సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1556వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా చూపిన ఊదీ మహిమ
2. ఆపద్బాంధవుడు సాయిబాబా!

బాబా చూపిన ఊదీ మహిమ


సాయి మహరాజ్‌కి‌, సాయిబంధువులకు నా నమస్కారం. నా పేరు రమాదేవి. 2023, మే 27న నా ఫోన్ క్రిందపడి స్క్రీన్ అంతా నల్లగా అయిపోయి ఎంత ప్రయత్నించినా డిస్ప్లే పని చేయలేదు. నేను బాబాకి నమస్కారం చేసి ఫోన్‌కి ఊదీ పెట్టాను. మావారు బాబాను నమ్ముతారు కానీ, నేను ఫోన్‌కి ఊదీ పెట్టేసరికి, "ఫోన్‌కు ఊదీ పెట్టటం ఏంటి?" అని నవ్వారు. మా అందరికంటే ఎక్కువగా బాబాను నమ్మే మా పాప కూడా నవ్వింది. కారణం మన ఈ బ్లాగులో పబ్లిష్ అయినా లాప్టాప్ ఛార్జర్, మొబైల్, లాప్టాప్ పని చేయకపోతే ఊదీ పెట్టిన తరువాత అవి బాగైన లీలలు గురించి నాకు తెలుసుగానీ వాళ్లకు తెలియదు. నేను, "బాబా! ఫోన్ మామూలుగా పనిచేస్తే, మీ అనుగ్రహాన్ని బ్లాగు ద్వారా తోటి సాయి భక్తులతో పంచుకుంటాను" అని అనుకున్నాను. కాసేపు మావారు, పిల్లలు ఫోన్ బాగు చేయటానికి ప్రయత్నించారు కానీ, ఫోన్ పని చేయలేదు. అప్పుడు మా పాప, "అమ్మా! రేపు షాపులో రిపేరుకి ఇస్తే, బాగైపోతుంది. అప్పుడు బ్లాగులో పంచుకుందువులే" అంది. నాకు చాలా ఉక్రోషంగా అనిపించి, 'రేపు రిపేరుకి ఇచ్చాక ఎలాగైనా బాగవుంతుంది. అప్పుడు బ్లాగులో పంచుకోవడం ఎందుకు? బాబా దయతో అది ఇప్పుడు మన నలుగురిలో ఎవరో ఒకరి చేతిలో బాగవ్వాలి. అలా అయితే బ్లాగులో పంచుకుంటాను. ఇప్పుడు కాకపోతే పంచుకోనవసరం లేదు" అని అన్నాను. అందుకు మా పాప, "అదేంటి అమ్మా, అలా అంటావు?" అంది. నేను పట్టుదలతో, "అంతే, బాబా ఇప్పుడు బాగు చేస్తే చేయాలి. లేదంటే లేదు" అన్నాను. మనసులో మాత్రం, "బాబా! మావాళ్లకు నీ ఊదీ మహిమ తెలియజేయి" అని అనుకున్నాను. నాకు ఆ నిముషంలో ఈ ఫోన్ బాగుకాకపోతే నన్ను ఒక పిచ్చిది అనుకుంటారేమోననిపించింది. సొంత మనుషులైన ఒక్కోసారి బాధలో అలా అనిపిస్తుంది. మాములు మనుషులం కదా! సరే, ఆ సమయంలో ఫోన్ మా 9 సంవత్సరాల బాబు చేతిలో ఉంది. రెండు నిముషాల్లో వాడు ఫోన్ బటన్స్ నొక్కుతూ గట్టిగా స్క్రీన్ ఒత్తి పట్టుకున్నాడు. అంతే, ఫోన్ డిస్ప్లే చాలా క్లియర్‌గా వచ్చింది. అది చూసిన నా ఆనందానికి అవధులు లేవు. నా భర్త మాత్రం షాక్ అయ్యి, "ఇది ఎలా జరిగింది?" అని అన్నారు. "బాబా కంటే పెద్ద మెకానిక్ ఎవరు ఈ లోకంలో?" అని గర్వంగా అన్నాను. తరువాత మావారు చాలాసార్లు ఫోన్ చెక్ చేసి చూశారు. ఈరోజు వరకు ఫోన్ బాగానే ఉంది. మా ఇంట్లో అందరూ బాబానే ఫోన్ బాగు చేశారని ముక్త కంఠంతో ఒప్పుకొని బాబాను క్షమించమని అడిగారు. 'సాయీ' అంటే 'ఓయీ' అని పలుకుతారు మన సాయి దేవుడు. "బాబా! మీరు మా వెంట ఉన్నందుకు మీకు శతకోటి ధన్యవాదాలు".


ఆపద్బాంధవుడు సాయిబాబా!


సాయిబంధువులందరికీ నా నమస్కారములు. నా పేరు శశికళ. నాకు చిన్నప్పటినుంచి ఏ కష్టమొచ్చినా సాయిని తలచుకుంటే, అంతా ఆయనే చూసుకుంటారని గట్టి నమ్మకం. ఆ నమ్మకమే కరోనా కాలంలో బాబా అనుగ్రహంతో మరోసారి నిరూపితమైంది. ఆ అనుభవాన్ని నేనిప్పుడు మీ అందరితో పంచుకుంటున్నాను. 2022, శ్రావణమాసంలో వరలక్ష్మీవ్రతం తర్వాత మూడురోజులకు ఒకరాత్రి మావారికి టిఫిన్ చేశాక ఒకటే ఎక్కిళ్ళు వచ్చాయి. ఎక్కిళ్ళు మామూలుగానే వస్తాయిని మేము లైట్‌గా తీసుకున్నాము. కానీ అవి ఎంతకీ తగ్గలేదు. అప్పుడు ఏం చేయాలో తెలియక డాక్టర్‌కి ఫోన్ చేస్తే గ్యాస్ సమస్య అయుండొచ్చు అని టాబ్లెట్స్ చెప్పారు. అవి తెచ్చి రెండు రోజులు వాడాము. అయినా ఎక్కిళ్ళు తగ్గలేదు. నాలుగు రోజులు గడిచాక హాస్పిటల్‌కి వెళితే, అన్ని టెస్టులు చేసి "ఆహార నాళం ఇరిటేట్ అవుతుంది. అందుకే ఎక్కిళ్ళు వస్తున్నాయి. తగ్గడానికి సమయం పడుతుంది" అన్నారు. అయితే మూడు రోజులు హాస్పిటల్లో ఉన్నా కూడా ఎక్కిళ్ళు ఏమాత్రం ఆగలేదు. అలానే ఇంటికి వచ్చేసాము. నేను, "బాబా! ఏమిటి ఈ విచిత్రం? ఎందుకు ఆ ఎక్కిళ్ళు అంతలా బాధిస్తున్నాయి? మీ దయతో అవి తగ్గితే, మీ అనుగ్రహాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో  పంచుకుంటాన"ని బాబాకి మొక్కుకున్నాను. తర్వాత ఆఫీసులో ఎవరో వేరే హాస్పటల్ పేరు చెప్పారు. ఆ హాస్పిటల్‌కి వెళితే మూడు రోజులకి మందులు వ్రాసి, "తగ్గకపోతే ఎండోస్కోపీ చేయాలి" అన్నారు. అయితే బాబా దయవల్ల గుణం కనిపించింది. ఎండోస్కోపీ అవసరం లేకుండానే మావారికి ఎక్కిళ్ళు తగ్గాయి. వారం రోజులపాటు ఇంట్లో ఎవరికీ నిద్రలేదు కానీ, చివరికి సాయినాథుని దయవల్ల పెద్ద గండం గట్టెక్కింది. "ధన్యవాదాలు బాబా. మీ దయతో అంతా చక్కబడింది". సాయి చల్లని చూపులు మనందరిపైన ఉండాలని కోరుతూ సెలవు..


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!

సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


6 comments:

  1. ఓం సాయిరామ్

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. E blag lo ala join avalli

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo