- ఆగిపోయిన శ్వాసను తిరిగిచ్చి ప్రాణం పోసిన బాబా
ఓం శ్రీ సాయినాథాయ నమః!!! సాయిభక్తులకు నమస్కారాలు. నా పేరు సంగీత. మాది నిజామాబాద్. 2022, నవంబర్ 24, రాత్రి పదిగంటలకి మావారు జిమ్ నుండి వచ్చి, స్నానం చేసి, టిఫిన్ చేసి కూర్చున్నారు. కాసేపటికి ఆయన నన్ను పిలిచి, "నాకు తల తిప్పుతోంది" అని అన్నారు. చూస్తే, ఆయన ఒళ్ళంతా చమటలు పట్టేస్తున్నాయి. నేను వెంటనే మా అన్నయ్యకి ఫోన్ చేసి పదినిమిషాల్లో మావారిని హాస్పటల్‌కి తీసుకెళ్ళాము. అక్కడ చెకప్ చేసి, బి.పి. 240/140 ఉందని చెప్పి, అడ్మిట్ చేసుకొని రెండురోజులకి డిశ్చార్జ్ చేశారు. ఆ రాత్రి ఇంట్లో ఉన్నాము. మరుసటిరోజు 2022, నవంబర్ 27, రాత్రి 9 గంటలకి మావారు బాత్రూంలో కళ్లు తిరిగి పడిపోయారు. వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళితే మళ్లీ అడ్మిట్ చేసుకున్నారు. అప్పుడు కూడా బి.పి. 240/140 ఉంది. రాత్రి 12 గంటల వరకు ఎన్ని ఇంజెక్షన్లు, టాబ్లెట్లు ఇచ్చినా బి.పి తగ్గలేదు. పైగా ఎనిమిదిసార్లు వాంతులయ్యాయి. నేను చాలా భయపడి, "బాబా! మీరే దిక్కు. ఆయనకు నయం అయ్యేలా దయచూపు తండ్రీ" అని వేడుకున్నాను. బాబా దయవల్ల ఇంకొక డాక్టర్ వచ్చి ఒక ఇంజక్షన్ చేస్తే బీపీ 150/100కి వచ్చింది. అప్పుడు MRI స్కానింగ్ చేశారు. రిపోర్టులో చాలా చిన్న చిన్న క్లాట్స్ ఉన్నాయని వచ్చింది. కానీ "అది ప్రాబ్లం కాద"ని చెప్పారు. 2022, నవంబర్ 29న మావారికి ఆంజియోగ్రామ్ చేసి, అనంతరం మావారి ఛాతీపై హాల్టర్ మిషన్ పెట్టారు. మరుసటిరోజు 2022, నవంబర్ 30, బుధవారం ఉదయం 11గంటలకి మా ఆయన పాలు, బ్రెడ్ తింటానని అంటే అవి తేవడానికి నేను టీ స్టాలుకి వెళ్ళాను. నేను వెళ్ళేటప్పుడు N.I.C.Uలో ఉన్న మావారు పాలు, బ్రెడ్ తీసుకొచ్చేసరికి అక్కడ లేరు. ఈలోగా మావారిని I.C.Uకి షిఫ్ట్ చేశారు. ఏమైందని డాక్టర్ని అడిగితే నన్ను ఒక రూములోకి తీసుకెళ్లి, "మీవారి గుండె, శ్వాస 17 సెకన్లపాటు ఆగిపోయాయి. సమయానికి పక్కనే డాక్టరు ఉండబట్టి CPR చేస్తే మళ్లీ శ్వాస వచ్చింద"ని చెప్పారు. ఆ డాక్టరు రూపంలో బాబానే మా ఆయనను కాపాడారని నా విశ్వాసం. ఎందుకంటే, నాకు బాబా మీద చాలా నమ్మకం. నేను ఎప్పుడూ బాబా స్మరణ చేస్తూ ఉంటాను. నేను పాలు తీసుకురావడానికి వెళ్ళేటప్పుడు కూడా 'బాబా, బాబా' అనుకుంటూనే వెళ్ళాను.
ఇకపోతే, అదేరోజు సాయంత్రం నాలుగు గంటలకి ఒక టెక్నీషియన్, ఒక జూనియర్ డాక్టర్ సహకారంతో మా ఆయనను అంబులెన్సులో హైదరాబాద్ తీసుకెళ్ళాము. అక్కడ మావారిని అడ్మిట్ చేసుకొని రోజుకో రకం టెస్టులు - హార్ట్ MRI, కిడ్నీ MRI, అల్ట్రాసౌండ్ స్కానింగ్, ENTకి సంబంధించి ఎన్నోరకాల టెస్టులు చేసి, "ఎందులోనూ ఏ సమస్యా లేదు. అన్నీ నార్మల్ ఉన్నాయి. ఆయన ప్రాబ్లమ్ ఏంటో తెలియట్లేదు" అని అన్నారు. తర్వాత హాల్టర్ మెషిన్లో చూస్తే హార్ట్ రేటు ఒక్కోసారి తగ్గిపోతుందని తెలిసింది. దాంతో "పేస్ మేకర్ అనే మెషిన్ గుండెకి అమర్చాలి. అది హార్ట్ బీట్ తక్కువ కాకుండా చూస్తుంది. అది జీవితాతం ఉండాల్సిందే. 2022, డిసెంబర్ 4, ఉదయం ఆపరేషన్ చేస్తామ"ని అన్నారు. ఆరోజు ఉదయం నేను, "బాబా! మీ దయవల్ల 'ఈ ఆపరేషన్ వద్దు, మందులతో తగ్గుతుంద'ని చెప్పాలి" అని మనసులో బాబాను చాలా వేడుకున్నాను. నిజంగానే డాక్టరు, "99% ఆపరేషన్ అవసరం లేదు. 2022, డిసెంబర్ 6న డిశ్చార్జ్ చేస్తామ"ని చెప్పారు. మేము చాలా సంతోషించాము. అయితే డిసెంబర్ 6, ఉదయం డాక్టరు పిలిచి, "మీకొక గుడ్ న్యూస్, మరో బ్యాడ్ న్యూస్" అని ముందుగా గుడ్ న్యూస్ గురించి చెప్తూ, "ఈరోజు తెల్లవారుఝామున మూడు గంటలకు మీవారి బీపీ 60\25 ఆయి, హార్ట్ బీట్ స్లో అయిపోయింది. మీవారు మెలకువలో ఉన్నందున వెంటనే జూనియర్ డాక్టర్ని పిలిచి, 'నాకు ఏదో అవుతోంద'ని చెప్పారు. ఆయన మెలకువతో ఉన్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏమయ్యేదో చెప్పలేకపోయేవాళ్ళము" అని అన్నారు. తరువాత బ్యాడ్ న్యూస్ గురించి చెప్తూ, "మీవారికి పేస్ మేకర్ వేయాలి. ఈవాళ సాయంత్రం ఆపరేషన్ చేస్తాం" అని చెప్పారు. అలాగే ఆరోజు సాయంత్రం ఆపరేషన్ చేసి, "మంచిగా జరిగింద"ని చెప్పారు. 2022, డిసెంబర్ 9న డిశ్చార్జ్ చేసారు. హాస్పిటల్లో ఉన్నప్పుడు బాబా ఫేస్బుక్ మెసేజ్‌ల రూపంలో నాకు ధైర్యం చెప్తూ ప్రతిక్షణం నాతోనే ఉన్నారు. కాబట్టే ఇవాళ మా ఆయన బ్రతికున్నారు. నిజంగా బాబా మావారికి పునర్జన్మని ప్రసాదించారు.
తర్వాత మావారు చెక్-అప్ కోసం హాస్పిటల్‌కి వెళ్లినప్పుడు ఆయన బీపీ ఫ్లక్చుయేట్ అవుతుంటే, అలా ఎందుకు అవుతుందని స్కానింగ్ తీశారు. నేను, "బాబా! రిపోర్ట్ నార్మల్ రావాలి. మీ అనుగ్రహాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల రిపోర్ట్స్ నార్మల్ వచ్చాయి. ఇంటికి వచ్చిన తర్వాత హాస్పిటల్ ఫైల్ కనిపించకపోతే చాలా టెన్షన్ పడ్డాము. "బాబా! ఫైల్ దొరికితే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల హాస్పిటల్‌వాళ్ళు ఫైల్‌ను తమవద్దే ఉంచామని, రిపోర్టులన్నీ వచ్చాక ఇస్తామని చెప్పారు. 2023, ఏప్రిల్ 3న మేము ఒక మహారాజు దగ్గరకి వెళ్ళినప్పుడు, ఆయన రిపోర్ట్స్ చూస్తానంటే హాస్పిటల్ ఫైల్ తీసుకెళ్ళాము. అక్కడనుంచి వచ్చిన తరువాత మా ఆయన ఆ నెల చెకప్ కోసం హాస్పిటల్‌కి వెళ్తానంటే మళ్ళీ ఫైల్ కనపడలేదు. అప్పుడు నేను, "బాబా! ఇదివరకు ఫైల్ దొరికితే నా అనుభవం పంచుకుంటానని మొక్కుకున్నాను. కానీ పంచుకోనందుకు క్షమించండి బాబా. ఇప్పుడు ఫైల్ దొరికితే రెండు అనుభవాలూ పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయతో నాలుగు రోజుల తరువాత ఫైల్ దొరికింది. "థాంక్యూ బాబా".
మా ఆయన నిజామాబాద్ జిల్లాపరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఆఫీసులో బదిలీలు మొదలైనప్పటినుండి తనకి ఏ జోన్లో వస్తుందో అని చాలా టెన్సన్ పడ్డారు. అప్పుడు నేను, "నాకు బాబా మీద నమ్మకముంది. మీకు దూరప్రాంతానికి ట్రాన్స్ఫర్ కాదు. టెన్షన్ పడకండి" అని చెప్తూండేదాన్ని. నిజంగానే బాబా మిరాకిల్ చేశారు. మావారు హాస్పిటల్లో ఉండగా జిల్లాలో ఒక పోస్ట్ ఖాళీ చేయించి మరీ మావారికి నిజామాబాద్‌కే పోస్టింగ్ ఇచ్చారు.
ఒకరోజు మా బాబు స్నేహితుడి పుట్టినరోజు ఉందంటే పంపించాను. అయితే చీకటిపడినా తను ఇంటికి తిరిగి రాలేదు. దాంతో నేను మాబాబు స్నేహితుని ఇంటికి వెళ్ళాను. ఆ అబ్బాయివాళ్ళక్క, "ఈరోజు మా తమ్ముడి పుట్టినరోజు కాదు. మా తమ్ముడు, మీ అబ్బాయి, మరో అబ్భాయి ముగ్గురూ కలిసి బండి మీద బయటకు వెళ్ళారు" అని చెప్పింది. నేను తిరిగి వస్తూ మా ఇంటికి దగ్గర్లో ఉన్న ఒక వెంచర్‌లో వాళ్ళకోసం వెతికాను. కానీ వాళ్ళు అక్కడ లేరు. అప్పుడు నేను, "బాబా! మీ దయవల్ల బాబు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే, మీ కృపను బ్లాగులో పంచుకుంటాన"ని అనుకున్నాను. అలా అనుకున్నానో, లేదో మావారు ఫోన్ చేసి, "బాబు వచ్చాడు. నువ్వు ఇంటికి వచ్చేయ్" అని అన్నారు. "థాంక్యూ బాబా".
ఒకరోజు పొద్దున్న మా అన్నయ్య, వదిన గొడవపడ్డారు. దాంతో మా అన్నయ్య, హాస్టల్లో ఉంటున్న వాళ్ళ బాబుని కలిసొస్తానని బయటకి వెళ్లి రాత్రి అయినా తిరిగి రాలేదు. తన కారు, ఫోన్, వాచ్ అన్నీ ఇంట్లోనే వదిలేసి వెళ్ళాడు. మరుసటిరోజు మా వదిన నాకు ఫోన్ చేసి, "మీ అన్నయ్య ఇంటికి రాలేదు" అని చెప్పింది. వెంటనే మేము అన్నయ్య వాళ్ళింటికి వెళ్ళాము. ఆరోజు కూడా గడుస్తున్నా అన్నయ్య ఇంటికి రాలేదు. ఫోన్ చేద్దామంటే ఫోన్ తీసుకెళ్ళలేదు. మాకు భయవేసింది. నేను చాలా ఏడ్చాను. నాకు అమ్మ, నాన్న ఇద్దరూ లేరు. ఉన్న ఒక్క అన్నయ్యకి ఏదైనా జరిగితే అని చాలా భయమేసి, "బాబా! మీరే దిక్కు. అన్నయ్యకి చెడు ఆలోచనలు కలగకుండా ఇంటికి చేర్చు తండ్రీ. తనని క్షేమంగా ఇంటికి చేర్చినట్లైతే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవలన అన్నయ్య ఆ రాత్రి ఇంటికి తిరిగి వచ్చాడు. నిజంగానే అన్నయ్యని బాబానే కాపాడారు. ఎందుకంటే, తను చనిపోవాలనే అనుకున్నాడట. తన మనసు మార్చి ఇంటికి తిరిగి వచ్చేలా చేసింది బాబానే.
సర్వేజనాః సుఖినోభవంతు!!!
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam
ReplyDeleteSai always be with me
Om Sai ram
ReplyDelete🙏🙏🙏fg 👏👏👏👏
ReplyDeleteOm Sai Sri Sai Jai Sai kapadu Tandri
ReplyDeleteOm sai ram
ReplyDelete