సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1571వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • జీవితాన్ని అనుగ్రహమయంగా చేస్తున్న సాయినాథుడు

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


సాయిభక్తులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నేను ఈ బ్లాగులో ఎన్నోసార్లు బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను పంచుకున్నాను. అవి పబ్లిష్ అయినా రోజు నాకు తెలియని ఆనందం కలిగింది. నేను ఇదివరకు పంచుకున్న అనుభవాలలోని చివరి అనుభవంలో మా అక్క ఎన్నో సమస్యలను అధిగమించి BA, LLB పరీక్షలు పాస్ అయిందని పంచుకున్నాను. మా అక్క రిజల్ట్ రాగానే నేను బాబా అనుగ్రహాన్ని బ్లాగుకి పంపాను. తరువాత మా అక్క సర్టిఫికెట్లకోసం దరఖాస్తు చేసుకుంది. మాములుగా రెగ్యులర్‌గా పాస్ అయ్యేవాళ్ల సర్టిఫికేట్ కాలేజీకి వస్తుంది. కానీ మా అక్క LLB పూర్తి చేయడానికి కొంచెం ఆలస్యం అవ్వడం వల్ల తనే స్వయంగా యూనివర్సిటీకి వెళ్లి సర్టిఫికెట్ తెచ్చుకోవాలి. అయితే మా అక్కకి యూనివర్సిటీకి వెళ్లి రావడం చాలా శ్రమతో కూడుకున్న పని. ఎందుకంటే, యూనివర్సిటీ మా ఊరుకి చాలా దూరం. అదీకాక అక్క తన అత్తవారింటి నుండి మా ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే యూనివర్సిటీకి వెళ్లి సర్టిఫికెట్ తీసుకోవాలి. అంతేగాని ప్రత్యేకించి సర్టిఫికెట్ కోసం రాలేని పరిస్థితి. అందుకని అక్క మొదట 10వ తరగతి, ఇంటర్ సర్టిఫికెట్లు కాలేజీలో తీసుకొని ఆ తర్వాత వీలు కుదిరినప్పుడు యూనివర్సిటీకి వెళ్లి LLB సర్టిఫికేట్ తీసుకుందామని అనుకుంది. తను అనుకున్నట్లే ఒకరోజు నేను, అక్క 10వ తరగతి, ఇంటర్ సర్టిఫికెట్ల కోసం కాలేజీకి వెళ్ళాము. అక్కడ ఆఫీస్ స్టాఫ్ ఒకతను 10వ తరగతి, ఇంటర్ సర్టిఫికెట్లు మాకు ఇచ్చి, LLB సర్టిఫికెట్ కూడా తనే తెచ్చి పెడతానని చెప్పాడు. నిజానికి మేము అతనిని LLB సర్టిఫికెట్ గురించి అస్సలు అడగలేదు. కేవలం 10వ తరగతి, ఇంటర్ సర్టిఫికెట్లు మాత్రమే అడిగాము. అతనే తనంతట తాను LLB సర్టిఫికేట్ కూడ తెచ్చిస్తానని, అయితే LLB సర్టిఫికేట్ రావడానికి ఒక వారం పడుతుందని వారం తర్వాత రమ్మని చెప్పాడు. సరేనని మేము ఒక వారం తర్వాత వెళ్ళాము. మాములుగా ఆ కాలేజీ సిబ్బంది టిసి, మార్క్‌లిస్ట్ వంటి సర్టిఫికెట్లు కోసం వెళ్ళిన విద్యార్థులకు వాటిని వెంటనే ఇవ్వరు. రెండు లేదా మూడు రోజుల తర్వాత రమ్మని చెప్తుంటారు. అందువల్ల LLB సర్టిఫికెట్ విషయంలో కూడా ఇంకోరోజు రమ్మంటారని నేను, మా అక్క అనుకున్నాము. కాని బాబా అనుగ్రహం వల్ల అతను మేము వెళ్ళగానే, "సర్టిఫికెట్లు తెచ్చాను" అని చెప్పాడు. నేను సంతోషంగా ఆ సర్టిఫికట్ తీసుకుని మా అక్కకి ఇచ్చాను. తరువాత అక్క టిసి కోసం ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళింది. నేను ఈ లోపల ఫోన్లో సాయి భక్తుల అనుభవాలు చదువుదామని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు తెరిచి చూస్తే అక్క రిజల్ట్ రాగానే నేను పంపిన అనుభవం ఆరోజే పబ్లిష్ అయి ఉంది. సర్టిఫికేట్ చేతికొచ్చి, దాన్ని చూసిన మరుక్షణమే బ్లాగులో నా అనుభవం చూసి నేను పులకించిపోయాను. యూనివర్సిటీకి వెళ్లి అప్లికేషన్ ఇచ్చి రెండు, మూడు సార్లు తిరిగి చాలా సమయం వెచ్చిస్తేగాని జరగని పని మేము అడగకుండానే ఒక వ్యక్తి ద్వారా జరిగిపోవడం, సరిగ్గా ఆ సర్టిఫికెట్ అందుకున్న రోజే నా అనుభవం రావడం బాబా చేసిన చమత్కారం. మా అక్క పాస్ అయ్యి డిగ్రీ వచ్చేదాకా తను, నేను చాలా ఆందోళనపడ్డాము. చివరికి బాబా ఇంత అద్భుతంగా ఆశీర్వదించారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


ఇకపోతే బాబా నా ఆరోగ్యం విషయంలో ఎలా అనుగ్రహించారో మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. నాకు థైరాయిడ్ సమస్య ఉంది. అలాగే ఎలర్జీ సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎంత ఎక్కువ అంటే చిన్న ఒత్తిడి వచ్చినా వెంటనే తుమ్ములు, జలుబు, గొంతు ఇన్ఫెక్షన్ వచ్చేంత. నేను చాలారోజులు నుండి డాక్టరుకి చూపించాలని అనుకుంటూ ఉన్నప్పటికీ ఏదో ఒక పని వల్ల వెళ్ళలేకపోయాను. చివరకి బాబా అనుగ్రహంతో ఒక రోజు వెళితే, డాక్టర్ కొన్ని టెస్టులు చేయించుకోమన్నారు. ఆ పరీక్షలలో కొన్ని రోగనిరోధక శక్తికి సంబంధించి కూడా ఉన్నాయి. అవి చూడగానే నాకు భయమేసింది. వాటి లక్షణాలు లేకపోయినా మనసులో ఆందోళనగా అనిపించింది. టెస్టులు చేయించుకొని రిపోర్టులు వచ్చేదాకా బాబాని తలుచుకుంటేనే ఉన్నాను. బాబా కృప చూపారు. నా భయాలన్నీ పటాపంచలయ్యాయి. రిపోర్టులు అన్నీ మామూలుగా వచ్చాయి. ఆశ్చర్యకర విషయమేమిటంటే, థైరాయిడ్ కూడా మామూలుగా వచ్చింది. నిజానికి గత కొన్నాళ్లుగా థైరాయిడ్ కంట్రోల్లో లేదు. ఇప్పుడు కూడా ఎక్కువ చూపిస్తుంది అని ఫిక్స్ అయ్యాను. కానీ బాబాని తలుచుకుంటే కానిది ఏముంది?


ఇంకో రెండు అనుభవాలు చెప్పి ముగిస్తాను. ఒకసారి మాకు బాగా కావాల్సిన బంధువు ఒకాయన ఒక సహాయం అడిగారు. నాకు ఆ సహాయం పూర్తిగా చెసే సామర్థ్యం లేకపోయినప్పటికీ ఆయన నేను ఎలాగైనా ఆ సహాయం చేయాలనే రీతిలో మాట్లాడారు. అదివరకు ఒకసారి ఇలాంటి విషయంలోనే ఆయన నన్ను అపార్థం చేసుకున్నారు. అందువల్ల ఇప్పుడు చేయకపోతే అపార్థం చేసుకుంటారేమో అని భయమేసి బాబాని ప్రార్ధించి నాకు చేతనైనంత వరకు చేసి ఆయనకి విషయం చెప్పాను. బాబా అనుగ్రహం వల్ల ఆయన ఏమీ అనుకోలేదు. మరోసారి ఆయన నా అకౌంటులో కొంచెం డబ్బు వేసి, ఒక ఫోన్ నంబరుకి పంపమని చెప్పారు. నేను అలాగేనని చెప్పాను. తరువాత ఆయన నాకు ఫోన్ చేస్తే నేను వేరే పనిలో ఉండి తీయలేదు. తరువాత నా ఫోన్ చూసుకుంటే ఆయన చాలసార్లు నాకు ఫోన్ చేసి ఉన్నారు. నేను పనిలో పడి ఫోన్ చూసుకోకపోవడం వల్ల నేను సమయానికి డబ్బులు ఆయన చెప్పిన నెంబరుకు పంపలేకపోయాను. నాకు ఒక్కసారిగా టెన్షన్ వచ్చింది, 'ఆయన ఇబ్బందిపడ్డారేమో!' అని వెంటనే ఫోన్ చేస్తే, ఆయన భార్య, "వేరే వాళ్లతో వేయించుకున్నారు" అని చెప్పింది. బాబా "ఒప్పుకున్న పని సరిగా చేయి, చేయలేకపోతే ఒప్పుకోవద్దు" అని అంటారు. అలాంటిది నేను చేస్తానని చెప్పిన పని సరిగా చేయనందున నాకు చాలాసేపు బాధగా అనిపించింది. అలాగే ఆ బంధువు ఈ విషయం గురించి మాతో గొడవ పెడతారేమో అని భయమేసింది. వెంటనే, "ఒకవేళ ఆయన ఈ విషయాన్ని తప్పుగా భావించకుంటే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. బాబా నా ప్రార్థన మన్నించారు. మా బంధువు నన్ను తప్పుగా భావించలేదు. ఇలాంటి విషయాలకి కూడా భయపడతారా అని మీకు అనిపించవచ్చు. కాని కొన్ని రిలేషన్స్ చాలా సున్నితంగా ఉంటాయి. అటువంటి రిలేషన్స్‌ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. లేకపొతే వాటివల్ల చాలా మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా చిన్న చిన్న విషయాల నుంచి పెద్ద పెద్ద విషయాల వరకు నన్ను కాపాడుతూ నా జీవితాన్ని అనుగ్రహమయంగా చేస్తున్న సాయినాథుని పాదాలకు శిరస్సు వంచి వందనాలు అర్పిస్తున్నాను. నా అనుభవాలను ఓపికగా చదివిన భక్త మహాశయులకు హృదయపూర్వక కృతజ్ఞతలు.


సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!

శుభం భవతు!!!


6 comments:

  1. Sai na vamsi nakosam thirigivachela chudu sai na kapuraanni nilabettu sai😥

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. Om Sai Ram
    Sai always be with me

    ReplyDelete
  4. OmsaikapaduTandri

    ReplyDelete
  5. Om sairam
    Om sairam
    Om sairam
    Om sairam
    Om sairam
    Om sairam
    Om sairam
    Om sairam
    Om sairam

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo