సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1563వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • బాబాని అడిగితే కానిది ఉంటుందా?

ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః!!!

ఓం శ్రీసాయి అసహాయసహాయాయ నమః!!!


అందరికీ నమస్కారం. ఈ 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వాహకుల సేవ కారణంగా మండువేసవిలో కూడా పండువెన్నెలలో ఉన్నట్లు ఉంటుంది. 'సాయి ప్రేమ' అనే వెన్నెలలో మేమంతా చల్లగా ఉంటున్నాం. అందుకు మీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. మీ అందరికీ బాబా ఆశీస్సులు ఎల్లప్పుడూ సుసంపన్నంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సాయిభక్తురాలిని. సిటీలో ఉండే మా బంధువు ఒకరు 2023, సంక్రాంతి పండుగకు మా ఇంటికి వచ్చారు. ఆ సమయంలో అతనికి కొంచెం బాగాలేదు. కొద్దిగా జలుబు అదీ ఉంది. పండుగ అయిపోయాక గురువారంనాడు అతను తిరిగి సిటీకి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళాక కూడా అతనికి జలుబు, దానితోపాటు స్వల్ప జ్వరం ఉంటే ఏవో టాబ్లెట్స్ వాడారు. కానీ తగ్గలేదు. సరిగ్గా వారానికి, అంటే మరుసటి గురువారం కొంచెం ఇబ్బందిగా అనిపించి హాస్పిటల్‌కి వెళ్తే, బీపీ ఎక్కువగా ఉందని ఇంజెక్షన్ చేశారు. కానీ కొంచెం కూడా బీపీ కంట్రోల్ కాలేదు. దాంతో, వెంటనే పెద్ద హాస్పిటల్‌కి తీసుకెళ్లమని డాక్టర్స్ చెప్పారు. ఈలోపు అతనికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి స్పృహ కోల్పోయారు. వెంటనే పెద్ద హాస్పిటల్‌కి తీసుకెళ్తే ఆక్సిజన్ పెట్టారు, కానీ మూడురోజులవరకు ఏమీ చెప్పలేమన్నారు. మర్నాడు ఉదయానికి పరిస్థితి మరింత విషమించడంతో వెంటిలేటర్ పెట్టి, "చాలా క్రిటికల్ సిట్యుయేషన్" అని అన్నారు. గురువారంనాడు, అంటే అతనిని హాస్పిటల్లో చేర్చినరోజు అతని అక్క నాతో విషయం చెప్పి, "చాలా భయంగా ఉంది. నయం చేయమని బాబాకి చెప్పమ"ని చాలా ఏడ్చింది. నేను వెంటనే సంకల్ప పారాయణ చేయించాను. అలా 4, 5 సార్లు పారాయణ చేయించాక బాబా ఎంతో కరుణ చూపారు. అతను మెల్లగా కోలుకుని ఇప్పుడు ఇంటికి వచ్చారు. నాతో ఫోన్లో మాట్లాడారు కూడా. అయితే ఇంకా కొంచెం కోలుకోవాల్సి ఉంది. అంటే నడక పర్వాలేదుగానీ, చేయి సరిగా పనిచేయటం లేదు, మాట కూడా సరిగా రావడం లేదు. బాబా దయతో చాలా త్వరలోనే అవి కూడా నయమవుతాయని మా నమ్మకం. ఎందుకంటే, అసలు బ్రతకడమే కష్టమన్న మనిషిని క్షేమంగా ఇంటికి పంపింది బాబానే. "థాంక్యూ సో మచ్ సాయీ. కేవలం అంటే కేవలం మీ ఆశీస్సుల వల్లనే అతను ఇంటికి వచ్చి తన కుటుంబంతో ఎంతో సంతోషంగా ఉన్నారు. అతను త్వరగా మునుపటిలా పూర్తి ఆరోగ్యంతో ఉండేలా దీవించు సాయీ. తన ఆరోగ్యం బాగుండాలని సంకల్ప పారాయణ చేసిన అందరూ కూడా సదా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తండ్రీ".


2023, మార్చిలో నా మేనకోడలు పుష్పవతి అయ్యింది. పాపని కూర్చోపెట్టటానికి పేరంటాళ్లు కావాలి కదా! కానీ అదేరోజు మా బంధువుల అబ్బాయి పెళ్లి ఉండటంతో చాలామంది ఆ పెళ్లికి వెళ్ళారు. అందువల్ల కేవలం ముగ్గురు పేరంటాళ్ళే వచ్చారు. మాకు ఏం చేయాలో పాలుపోక బాబా జపం చేయసాగాము. అంతలో మా తమ్ముడు, మా కజిన్ పెళ్లికి వెళ్ళినవాళ్ళకి ఫోన్లు చేశారు. కళ్యాణమండపం దగ్గర్లోనే ఉండటం వల్ల వాళ్ళు వెంటనే వచ్చారు. మరికొంతమందిని తమ్ముడు వెళ్లి తీసుకొచ్చాడు. వాళ్ళంతా భోజనాలకి ఆలస్యమవుతున్నా పట్టించుకోకుండా పాపని కూర్చోబెట్టి అక్షింతలు వేసి వెళ్ళారు. అంతా బాబా దయ అని, "ఫంక్షన్ కూడా ఏ ఇబ్బందీ లేకుండా బాగా జరగాలి" అని బబాతో చెప్పుకున్నాను. నేను సంకల్ప పారాయణ కూడా చేయించాను. బాబాని అడిగితే కానిది ఉంటుందా? గురువారం ఫంక్షన్ వచ్చేలా అనుగ్రహించారు బాబా. ముందు ఎలా జరుగుతుందో అని చాలా టెన్షన్ పడ్డప్పటికీ బాబా కృపవలన అన్ని ఏర్పాట్లు మేమే చేసుకున్నాము. అయినా కూడా మానవ సహజమైన కంగారుతో ఫంక్షన్ జరిగేరోజు ఉదయం కూడా, అందరూ వస్తారో లేదోనని టెన్షన్ పడ్డాం. ఎందుకంటే, వారాంతం అయితే అందరూ వస్తారు. కానీ బాబా అంటేనే గాడ్ ఆఫ్ మిరాకిల్స్ కదా! దాదాపు పిలిచినవాళ్ళందరూ వచ్చారు. హైదరాబాద్, విజయవాడ, ఇంకా వేరే ఇతర దూరప్రాంతాల నుండి కూడా అందరూ వచ్చి పాపను ఆశీర్వదించారు. భోజనాలు కూడా చాలా బాగున్నాయని అందరూ అన్నారు. మేము ఎంత సంతోషించామో మాటల్లో చెప్పలేను. ఫంక్షన్ హాల్ నుంచి మేము ఇంటికి వస్తుంటే ఒక ఇంటి గుమ్మంపై ఫోటో రూపంలో సాయి దర్శనమిచ్చారు. బాబాని చూస్తుంటే, 'ఇప్పుడు నీకు సంతోషమేనా?' అని నవ్వుతున్నట్లు అనిపించింది. మా తమ్ముడు కూడా అదే అనేసరికి నాకు కళ్ళలో నీళ్ళు వచ్చేశాయి. అక్కడే "థాంక్యూ సో మచ్ బాబా" అని బాబాకి చెప్పుకున్నాను. "మీకు ఎన్నిసార్లు థాంక్స్ చెప్పినా తక్కువే బాబా. తల్లికి థాంక్స్ చెప్పకూడదు. కానీ చెప్పకుండా ఉండలేము సాయీ. మీరు చూపే అనుగ్రహానికి ఏమి చెప్పినా, ఎన్ని చెప్పినా సరిపోదు. ఎల్లపుడూ ఇలాగే మా అందరినీ దీవించు సాయీ. నాకు మనశ్శాంతినిచ్చి మీరు గర్వించే బిడ్డలా నేను ఉండేలా ఆశీర్వదించు బాబా".


2020లో ప్రపంచం అంతా కరోనా టెన్షన్‌లో ఉన్నప్పుడు ఎవరు ఇంటికొచ్చినా ఒకటే కంగారుగా, భయంగా ఉండేది. అలాంటి సమయంలో ఒక బామ్మ మాటిమాటికీ మా ఇంట్లోకి వస్తుండేది. కారణం ఆవిడ పనిమనిషి. వేరే ఇళ్లలో పనిచేసి వస్తుండేది. మా ఇంట్లో పసిబిడ్డ ఉన్నందున మాకు చాలా భయమేసేది. కానీ ఆవిడను రావద్దని చెప్పలేము, చెప్పినా అర్థం చేసుకునే వయసు కాదు. అందువల్ల బాబాతో, "మావాళ్లకి ఏ ఇబ్బందీ రాకుండా చూడండి. వాళ్ళు క్షేమంగా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి" అని చెప్పుకున్నాను. బాబా దయతో ఎవరికీ ఏ ఇబ్బందీ కలగలేదు, వాళ్ళు క్షేమంగా ఇంటికి వెళ్ళారు. "థాంక్యూ సో మచ్ బాబా. కొన్ని కారణాల వల్ల ఈ మీ అనుగ్రహాన్ని పంచుకోవటం ఆలస్యమైంది. నన్ను క్షమించండి సాయీ".


ఈమధ్య మా నానమ్మగారు కాలంచేశారు. పెద్దవయసు, వేసవి ఎండల తీవ్రతను తట్టుకోలేకపోయారు. బాబా ఆవిడను ఏకాదశిరోజున తీసుకెళ్లారు. ఆవిడకు సంబంధించిన తదుపరి కార్యక్రమాలన్నీ బాగా జరగాలని, ఏ ఇబ్బందీ రాకూడదని నేను బాబాని వేడుకున్నాను. సంకల్ప పారాయణ కూడా చేయించాను. బాబా దయతో అన్ని కార్యక్రమాలు చాలా బాగా జరిగాయి. కార్యక్రమం గురువారం పడింది. ఆరోజు శాంతిహోమం చేయాలని, పూజ అయ్యేవరకు (సాయత్రం 5 గంటలవ్వొచ్చు అన్నారు) తమ్ముడు ఏమీ తినకుండా ఉండాలని అన్నారు. ఏమీ తినకుండా అన్ని గంటలపాటు తమ్ముడు ఎండలో కూర్చుని ఎలా చేస్తాడని మాకు కంగారుగా అనిపించింది. కానీ మన సాయి దయతో ఆరోజు వాతావరణం చల్లగా ఉంది. రెండు గంటలలోపే హోమం పూర్తైంది. కాకపోతే, నానమ్మ కార్యక్రమాలు మరియు ఎండల కారణంగా మా అమ్మ ఆరోగ్యం కొంచెం బాగలేకుండా పోయింది. కానీ బాబా దయవల్ల తొందరగానే కోలుకుందితరువాత నా మేనల్లుడికి బాగాలేదు. కానీ, బాబా దయవల్ల ఇప్పుడు బాగానే ఉన్నాడు. ఇంకొంచెం ఇబ్బంది ఉందిగానీ, త్వరలోనే నయమవుతుందని నాకు తెలుసు. ఎందుకంటే, మనమంతా సాయితల్లి బిడ్డలం. మనం బాగుండాలనే ఎల్లప్పుడూ ఆ తల్లి తపన. "అన్నిటికీ ధన్యవాదాలు బాబా".


సర్వం శ్రీ. సాయినాథార్పణమస్తు!!!

లోకాః సమస్తాః సుఖినోభవంతు!!!


8 comments:

  1. ఓం సాయిరామ్

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. Om Sai Sri Sai Jai Sai

    ReplyDelete
  5. Sankalpa parayanam antey yemiti

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo