సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1559వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • బాబా లీలలకు అంతులేదు

బాబా లీలలకు అంతులేదు


అందరికీ నమస్కారం. నా పేరు హర్షధాత్రి. నేను ఈమధ్యనే 7వ తరగతి పాసై 8వ తరగతికి వచ్చాను. కొన్ని రోజుల ముందు నేను బాబా దయవలన ఎటువంటి ఆటంకాలు లేకుండా శ్రీపాద శ్రీవల్లభస్వామి చరితామృతం చదివాను. అందులోని ఒక కథ చదివాక నాకు చాలా భయమేసి రాత్రి 3:00 గంటలైనా నాకు నిద్ర పట్టలేదు. అప్పుడు నా షెల్ఫ్‌లో ఉన్న బాబా ఫోటో వైపు చూస్తే బాబా చుట్టూ చాలా వెలుగు కనపడింది. నేను మొదట ఆ వెలుగు బెడ్‌లైటుదేమో అనుకున్నాను కానీ, కాదు. తరువాత అరగంటలో నాకు నిద్రపట్టింది. మరుసటిరోజు ఉదయం నేను మా అమ్మతో 'రాత్రి బాబా చుట్టూ వెలుగు కనిపించింద'ని చెబితే, "నువ్వు భయపడ్డావు కదా! అందుకే బాబా 'నేను ఉన్నాను. నువ్వు భయపడకుండా ప్రశాంతంగా నిద్రపో' అని చెప్పినట్టున్నారు" అని అమ్మ చెప్పింది. అది విని నాకు చాలా ఆనందంగా అనిపించింది. "చాలా థాంక్స్ బాబా".


ఇకపోతే, చరితామృతం చదివేటప్పుడు ఆరోగ్యపరమైన ఏ సమస్యా రాలేదుగానీ, చదవడం అయిపోయిన తరువాత నాకు జలుబు చేసింది. అప్పటికి కొద్దిరోజులముందే నాకు, మా తమ్ముడికి, మా అమ్మకి హై-ఫీవర్ వస్తే, మా అందరినీ చూసుకోవడానికి మా డాడీ చాలా ఇబ్బందిపడ్డారు. ఆ ఒత్తిడి వల్ల మరియు చాలా నీరసంగా ఉండటం వల్ల నేను 7వ తరగతి ఫైనల్ ఎగ్జామ్స్ వ్రాయడానికి చాలా ఇబ్బందిపడ్డాను. మళ్ళీ ఇంతలోనే జలుబు సమస్య వచ్చేసరికి 'నాకు మామూలుగానే జలుబు మొదలైతే చాలారోజుల వరకు తగ్గద'ని చాలా భయమేసి, "బాబా! మొన్నటివరకు జ్వరంతో చాలా ఇబ్బందిపడ్డాము. మళ్ళీ కొత్తగా ఈ మహమ్మారి వద్దు బాబా. ఈ జలుబు త్వరగా తగ్గిపోవాలి. అదికూడా నా ఒక్కదానితోనే పోవాలి. అలా అయితే మీ అనుగ్రహాన్ని బ్లాగు ద్వారా తోటి సాయిభక్తులతో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకొని రోజూ ఊదీనీళ్లు తీసుకున్నాను. బాబా దయతో జలుబు తగ్గింది.


2023, జూన్ 5న నేను నా కళ్ళకి కాటుక పెట్టుకున్నాను. తరువాత ఆ కాటుకను తొలగించడానికి ఆయిల్ రాసుకునేటటప్పు కొంచెం ఆయిల్ నా ఎడమకంటిలోకి వెళ్లి కొంచెం అస్పష్టంగా కనిపించసాగింది. నేను మొదట 'తగ్గిపోతుందిలే' అని అనుకొన్నాను కానీ, తగ్గకపోయేసరికి నాకు చాలా భయమేసి, "బాబా! నా చూపులోని అస్పష్టతను తగ్గించండి. మీ అనుగ్రహాన్ని బ్లాగు ద్వారా తోటి సాయిభక్తులతో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకొని 'శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే మంత్రాన్ని జపించాను. కొద్దిసేపటికి చూపులోని అస్పష్టత తగ్గింది. "థాంక్యూ సో మచ్ బాబా. అడుగడుగునా మాకు తోడుగా ఉంటున్నావు".


ఒకసారి నా కాలు కట్ అయి చాలా నొప్పిగా అనిపించింది. అయినా నేను పట్టించుకోలేదు. ఆరోజు రాత్రి హఠాత్తుగా విపరీతంగా నొప్పి వచ్చి నాకు చాలా బాధ కలిగింది. వెంటనే ఊదీ నోట్లో వేసుకొని, నుదుటిన పట్టుకొని, "బాబా! ఎలాగన్నా నాకు నొప్పి తగ్గిపోయేలా చూడండి" అని బాబాకి చెప్పుకొని పడుకున్నాను. వెంటనే నాకు చాలా ఉపశమనంగా అనిపించింది. నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. "లవ్ యు బాబా".


ఇప్పుడు నేను అసలు ఎలా బాబా భక్తురాలినయ్యానో చెప్తాను. మేము బాబా గురించి 'స్వీట్‌హోమ్ ద్వారకామాయి' అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుసుకున్నాము. ఆ ఛానల్‌లోని వీడియోలు చూడడం వల్ల మా అమ్మ బాబాని నమ్మింది. నేను మాత్రం అంతగా నమ్మలేదు. కానీ బాబా తన మనవరాలిని తన భక్తురాలిగా చేసుకోవాలనుకున్నారేమో! హఠాత్తుగా మా డాడీ శిరిడీ వెళ్ళడానికి ప్లాన్ చేశారు. ఎప్పుడు, ఎక్కడికి వెళ్ళాలన్నా స్కూలులో ఏమి చెప్తారో, నోట్స్ అసంపూర్తిగా ఉండిపోతాయేమోనని చదువుపట్ల నాకున్న తపనతో వెళ్లాలని ఉన్నప్పటీకీ వెళ్లకుండా ఆగిపోయే నేను శిరిడీ వెళ్తున్నాం అంటే ఎందుకో తెలీదు చాలా తేలికగా ఒప్పుకొని స్కూలుకి లీవ్ లెటర్ వ్రాసాను. 2022, అక్టోబర్ 21 రాత్రి మేము ట్రైన్ ఎక్కాము. మరుసటిరోజు ఉదయం ట్రైన్ దిగాక మేము ముందుగా బుక్ చేసుకొన్న హోట‌ల్‌కి వెళ్ళడానికి సులభంగా ఒక వ్యాన్ దొరికింది. ఆ వ్యాన్‌లో మేము హోటల్‌కి చేరుకున్నాము. ఎంతో సౌకర్యంవంతమైన రూమ్ మాకిచ్చారు. మేము స్నానాలు చేసుకొని దర్శనానికి వెళ్లేసరికి మధ్యాహ్నం అయ్యింది. మధ్యాహ్న ఆరతి సమయం అయినందున మమ్మల్ని లైన్‌‌‌లో ఆపేశారు. ఏ గుడికి వెళ్లినా లైన్‌లో వెయిట్ చేయడమంటే అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. చాలా తలనొప్పిగా అనిపిస్తుంది. కానీ బాబా దగ్గర వెయిట్ చేసేటప్పుడు అస్సలు తలనొప్పి అనిపించలేదు. నేను మా అమ్మతో, "అమ్మా! ఆరతి ఎంతసేపు ఇస్తారు?" అని అడిగాను. అమ్మ, "అరగంట" అని చెప్పింది. అది విన్న నేను, "అమ్మో! 30 నిమషాలా! అంతసేపు ఒకే దగ్గర కూర్చొని ఉంటే నాకెంత తలనొప్పి వస్తుందో ఏమో!" అని అనుకున్నాను. కాసేపటికి మమ్మల్ని ఆరతికోసం సమాధి మందిరంలోకి పంపారు. లోపలకి వెళ్ళాక నేను 30 నిముషాలపాటు ప్రశాంతంగా ఆరతి దర్శించాను. 'ఇంతసేపూ తలనొప్పి లేకుండా ఎలా ఉన్నాన'ని నాకే ఆశ్చర్యంగా అనిపించింది. ఆ తరువాత భోజనము చేసి రూమ్‌కి వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకున్నాము. మళ్ళీ దర్శనానికి వెళ్ళడానికి తయారవుతున్నప్పుడు నాకెందుకో ఇంటికి వెళ్ళాలన్న ఆలోచన వచ్చి చాలా ఏడుపొచ్చింది. అంతలోనే, 'నేను ఎందుకు ఏడుస్తున్నాన'ని అనుకొన్నాను. తరువాత మేము దూప్ ఆరతికి హాజరయ్యాము. మర్నాడు చూడాల్సిన టెంపుల్స్ అన్ని చూసాక ద్వారకామాయి దగ్గరకి వెళ్లినప్పుడు 'బాబా ఉన్నకాలంలో ద్వారకామాయి ఎలా ఉండేదో? అసలు శిరిడీ ఎలా ఉండేది?' అని నాకనిపించింది. ఆ విషయమై, "బాబా! కలలో అయిన సరే మీరు ఉన్నపుడు శిరిడీ ఎలా ఉండేదో నాకు తెలుసుకోవాలని ఉంది" అని అనుకున్నాను. ఆ తర్వాత మా డాడీ, "ఈ రోజు రాత్రి మనం ఇంటికి బయల్దేరుతున్నాము" అని చెప్పారు. అది వినగానే నాకు, 'ఇంత కంటే బాధాకరమైన వార్త ఇంకొకటి ఉంటుందా?' అని అనిపించి విపరీతంగా ఏడుపు వచ్చింది. దాంతో 'నాకు శిరిడీ వదిలి వెళ్ళాలని లేద'ని అర్థమై దుఃఖాన్ని ఆపుకోలేకపోయాను, ఏడుస్తూనే ఉన్నాను. కానీ అమ్మ, నాన్న, తమ్ముడికి నా బాధని కనపడనీయలేదు. కొద్దిసేపటి తరువాత మేము వాటర్ బాటిల్ కొనడానికి ఒక షాపు దగ్గర ఆగాము. ఇంకా ఎడుస్తూనే ఉన్న నేను కళ్ళ నుండి కన్నీళ్లు కారుతుంటే అమ్మానాన్నలకు కనపడుతుందేమోనని పక్కనే ఉన్న బాబా ఫొటోలు అమ్మే షాపులోకి వెళ్లాను. మొట్టమొదట నా చూపు ఒక బాబా ఫోటోపై పడింది. ఆ ఫోటోలోని బాబా చిన్నగా చిరునవ్వు నవ్వుతున్నారు. అలా బాబాను చూసిన క్షణాన నాకు, 'తాతను వదిలి వెళ్ళడం ఇష్టం లేక మనవరాలు ఏడుస్తుంటే, ఆ తాత చిన్న చిరునవ్వు నవ్వి మనవరాలిని(నన్ను) ఓదారుస్తున్నట్లు' అనిపించింది. అంతే, 'ఎలాగన్నా ఈ బాబాని నాతో ఇంటికి తీసుకువెళ్ళాలి, లేదంటే శిరిడీ నుండి కదిలేదే లేదు' అని అనుకొని అమ్మని షాపు లోపలికి రమ్మని పిలిచి, "నాకు ఈ బాబా ఫోటో కావాలి" అని అడిగాను. అమ్మ ముందు వద్దని అంది. కానీ అంతలోనే నా కళ్ళలో కన్నీళ్లు చూసిందేమో! "సరే తీసుకో, కానీ ఈ ఫోటో వద్దు వేరే ఫోటో చూడు" అని అంది. నేను మాత్రం, "నాకు ఈ ఫోటోనే కావాలి" అని పట్టుబట్టి కూర్చున్నాను. దాంతో అమ్మ ఆ ఫోటోనే నాకు కొని ఇచ్చింది. ఆ ఫోటో తీసుకున్న తరువాత కూడా నాకు శిరిడీ వదిలి వెళ్లాలనిపించక నా బాధ అమ్మతో చెప్పాను. అమ్మ ద్వారా విషయం తెలుసుకున్న డాడీ, "నువ్వు అలా అనకూడదు తల్లీ. ఇప్పుడు మనం నలుగురం ఇంటికి వెళితే ఇంకో నలుగురుకి శిరిడీ రావడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాము. మనలాంటివాళ్ళు ఎందరో బాబాను చూడాలి అనుకుంటారు కదా!" అని అన్నారు. దాంతో నేను ఇంటికి రావడానికి ఒప్పుకున్నాను. కానీ నా బాధ పోలేదు. దాన్ని 'బాబా ఉన్నకాలంలో శిరిడీ ఎలా ఉండేదో తెలుసుకోవాల'న్న నా కోరికని తీర్చడం ద్వారా బాబా తీసేసారు. అదెలా అంటే, మేము శనిశింగణాపూర్ వెళ్ళినప్పుడు ఓ చోట ఓల్డ్ శిరిడీ అన్న బోర్డు కనిపించింది. నేను అక్కడ బాబా ఉన్నప్పటి విలేజ్ ఉంటుందేమో అనుకోని అక్కడికి వెళదామని మా అమ్మవాళ్ళను అడిగాను. అయితే వాళ్ళు సాయంత్రం చూద్దాములే అన్నారు. నేను సాయంత్రం అమ్మవాళ్ళను బ్రతిమలాడిన మీదట మేము మొత్తానికి అక్కడికి వెళ్ళాము. అది బాబాస్ హెరిటేజ్ విలేజ్. అక్కడ బాబా ఉన్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనలను అప్పటి వేషధారణలతో బొమ్మల రూపంలో ఉంచారు. వాటిని చూసాక నాకు చాలా ఆనందంగా అనిపించింది. అమ్మానాన్న ఓదార్చినా ఏడుపు అపని నేను ఆ ఓల్డ్ శిరిడీలో బాబాను చూసాక సంతోషంగా శిరిడీ వదిలి రాగలిగాను. అప్పటినుండి నేను బాబాకి భక్తురాలినయ్యాను.


నేను నా సెల్ఫ్‌లోని బాబా ఫోటో వద్ద వెలుగు కనిపించిందని మొదటి అనుభవంలో వ్రాశాను కదా! ఆ బాబా ఫోటోనే నేను శిరిడీలో కొనుక్కున్న బాబా ఫోటో. కింద జతపరుస్తున్నాను, చూడండి. "శతకోటి ధన్యవాదాలు బాబా. మీ లీలలకు అంతులేదు. మళ్ళీ ఎప్పుడు శిరిడీకి పిలుస్తారా అని ఎదురుచూస్తున్నాను బాబా. తొందరగా అనుగ్రహించండి".


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!


8 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. ఓం సాయిరామ్

    ReplyDelete
  3. సాయిలీలలు ఎన్నని చెప్పగలం. నమ్మితే చాలు అన్నీ తానై కాపాడతాడు. ఓం సాయిరాం..

    ReplyDelete
  4. Om Sai Sri Sai Jai Sai

    ReplyDelete
  5. Om sairam 🙏🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo