సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 940వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. చల్లని తండ్రి బాబా చూపిన గొప్ప అద్భుతం
2. తిరుమల దర్శనం టికెట్ల బుకింగ్ లో బాబా సహాయం
3. భక్తునిగా మార్చిన బాబా అనుగ్రహం

చల్లని తండ్రి బాబా చూపిన గొప్ప అద్భుతం


సాయిభక్తులకు నమస్కారాలు. నా పేరు లత. ఒకసారి డెంగ్యూ, కరోనా, టైఫాయిడ్, మలేరియా వంటి జ్వరాలున్న పరిస్థితుల్లో నాకు చాలా తీవ్రంగా జ్వరం వచ్చింది. దాంతోపాటు జలుబు, దగ్గు, తలనొప్పి, కాళ్ళనొప్పులు, ఒళ్ళునొప్పులు కూడా చాలా ఎక్కువగా ఉండేవి. రెండు రోజులపాటు యాంటీబయాటిక్స్‌తో పాటు జ్వరం తగ్గటానికి మందులు వాడినప్పటికీ మూడవరోజుకి కూడా జ్వరం అలాగే కొనసాగింది. పైగా, మూడవరోజు మా చిన్నబాబుకి కూడా విపరీతమైన జలుబుతో తుమ్ములు మొదలయ్యాయి. దాంతో, అది వైరల్ ఫీవరేమోనని నాకు చాలా భయం వేసి, "బాబా! ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకున్నాము. మళ్ళీ ఇంతలోనే మాకు ఈ ఆపద ఏమిటి బాబా?" అని బాబాకి దణ్ణం పెట్టుకుని, నేను, మా బాబు ఊదీ కలిపిన నీళ్ళు త్రాగాము. అద్భుతమేంటంటే, ఊదీనీళ్ళు త్రాగిన వెంటనే నాకు జ్వరం తగ్గి, చాలావరకు మంచిగా అనిపించింది. కానీ మా బాబుకి జలుబు ఇంకా ఎక్కువై నిరంతరాయంగా తుమ్ములు రాసాగాయి. నాకు ఎంతో భయమేసి అదేరోజు సాయంత్రం బాబుని హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళాను. బాబును పరీక్షించిన డాక్టరు, "జలుబు బాగా ఎక్కువగా ఉంది" అని చెప్పి, మూడురోజులకు మందులు ఇచ్చారు. అయితే, అదేరోజు బాబుకి జ్వరం కూడా వచ్చింది. మరుసటిరోజు ఉదయం నిద్రలేచిన తర్వాత కూడా బాబుకి జ్వరం చాలా ఎక్కువగా ఉంది. పైగా, "కళ్ళు సరిగా కనిపించడం లేదు" అన్నాడు. దాంతో నాకు మరింత భయమేసి, "బాబా! నాకు నువ్వు తప్ప ఎవరూ లేరు. దయచేసి ఎటువంటి ప్రమాదం జరగకుండా చూడు దయగల తండ్రీ. నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని కన్నీళ్లు పెట్టుకున్నాను. అంతలోనే బాబు లేచి, "నాకు కళ్ళు బాగా కనిపిస్తున్నాయి" అన్నాడు. పైగా "కలలో సాయిబాబా కనిపించార"ని అన్నాడు. నిజంగా ఇది గొప్ప అద్భుతం! ‘బాబా బ్లాగులో పంచుకుంటాను’ అని అన్న మరుక్షణంలోనే బాబు ‘నాకు తగ్గిపోయింది’ అని చెప్పాడు. బాబా దయవల్ల ఆ మందులతో మూడు గంటల్లోనే జ్వరం కూడా తగ్గిపోయి పూర్తిగా నయమైంది. చల్లని తండ్రి బాబా కృపవలనే ఇది సాధ్యమైంది. నిజానికి మాకు వచ్చిన జ్వరానికి నాకు ఎంతో భయం వేసింది. కానీ దయార్ద్రహృదయుడైన నా తండ్రి సాయిబాబా కరుణించి కాపాడారు. చల్లని తండ్రి బాబా దయవల్ల ఇప్పుడు మా ఇంట్లో అందరూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. "బాబా! నేను మీకు ఎంతో ఋణపడివున్నాను. మీ నామస్మరణ చేయడం తప్ప ఇంకేమి చేయగలను సాయీ? సదా మీ నామస్మరణలో ఉండేలా అనుగ్రహించండి సాయీ".


చివరిగా తోటి సాయిభక్తులకు నాదొక విన్నపం: ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ అధైర్యపడకండి. చల్లని తండ్రి దీవెన మనకు ఎప్పుడూ ఉంటుంది. బాబా దయవల్ల అందరూ చల్లగా ఉంటారు. చల్లని తండ్రి బాబా ఉండగా మనకు భయమేల? బాబా దీవెనలు అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.


తిరుమల దర్శనం టికెట్ల బుకింగ్‌లో బాబా సహాయం


ముందుగా సాయిబంధువులందరికీ నమస్కారాలు. బాబా అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నేను ఒక సాయి భక్తురాలిని. మేము, మా అమ్మవాళ్ళు కలిసి 2021, సెప్టెంబర్‌లో స్వామివారి దర్శనానికి తిరుమల వెళదామనుకున్నాము. కాబట్టి దర్శనానికి స్లాట్స్ ఓపెన్ అయ్యే రోజు టికెట్స్ బుక్ చేయడానికి ప్రయత్నించాము. అయితే సర్వర్స్ స్లోగా ఉన్న కారణంగా ఎంతసేపు ప్రయత్నించినా బుకింగ్ పేమెంట్ దగ్గర లేదా ఇంకెక్కడైనా అగిపోతుండేది. సరేనని కాసేపు ఆగి ప్రయత్నిస్తే, సెప్టెంబరులోని  స్లాట్స్ అన్ని బుక్ అయిపోయాయని వచ్చింది. దాంతో ఇక చేసేదిలేక అక్టోబర్ నెలలో వెళ్దామని అనుకున్నాము. అందుకు తగ్గట్టే, అక్టోబర్ నెల స్లాట్స్ ఓపెన్ అయిన రోజు టికెట్స్ బుక్ చేయడానికి ప్రయత్నించాం. అయితే, చాలామంది టికెట్స్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుండటం వల్ల ఈసారి కూడా టికెట్స్ బుక్ చేయడం కష్టం అయ్యింది. దాంతో నాకు ఈసారి కూడా టికెట్స్ బుక్ అవుతాయో, లేదోనని టెన్షన్‌గా అనిపించి, "టికెట్స్ బుక్ అయ్యేలా చూడమ"ని బాబాను, వెంకటేశ్వరస్వామిని వేడుకోవడం మొదలుపెట్టాను. "బాబా! ప్లీజ్ బాబా... టికెట్స్ బుక్ అయ్యేలా చూడు. తిరుమలలో అమ్మ కొన్ని మొక్కులు తీర్చుకోవలసి ఉందని మీకు తెలుసు కదా బాబా. ఇంకా ఆలస్యం కాకుండా చూడు బాబా ప్లీజ్" అని బాబాను వేడుకున్నాను. బాబా నా మొర ఆలకించారు. కాసేపటి తర్వాత మళ్లీ ప్రయత్నిస్తే, మేము అనుకున్న తేదీలలో కాకపోయినా బాబా, వెంకటేశ్వరస్వామి నిశ్చయించిన తేదీలో టిక్కెట్లు బుక్ అయ్యాయి. సంతోషంగా నేను మనసులోనే బాబాకు ధన్యవాదాలు చెప్పుకున్నాను.


ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి.

సమస్త లోకా సుఖినోభవంతు.


భక్తునిగా మార్చిన బాబా అనుగ్రహం


సాయిబంధువులకు నా నమస్కారాలు. నా పేరు సాహిత్య. నేను ఇప్పుడు మా నాన్నగారి అనుభవాన్ని, ఆయనకి టెక్నికల్ నాలెడ్జ్ అంతగా లేనందున ఆయన తరుపున నేను మీతో పంచుకుంటున్నాను. మా నాన్నగారు గవర్నమెంట్ టీచరుగా పనిచేసి పదవీ విరమణ చేశారు. కొన్నేళ్ల క్రితం నాన్న పదవీ విరమణ చేయడానికి ముందు ఎలక్షన్స్ వచ్చాయి. మామూలుగా అయితే నాన్న 30 సంవత్సరాల కాలంలో ఎన్నోసార్లు ఎలక్షన్ డ్యూటీని విజయవంతంగా పూర్తిచేశారు. కానీ ఉద్యోగ విరమణకు చేరువగా ఉన్న తరుణంలో, పైగా కొన్ని ఆరోగ్య సమస్యల వలన నాన్నకి ఎలక్షన్ డ్యూటీకి వెళ్లడం ఇష్టం లేకపోయింది. అందువలన నాన్న మొదటిసారి సాయిబాబాకి దణ్ణం పెట్టుకుని, "ఎలక్షన్ డ్యూటీ రద్దు అయ్యేలా చూడు బాబా" అని అనుకున్నారు. కానీ నాన్నకి ఎలక్షన్ డ్యూటీ పడింది. దాంతో ఏదో తెలియని ఆందోళన, భయంతో అయిష్టంగానే బట్టలు సర్దుకుని ప్రయాణానికి సిద్ధమయ్యారు. మా అమ్మ ఎదురెళ్లి నాన్నని సాగనంపి ఇంటి లోపలికి వచ్చి తలుపు వేసుకుంది. ఒక అరగంట తర్వాత మా ఇంటి కాలింగ్ బెల్ మోగింది. అమ్మ వెళ్లి తలుపులు తీస్తే, ఎదురుగా నాన్న నిలబడి ఉన్నారు. "ఏమైంది, అప్పుడే తిరిగి వచ్చారు?" అని అడిగితే నాన్న, "చివరి నిమిషంలో ఎలక్షన్ డ్యూటీ రద్దయింద"ని చెప్పారు. అప్పటినుండి నాన్న సాయిబాబా భక్తుడయ్యారు. ప్రతిరోజు మా ఇంటికి దగ్గరలో ఉన్న సాయిబాబా గుడికి వెళ్లి, ఐదు ప్రదక్షణలు చేయనిదే టిఫిన్ కూడా తినరు నాన్న. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. నాన్న ఆరోగ్యాన్ని కాపాడండి బాబా. ఆయనకి మానసిక ఆనందాన్ని, ధైర్యాన్ని ప్రసాదించండి. మేము ఎల్లప్పుడూ శుభ్ర మార్గంలో నడిచేటట్టు, మా మనసు ఎప్పుడూ మంచినే ఆలోచించేటట్లు దీవించండి బాబా".


శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!



9 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  2. Om sai ram today's devotees experiences are very nice. I liked it. Baba saves his devotees in time. That is baba's power. I trust sai tandri, please bless us be with us ❤❤❤

    ReplyDelete
  3. OM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH..Om Sai Ram

    ReplyDelete
  4. Om sai ram baba amma arogyam bagundali thandri sainatha

    ReplyDelete
  5. Baba ma samasayalini teerchu thandri sainatha

    ReplyDelete
  6. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!


    ReplyDelete
  7. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤🤗🌼😀🌺🥰🌸😃🌹

    ReplyDelete
  8. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo