సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 938వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. మన నిజమైన అవసరాలేమిటో బాబాకి మాత్రమే తెలుసు
2. ఆపద నుండి రక్షించిన సాయి

మన నిజమైన అవసరాలేమిటో బాబాకి మాత్రమే తెలుసు


బాబాకు నమస్కరిస్తూ, వారి ఆశీస్సులు మనందరికీ సదా ఉండాలని కోరుకుంటూ నా స్వీయ అనుభవమొకటి మీ అందరితో పంచుకుంటున్నాను. 2021, ఆగస్టు 6న నేను, మా తమ్ముడు పనిమీద వైజాగ్ వెళ్ళాం. దారిలో డి-మార్ట్‌లో సరుకులు తీసుకుందామని వెళితే, అక్కడ కారు పార్క్ చేసేందుకు స్థలం లేదు. దాంతో, 'తిరుగు ప్రయాణంలో వద్దాం. అప్పుడు కారు పార్క్ చేసేందుకు బాబా అవకాశం ఇస్తారులే' అనుకొంటూ సిటీలోకి వెళ్లి పని చూసుకుని తిరుగు ప్రయాణంలో మళ్లీ డి-మార్ట్‌కి వచ్చాం. ఈసారి కూడా కారు పార్క్ చేయడానికి ఖాళీ లేదు. అక్కడున్న సెక్యూరిటీ గార్డు, ‘ఎడమవైపు రెండో వీధిలో పార్క్ చేసుకోమ’ని అన్నాడు. ఇంక చేసేది లేక అతను చెప్పిన చోటికి వెళ్తే, అక్కడ కూడా కారు పార్క్ చేయడానికి సరైన స్థలం కనపడలేదు. దాంతో తిరిగి డి-మార్ట్ వద్దకి వస్తూ, ‘ఈసారైనా పార్క్ చేయడానికి అవకాశం ఉంటుందేమో’నని ఆశపడ్డాం. కానీ నిరాశే ఎదురైంది. బాబా సహాయం చేయలేదని ప్రత్యేకించి అనుకోకపోయినా, మనసుకైతే కాస్త అనిపించింది. సరే, కొద్దిగా ముందుకు వెళ్ళి ఒక చిన్న వీధిలో కారు పార్క్ చేసొచ్చి డి-మార్ట్ లోపలికి వెళ్ళాము. చకచకా కావలసిన సరుకులను ట్రాలీలో వేసుకున్నాక మా తమ్ముడు బిల్లింగ్ కోసం నన్ను లైనులో ఉండమని చెప్పి, తను ఫస్ట్ ఫ్లోర్‌లో ఐటమ్స్ చూసుకుని వస్తానని వెళ్ళాడు. తను అటు వెళ్ళగానే కౌంటరులో బిల్లింగ్ చేస్తున్న అతను, "ఆ లైనులో కేవలం కార్డు ద్వారా మాత్రమే అమౌంట్ పే చేయాల్సి ఉంటుంద"ని చెప్పాడు. సాధారణంగా మా తమ్ముడు ఎప్పుడూ కార్డు ద్వారానే క్యాష్ చెల్లిస్తాడు. కాబట్టి నేను ఆ లైనులోనే నిల్చున్నాను. కానీ, కాసేపటిక్రితం రిలయన్స్ ఫ్రెష్‌లో మా తమ్ముడి దగ్గరున్న కార్డు పనిచేయలేదు. అందువల్ల, ‘తన దగ్గర వేరే కార్డు ఉందో, లేదో? ఒకవేళ లేకుంటే కనీసం క్యాష్ అయినా ఉందో, లేదో? లేకపోతే ఏమిటి పరిస్థితి?’ అని ఆలోచిస్తూ టెన్షన్ పడసాగాను. బిల్లింగ్ కోసం నా ముందు కొంతమంది ఉన్నారు. వాళ్ళ నడవడిని బట్టి వాళ్లంతా ఒకే గ్రూపులా అనిపించింది. వాళ్ళందరి చేతుల్లో ఒకటి, రెండు ఐటమ్స్ మాత్రమే ఉన్నాయి. వాళ్ల బిల్లింగ్ అయిపోయాక వరుసలో నేనే బిల్లింగ్ చేయించుకోవాల్సి ఉంది. కానీ, మా తమ్ముడు ఇంకా రాలేదు. అందువల్ల నా వెనుకనున్న అతన్ని బిల్లింగ్ చేయించుకోమని చెప్తుండగా మా తమ్ముడు దూరంగా కనిపించాడు. తనని తొందరగా రమ్మని సైగ చేసి పిలిచాను. తను రాగానే, "ఈ కౌంటర్లో కేవలం కార్డు బిల్లింగ్ చేస్తారట. మరి రిలయన్స్ ఫ్రెష్‌లో కార్డు పనిచేయలేదు కదా, వేరే కార్డు ఉందా?" అని అడిగాను. అందుకు తను, "వేరే కార్డు లేదుగానీ, ఉన్న కార్డు పనిచేస్తుందిలే" అన్నాడు. మళ్లీ అంతలోనే, "ఈ సరుకులకు సరిపడా అమౌంట్ కార్డులో లేదు" అని అన్నాడు. 'మరెలా?' అనుకుంటూ ఉండగా హఠాత్తుగా ఒకతను మా వద్దకి వచ్చి, మా ట్రాలీని చూపిస్తూ, "ఈ సరుకులు 3,500 రూపాయలు అవుతాయా?" అని అడిగాడు. అతనెందుకు అలా అడిగాడో మాకు అర్థం కాలేదుగానీ, "ఆ, అంతకంటే ఎక్కువే ఉంటాయి" అని అన్నాము. అప్పుడతను, "3,500 రూపాయల సరుకులకు నా కార్డు మీద డబ్బులు పే చేస్తాను. మిగతావి మీరు చేసుకోండి" అని అన్నాడు. అసలే మా కార్డులో డబ్బులు సరిపోవన్న ఆలోచనలో ఉన్న మేము వేరే ఆలోచన ఏమీ చేయక అతను ఇచ్చిన ఆఫర్‌కి అంగీకరించాము. వెంటనే మా ట్రాలీలో ఉన్న సరుకులు బిల్లింగ్ చేయడం మొదలుపెట్టి, సుమారు 4,000 రూపాయలయ్యాక మా తమ్ముడు తన దగ్గర ఉన్న కార్డు ఇచ్చాడు. అయితే, ఎంత ప్రయత్నించినా ఆ కార్డు పనిచేయలేదు. దాంతో మాకు సహాయం చేస్తానన్నతను ఆ అమౌంటును సుమారు 3,500 రూపాయలకు సెట్ చేయించి, తన కార్డు మీద ఆ డబ్బులు పే చేశాడు. ‘ఇక మిగిలిన సరుకుల విషయం ఏం చేద్దాం?’ అనుకుంటుండగా అతను తనంతట తానే, "అవి కూడా బిల్లింగ్ చేయించండి, వాటికి కూడా నా కార్డు మీద పే చేస్తాను. తరువాత మనం చూసుకుందాం" అని అన్నాడు. సరేనని మిగిలినవి కూడా బిల్లింగ్ చేసి బయటకి వచ్చాము. అతను తనకి ఎంత అమౌంట్ ఇవ్వాలో లెక్కించి చెప్తే, మా తమ్ముడు తన వద్ద ఉన్న క్యాష్ ఇవ్వబోయాడు. అందుకతను, "క్యాష్ అయితే నేను మళ్ళీ బ్యాంకుకు వెళ్లి అకౌంటులో వేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఫోన్-పే ద్వారా నా అకౌంటుకి పంపించమ"ని అన్నాడు. నాకు అంతా చిత్రంగా అనిపించింది. మా తమ్ముడు ఫోన్-పే, మొబీక్విక్, పేటిఎమ్‌ల ద్వారా ప్రయత్నించినప్పటికీ ఏదో ఎర్రర్ చూపిస్తూ అతని అకౌంటుకి డబ్బులు ట్రాన్స్‌ఫర్ కాలేదు. సమస్య ఏమిటో అర్థం కాలేదుగానీ, అడగకుండానే అంత సహాయం చేసిన అతనికి కావాల్సిన విధంగా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తే బాగుంటుందనిపించి, తెలిసినవాళ్లకి ఫోన్ చేసి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయమని చెప్పాము. కానీ ఆ ప్రయత్నం కూడా ఫలించలేదు. చివరికి క్యాష్ రూపంలోనే అతనికి డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. మేము అతనికి మాటల్లో కృతజ్ఞతలను చెప్పినా, మాకు అంత సహాయం చేసిన తనకి నచ్చినట్లు చేసి తనని సంతృప్తిపరచలేకపోయాము.


తరువాత మేము కారులో వస్తూ జరిగినదాని గురించి చర్చించుకుంటుండగా, బాబా మార్క్ స్పష్టంగా అర్థం కాసాగి మాకు చాలా సంతోషంగా అనిపించింది. కాస్త వివరంగా చెప్పాలంటే, అప్పటివరకు మా ముందు లేని ఆ వ్యక్తి ఉన్నట్టుండి మా ముందుకు వచ్చాడు. అతని చేతిలో రెండు మూడు ఐటెమ్స్ మాత్రమే ఉన్నాయి. అవి మహా అయితే రెండు, మూడు వందలలోపే ఉంటాయి. తన మానాన తాను తన కార్డు మీద డబ్బులు పే చేసుకుని వెళ్లిపోవచ్చు. మాకు సహాయం చేయాల్సిన అవసరం అతనికి ఎంత మాత్రమూ  లేదు. కానీ తనంతటతానే వచ్చి మాకు సహాయం చేశాడు. అయినా ఈ రోజుల్లో అడిగితేనే ఎవరూ సహాయం చేయరు. అంతెందుకు? అతని స్థానంలో మేమున్నా చేసేవాళ్ళం కాదేమో! మరి అతనెందుకు తనంతట తానే డబ్బులు పే చేస్తానని అన్నాడు? పోనీ, తనకి నగదు రూపంలో డబ్బులు కావాల్సి ఉండి మాకు సహాయం చేసి బదులుగా క్యాష్ తీసుకోవాలని అనుకున్నాడనుకోవడానికీ లేదు. ఎందుకంటే, మేము క్యాష్ ఇస్తే, ‘అలా వద్దు, అకౌంటులోకే డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయమ’న్నాడు. ఇలా ఎంత ఆలోచించినా అన్నీ సమాధానం లేని ప్రశ్నలే!


నిజానికి మేము పార్కింగ్ విషయంలోనే బాబా సహాయాన్ని ఆశించాము. ఎందుకంటే, కారు దూరంగా ఎక్కడో పెడితే, ట్రాలీని అక్కడివరకు తీసుకువెళ్లే అవకాశం ఉండదు గనుక, ‘అంతదూరం సరుకులు ఎలా తీసుకెళ్తామ’ని భయపడ్డాము. మాకదే అవసరంగా అనిపించిందిగానీ, బిల్లింగ్ దగ్గర మేము మా అవసరాన్ని గుర్తించలేదు, బాబాను తలచుకోలేదు. ఎందుకంటే, మా వద్ద క్యాష్ ఉంది కాబట్టి వేరే కౌంటర్లో బిల్లింగ్ చేసుకోవచ్చు. కానీ అలా జరగడం వెనుక ఏవో పరిణామాలు ఉండే ఉండొచ్చు. అవేమిటో మాకు తెలియకున్నా అందరి అంతరాత్మ తామై, సదా కంటికి రెప్పలా మనల్ని కనిపెట్టుకుని ఉండే బాబాకు తెలుసు కాబట్టి మా అవసరాన్ని గుర్తించి, అడగకనే సహాయం అందించారు. ఈ అనుభవం ద్వారా, నిజంగా మన అవసరాలేమిటో మనకు తెలియవనీ, అందువల్ల బాబాను ఏవేవో అడిగి, అవి నెరవేరకపోతే మనం కోరింది ఆయన ఇవ్వలేదనీ, సహాయం చేయలేదనీ అనుకుంటాంగానీ, మన అవసరాలు మనకన్నా ఎక్కువ బాబాకే తెలుసుననీ, మనం అడగకపోయినా ఊహించని రీతిలో వాటిని సమకూరుస్తారనీ, సహాయం అందిస్తారనీ అర్థమైంది. ఇప్పటికీ ఈ బాబా అనుగ్రహాన్ని నేను మరువలేకపోతున్నాను. ఎప్పుడు తలచుకున్నా ‘బాబా ఎంతలా మనల్ని కనిపెట్టుకుని ఉంటున్నారో’ అనిపిస్తుంది. ఇలా చెప్తూ పోతే బాబా నాపై కురిపించిన అనుగ్రహం గురించి ఎంతైనా చెప్తూపోతానేమో! ఎందుకంటే, అంత అనుగ్రహాన్ని బాబా చూపారు. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు. అమృతానికే తలమానికమైన మీ ప్రేమను నిరంతరం ఆస్వాదిస్తూ మీ స్మరణలో ఆనందంగా ఉండేలా మమ్మల్ని అనుగ్రహించండి బాబా".


ఆపద నుండి రక్షించిన సాయి


సాయిబంధువులకు నా నమస్కారాలు. నా పేరు కళ్యాణి. నేను ఇప్పుడు బాబా మాకు ప్రసాదించిన ఒక అనుభవం మీతో పంచుకోబోతున్నాను. ఒకరోజు నాకు కలలో మరియు ధ్యానంలో మా నాన్నకి ప్రమాదం జరగనున్నట్లు వచ్చింది. దాంతో నాకు చాలా భయం వేసింది. మరుసటిరోజు గురువారం, సాయి దివ్యపూజ చివరిరోజు. బాబా గుడికి వెళ్ళి, బాబాను ప్రార్థించి ఇంటికి తిరిగి వచ్చాము. ఇంటికి వచ్చాక ధ్యానం చేస్తే, మళ్ళీ నాన్నకి ప్రమాదం జరగనున్నట్లు వచ్చింది. వెంటనే నేను మా అమ్మకి విషయం చెప్పాను. తరువాత నాన్నకి ఫోన్ చేసి, "నేలపై ఉన్న మట్టి/ఇసుకను బాబా ఊదీగా భావించి పెట్టుకోమ"ని చెప్పాను. నాన్న నేను చెప్పినట్లే చేశారు. తరువాత మేము దూఫ్ హారతి చూస్తుండగా ఒక చిన్నపిల్లవాడు మా ఇంటికొచ్చి అరటిపండు అడిగాడు. మేము తనకి ఒక అరటిపండు, రెండు రూపాయలు ఇచ్చి పంపి సాయిని ప్రార్థించాము. కాసేపటికి నాన్న సురక్షితంగా ఇంటికి వచ్చారు. నేను నాన్నను, "ఏమైనా జరిగిందా?" అని అడిగాను. అందుకు నాన్న, "ఏం కాలేదు. కానీ ఓ చోట వాహనం ఆదుపు తప్పింది" అని చెప్పారు. ఎల్లవేళలా మాకు తోడుగా ఉంటున్న బాబాకి కృతజ్ఞతలు.



5 comments:

  1. Jaisairam bless amma for her eye operation recovery and bless me for my health and wealth of happiness. Jaisairam

    ReplyDelete
  2. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  3. Sai ram please cure my grand children's fever, please be with them and bless them

    ReplyDelete
  4. Om sai ram baba ma arogya samasyalani teerchu thandri sainatha

    ReplyDelete
  5. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo