సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1558వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా దగ్గరకొస్తే మన మూడ్స్‌కి మూడుతుంది
2. IELTS పరీక్షలో స్కోర్ చాలా తక్కువ వచ్చినా యూకేలో అడ్మిషన్ ఇప్పించిన బాబా

బాబా దగ్గరకొస్తే మన మూడ్స్‌కి మూడుతుంది

 

శ్రీసాయినాథాయ నమః!!! నా పేరు నీలవేణి. మాది విశాఖపట్టణం. నాకు 20 సంవత్సరాల వయసున్న అమ్మాయి ఉంది. తను డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతోంది. ఆరు నెలల క్రితం తను తన స్నేహితుల చేతుల్లో డబ్బుల విషయంగా మోసపోయి వాళ్లతో గొడవపడింది. అప్పటినుండి తను మోసపోయానన్న అపరాధభావాన్ని తట్టుకోలేక, పరిస్థితిని ఎదుర్కోలేక ఒత్తిడికి గురై బాగా డిప్రెషన్‌కి లోనైంది. ఎప్పుడూ చిరాకుగా, అసహనంగా, విసుగ్గా, నిరుత్సాహంగా ఉంటుండేది. తనతో ఎవరు, ఏం మాట్లాడినా ఇంటా బయటా గొడవపడేది. చివరికి ప్రేమతో మాట్లాడినా ప్రతికూలంగానే తీసుకునేది. నిత్యం ఫ్రెండ్స్‌తో ఫోన్లో గట్టిగా అరుస్తూ, తిడుతూ, పచ్చిబూతులు మాట్లాడుతుండేది. ఇరుగుపొరుగువారు వింతగా, అసహ్యంగా చూస్తుండేవారు. అమ్మాయి ఫోనులో మాట్లాడుతుందంటే నా పరిస్థితి భయంగా, గందరగోళంగా, వణుకుగా ఉండేది. నేను ఏమీ చేయలేక మనసులో ప్రతి దేవుడిని ప్రార్థించుకుంటుండేదాన్ని. కానీ ఆరు నెలలు వరకు పరిస్థితి అలానే కొనసాగింది. అలా ఉండగా 2023, మే నెలలో నేను ఫేస్‌బుక్‌లో 'సాయి మహరాజ్ సన్నిధి' తెలుగు బ్లాగులోని సాయిభక్తుల అనుభవాలు, బాబా మహిమలు చదివాను. అలా వరుసగా 15 రోజులు బాబా మహిమలు చదివిన తర్వాత నా మనసులో బాబాని తలచుకొని, "నా బిడ్డ ఫోన్ మాట్లాడినప్పుడు అరుపులు, కేకలు, బూతులు మాట్లాడకుండా చేయి తండ్రీ. అమ్మాయి మారితే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి శరణువేడాను. అదేమి విచిత్రమో కానీ, ఆ క్షణం నుండి నేటివరకు, అంటే ఈ అనుభవం వ్రాసే సమయానికి 15 రోజులు, అమ్మాయి ప్రశాంతంగా ఉంది. ఫోన్ మాట్లాడినా బూతులు లేవు, అరుపులు లేవు, కేకలు లేవు. నాతో కూడా ప్రేమగా ఉంటోంది. పెట్టింది తింటోంది, సమయానికి కాలేజీకి వెళ్లి తిరిగి ఇంటికి వస్తోంది. ఆ సాయినాథుని దయవలనే ఇంత మార్పు వచ్చింది, ఇంకా మారుతుందని ఆశిస్తున్నాను. ఈ మార్పు అంతటికీ కారణమైన సాయినాథుని పాదాలకు నా నమస్కారాలు. ఇంత దయచూపిన ఆ సాయినాథునికి నేను ఎల్లవేళలా ఋణపడి ఉంటాను.


శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!


IELTS పరీక్షలో స్కోర్ చాలా తక్కువ వచ్చినా యూకేలో అడ్మిషన్ ఇప్పించిన బాబా


సాయిబంధువులకు నమస్కారాలు. నా పేరు ప్రసన్న. నేను హైదరాబాద్ నివాసిని.  ఈ బ్లాగులోని ఎందరో సాయిబంధువుల అనుభవాలు చదువుతుంటే సాయితండ్రి పదకొండు వచనాలు అనుభవమవుతున్నాయి. ముఖ్యంగా 'నా సమాధి నుండియే నేను సర్వ కార్యములు నిర్వహింతును' అన్న బాబా మాట ప్రతి సాయిభక్తునికి అనుభవం. ఆ తండ్రి చూపుతున్న దివ్యకరుణాకటాక్షాలను తలచుకుంటే చాలా ఆనందం కలుగుతుంది. ఇక అసలు విషయానికి వస్తే..  మా చెల్లి సాయిభక్తురాలు. తనకి బాబా మీద చాలా నమ్మకం. తను అనుక్షణం సాయినామస్మరణ చేస్తుంటుంది. తన కొడుకు హైదరాబాద్‌లో BBA పూర్తిచేశాడు. తను మిగతా పిల్లలతో పోలిస్తే కాస్త నెమ్మదస్తుడు, భయస్తుడు. చదువులో యావరేజ్ స్టూడెంట్. అయినప్పటికీ పరీక్షలకు చాలా బాగా ప్రిపేర్ అవుతాడు, స్నేహితుల డౌట్స్ క్లియర్ చేస్తాడు. కానీ పరీక్షల్లో సరిగా వ్రాయలేడు. మా చెల్లికి వాడి గురించి చాలా టెన్షన్. తను అకాడమిక్ లైన్‌లో ఉద్యోగం చేసున్నందున వాడికి అన్ని విషయాలలో జాగ్రత్తగా గైడ్ చేస్తుంటుంది. తనకి వాడిచేత విదేశాల్లో MBA చేయించాలని చాలా కోరిక. అలాగైనా వాడు కొంచెం ఇంప్రూవ్ అవుతాడేమోనన్న ఆశ. కానీ వాడికి IELTS పరీక్షలో స్కోర్ చాలా తక్కువ వచ్చింది. మా చెల్లి కన్సల్టెంట్స్‌ని సంప్రదిస్తే వాళ్లు, "IELTS పరీక్షలో స్కోర్ తక్కువగా ఉంది కాబట్టి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. సీటు రావడం చాలా కష్టం" అని అన్నారు. పోనీ, బాబుచేత మళ్ళీ IELTS పరీక్ష వ్రాయిద్దామంటే రిజల్ట్స్ వచ్చేటప్పటికి ఈ సెమిస్టర్ అడ్మిషన్ టైమ్(2023, సెప్టెంబర్) అయిపోతుంది. కాబట్టి నెక్స్ట్ సెమిస్టర్ (2024, జనవరి) వరకు ఆగాల్సి వస్తుంది. ఇటువంటి స్థితిలో మా చెల్లి, 'సమస్యని బాబాకి వదిలేస్తే, ఆయన ఏది మంచిదో అది చేస్తార'ని 'సాయి దివ్యపూజ' మొదలుపెట్టింది. ఒక్క వారంలో బాబా అద్భుతం చేశారు. కన్సల్టెన్సీవాళ్లు "ఒకసారి యూకే యూనివర్సిటీలో ట్రై చేస్తాము. వాళ్ళు IELTS స్కోర్ తక్కువ ఉన్నా కన్సిడర్ చేస్తారేమో!" అని అప్లికేషన్ ఫార్వర్డ్ చేశారు. మా చెల్లి బాబా మీద పెట్టుకున్న నమ్మకం వృధా పోలేదు. కన్సల్టెన్సీ వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి, "యూకేలో ఒక యూనివర్సిటీ మీ బాబుకి వచ్చిన IELTS స్కోరుని ఆమోదించింది" అని చెప్పారు. మా చెల్లెలు, మేము బాబాకి మనసారా ధన్యవాదాలు తెలుపుకుని ఆయన అనుగ్రహంతో ప్రాసెస్ అంతా ఏ విఘ్నం లేకుండా జరగాలని దివ్యపూజ కొనసాగిస్తున్నాము. మన అందరిపై బాబా అనుగ్రహం ఇలాగే ఎల్లవేళలా ఉండాలని, మన ప్రతీ చిన్నాపెద్దా సమస్యలకు బాబా పరిష్కారం  చూపుతూ ఉండాలని వేడుకుందాము.


10 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. ఓం సాయిరామ్

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. Om sairam
    Om sairam
    Om sairam

    ReplyDelete
  5. Om Sai Sri Sai Jai Sai

    ReplyDelete
  6. Om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram

    ReplyDelete
  7. Om sai sri sai jaya jaya sai

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo