1. బాబా అనుగ్రహాశీస్సులు
2. బాబా నామంతో సమస్యలు మాయం
బాబా అనుగ్రహాశీస్సులు
సాయితండ్రికి శతకోటి పాదనమస్కారాలు. ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా ధన్యవాదాలు. నేనొక సాయిభక్తురాలిని. ఈమధ్య ఒకసారి నాకు కాస్త గుండెనొప్పిగా అనిపించింది. అదే సమయంలో చెవి, కంఠం కూడా నొప్పి అనిపించాయి. మరోసారి మావారు కొద్దిపాటి జలుబు, జ్వరంతో బాధపడ్డారు. ఈ రెండు సందర్భాలలోనూ నేను ఎంతో భయపడి బాబాని ప్రార్థించి, ‘ఈ ఆరోగ్య సమస్యలు నయమైతే నా అనుభవాలను బ్లాగులో పంచుకుంటాన’ని అనుకున్నాను. బాబా ఎంతో దయతో మాకు వచ్చిన అన్ని ఆరోగ్య సమస్యలనూ తగ్గించారు. ఆయన దయవలన ఇప్పుడు మేమిద్దరమూ బాగున్నాము. మన బాబా ఉండగా మనకి భయమేల?
ఇంతకుముందు ఒకసారి నేను నా అనుభవాలతోపాటు మా ఫ్రెండ్ వస్తువు ఒకటి పోయిందనీ, వాళ్ళు బాబా మీద భారం వేసి అందరినీ తమ తరఫున ప్రార్థించమన్నారనీ మీతో విన్నవించుకున్నాను. ఇంతకుముందు ఎన్నిసార్లు వెతికినా దొరకని ఆ వస్తువు మీ అందరి ప్రార్థన మరియు సాయికృపతో మునుపు వెతికిన అదే బ్యాగులో దొరకడంతో వాళ్ళు చాలా ఆనందించారు. సాయికి మరియు మీ అందరికీ ధన్యవాదాలు.
అలాగే, ఇంతకుముందు మా పెద్దబ్బాయి గ్రీన్ కార్డుకు సంబంధించి మీతో పంచుకున్నాను. తరువాత బాబా ఆశీస్సులతో ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా మా అబ్బాయి, కోడలి గ్రీన్ కార్డులు నేరుగా ఇంటికి వచ్చాయి. బాబా తలచుకుంటే అసాధ్యమైనది కూడా సాధ్యమవుతుంది. చిన్నకొడుకు, కోడలికి కూడా తొందరలోనే గ్రీన్ కార్డు రావాలని ఆ సాయినాథుని ప్రార్థిస్తున్నాను. ఆ శుభవార్తను కూడా బాబా ఆశీస్సులతో తొందరలోనే మీ అందరితో పంచుకుంటాను.
ఇంకో ముఖ్యవిషయం, నేను ఇదివరకు ఒక అనుభవంలో ‘కొందరు మాకు డబ్బులు, ప్లాట్లు, పొలాలు ఇవ్వాల్సి ఉంద’ని పంచుకున్నాను. ఆ విషయంలో మాకు రావాల్సినవి 'మూడు, నాలుగు నెలల్లో వస్తాయ'ని బాబా సందేశమిచ్చారు. బాబా వాక్కు బ్రహ్మవాక్కు. ఆయన మాట ఎప్పుడూ తప్పదు కదా! కావున, ‘బాబా చెప్పిన సమయానికి అవన్నీ ఖచ్చితంగా వస్తాయ’ని నేను మావారితోనూ, పిల్లలతోనూ చెప్పాను. బాబా చెప్పినట్లే సరిగ్గా అదే సమయానికి మాకు రావాల్సినవి చాలావరకు వచ్చాయి. మావాళ్ళు "నువ్వు చెప్పినట్లే బాబా చేశారు" అని చాలా ఆనందపడ్డారు. ఇంత చేసిన బాబా ఇంకా రావాల్సినవి కూడా వచ్చేటట్లు చేయరా? తొందర్లోనే ఆ అనుభవాలను పంచుకోవాలని, మన అందరినీ చల్లగా దీవించాలని బాబాను కోరుకుంటున్నాను.
నాకు తెలిసిన ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించి, అతన్నే పెళ్లి చేసుకోవాలని అనుకుంటోంది. మొదట్లో ఆ అబ్బాయి చాలా బాగా ఉండేవాడట. ఇప్పుడు ఎవరో చెప్పిన మాటలు విని ఈ అమ్మాయిని ఇష్టపడటం లేదు. దాంతో తల్లి లేని ఈ అమ్మాయి బెంగపెట్టుకుంది. మనమంతా తల్లిదండ్రుల్లా ఆ అమ్మాయి కోరుకున్నట్లు వివాహం జరగాలని బాబాను ప్రార్థించుదాము.
"బాబా! మా మనవడు, మనవరాలి బాధ్యత అంతా మీదే. మీ దయతో మనవడు బాగున్నాడు. మనవరాలి విషయంలో మనసులో ఉన్న కొద్ది బాధను మీరే తీసేయాలి బాబా. మీ అనుగ్రహంతో మా అబ్బాయిలిద్దరికీ తొందరలోనే మళ్ళీ సంతానం కలగాలి. ఇంకా, మా అన్నయ్యకి మంచి జరగాలి. మా పనమ్మాయి పాపకి ఆరోగ్యం బాగోలేదు బాబా. మా డ్రైవరుకు కూడా కొద్దిగా నీరసంగా ఉంది. వాళ్ళు ఆరోగ్యంగా ఉండేలా అనుగ్రహించమని మరీ మరీ మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరి బాగోగులూ మీకు తెలుసు బాబా".
ఇట్లు
బాబా పాదదాసురాలు.
బాబా నామంతో సమస్యలు మాయం
బ్లాగులో ప్రచురింపబడిన 'శ్యామా కుమారునితో సాయిపథం ఇంటర్వ్యూ' చాలా బాగుంది. ఇలా బాబా గురించి చాలా చాలా మంచి విశేషాలు తెలియజేస్తున్న సాయికి బాబాతండ్రి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు శ్రీదేవి. మన సాయితండ్రి పిలిస్తే పలికే దైవం కదా! నేను కోరిన కోరికలను తీరుస్తూ ఇంకా ఇంకా తమపై విశ్వాసం, ప్రేమ పెరిగేలా చేస్తున్నారు మన సాయితండ్రి. నేను ఇంతకుముందు మీతో ఎన్నో అనుభవాలను పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను.
ఒక సంవత్సరం నుండి మా అత్తగారిని తలనొప్పి ఎంతగానో బాధిస్తోంది. ఒకటి, రెండుసార్లు డాక్టరుని సంప్రదిస్తే, ‘సైనస్’ అని చెప్పి కొన్ని మందులిచ్చారు. అవి వాడినప్పటికీ, తగ్గినట్లే తగ్గి మళ్లీ నొప్పి ఆమెను బాధిస్తుండేది. ఈమధ్య 2021, సెప్టెంబరు 17న ఆవిడ మరోసారి డాక్టరు దగ్గరికి వెళ్లారు. కాసేపటికి నేను ఫోన్ చేస్తే, "డాక్టరు తలకి స్కానింగ్ చేయించమని చెప్పారు. స్కానింగ్ చేయించుకోవడానికి వెళ్తున్నామ"ని అన్నారు. అప్పుడు నేను, "అత్తయ్య స్కానింగ్ రిపోర్టులో ఎటువంటి పెద్ద సమస్యా లేకుండా ఉంటే ఈ అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాన"ని బాబాను వేడుకుని రిపోర్టు వచ్చేదాకా బాబా నామస్మరణ చేస్తూ ఉన్నాను. బాబా దయవలన, 'పెద్దగా సమస్యేమీ లేదని, మందులతో తగ్గిపోతుంద'ని డాక్టర్ చెప్పారు. ఇదంతా నా సాయితండ్రి దయే.
ఇటీవల మా అన్నయ్యకి ఆర్థికంగా ఒక పెద్ద సమస్య వచ్చింది. ఆ కారణంగా తనదికాని సమస్యకు తను డబ్బులు కట్టాల్సి వచ్చింది. నేను అప్పుడు "అన్నయ్యకి సహాయం చేయమ"ని బాబాను వేడుకుని, 'ఓం శ్రీసాయి అసహాయ సహాయాయ నమః' అనే మంత్రాన్ని పఠించసాగాను. అంతేకాదు, ‘ఆ సమస్య పరిష్కారమైతే ఆ అనుభవాన్ని బ్లాగ్ ద్వారా సాయిబంధువులతో పంచుకుంటాన’ని కూడా అనుకున్నాను. బాబా దయవల్ల ప్రస్తుతానికి ఆ సమస్య పరిష్కారమైంది. "ధన్యవాదాలు బాబా. కానీ బాబా, ఎప్పుడైనా మళ్ళీ ఈ సమస్య వస్తే, తనదికాని సమస్యకు అన్నయ్య డబ్బులు కట్టాల్సి వస్తుందని మీకు తెలుసు. కాబట్టి అసలు వ్యక్తుల ద్వారా ఆ డబ్బును తిరిగి ఇప్పించి అన్నయ్యను సమస్య నుండి పూర్తిగా కాపాడు తండ్రీ. సమస్య చిన్నదైనా, పెద్దదైనా నీవు తప్ప మాకు దిక్కెవరు బాబా?"
2021, సెప్టెంబరు 18న రాత్రి 11 గంటల సమయంలో నా స్నేహితురాలి చేయి విపరీతంగా నొప్పి పెట్టసాగింది. తను చెయ్యి కదిలించలేక చాలా ఇబ్బందిపడుతూ బాబాను ప్రార్థించి, బాబా ఊదీని తన చేతికి రాసుకుంది. తన భర్త డాక్టరుని పిలిపించి, నొప్పి తగ్గటానికి ఇంజక్షన్స్ వేయించారు. రెండు ఇంజక్షన్ వేసినప్పటికీ తనకి నొప్పి తగ్గలేదు. తను భరించలేని నొప్పితో బాధపడుతూ నన్ను తలచుకుందట. సరిగ్గా అప్పుడే నాకు హఠాత్తుగా మెలకువ వచ్చి, 'ఇప్పుడెందుకు మెలకువ వచ్చిందా?' అనుకుంటూ మొబైల్ తీసుకుని యూట్యూబ్ ఓపెన్ చేస్తే, హిందీలో ఉన్న సాయి సందేశం ఒకటి నా కంటపడింది. బాబాపట్ల నా మనసులో ఉన్న భావాలకు, ఏ సేవ చేయలేకపోతున్నానన్న బాధకు తగ్గట్టు బాబా ఇచ్చిన ఆ సందేశం వింటుంటే నా కళ్ళంట నీళ్లు వచ్చేసాయి. ఆ సందేశం బాబా నాకే ఇచ్చినట్లు ఉన్నప్పటికీ అంత మంచి సందేశాన్ని ఎవరికైనా పంపిస్తే బాగుంటుందనిపించి మా బ్రదర్ కి, నా స్నేహితురాలికి పంపాను. వెంటనే నా స్నేహితురాలు నాకు ఫోన్ చేసింది. నేను తన కాల్ చూసి, 'అయ్యో ఈ సమయంలో మెసేజ్ పంపి తనని డిస్టర్బ్ చేసానా ఏంటి?' అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేశాను. తను, "ఈ సమయంలో మెసేజ్ చేసేవేంటి? సరేగాని, నాకు బాగోలేదు. కొద్దిసేపటి క్రితమే నొప్పి భరించలేక బాబాని తలుచుకుంటూ 'నువ్వేం చేస్తున్నావో' అని నిన్ను కూడా గుర్తు చేసుకున్నాను" అని చెప్పి ఏడ్చింది. 'ఇందుకేనేమో నన్ను లేపి, సందేశాన్ని పంపించారు బాబా?' అని నాకనిపించింది. అప్పుడు నేను తనతో, “బాబా ఊదీ రాసుకుని, బాబా నామస్మరణ చేస్తూ ఉండు. రేపటికల్లా నీ చేయినొప్పి తగ్గితే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని చెప్పి తను తన బాధను మరిచిపోయేలా బాబా గురించి మాట్లాడుతూ తెల్లవారుజామున మూడుగంటల వరకు సత్సంగం చేశాను. అప్పుడిక తను నిద్రపోతానంటే నేను ఫోన్ పెట్టేసాను. మరుసటిరోజుకి కూడా తనకి కొద్దిగా నొప్పి ఉండటంతో హాస్పిటల్ కి వెళదామని అనుకున్నారు. కానీ నేను వాళ్ళ అమ్మాయితో, "నువ్వు మీ అమ్మకోసం, 'హాస్పిటల్ కి వెళ్లకుండా అమ్మకు ఊదీతో ఇంటివద్దే నయమైపోయేలా అనుగ్రహిస్తే సచ్చరిత్ర పారాయణ చేస్తాన'ని బాబాకి మొక్కుకోమ"ని చెప్పాను. తను అలాగే చేస్తానని చెప్పింది. ఆరోజు సాయంత్రానికి హాస్పిటల్ కి వెళ్లకుండానే సాయి మహత్యం వల్ల నొప్పి తగ్గిందని నా స్నేహితురాలు చెప్పింది. తరువాత ఆదివారంనాడు నేను నా స్నేహితురాలితో మాట్లాడినప్పుడు తను, "చేయినొప్పి లేదు కానీ రెండు వేళ్ళు స్పర్శ లేకుండా ఉన్నాయి, భయమేస్తోంది" అని చెప్పింది. అయితే, బాబా ఊదీ రాసుకుంటూ, బాబా నామం చేస్తూ, స్తవనమంజరి వింటూ ఉంటే బాబా దయవలన తను తన సమస్య నుండి పూర్తిగా బయటపడింది. నా సాయితండ్రికి వేలవేల వందనాలు.
Jaisairam bless amma for her eye operation recovery and bless me for my health and wealth of happiness.jai sairam
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
🕉 sai Ram
ReplyDeleteOm Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤😃🌹🤗🌺😀🌼🥰🌸
ReplyDeleteOm sai ram baba ma arogya samasyalu teerchu thandri
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete