్థమేమిటో ఎవరికీ బోధపడలేదు. కానీ బాబా మాటలు అగాధాలు కదా! సమయం సందర్భం వచ్చినప్పుడు మాత్రమే వారి మాటలలోని సత్యాలు అవగాహనమవుతాయి.


అదివరకే హుబ్లీకి చెందిన శ్రీసిద్దారూఢస్వామి, ఎలిచ్‌పూర్‌కి చెందిన శ్రీశంకర్ భట్‌జీ, పలూస్‌కి చెందిన గోండీబాబా మరియు సుమారు ఇరవై, ఇరవై రెండు సంవత్సరాలకు పూర్వం పూణేలోని సోమేశ్వర దేవాలయంలో కొన్నిరోజులు నివాసమున్న నిజమైన పరమహంస వంటి పురుషశ్రేష్ఠుల దర్శనంతో వేదాంత గ్రంథాలలో చెప్పిన విధంగా ‘సత్పురుషులు ఈ జగత్తులో ఉన్నార’నే భావన సహస్రబుద్ధేకి దృఢమై ఉన్నప్పటికీ, బాబా సమర్థత పట్ల నమ్మకం లేకపోవడంతో వారి మాటలలోని అంతరార్థమేమిటో గ్రహించలేక, "తాత్యాబాను సేవించుకో!” అని బాబా ఆదేశించినప్పటినుండి, "మీ గురువుగారి(బాబా) ఆదేశం మేరకు నేను మీకు ఏ సేవ చేయాలి?" అంటూ పదేపదే ఎగతాళిగా నూల్కర్‌ను అడుగుతుండేవాడు. స్నేహితుని ఎగతాళి మాటలను మౌనంగా భరిస్తున్న నూల్కర్ చివరికి ఒకరోజు అతనితో, “బాబా ఆజ్ఞలోని అంతరార్థమేమిటో వారికే ఎఱుక. సమయం వచ్చినప్పుడు మనకూ తెలుస్తుంది. నీవూ, నేనూ ఒకే స్థాయికి చెందినవాళ్ళం. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను పూర్తిగా బాబా ప్రేమలో లీనమైపోయాను. బహుశా నీవు కూడా త్వరలోనే అలా కావచ్చు. ఏదేమైనా ఈ ఎగతాళి మాటలను మాత్రం దయచేసి ఇంతటితో ఆపేయి. ఆ మాటల వల్ల నాకు చాలా బాధ కలుగుతోంది" అని అన్నాడు. స్నేహితుని మనసును అర్థం చేసుకున్న సహస్రబుద్ధే అంతటితో నూల్కరును ఎగతాళి చేయడం ఆపేశాడు.


సహస్రబుద్ధే తిరుగు ప్రయాణం గురించి అతని తరఫున షామా మూడు నాలుగు రోజులకొకసారి బాబాను అడుగుతుండేవాడు. మొదటిసారి అడిగినప్పుడు బాబా, “నాలుగురోజులుండి వెళ్లమను!” అన్నారు. నాలుగు రోజుల తర్వాత అడిగితే మళ్ళీ 'నాలుగు రోజులుండి వెళ్ళమ'నే సమాధానమిచ్చారు బాబా. ఇలా రెండు మూడు వాయిదాలైన తర్వాత ఒకరోజు షామాతో, "మనకి అతనితో పని ఉంది. అతన్ని మశీదు ముందు కుక్కలా పడుండనీ! ఎక్కడికీ వెళ్లడానికి వీల్లేదు. ముందు ముందు వాడి అవసరం మనకెంతో వుంది. వాడు పెద్దపెద్ద కార్యాలు చేయవలసి ఉంది. నీకేమీ తెలియదు. అవసరం లేకుండా నేను వాడినిక్కడకు రప్పించలేదు” అన్నారు బాబా. ఇంకోసారి, “అతను నావాడు. అతని పని నేను చేయాలి. నేను తప్ప అతనికి ఎవరున్నారు?” అని అన్నారు. అలా బాబా నుండి తనకి అభయవచనం లభించిందని ఆనందపడ్డాడు సహస్రబుద్ధే. తరువాత అతనొకసారి బాబాకు నమస్కరించుకుని, “బాబా! మీరు చెప్పే మాటల్లో ఏదో ఒక అర్థవంతమైన బోధ అంతర్లీనంగా ఉంటుంది. కానీ, మీ భక్తులు మీ మాటలలోని అంతరార్థాన్ని గ్రహించలేక ఆ మాటల గురించి వారికి తోచినట్లు ఏవేవో మాట్లాడుతుంటారు. నేను అలాంటిదేమీ చేయను. మీరు నాకేదైనా చెప్పాలనుకుంటే దయచేసి స్పష్టంగా నాకు అర్థమయ్యేలా చెప్పండి” అని విన్నవించుకున్నాడు. అప్పుడు బాబా, “సరే” అని అన్నారు. ఆపై కొన్నిరోజుల తరువాత, “మా అనుభవం పరోక్షమైనది కాదు. అలా భావించేవారు వెళ్ళవచ్చు. అలా కాని పక్షంలో అనుభవించిన తరువాత వెళ్ళాలి" అని తమ సహజ శైలిలో అన్నారు బాబా. ఆ మాటలు బాబా తనను ఉద్దేశించే అన్నారని గ్రహించిన సహస్రబుద్ధే వెంటనే, “అలాగే బాబా, ఇక మీరు ఖచ్చితంగా చెప్పేవరకు నేను ఇక్కడి నుండి వెళ్ళను” అని బాబాకు మాటిచ్చాడు. అప్పుడు కూడా బాబా "సరే" అని మాత్రమే అన్నారు.


అప్పటివరకు తాత్యాసాహెబ్ నూల్కర్ ఆరోగ్యం బాగానే ఉంది. కానీ తరువాత కొన్నిరోజులకు అతని ఆరోగ్యం బాగా దెబ్బతింది. మధుమేహం వల్ల మొదట అతని పిరుదులపై రాచకురుపొకటి లేచి క్రమేణా వాటి సంఖ్య అధికమై అతను తీవ్రమైన అనారోగ్యంతో పూర్తిగా మంచానికతుక్కుపోయాడు. సేవాతత్పరభావం గల సహస్రబుద్ధే ఇతరుల సేవకు సదా సిద్ధంగా వుండేవాడు. పైగా ఇప్పుడు జబ్బుపడినది అతని సన్నిహిత స్నేహితుడు కాబట్టి నూల్కర్‌కి నయమయ్యేంతవరకు శిరిడీ విడిచి వెళ్ళకూడదని నిశ్చయించుకొని అహోరాత్రులు నూల్కర్ సేవకు అంకితమైపోయాడు. అతను శిరిడీ వచ్చిన మొదటి మూడు రోజులలో అతన్ని ఉద్దేశ్యించి 'తాత్యాబాను సేవించుకో' అన్న బాబా మాటలలోని అంతరార్థమేమిటో అప్పుడు అందరికీ తెలిసి వచ్చింది. ఒకరోజు నూల్కర్ కన్నీళ్లు పెట్టుకుంటూ సహస్రబుద్ధేతో, “నీలకంఠా! కేవలం నేను కష్టపడకుండా చూసుకోవడానికే బాబా నిన్ను ఇక్కడకు తీసుకువచ్చారు. బాబా మొదటిరోజు చేసిన ఆజ్ఞకు అర్థం అదే కదా!" అన్నాడు. ఆ తరువాత ఒకరోజు అర్థరాత్రి సమయంలో నూల్కర్ తన కొడుకులిద్దరినీ పిలిచి, “ప్రభూ! నీకోసం ప్రతీక్షించే నా ముందు నిలిచి, నీ దివ్యమంగళరూపాన్ని దర్శించుకోనీ” అని అర్థమొచ్చే మరాఠీ అభంగాన్ని పాడమన్నారు. వాళ్ళు భజన చేస్తుండగా సహస్రబుద్ధే బాబా పాదతీర్థాన్ని నూల్కర్‌కి ఇచ్చాడు. తరువాత నూల్కర్ బాబా స్మరణ చేసుకుంటూ ప్రాతఃసమయంలో దేహత్యాగం చేశాడు. అక్కడున్నవారంతా 'అంత్యకాలమందు ఎవరైతే నన్ను స్మరిస్తూ దేహత్యాగం చేస్తారో వారు నన్నే చేరుకుంటారు' అనే భగవద్గీతలోని వాక్యాలు గుర్తుచేసుకొని, “ఇటువంటి మరణం నిజంగా గొప్ప సత్కార్యాల ఫలం” అని అనుకున్నారు. అది బాబా అనుగ్రహం. ఆ ముందురోజు తాత్యాబా ఆరోగ్యం పూర్తిగా విషమించడానికి ముందు షామాతో బాబా, “నా మాట విని తాత్యాబా ఇక్కడే ఉండి తన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు” అని అన్నారు. కానీ ఆ సమయంలో తాత్యాసాహెబ్‌కు అంతిమఘడియలు సమీపించాయనే ఆలోచన డాక్టరైన అతని పెద్ద కుమారునికి కూడా రాలేదు.


శిరిడీ వస్తున్నప్పుడు ఏ యువకుడైతే రైలులో సహస్రబుద్ధేకు పరిచయమయ్యాడో, అదే యువకుడు ఒకటి రెండు నెలల తర్వాత శిరిడీ వచ్చాడు. అప్పటికి బాబా పట్ల సహస్రబుద్ధేకున్న సంశయాలు పూర్తిగా పటాపంచలైపోవడం వలన, ఆ యువకుడిని మరలా అదివరకటి ప్రశ్ననే అడిగాడు. ఆశ్చర్యంగా ఆ యువకుడు, “ఇంతకుమునుపు బాబాను అనేకసార్లు చూసి నేను ఏ అభిప్రాయమైతే ఏర్పరుచుకున్నానో, అదంతా అరగంటలో పూర్తిగా మారిపోయింది” అని అన్నాడు. కానీ ఆ పరివర్తనకు కారణమేమిటో మాత్రం అతను చెప్పలేదు.


సహస్రబుద్ధే శిరిడీ రావడానికి ముందు 35-36 సంవత్సరాలలో కనీసం ఒక్క వారమైనా కలలు లేకుండా అతనికి గడిచింది లేదు. కానీ శిరిడీలో కల అన్నది ఎరుగక ప్రశాంతమైన నిద్రతో అతనికి కొన్ని నెలలు గడిచిపోయాయి. శిరిడీలో ఉన్నప్పుడు అతని ఆరోగ్యం బాగుండేదేమో, అందుకే కలలు రాలేదు అనుకునే ఆస్కారం ఉంది. కానీ, దానికి కారణం బాబా అనుగ్రహం తప్ప ఇంకొకటి కాదంటాడతను. ఎందుకంటే, శిరిడీలో ఉన్నప్పటికంటే ఇతర ప్రదేశాలలో ఉన్నప్పుడు అతని ఆరోగ్యం ఇంకా మెరుగ్గా ఉన్నప్పటికీ అతనికి సదా కలలు వస్తుండేవి.


ఒకసారి సహస్రబుద్ధే వరుసగా మూడు రోజుల పాటు తన మనసులో “ఆపన్ సారిఖ్ కరితీ తత్కాల్"(తక్షణమే తమంతటివారిగా మార్చేస్తారు) అనే మహాత్ముల వచనం గురించి చింతన చేస్తుండగా, అతను ఇంటికి తిరిగి వెళ్ళే విషయమై అనుమతిని ఎప్పుడు ఇస్తారని బాబాను అడిగాడు షామా. అప్పుడు బాబా, “కూర్చున్నచోటునుండి నేను లేచి, అక్కడ తనని కూర్చోబెట్టాలి. నేను ఏం చేసేది? ఆ పని చాలా ఓపికతో కూడుకున్నది” అని స్పష్టంగా అన్నారు. బాబా మాటలు విన్న సహస్రబుద్ధే, ‘సర్వాంతర్యామి అయిన శ్రీసాయి తన అంతరంగంలోని ఆలోచనలకు సమధానమిచ్చార’ని గ్రహించి ఆనందాశ్చర్యాలలో మునిగిపోయాడు. ఇతరులెవరికీ బాబా మాటలలోని అంతరార్థం బోధపడలేదు.


ఒకసారి మధ్యాహ్న ఆరతి సమయంలో ఒక భక్తుడు తెచ్చిన మిఠాయిని అందరికీ పంచడం ప్రారంభించారు బాబా. సహస్రబుద్ధే తన మనసులో, "నా వంతు వస్తుందా, రాదా?" అని అనుకున్నాడు. వెంటనే బాబా, “నీకు ఏమీ లేదు” అని తమ చేతులతో సైగ చేస్తూ ప్రసన్నవదనులయ్యారు. ఆపై అతనికి ప్రసాదం ఇచ్చారు బాబా.


ఒకరోజు సహస్రబుద్ధే మశీదులో అడుగుపెడుతూనే బాబా, “రా రామయ్యా” అంటూ ఆహ్వానించారు. మరో సందర్భంలో, భక్తులందరూ వరుసగా బాబాకు నమస్కరించుకుని బాబా చేతుల మీదుగా ఊదీ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. సహస్రబుద్ధే వంతు వచ్చింది. అతను నమస్కారం చేసుకోగానే బాబా అతని చేతిలో ఊదీ పెట్టి, అతని శిరస్సుపై చేయి ఉంచి, “రామ్ రామయ్యా” అని ఆశీర్వదించారు. కారణం, “శ్రీరామ్ సర్వ కర్మణి” అనే వాక్యంపై సహస్రబుద్ధేకు శ్రద్ధ ఉండేది. తన శ్రద్ధకు అనుగుణంగానే బాబా అలా ఆశీర్వదించారని అర్థమై ఎంతో ఆనందించాడు సహస్రబుద్ధే. భక్తుల పరిపాకాన్ని బట్టి వారి వారి ఉపాసనలలో శ్రద్ధను అచంచలం చేసేవారు బాబా.


బాబా మొదట సహస్రబుద్ధేని 12 రూపాయలు దక్షిణ అడిగారు. కొన్ని రోజులకు 8 రూపాయలు దక్షిణ అడిగి తీసుకున్నారు. దానికి కొన్ని రోజుల ముందు మిత్రుడు రామచంద్ర వామన్ మోదక్ వద్ద నుండి బాబాకు దక్షిణ సమర్పించడం కోసం నూల్కర్‌ పేరుమీద 5 రూపాయలు మనియార్డర్ వచ్చింది. నూల్కర్ ఆ డబ్బులు బాబాకు సమర్పించమని సహస్రబుద్ధేకిచ్చాడు. అతను ఆ మొత్తాన్ని బాబాకు సమర్పించబోగా, "ఈ రూపాయలు నువ్వే ఉంచుకో, నీ ఖర్చులకు అవసరమవుతాయి” అని అన్నారు బాబా. కానీ సహస్రబుద్ధేకు ఆ డబ్బులను తీసుకోవడం ఇష్టంలేకపోవడం వలనా, ఇంకా ఖర్చులకు అవసరమైన డబ్బు తన వద్ద చాలానే ఉండటం వలనా ఆ విషయాన్నే బాబాకు చెప్పి ఆ 5 రూపాయలను మళ్ళీ బాబాకి ఇవ్వబోయాడు. అప్పుడు బాబా, “ఈ డబ్బులు నీ ఖర్చులకు ఉపయోగపడతాయని నేను నీకు చెప్తున్నాను. కాబట్టి ఈ డబ్బులు నీ వద్దనే ఉంచుకో” అని అన్నారు. ఇక చేసేది లేక సహస్రబుద్ధే ఆ డబ్బులు తన వద్ద ఉంచుకున్నాడు. తరువాత బాబా అతనికి ఇంటికి తిరిగి వెళ్ళడానికి అనుమతి ఇచ్చినప్పుడు అతను శిరిడీ నుండి ముంబాయికి గానీ, పూనాకి గానీ వెళ్ళాలనుకున్నాడు. కానీ ఊహించని కారణం వలన అతను శిరిడీ నుండి జల్గాఁవ్‌కు వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు అతని దగ్గరున్న డబ్బులుకాక ఖర్చులకు సరిగ్గా మరో 5 రూపాయలు అవసరమయ్యాయి. అయితే తన ఖర్చుల కోసం బాబా ఇచ్చిన ఆ 5 రూపాయలను ఖర్చుపెట్టుకోవడం ఇష్టంలేక, బాబా తమ స్వహస్తాలతో ప్రసాదించిన ఆ రూపాయలను పవిత్రంగా దాచుకోవాలని తలచి, బాబా ఇచ్చిన ఐదు రూపాయలను ఒక సీల్డ్ కవర్లో ఉంచి, ఆ కవరుని తన స్నేహితుని వద్ద ఉంచి, బదులుగా స్నేహితుని వద్ద నుండి 5 రూపాయలు అప్పుగా తీసుకొని జల్గాఁవ్ వెళ్ళాడు. తరువాత ఆ అప్పును తీర్చి ఆ సీల్డ్ కవరును వెనక్కి తెప్పించుకుని, ఆ రూపాయలను బాబా ప్రసాదంగా పదిలపరచుకున్నాడు సహస్రబుద్ధే.


ఆ తరువాత సహస్రబుద్ధే ఎప్పుడు శిరిడీ వెళ్ళినా, ప్రతిసారీ బాబా అతన్ని 15 రూపాయలు దక్షిణ అడుగుతుండేవారు. ఒక సందర్భంలో అతని వద్ద డబ్బు లేనందున అదే విషయం బాబాతో చెబితే, ‘దీక్షిత్ వద్దనుండి గానీ లేదా జోగ్ వద్దనుండి గానీ తెచ్చివ్వమ’ని చెప్పారు బాబా. బాబా ఆదేశానుసారం సహస్రబుద్ధే ముందుగా బాపూసాహెబ్ జోగ్ వద్దకు వెళ్ళాడు. కానీ జోగ్ ఇంటివద్ద లేకపోవడంతో కాకాసాహెబ్ దీక్షిత్ వద్దకు వెళ్ళాడు. దీక్షిత్ అతనితో, “మీ డబ్బుల గురించి నాకు తెలియదు. నేను గ్రంథాన్ని తీసిస్తాను. అందులో మీ రూపాయలను వెతుక్కోండి” అని చెప్పాడు. కానీ సహస్రబుద్ధే ఆ గ్రంథం చదివి అందులోనుండి బాబా అడిగిన దక్షిణలోని అంతరార్థాన్ని తెలుసుకునే సమస్యలో పడకుండా నేరుగా బాబా వద్దకు వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పి, ఆ 15 రూపాయల అర్థమేమిటో తెలియజేయమని విన్నవించుకున్నాడు. అయితే బాబా అతనితో, “ప్రస్తుతానికి వదిలేయ్, తరువాత చూద్దాం. మనం అంత తొందరపడనవసరం లేదు” అని అన్నారు. దాంతో అతను ఆ 15 రూపాయలలోని అంతరార్థం గురించి ఆలోచనలో పడ్డాడు. అతని వద్దనున్న ‘శ్రీనాథభాగవతం’ గ్రంథంలో ఈ క్రింది శ్లోకాలు ఉన్నాయి.


वाचा नेमावी माझेनि नामें।

मन नेमावें ध्यानसंभ्रमें।

‘प्राण’ नेमावा प्राणायामें।

‘इंद्रियें’ दमेंनेमावी ॥98॥


వాచా నేమావీ మాఝేని నామే।

మన్ నేమావే ధ్యానసంభ్రమే।

ప్రాణ్ నేమావ ప్రాణాయామే।

ఇంద్రియే దమే నేమావీ ॥98॥


భావం: వాక్కును నా నామంతోనూ, మనసును ధ్యానంతోనూ, ప్రాణాన్ని ప్రాణాయామంతోనూ, ఇంద్రియాలను నిగ్రహంతోనూ నియంత్రించాలి.


बुद्धि’ नेमावी आत्मविवेकें।

‘जीव’ नेमावा परमात्मसुखें ।

इतकेन तूं आवश्यकें।

होसी कौतुकें मद्रूप ॥99॥


బుద్ధి నేమావీ ఆత్మవివేకే।

జీవ నేమావా పరమాత్మసుఖే।

ఇతకేన్ తూ ఆవశ్యకే।

హోసీ కౌతుకే మద్రూప్ ॥99॥


భావం: బుద్ధిని ఆత్మవివేచనతోనూ, జీవుని పరమాత్మసుఖంతోనూ నియంత్రించాలి. అంతటితో అవశ్యం నువ్వు (నాతో) ఏకాత్మత పొందుతావు.


పై రెండు శ్లోకాలలో 5 యోగసాధనలు మరియు ఇంద్రియాల నియంత్రణ వంటి ఆత్మజ్ఞానాన్ని పొందే 10 పద్ధతులు ఉన్నాయి. అవి అతని గమనింపుకు రాగానే "నేను శిరిడీకి వెళ్ళిన ప్రతిసారీ బాబా 15 రూపాయలు దక్షిణ అడగడంలోని అంతరార్థం ఇదే!" అనే ఆలోచన అతని మనసులోకి వచ్చి, “ 'శ్రద్ధయే జ్ఞానాన్ని కలుగజేస్తుంది’ అనేది భగవత్ వాక్యం. నా శ్రద్ధ గుడ్డిది కాదు” అని తలచాడు.


ఒకసారి సహస్రబుద్ధే మసీదులో కూర్చుని ఉన్నప్పుడు బాబా అకస్మాత్తుగా అతని వైపు వేలు చూపిస్తూ, "ఈ తాయీ అతని కోడలు!" అని అన్నారు. బాబా చెప్పిన ‘తాయీ’ ఎవరో కాదు, దాసగణు భార్య. ఆమె అసలు పేరు సరస్వతీబాయి. అందరూ ఆమెను 'బాయీ' అని పిలుస్తారు. బాబా మాత్రం ఆమెను 'తాయీ' అని పిలిచేవారు. ఆమె మానసిక స్థితి నిలకడగా ఉండేదికాదు. అసలు విషయమేమిటంటే, దాసగణు చెప్పుకోదగ్గ సంసార జీవితాన్ని ఎన్నడూ గడపలేదు. నిజానికి, అతను ఆ జీవితాన్ని కోరుకోనూలేదు. అతని మనస్సు ఎప్పుడూ ఆధ్యాత్మిక ఆనందాన్ని కోరుకుంటుండేది. అందువల్ల అతను పూర్తిగా గ్రంథ రచనలు, హరికథా సంకీర్తనలు, జపధ్యానాదులలో నిమగ్నమైవుండేవాడు. హరికథా సంకీర్తనల నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్తూ చాలారోజులు తన ఇంటికి దూరంగా ఉంటుండేవాడు. వీటన్నింటికీ మించి బాబా అతన్ని నాందేడులో ఉండమని ఆజ్ఞాపించారు. ఫలితంగా వచ్చిన మానసిక ఒత్తిళ్ల కారణంగా అతని భార్య మానసిక సమతుల్యతను కోల్పోయింది. ఆ సమయంలో దాసగణు తాను దైవసాక్షిగా వివాహం చేసుకున్న తన భార్య పట్ల తన విధులను నిర్వర్తించలేక, అలాగని నిర్వర్తించకుండానూ ఉండలేక తీవ్రమైన మానసిక క్షోభను అనుభవించాడు. చివరికి దాసగణు తన భార్యను చూసుకునే బాధ్యతను బాబాకు అప్పగించాడు. బాబా ఆ భాద్యతను స్వీకరించి దాసగణును సంసార బాధ్యతల నుండి విడిపించారు. అంతటితో దాసగణుకు తన భార్య విషయంలో పూర్తి మనశ్శాంతి లభించింది.


ఇక అసలు విషయానికి వస్తే.. "ఈ తాయీ అతని కోడలు!" అని బాబా అన్న మాటలు విన్న కాకాసాహెబ్ దీక్షిత్ మరికొంతమంది ఇతర భక్తులు సరదాగా, “అలా అయితే ఆమెను అతనికి అప్పజెప్పమంటారా?” అని బాబాను అడిగారు. దానికి బాబా, “అవును! ఆమెను ఈ ముసలాడికి అప్పగించండి. అతను తాత్యాబా(తాత్యాసాహెబ్ నూల్కర్)కి చేసినట్లే ఆమె విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని పరిచర్యలు చేస్తాడు" అని అన్నారు. తాత్యాసాహెబ్ తన స్నేహితుడు కాబట్టి బాబా ఆదేశం మేరకు ఒక శిక్షణ పొందిన పరిచారకునివలే అహర్నిశలూ తన స్నేహితునికి సపర్యలు చేశాడు సహస్రబుద్ధే. కానీ సరస్వతీబాయికి సపర్యలు చేయడమంటే మాటలు కాదు. అది సున్నితమైన వ్యవహారం, చాలా ప్రయాసతో కూడుకున్నది. ఎందుకంటే, ఆమె పూర్తిగా మతిస్థిమితం లేని స్థితిలో ఉండేది. ఆమె నిరంతరం ఏదో ఒకటి గొణుగుతూ ఎక్కడెక్కడో తిరుగుతుండేది. గ్రామంలోని ఎవరి ఇంట్లోనైనా చొరబడి మంచాన్ని ఆక్రమించుకొనేందుకు ప్రయత్నించేది. చాలా సందర్భాలలో ఆమెకు తన శరీరం గురించి పట్టేది కాదు. ఆమె జుట్టు, ఒంటి మీద బట్టలు చిందరవందరగా ఉండేవి. ఒకసారి ఆమె శిరిడీలోని బావిలో దూకింది కూడా. ఆమె ఫలానా చోట అని కాకుండా ఎక్కడైనా, చివరికి తన మంచం మీద కూడా మలమూత్ర విసర్జన చేసేది. ఆమె రెండు చేతులూ చర్మవ్యాధులతో నిండివుండేవి. అటువంటి ఆమెను జాగ్రత్తగా చూసుకోమని సహస్రబుద్ధేను ఆదేశించారు బాబా.


బాబా మాట అత్యంత పవిత్రమైనది. బాబా ఆదేశానుసారం సరస్వతీబాయి బాగోగులు చూసుకోవడానికి సిద్ధమయ్యాడు సహస్రబుద్ధే. ముందుగా ఆమె చర్మవ్యాధి నివారణ కోసం ఔషధగుణాలతో కూడిన క్యూటికురా సబ్బులను, పుల్విస్ గ్లిసెరాజికో పౌడరును తెప్పించాడు. రోజుకు కనీసం రెండుసార్లు ఆమె చేతులను సబ్బుతో కడిగి, శుభ్రంగా తుడిచి, పౌడరును రాసేవాడు. దాంతో అతి తక్కువ సమయంలోనే ఆమె చేతులకున్న చర్మవ్యాధులు తగ్గిపోయాయి. ఆమెకు స్నానం చేయించడానికి, మలమూత్ర విసర్జన కోసం ఆమెను బహిర్భూమికి తీసుకువెళ్ళడానికి ఒక మహిళను నియమించాడు సహస్రబుద్ధే. ప్రతిరోజూ పడుకునేముందు నియమంగా రాత్రి 11 గంటల సమయంలో ఆ మహిళ సరస్వతీబాయిని మలవిసర్జనకు బహిర్భూమికి తీసుకువెళ్ళేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. దాంతో సరస్వతీబాయి మంచం మీద మలవిసర్జన చేయడం మానేసింది. ప్రతిరోజూ ఆమెకు స్నానం చేయించిన తరువాత ఆమెచేత సాఠేవాడాలో బాబా ఫోటో చుట్టూ 108 ప్రదక్షిణలు చేయించేవాడు. ప్రతి ప్రదక్షిణ పూర్తయ్యాక ఆమెచేత బాబాకు నమస్కారం చేయించేవాడు. అతను ఆ విధంగా ఒక నెలరోజులపాటు క్రమంతప్పకుండా అవలంబించిన మీదట ఆశ్చర్యకరంగా ఆమెలో గొప్ప మార్పు కనపడటం మొదలైంది. సేవ చేయడంలో సహస్రబుద్ధే కనబరిచే ఆప్యాయత, అలాగే క్రమశిక్షణ విషయంలో కఠినంగా ఉండే అతని స్వభావం కూడా ఆమె కోలుకోవడానికి ఎంతగానో దోహదమయ్యాయి. ఒకరోజు సహస్రబుద్ధే సాటి భక్తులతో కలిసి మాట్లాడుతుండగా ఆమె సహస్రబుద్ధే వద్దకు వచ్చి, “బాబాసాహెబ్! నేనిప్పుడు బాగానే ఉన్నాను. నేను నా స్వహస్తాలతో భోజనం తయారుచేసి అందరికీ వడ్డించాలనుకుంటున్నాను" అని అంది. నిన్న మొన్నటివరకు అసలు నయంకానంతలా పూర్తిగా మతిస్థిమితం లేకుండా ఉన్న ఆమె అలా చెప్తుంటే అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. అంతేకాదు, వెంటనే వాళ్ళు బాబా వద్దకు వెళ్లి ఆమెలో వచ్చిన మార్పు గురించి తెలియజేశారు. ఆమె విషయంలో సహస్రబుద్ధే చేసిన సేవకు అందరూ ఎంతో ఆనందాశ్చర్యాలను వ్యక్తం చేశారు. అయితే వారి మాటలు విన్న బాబా, “అతనేమైనా పరాయివారికి ఉపకారం చేశాడా? తన సొంత కోడలికే కదా సహాయం చేశాడు. ఇందులో గొప్ప విశేషమేముంది?” అని అన్నారు. ఆ విషయమై సహస్రబుద్ధే ఇలా అంటాడు - ‘‘ఈ ‘కోడలు’ చిక్కుముడిని ఛేదించాలని నా స్నేహితులు ఎంతో ఆసక్తిగా దాని అర్థమేమిటో తెలుపమని నన్నడిగారు. నేను సమాధానం కోసం అన్వేషించడం ప్రారంభించాను. ఆ క్రమంలో మా ఇంటిపేరు, దాసగణు ఇంటిపేరు ఒకటేనని గ్రహించాను - సహస్రబుద్ధే! వయసులో దాసగణు నాకంటే చాలా చిన్నవాడు. అందుకే, అతని భార్య నాకు కోడలు అయింది!’’. (1919, వైశాఖమాసంలో దాసగణు భార్య మరణించింది).


సహస్రబుద్ధే చివరిసారి(బాబా సశరీరులుగా ఉండగా) శిరిడీ వెళ్ళినప్పుడు ప్రథమ దర్శనంలో, “నువ్వు రావడం మంచిదైంది. నేను నిన్నే గుర్తుచేసుకుంటున్నాను” అని అదివరకెన్నడూ అతను వినని మాటలు బాబా ముఖతః వెలువడ్డాయి. కానీ అదే తన చివరి దర్శనమనే ఆలోచన బాబా మహాసమాధి చెందారన్న వార్త అతనికి చేరేవరకు అతని మనసులోకి రాలేదు. ఆ సందర్భంలోనే అతను తిరిగి వెళ్ళే సమయం నిర్ధారించుకుని, కోపర్గాం నుండి సాయంత్రం సమయంలో రైలు బయలుదేరుతుంది కాబట్టి శిరిడీ నుండి మధ్యాహ్న సమయంలో బయలుదేరేందుకు కాకాసాహెబ్ దీక్షిత్ ద్వారా బాబా అనుమతి కోరాడు సహస్రబుద్ధే. అయితే ఆ సమయంలో బయలుదేరడానికి అనుమతి నిరాకరిస్తూ, “రేపు ఉదయం వెళ్ళనీ” అని అన్నారు బాబా. అలా రెండు మూడు రోజులు వరుసగా అనుమతి కోరినప్పుడల్లా బాబా అలాగే చెప్పసాగారు. చివరకు ఒకరోజు సహస్రబుద్ధే పట్టుబట్టి మధ్యాహ్న సమయంలో బయలుదేరి వెళ్ళడానికి బాబా అనుమతి తీసుకొని కోపర్గాఁవ్ స్టేషనుకు వెళ్ళాడు. తీరా అక్కడికి చేరుకున్నాక తెలిసింది ఆ రైలు వేళలు ఉదయానికి మార్చబడ్డాయని. సర్వజ్ఞుడైన శ్రీసాయి మాట వినకుండా వచ్చినందుకు పశ్చాత్తాపపడుతూ మనసులోనే బాబాకు క్షమాపణ చెప్పుకుని మరుసటిరోజు ఉదయం రైలు వచ్చేవరకు స్టేషనులోనే గడిపాడు సహస్రబుద్ధే.


(Source: Experience of Shri.Nilkanth Ramachandra Sahasrabuddhe vide letter written on 18th February 1920 – Shri Sai Leela Magazine Year 1923, 3rd issue)

http://saiamrithadhara.com/mahabhakthas/Tatyasaheb.html

http://telugublogofshirdisai.blogspot.com/2020/05/blog-post_31.html?m=1

సాయిపథం ప్రథమ సంపుటము

దీక్షిత్ డైరీ బై విజయకిశోర్.


2 comments:

  1. Great Article, Thanks for sharing. Om Sai Ram🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo