ఈ భాగంలో అనుభవం:
- ఇబ్బందులు లేకుండా దయ చూపిన బాబా
నేను ఒక సాయిభక్తుడిని. నేను, నా భార్య ఇద్దరి పిల్లలతో మా సొంతూరు(పలాస)కి దూరంగా సోలాపూర్‌లో ఉంటున్నాము. మేమిద్దరం ఉద్యోగస్తులు కావడం, అలాగే మా వాళ్లంటూ ఎవరూ దగ్గర్లో లేకపోవడం వల్ల పిల్లల్ని చూసుకోవడానికి మేము ఒక పని మనిషిని(కేర్ టేకర్)ని పెట్టుకున్నాము. ఆమె కూతురు కాన్పు దగ్గర్లో ఉండటం వల్ల తను కొద్దిరోజులు పిల్లలను చూసుకోవడానికి రాలేని పరిస్థితి వచ్చింది. అందువల్ల మేము మా అమ్మని పిలుద్దామని అనుకున్నాము. కానీ మా అమ్మ మా నాన్నకి రెండవ భార్య అయినందున ఆమె మాతో సరిగా మాట్లాడదు, అందరితో గొడవలు పెట్టుకుంటూ ఉంటుంది. ఆ కారణంగా సందేహిస్తూనే నేను మా నాన్నతో మాట్లాడి పరిస్థితి వివరించి పని ఆమె కూతురుకి ప్రసవమైతే, ఆమె కనీసం వారం రోజులైన పనికి రాదు. అన్ని రోజులకు మాకు సెలవులు దొరకడం కష్టం. అదీకాక పిల్లలిద్దరినీ చూసుకోవడం ఇంకా కష్టమని చెప్పి బాబా మీద భారమేసాను. బాబా దయవల్ల మా నాన్న అమ్మని తీసుకొని ఇక్కడికి రావడానికి ఒప్పుకున్నారు. మా అమ్మ జూన్ 25న అమావాస్య అయిన తర్వాత మర్నాడు బయల్దేరి జూన్ 26 సాయంత్రంకి వస్తానని అంది. తరువాత మళ్ళీ అమ్మవారి వారాలు ఉన్నాయని జూలై 2న వస్తానని అంది. కానీ మా పనిమనిషి తన కూతురుకి జూన్ 20, 25 కల్లా కాన్పు అయిపోవచ్చని అంది. దాంతో అదే విషయం మా అమ్మకి చెప్పి ఒప్పిస్తే చివరికి జూన్ 26న బయల్దేరి రావడానికి ఒప్పుకుంది. ఇంకా నేను, "బాబా! మా అమ్మ ఇక్కడికి వచ్చాకనే ఆ అమ్మాయికి కాన్పు అవ్వాలి తండ్రీ. అలా ఐతే నా శక్తిమేరకు ముగ్గురికి అన్నదానం చేస్తాను" అని బాబాకి మొక్కుకొని భారం ఆయన మీద వేసాను. ఆ తండ్రి దయతో మా అమ్మ 26న ఇక్కడికి వచ్చాక జూలై 1న ఆ అమ్మాయి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అందువల్ల మాకు ఇబ్బంది అవ్వకుండా అయింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
అంతకుముందు ఒకసారి మా ఊర్లో అమ్మవారి పండగలు జరగనున్నాయని మా అమ్మానాన్న మమ్మల్ని రమ్మన్నారు. అయితే నా భార్య రానని అంది, టిక్కెట్లు కూడా అందుబాటులో లేవు. అందువల్ల నేను ఒక్కడినే ఒక్కరోజుకోసం వెళదామనుకున్నాను. కానీ అమ్మ, నాన్న మా అందర్నీ రమ్మని అన్నారు. అదీకాక ఆ సమయంలో హఠాత్తుగా నా భార్యకి ఒంట్లో బాగాలేకపోవడంతో అమ్మవారి పండగలకి రానని అన్నందువల్లే అలా అయిందని అందరూ అనుమానించారు. దాంతో నేను నా టికెట్ క్యాన్సిల్ చేసి వెయిటింగ్ లిస్టు ఉన్నప్పటికీ 4 రోజులకోసం వేరేగా బ్రేక్ జర్నీ టికెట్లు మా అందరికీ తీశాను. మా ప్రయాణానికి ముందురోజు బక్రీద్ పండుగ ఉండడం వల్ల టిక్కెట్లు కన్ఫర్మ్ అవుతాయో, లేదోననిపించి బాబా మీద నమ్మకముంచి ఎమర్జెన్సీ కోట అప్లై చేశాను. బాబా దయవల్ల టికెట్ కన్ఫర్మ్ అయింది. అప్పుడు నేను, "బాబా! ప్రయాణమంతా పిల్లలు(2.5 సంవత్సరాల బాబు, 5 నెలల పాప) మమ్మల్ని ఇబ్బందిపెట్టకుండా, వాళ్లూ ఇబ్బందిపడకుండా క్షేమంగా వెళ్ళి వచ్చేలా కరుణించండి తండ్రీ. అలాగే తిరుగు ప్రయాణం టిక్కెట్లు కన్ఫర్మ్ అయ్యేలా చూడండి. ముగ్గురికి అన్నదానం చేస్తాను" అని అనుకొని ప్రయాణమయ్యాను. బాబా దయవల్ల ఎటువంటి ఇబ్బందీ లేకుండా మా వూరు చేరుకున్నాము, అమ్మవారి దర్శనం బాగా అయ్యింది, పండగలు బాగా జరిగాయి. కానీ తిరుగు ప్రయాణం టికెట్లు ప్రయాణమయ్యేరోజు చార్ట్ ప్రిపేర్ అయ్యేవరకు వెయిటింగ్ లిస్ట్ ఉండడంతో కాస్త టెన్షన్ పడ్డాము. కానీ బాబాని, "బాబా! ఎలా అయినా కన్ఫర్మ్ అయ్యేలా చూడండి. లేదంటే ఇద్దరు చిన్న పిల్లలు, లగేజీతో చాలా ఇబ్బంది అవుతుంది" అని ప్రార్ధించి మరోసారి చూసేసరికి కన్ఫర్మ్ ఐయ్యాయి. "ధన్యవాదాలు తండ్రీ. మీ దయతో ఇద్దరు చిన్న పిల్లలతో ప్రయాణం క్షేమంగా జరిగింది. పిల్లల ఆరోగ్యం మంచిగా ఉండేలా దయ చూపండి తండ్రీ".
ఒకసారి మా పిల్లలిద్దరికీ జలుబు, దగ్గు, జ్వరం వచ్చాయి. బాబుకి మందులు వేసినా జ్వరం తగ్గకపోయేసరికి ఆ రోజు సాయంత్రం 4.30కి హాస్పిటల్‌కి తీసుకెళ్లి డాక్టరుకి చూపిస్తే, మందులు మార్చారు. వాటితో బాబుకి నయమైపోతుందని అనుకునేలో పు పాప ఆ సాయంత్రం నుండి నిద్రవస్తున్నా నిద్రపోలేక ఒకటే ఏడుపు. కడుపునొప్పి అయ్యుండొచ్చని డ్రాప్స్ వేసినప్పటికీ ఏడుపు ఆపలేదు. తర్వాత వాము నీరు కూడా తాగించాము. అయినా పాప ఏడుస్తూనే ఉండింది. భుజం మీద వేసుకొని 'జో' కొడుతుంటే నిద్రపోయింది కానీ, మంచం మీద వేస్తే మళ్ళీ లేచి ఏడవసాగింది. పాప చిన్నదైనందున ఎందుకు ఏడుస్తుందో మాకు అర్థం కాలేదు. రాత్రి 10 వరకు చూసినా ఆపకుండా ఏడుస్తుండడంతో ఇంకా హాస్పిటల్‌కి వెళ్లాలని అనుకొని మేము ఎప్పుడూ వెళ్ళే హాస్పిటల్ కి కాల్ చేస్తే, 'టైమ్ ఐపోయింది, ఇప్పుడు ఇంకా చూడము' అన్నారు. దాంతో మా స్టాఫ్‌ను అడిగితే ఒక హాస్పిటల్ నెంబర్ ఇచ్చి వెళ్ళమన్నారు కానీ, ఆ నెంబర్ కలవలేదు. హాస్పిటల్ దూరంలో ఉంటుంది. ఒకవేళ వెళ్లాక అక్కడ ఎవరూ లేకపోతే కష్టం. అందువల్ల బాబాని నమ్ముకొని, కొంచెం ఊదీ పాపకి పెట్టాను. ఇంతలో మరో హాస్పిటల్ ఉంటుందని తెలిసి, ఆటో బుక్ చేసుకుని నేను, మా అమ్మ పాపని తీసుకొని వెళ్ళాము. కానీ దారిలో ఆ హాస్పిటల్‌కి కాల్ చేస్తే, వాళ్ళు కూడా 'చూడం, వేరే హాస్పిటల్‌కి వెళ్ళిపోండి' అన్నారు. నేను అభ్యర్థించినా వాళ్ళు అదే అన్నారు. ఇంకా వేరే ఏ హాస్పిటల్‌కి వెళ్ళినా అడ్మిట్ అవ్వమంటారు. నా భార్య బాబుతో ఇంట్లో ఉంది. పాప వాళ్ళ నాన్నమ్మ దగ్గర ఉండలేదు. అందుకని నేను బాబాని, "ఎలా అయినా అడ్మిట్ అవ్వమనకుండా డాక్టర్ చూసేలా కరుణించండి తండ్రీ. అలా ఐతే ముగ్గురికి అన్నదానం చేస్తాను" అని అనుకున్నాను. తర్వాత ఒక హాస్పిటల్‌కి వెళితే, మొదట చూడమన్నారు. కానీ బాబా మీద భారమేసి మళ్ళీ అడిగితే, "ఎమర్జెన్సీ విజిట్ చార్జీలు అవుతాయి, డాక్టర్ని పిలుస్తాము" అన్నారు. పోనీలే ఎలా ఐతేనేం పాపకి నయమవ్వడమే కావాలని, సరేనన్నాము. డాక్టరు చెక్ చేసి చెవిలో ఇన్ఫెక్షన్ ఉందని, ఇయర్ డ్రాప్స్, నాసల్ డ్రాప్స్ వ్రాసారు. బాబా దయవల్ల ఆ రాత్రి 11 అప్పుడు కూడా ఒక మెడికల్ షాపు ఉండటంతో మందులు తీసుకుని వాడాము. బాబా దయవల్ల పాప, బాబులకి నయమయ్యింది. "ఎన్ని ధన్యవాదాలు చెప్పినా మీకు తక్కువే బాబా".
Om Sai Ram 🙏🙏🙏🙏❤️
ReplyDeleteOm Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Sri Sai Jai Jai Sai. Om Sai Ram.
ReplyDeleteOm Sai Ram 🙏🙏🙏
ReplyDelete