ఈ భాగంలో అనుభవాలు:
1. సమస్యల పరిష్కారం కోసం శిరిడీ సాయిబాబాకి విన్నవించుకో - వారే పరిష్కారం చెపుతారు
2. బాబాని నమ్ముకుంటే ఏ ఇబ్బంది వచ్చినా తప్పిపోతుంది
సమస్యల పరిష్కారం కోసం శిరిడీ సాయిబాబాకి విన్నవించుకో - వారే పరిష్కారం చెపుతారు
శ్రీసాయినాథాయ నమః. సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నేను గత మూడు సంవత్సరాల(2022) నుండి బాబాను నమ్ముతున్నాను. అంతకుముందు రాముడు, లలితాదేవి పూజలు చేస్తుండేదాన్ని. ఒకరోజు ఫేస్బుక్లో మొగలిచెర్ల అవధూత శ్రీదత్తాత్రేయస్వామి మహిమలు చదివి అతనిని ధ్యానిస్తూ నా కుటుంబలోని సమస్యలు అతనికి విన్నవించుకుంటుండేదాన్ని. ఒకనాటి ధ్యానంలో ఆ దత్తస్వామి నుండి, "నీ సమస్యలకు పరిష్కారం కోసం శిరిడీ సాయిబాబాకి విన్నవించుకో, వారే నీ సమస్యలకు పరిష్కారం చెపుతారు" అని సమాధానం వచ్చింది. ఆరోజు నుండి నేను నిత్యం సాయి నామస్మరణలో ఉంటున్నాను. ఆయన ఈ మూడు సంవత్సరాల్లో ఎన్నో ఆపదలు, ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో అవాంతరాలు అందుండి నన్ను కాపాడారు. నా ప్రతి సమస్యకి పరిష్కారం చూపారు.
ఇప్పుడు నేను ఒక చిన్న సమస్యను బాబా ఎలా పరిష్కరించారో చెప్తాను. నావి, మా అమ్మాయివి కలిపి మొత్తం 5 జతల బంగారు చెవికమ్మలు ఒక చిన్న ప్లాస్టిక్ కవర్లో పెట్టి, దాన్ని ఎక్కడ పెట్టానో మర్చిపోయాను. వాటిని ఎక్కడ పెట్టనా అని మూడురోజులు బీరువా, అల్మారాలు, వంటగది మొత్తం అంతా వెతికాను. వెతికి వెతికి మనఃశాంతి పోయింది, చేతులు కూడా నొప్పి పుట్టాయి కానీ, ఎంత వెతికినా అవి మాత్రం దొరకలేదు. మా ఇంటికి ఇతరులెవరూ రాలేదు కాబట్టి, దొంగలించబడే అవకాశం లేదు. వాటిని వెతుకుతున్న సమయంలోనే ఈ 'సాయిమహారాజ్ సన్నిధి' బ్లాగులో ఒక చిన్నపాప బంగారు గాజు దొరికిన అనుభవం చదివాను. అది చదవగానే నాకు ధైర్యం వచ్చి, బాబాకి నమస్కారం చేసుకొని, "బాబా! నా చెవికమ్మలు దొరికితే, ఐదుగురికి అన్నదానం చేస్తాను" అని మ్రొక్కుకొని బీరువాలో అదివరకు వెతికిన చోటే మళ్ళీ వెతికాను. రెండుక్షణాల్లో బట్టల మధ్యలో ఆ ప్లాస్టిక్ కవర్లో పెట్టిన బంగారు చెవిదిద్దులు దొరికాయి. మూడు రోజులుగా దొరకనివి బాబాని తలుచుకొని వెతికిన రెండు క్షణాల్లో దొరికాయి. ఇది ముమ్మాటికి బాబా లీల. మరుసటి గురువారం గుడిలో బాబా హారతిలో హారతిలో పాల్గొని ఐదుగురికి అన్నదానం చేసి బాబాకి ధన్యవాదాలు తెలుపుకున్నాను.
బాబాని నమ్ముకుంటే ఏ ఇబ్బంది వచ్చినా తప్పిపోతుంది
అందరికీ నమస్కారం. నా పేరు శివాని. మా కుటుంబమంతా ఉన్నంతలో సర్దుకుంటూ ఎప్పుడూ సంతోషంగా ఉంటుంటాము. ఏమన్నా ఇబ్బంది వచ్చినా బాబాని నమ్ముకుంటే ఆ ఇబ్బంది తప్పిపోతుంది. 2025, మే నెలలో మా అమ్మకి గుండెలో పెద్ద సమస్య ఉందనీ, హార్ట్ సర్జరీ చేయాలనీ, 2 ఆపరేషన్లు చేయాలనీ, చేసినా నమ్మకం లేదని మా నెల్లూరులో డాక్టరు చెప్పారు. మాకు చాలా భయమేసింది. ఎలా అయినా అమ్మని కాపాడుకోవాలని చెన్నైలోని అపోలో హాస్పిటల్కి అమ్మని తీసుకెళ్లి టెస్టులు చేయిస్తే, వాళ్ళు కూడా 2 ఆపరేషన్లు చేయాలన్నారు కానీ, మరేం పర్వాలేదని భరోసా ఇచ్చారు. కాకపోతే 12 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. అప్పు చేసైనా అమ్మని కాపాడుకోవాలని సరేనని చెప్పాము. ఆపరేషన్ తేదీ 2025, జూన్ 14కి ఇచ్చారు. నేను బాబాతో, "అమ్మకి 2 ఆపరేషన్లు జరగకుండా ఒక్కటే అయ్యేలా చూడండి బాబా" అని చెప్పుకుంటూ ఉండగా దాదాపు 8గంటలు సేపు ఆపరేషన్ జరిగిన తర్వాత డాక్టర్ వచ్చి, "మీ అమ్మగారికి 2 ఆపరేషన్లు అక్కర్లేదు. ఒక్కటే చేసాము" అని చెప్పారు. అంతేకాదు, మా ఆర్థిక స్థితి గురించి చెప్పాక, 7 లక్షలు మాత్రమే కట్టండి అని చెప్పారు. బాబా దయవల్ల అమ్మని జాగ్రత్తగా ఇంటి తీసుకొచ్చాము. కానీ అమ్మ హార్ట్ బీట్ సరిగా లేదని ఒక మెషిన్ పెట్టి 3 రోజులు పరిశీలిస్తాం. రిపోర్టులో ఇలాగే హార్ట్ బీట్ సరిగా లేకుంటే పేస్ మేకర్ పెట్టాలి, మళ్ళీ ఆపరేషన్ చేయాలన్నారు. మేము బాబాని, "మేము మళ్ళీ డబ్బు ఎక్కడనుంచి తేవాలి? అదీకాక అమ్మ మళ్ళీ ఆ నొప్పి భరించాలి. అందుకని డాక్టర్ పేస్ మేకర్ పెట్టనవసరం లేదని చెప్పేలా దయ చూపండి బాబా" వేడుకున్నాము. బాబా మేము కోరుకున్నట్లే దయ చూపారు. డాక్టరు పేస్ మేకర్ అవసరం లేదని అన్నారు. "చాలా కృతజ్ఞతలు బాబా. అమ్మ నొప్పితో భాదపడుతుంది. ఎలా అయినా తన నొప్పిని తగ్గించండి బాబా".
నా భర్త ఒక భూ సంబంధిత కేసుతో బాధ పడుతున్నారు. ఆ విషయంలో ఇంకో కేసు వేయాలి, దానికి డబ్బు కావాలి అన్నారు ఆయన. నాకు ఆ కేసు వేయడం ఇష్టం లేదు. బాబాని అడిగితే, 'కేసు వెయ్యొద్దు, అవసరం లేదు' అన్నారు. "ఎప్పుడూ నాతోనే ఉండి నాకేం కావాలన్నా తీర్చి మీకు చాలా ధన్యవాదాలు బాబా. నా భర్త ఆ కేసు పరిష్కారమై, దాని నుండి బయటపడాలి. మీరే ఈ సమస్యను తీర్చాలి బాబా. నా అనుభవం చదివిన వాళ్ళకి ఏవైనా సమస్యలున్నా వాటిని తీర్చండి బాబా, ప్లీజ్".
సర్వేజనా సుఖినోభవంతు.
Sai Sai 🙏🙏🙏
ReplyDelete