సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1574వ భాగం....


ఈ భాగంలో అనుభవం :

  • ఎప్పుడూ వెన్నంటి కాచుకునే సాయినాథుడు

నేను ఒక సాయి భక్తురాలిని. నిత్య జీవితంలో ప్రతిరోజూ బాబా ఏదో ఒక ప్రయోజనం కోసం ఎక్కడో ఒక సూత్రాన్ని కడుపుతుంటారు. ఏది అని వ్రాయగలం? ఎన్నని వ్రాయగలం? నేను ఈమధ్య నా అనుభవాలు వ్రాసి చాలాకాలం అయింది. మనసులో ఉన్న కొన్ని కోరికలు తీరిన తరువాత వివరంగా పంచుకుందామని ఆగాను. కానీ 2023, జూన్ 10న 'సాయి మహారాజ్ సన్నిధి' టెలిగ్రామ్ గ్రూపులో సాయి భక్తుల అనుభవాలు చదువుతుంటే ఎందుకో అప్పటికి రెండు రోజుల క్రితం జరిగిన చిన్న సంఘటన వ్రాయాలనిపించింది.


2023, జూన్ 1, గురువారం సాయంత్రం నేను హారతికని బాబా గుడికి వెళ్ళాను. హారతి అనంతరం యథాలాపంగా(ముందుగా అనుకోకుండా) కొద్ది దూరంలో ఉన్న కేశవస్వామి గుడికి వెళ్ళాను. అక్కడ దర్శనమయ్యాక పూజారిగారు, "అమ్మా! వచ్చే గురువారం శ్రవణ నక్షత్రం సందర్భంగా స్వామికి అభిషేకం జరుగుతుంది, గోత్రనామాలు వ్రాయించుకుంటారా?" అని అడిగారు. మాములుగా నేను ఏడాదికి ఒకసారి మా ఊరిలో జరిగే లక్షపత్రి పూజ తప్ప ఇతరత్రా అభిషేకాలు వంటివేమీ చేయించను. కనీసం బాబాకి కూడా ఎప్పుడూ అభిషేకం చేయించను. ఊరికే గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకుని వస్తాను. అభిషేకం పేరు చెప్పి లీటర్ల కొద్దీ పదార్ధాలు వ్యర్థం చేస్తున్నట్లు నా మనసుకి అనిపిస్తుంది. అలాంటి నేను ఆ పూజారి అలా అడిగేసరికి, ఏదో అడిగారు. కాదనడం ఎందుకన్నట్టుగా సరే అని ఆయన చెప్పిన డబ్బులు చెల్లించాను. అంతటితో ఆగక ఎందుకో గుర్తుపెట్టుకుని ఆ కార్యక్రమానికి హాజరు కావాలాని గట్టిగా అనుకున్నాను. ఆ పూజారి, "ఉదయం 6 గంటలకు ప్రారంభిస్తాం. పూర్తైయ్యేసరికి 8.30 అవుతుంది. మీ వీలుని బట్టి రావచ్చు" అని చెప్పారు. నేను, "ఏమైనా తెచ్చుకోవాలా?" అని అడిగితే, "అవసరం లేదు. మీకు వీలుంటే కాస్త ఆవు పాలు తెచ్చుకోండి. అభిషేకానికి వాడుదాం" అని అన్నారు. నేను సరేనని మావారిని కూడా అభిషేకానికి హాజరయ్యేలా ముందే ప్రిపేర్ చేశాను. ఎందుకంటే, తను మామూలుగా ఉదయం 7.30, 8 మధ్యలో తన ఆఫీసుకి బయలుదేరి వెళ్లిపోతుంటారు. ఆరోజు(2023, జూన్ 8, గురువారం) కొంచెం ముందే లేచి 6 గంటలకి గుడికి వెళ్లి, అక్కడ పూజ పూర్తయ్యాక తను అటునుంచి ఆటే ఆఫీసుకి వెళ్లేలా ప్లాన్ చేసుకున్నాము. మావారు అలాగే బాబా గుడికి కూడా వెళదామన్నారు. కానీ ఏదో విధంగా ఆలస్యమైపోయి మేము వెళ్ళేసరికి 7 గంటలు అయింది. అప్పటికి కేశవస్వామికి అభిషేకం పూర్తై కర్టెన్ వేసేసి క్లీనింగ్ చేస్తూ ఉన్నారు. చేతిలో పాలు నన్ను వెక్కిరించాయి. ఆలస్యంగా రావడం మాదే తప్పని తెలుస్తున్నా, 'అయ్యో! ఇంత ప్లాన్ చేసుకుని అభిషేకం చూడలేకపోయాను' అని కొంచెం దిగులుగా అనిపించింది. అంతలో మావారు ఇక్కడ క్లీనింగ్ అయ్యేలోపు బాబా గుడికి వెళ్ళొచ్చేద్దాం అన్నారు. ఈ పాలు కూడా బాబా గుడిలో బాబాకి అభిషేకం చేద్దాం, అక్కడ ఎప్పుడూ చిన్న బాబా విగ్రహాలకు అభిషేకాలు చేస్తూ ఉంటారు కదా అనుకుని అక్కడికి వెళ్ళాం. అక్కడ దర్శనం అయిందికానీ, "అభిషేకం ఇప్పుడు చేయము. పొద్దున్నే అయిపోతుంది" అన్నారు. నాకు బాబా మీద చాలా కోపం వచ్చింది. తప్పు మాదే అని తెలుస్తున్నా 'తెచ్చిన పాలను మళ్ళీ వెనక్కి ఎలా తీసుకెళ్లాలి? మీరైనా స్వీకరించవచ్చు కదా! కేశవస్వామి అభిషేకానికి తెచ్చినా అన్నీ మీ రూపాలే కదా!' అని ఎందుకో కొంచెం బాబా మీద అలిగాను. సాధారణంగా నేను ఎప్పుడైనా అటువంటి సందర్భాలలో 'సాయి అనుగ్రహం నా మీద తగ్గిందా ఏంటి?' అని కొంచెం ప్రతికూల భావాలకు లోనై బాధపడేదాన్ని లేదా భయపడేదాన్ని. కానీ ఈసారి నా ఆ స్వభావానికి విరుద్ధంగా తిరిగి దెబ్బలాటకి వెళ్లినట్టుగా అలిగాను. మావారు, "సరే, వదిలేయ్! అవి మన పొట్టలోకే వెళ్ళాలని వ్రాసి పెట్టుందేమో!" అన్నారు. ఇంకా మేము ఇంటికి వచ్చేసాము. అయినా నేను ఆ పాల గురించే ఆలోచించసాగాను. 'అభిషేకం పేరుతొ వృధా చేయడం నాకిష్టం లేదని బాబా ఎవరికైనా ఉపయోగపడేలా చేస్తారేమో, ఎవరైనా వచ్చి అడుగుతారేమో, ఎవరు వస్తారో' అని ఎదురుచూస్తూనే ఆ పాలు కాచి, చల్లారాక ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఆ విషయం మర్చిపోయాను.


ఆరోజు రాత్రి జరిగిన వింత చూడండి! మేము రోజూ ఆవుపాలు తెప్పించుకుంటాము. పాలు తెచ్చే అబ్బాయి రాత్రి చాలా ఆలస్యంగా అంటే సుమారు రాత్రి 9.30 ప్రాంతంలో పాలు తెచ్చి ప్రహారీగోడ మీద పెట్టి ఒకసారి బెల్ కొట్టి వెళ్ళిపోతాడు. మేము త్వరగా పడుకుంటాం. అందువల్ల తలుపులన్నీ వేసేసుకుని కేవలం ఆ పాలకోసం నిద్రపోకుండా వేచి చేసి, అవి రాగానే లోపల పెట్టుకొని పడుకుంటాం. ఆరోజు రాత్రి మావారు ఫోన్ చూస్తూ, "పాలు తెచ్చేసావా?" అని అడిగారు. నేను ఇంకా తేలేదు అన్నాను. ఆయన, "లేదా? ఇందాక 10 నిమిషాల క్రితమే నాకు బెల్ వినపడింది. వెళ్లి చూడు" అన్నారు. సరేనని వెళ్లి చూస్తే, అక్కడ పాలు లేవు. పాల అబ్బాయికి ఫోన్ చేస్తే, "నేను పావుగంట క్రితమే పెట్టేసాను" అన్నాడు. దాంతో పాలు పిల్లి ఎత్తుకెళ్లి ఉంటుందని నిర్థారించుకొని పోనీలే, ఈరోజు పాలు పిల్లి పొట్టలోకి వెళ్లాయనుకుంటూ ఉండగా 'ఆరోజు ఉదయం అభిషేకానికని తీసుకెళ్ళి, తిరిగి వెనక్కు తెచ్చిన పాలు ఎవరికి చేరుతాయో అని ఎదురుచూడడం, మావారు అవి మనకే రాసిపెట్టి ఉన్నాయేమో అనడం' అంతా ఫ్లాష్‌బ్యాక్‌లా నాకు గుర్తొచ్చాయి. అప్పుడు, 'ఆరోజు పాలని పిల్లి పట్టుకెళ్ళిపోతుంది కాబట్టి మరుసటిరోజు పొద్దున్నే బయటకి పాలకోసం వెళ్ళే ఇబ్బందిలేకుండా ముందురోజు పాలను బాబా మాకోసం ఉంచేసారా?' అని స్పురించింది. ఆ తలంపు నా మదిలోకి రాగానే నా పరిస్దితి ఎలా ఉండి ఉంటుందో మీరే ఊహించుకోండి. దాన్ని బాబా ప్రేమ అనాలా?, ప్రణాళిక అనాలా?, వాత్సల్యం అనాలా? ఏ పేరు పెట్టాలో నాకైతే అర్దం కావట్లేదు.


ఇంకో అనుభవం: బాబా ఎప్పుడూ ఏ కార్యక్రమానికి నాకు నెలసరి అడ్డు రానివ్వలేదు. ముందో, వెనకో మొత్తానికి అనుకున్న కార్యక్రమానికి అడ్డు లేకుండా జరిపిస్తుంటారు బాబా. ఇక విషయానికి వస్తే, 2023, జూన్ 2, శుక్రవారం మా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి, "నేను మన ఊరి బ్యాచ్‌తో తిరుపతి సేవకు వెళ్తున్నాను. సేవకి వెళ్లాలని నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను కానీ, నెలసరి సమస్య వల్ల ఇప్పటివరకూ కుదరలేదు. ఇప్పుడు అనుకోకుండా నాకు ఈ అవకాశం వచ్చింది. సేవకి వెళ్ళే వాళ్ళలో ఎవరో ఒకరిద్దరు ఆగిపోవటం వల్ల నాకు అవకాశమొచ్చి ఇప్పటికిప్పుడు ప్రయాణం పెట్టుకున్నాను" అని చెప్పింది. నేను తనకి శుభాకాంక్షలు చెప్పి సరదాగా "నేను కూడా వచ్చేయనా?" అని అన్నాను. దానికి తను, "వస్తావా? అవకాశం ఉన్నట్టుంది. అడుగుతాను" అనింది. అయితే నేను, "ఇప్పుడే అడగొద్దు. నేను కొంచెం ఆలోచించుకొని ఒక పావుగంటలో ఫోన్ చేస్తాను" అని చెప్పి ఫోన్ పెట్టేసాను. తరువాత తను చెప్పిన తేదీలు చూసుకుంటే బయలుదేరవలసినది జూన్ 3, శనివారం, తిరిగి వచ్చేది 11వ తేదీ, ఆదివారం. నా నెలసరి తేదీ 14. ఒక రెండు, మూడు రోజులు ముందుగా వస్తుందనుకున్నా అప్పటికి సేవ పూర్తైపోతుంది. మహా అయితే ప్రయాణంలో రావొచ్చు. నేనెప్పుడూ సేవకి వెళ్ళాలని పెద్దగా అనుకోనప్పటికీ స్వామి ఈ విధంగా అవకాశమిచ్చి పిలుస్తున్నారేమో, వెళ్తే బాగుంటుందేమో అని ఒకవైపు, రేపు మధ్యాహ్నం ట్రైన్ ఎక్కాలంటే (రాత్రి 9 గంటలప్పుడు) అన్నీ కుదురుతాయి అని మరో వైపు, వెళ్తే పై అనుభవంలో చెప్పిన అభిషేకం మిస్ అవుతానేమో అని ఇంకో వైపు ఆలోచిస్తూ ఏదీ తేల్చుకోలేక సతమతమయ్యాను. చివరికి ఇక ఇలా కాదని బాబా ముందు చీటీలు వేసాను. చీటిలో వెళ్ల వద్దని వచ్చింది. ఇక మరో ఆలోచన లేకుండా నా ఫ్రెండ్‌తో రానని చెప్పేసి అక్కడితో వదిలేసాను. చూస్తే, ఎప్పుడూ సరిగా లేదా రెండు రోజులు ముందుగా వచ్చే నెలసరి ఏకంగా ఐదారు రోజుల ముందుగా జూన్ 9న వచ్చింది. అప్పుడు కానీ, బాబా ఎందుకంత స్పష్టంగా సేవకి వెళ్ళొద్దని చెప్పారో అర్దమై మరోసారి మనని ఎప్పుడూ వెన్నంటి కాచుకునే సాయినాథుని కృపాదృష్టికి పులకించిపోయాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!!


4 comments:

  1. సాయి నా వంశీ నన్ను అర్థం చేసుకున్న కోసం తిరగొచ్చేసేలా చూడు సాయి నన్ను కాపురానికి తీసుకెళ్లేలా చూడు సాయి. నాకు నా భర్తతో కలిసి బ్రతికే అదృష్టాన్ని ప్రసాదించు సాయి నాకు అన్ని దాంపత్యాన్ని ప్రసాదించండి బాబా

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. Today is my daughter birthday. Pl bless her. Give pg medicalseat in AIIMS

    ReplyDelete
  4. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాద్ మహారాజ్ కి జై

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo