సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

మహల్సాపతి - నాలుగవ భాగం



బాబా వర్తమానంలో ఎక్కడో సుదూర ప్రాంతాలలో జరిగేది తెలుసుకోగలిగే తమ దివ్యదృష్టిని, భవిష్యత్ జ్ఞానాన్ని, వ్యక్తుల మనస్సులపైన, పదార్థాలపైన (మానవ శరీరాలతో సహా) తమకు గల నియంత్రణను భక్తుల శ్రేయస్సు కోసం ఉపయోగించేవారు. ఆయన తమ భక్తులు దగ్గరగా ఉన్నా, ఎక్కడో దూరంగా ఉన్నా ప్రతిక్షణం వారి క్షేమాన్ని గమనిస్తూ, అవసరమైతే వారిని హెచ్చరించి వాళ్ళకొచ్చిన కష్టాల నుండి బయటపడేస్తుండేవారు. తమను అనన్యంగా ప్రేమించే భక్తులపై అప్రమత్తతో కూడుకున్న వారి అనుగ్రహదృష్టి ఎల్లప్పుడూ ఉండేది. మహల్సాపతిపై ఉన్న ఆ విధమైన వారి అనుగ్రహదృష్టి అతని ఆకలి కష్టాలను తీర్చింది(ఆ విషయం గురించి ఇదివరకు తెలుసుకున్నాం), రానున్న ఆపదలను తప్పించింది, అవసరంలో ధైర్యాన్నిచ్చింది. 

ప్రతిరోజూ రాత్రి మహల్సాపతి భోజనానికి ఇంటికి వెళ్లేముందు బాబాను సెలవు అడిగేవాడు. అప్పుడు బాబా, "వెళ్ళు, నేను నీతోనే ఉన్నాను" అని చెప్పడం ద్వారా “నేను నీకు రక్షణనిస్తాను” అని చెప్పకనే చెప్పేవారు. బాబా భౌతికంగా అతనితో లేకపోయినా అదృశ్యరూపంలో అతనిని సంరక్షిస్తుండేవారు. అతనికెప్పుడూ ఏ హానీ జరగలేదు. 

ఆరోజుల్లో శిరిడీలో పాముల సంచారం ఎక్కువగా ఉండేది. ఒకరోజు సాయంత్రం మహల్సాపతి మసీదు నుండి బయలుదేరుతుండగా బాబా అతనితో, "దారిలో ఇద్దరు దొంగలు (బాబా పాములను ‘దొంగలు’ అనీ, ‘ఆ పొడుగాటి మనిషి’ అనీ అనేవారు) ఎదురుపడే అవకాశముంద"ని చెప్పారు. బాబా చెప్పినట్లే, మహల్సాపతికి తన ఇంటి గుమ్మం వద్ద ఒక పాము, పొరుగింటి వద్ద మరో పాము కనిపించాయి. మరొకరోజు బాబా అతనితో, "నువ్వు తిరిగి వచ్చేటపుడు నీతోపాటు ఒక లాంతరు తెచ్చుకో. మసీదు గేటు వద్ద నీకొక దొంగ ఎదురవుతాడు!" అని అన్నారు. బాబా ఆదేశం మేరకు మహల్సాపతి చేతిలో లాంతరు పట్టుకొని వస్తుంటే మసీదు గేటు వద్ద ఒక పాము కనిపించింది. అతను, 'పాము, పాము' అని పెద్దగా అరవడంతో చుట్టుప్రక్కలవాళ్ళు వచ్చి దాన్ని చంపేశారు.

ఒకసారి బాబా మహల్సాపతితో మామూలుగా మాట్లాడుతూ, "నువ్వు వెన్ను నేలకు ఆనించి పడుకోవద్దు!" అని హెచ్చరించారు. అతను ఆ నియమాన్ని కొన్నిరోజులు శ్రద్ధగానే పాటించాడు. అయితే, ఒకరోజు భోజనం తరువాత కాస్త అసౌకర్యంగా అనిపించడంతో అలాగే నేలపై కూర్చున్నాడు. కొద్దిసేపటికి నిద్రతూగి వెన్నును నేలకు ఆనించి నిద్రపోయాడు. అతనికి పిచ్చి పిచ్చి కలలొచ్చి, నిద్రలో కలవరించసాగాడు. కొంతసేపటికి అతనికి మెలకువ వచ్చింది. లేచి కూర్చొని కాళ్ళు మడుచుకుందామంటే సాధ్యం కాలేదు. కూతుళ్ళు వచ్చి అతని కాళ్ళు మర్దన చేశాకగానీ అతను లేచి నడవలేకపోయాడు. తరువాత అతను బాబా వద్దకు వెళ్ళగానే బాబా అతనితో, "నేను నిన్ను నేలకు వెన్ను ఆనించవద్దని చెప్పాను కదా!" అని అన్నారు.

బాబా మహల్సాపతి కుటుంబ బాగోగులను కూడా నిరంతరం గమనిస్తూ ఉండేవారు. ఒకసారి మహల్సాపతి భార్య దూరాన ఉన్న తన పుట్టింటికి వెళ్ళింది. అక్కడుండగా ఆమెకు గొంతుభాగంలో ఒక కణితి లేచి, విపరీతంగా బాధపెట్టసాగింది. సర్వజ్ఞులైన బాబా ఆ విషయం తెలుసుకొని మహల్సాపతితో, "నీ భార్యకు గొంతు దగ్గర ఒక కణితి లేచింది. దాన్ని నేనే నయం చేస్తాను. ఇంకెవ్వరూ నయం చేయలేరు!" అని అన్నారు. తన భార్య ఆరోగ్యం గురించి ఏమీ తెలియని మహల్సాపతికి బాబా మాటలలోని మర్మం అర్థం కాకపోయినప్పటికీ ఏదో సాదాసీదాగా "అవును బాబా" అని అన్నాడు. తరువాత కొన్నిరోజులకి మహల్సాపతికి తన భార్య వద్ద నుండి ‘తనకు ఒక కణితి లేచిందని, తరువాత చిత్రంగా అదే తగ్గిపోయింద’ని లేఖ వచ్చింది. అది చదివాక బాబా మాటలలోని ఆంతర్యం మహల్సాపతికి బోధపడింది.

బాబా తరచూ తమ భక్తుల రోగాలను తాము స్వీకరించి వాళ్ళకు ఉపశమనం కలిగించేవారు. ఇందుకు సంబంధించి మహల్సాపతి కుమారుడైన మార్తాండ్ మహల్సాపతి ఒక అందమైన అనుభవాన్ని ఇలా చెప్పారు: “ఒకసారి మా అమ్మ నందూర్ షింగోట్ అనే గ్రామంలో ఉన్న తన సోదరుని వద్దకు వెళ్ళింది. ఒకరోజు మా నాన్నగారు తన అలవాటు ప్రకారం బాబా వద్ద కూర్చొని ఉండగా అకస్మాత్తుగా బాబా, "అరే భగత్, నా భక్తులొకరు ఒక కురుపుతో చాలా బాధపడుతున్నారు. చూడు! నా తుంటిపై కూడా ఒక కురుపు ఉంది. కానీ, ఇప్పుడది నయమవుతుంది" అని అన్నారు. నిజంగానే బాబా తుంటిపై ఒక కురుపు ఉండటాన్ని, దానివలన ఆయన బాధపడుతుండటాన్ని నాన్న చూశారు. దాంతో నాన్న ఆందోళన చెందసాగారు. అది గమనించిన బాబా మా నాన్నతో, "చింతించకు! రెండు మూడు రోజుల్లో ఇది తగ్గిపోతుంది" అని అన్నారు. నిజానికి బాబా మాటలు అత్యంత నిగూఢమైనవి. ఆ మాటలు తనకు సంబంధించినవేనని మా నాన్న ఆ సమయంలో గ్రహించలేదు. రెండు, మూడు రోజుల తరువాత బాబా తుంటిపై ఉన్న కురుపు చిట్లింది. మరో రెండు మూడు రోజుల తరువాత నాన్నకి నందూర్ షింగోట్‌లో ఉన్న అమ్మ వద్ద నుండి ఒక లేఖ వచ్చింది. ఆ లేఖలో, ‘తన తుంటిపై ఒక కురుపు లేచి చాలా బాధపడ్డాననీ, ఫలానా రోజున ఆ నొప్పి నుండి ఉపశమనం కలిగిందనీ, మరో రెండు మూడు రోజులకి కురుపు చిట్లింద’నీ అమ్మ తెలియజేసింది. ఆ లేఖ చదివాక, సరిగ్గా బాబా తన తుంటిపై కురుపు ఉందని చెప్పిన సమయం నుండి అమ్మకి బాధ తగ్గిందనీ, అక్కడ ఆమెకి కురుపు చిట్లినరోజే ఇక్కడ శిరిడీలో బాబా తుంటిపై కురుపు చిట్లడం జరిగిందనీ మేము గ్రహించాము. దాంతో నాన్న తన భార్య బాధను బాబా స్వీకరించారని చాలా బాధపడి నాతో, "అరే మార్తాండ్, చూశావా? నీ తల్లికి ఉపశమనం కలిగించడానికి ఆమె బాధను బాబా తమ మీదకు తీసుకున్నారు. మన వల్ల ఆయన చాలా బాధపడాల్సి వచ్చింది” అని అన్నారు.

1908 తరువాత ఒకసారి బాబా, "ఖండోబాకి సంబంధించినవాళ్ళకి త్వరలో కష్టాలున్నాయి. అయినా వారు భయపడాల్సిన అవసరం లేదు. నేను అవసరమైనది చేస్తాను" అని అన్నారు. కొద్దిరోజులకి మహల్సాపతి భార్య, అతని కుమార్తె తీవ్రంగా అనారోగ్యం పాలయ్యారు. మరికొద్ది రోజులకే కుటుంబంలోని ఇతర సభ్యులు కూడా అనారోగ్యానికి గురయ్యారు. బాబా దర్శనానికి వచ్చే భక్తులలో ఉన్న కొంతమంది వైద్యులు ఆ విషయం తెలుసుకొని మహల్సాపతికి కొన్ని మందులిచ్చారు. ఆ మందుల విషయమై మహల్సాపతి బాబాను సంప్రదిస్తే, ఆయన ఆ మందులు వాడవద్దని చెప్పి, "మంచానపడ్డవారిని మంచంలోనే ఉండనీ" అని, మసీదు చుట్టూ తిరుగుతూ తమ చేతిలోని సటకాను ఊపుతూ, "రా! నీ శక్తి ఎంతటిదో మేమూ చూస్తాం! నా ముందుకొచ్చావంటే, నా చేతిలో ఉన్న ఈ చిన్నకర్రతో నేనేమి చేయగలనో నీకు చూపిస్తాను" అంటూ ఏదో అదృశ్యశక్తిని బెదిరించసాగారు. అది మహల్సాపతి కుటుంబసభ్యుల వ్యాధికి బాబా చేసిన చికిత్స. ఫలితంగా, ఎటువంటి ఔషధమూ లేకుండా మహల్సాపతి కుటుంబసభ్యులందరూ కోలుకున్నారు. వ్యాధితో పోరాడేవారికి బాబా అనుసరించిన పద్ధతి ఆధునిక ఔషధం కాకపోయినప్పటికీ అది ఖచ్చితంగా ప్రభావవంతమైనదని నిరూపణ అయింది.

మహల్సాపతికి నలుగురు కుమార్తెలు - జానకీబాయి, సీతాబాయి, రఖుమాబాయి మరియు విఠాబాయి. వాళ్ళకి అస్నాగాఁవ్, దోచాలే, డోర్హాలే, రూయీ గ్రామాలకు చెందిన అబ్బాయిలతో వివాహాలయ్యాయి. పేదవాడైనందున మహల్సాపతి పట్ల అతని వియ్యంకులకు ఏమాత్రం గౌరవం ఉండేది కాదు. ఒకసారి డోర్హాలేలో ఉన్న అతని వియ్యంకుడొకడు తన ఇంట్లో ఏదో కార్యం జరుపుకుంటూ భోజనానికి రమ్మని మహల్సాపతికి ఆహ్వానం పంపాడు. అక్కడికి వెళ్లేముందు అతను బాబా అనుమతి కోసం మసీదుకు వెళ్ళాడు. బాబా అతనితో, "నీకు అక్కడ అవమానం జరగనుంది" అని అన్నారు. దానికి మహల్సాపతి "పోకపోతే ఎలా బాబా? పిలిచిన వాళ్ళు దగ్గర బంధువులు. పోలపోతే ఏమయినా అనుకుంటారు. అక్కడ అందరూ భోజనానికి నాకోసం ఎదురు చూస్తుంటారు. పోక తప్పదు!" అని అన్నాడు. బాబా మౌనం వహించారు. మహల్సాపతి బాబా వద్ద సెలవు తీసుకొని ఒక స్నేహితుని వెంటబెట్టుకొని డోర్హాలే వెళ్ళాడు. వాళ్ళు అక్కడికి చేరుకునేసరికి తన రాక గురించి ఏ మాత్రమూ పట్టించుకోకుండా అందరూ భోజనాలు చేసి, చేతులు కడుక్కుంటూ ఉండటం మహల్సాపతికి కనిపించింది. జరిగిన అవమానానికి మహల్సాపతి భోజనం చేయకుండానే తిరిగొచ్చి, జరిగినదంతా బాబాతో చెప్పుకున్నాడు.

మరోసారి, శిరిడీ నుండి ఆరు నుండి పది మైళ్ళ దూరంలో ఉన్న అస్తీగాఁవ్‌కు చెందిన రాంభావ్ హార్డే అనే సాయిభక్తుడు తమ గ్రామానికి వచ్చి పురాణ పఠనం చేసి, విందారగించి వెళ్ళమని మహల్సాపతిని ఆహ్వానించాడు. అసలే మహల్సాపతికి పురాణ పఠనమందు ఎంతో ఆసక్తి, పైగా చక్కటి ఆహ్వానం. అందుచేత మహల్సాపతి ఎంతో సంతోషంగా ఆ ఆహ్వానాన్ని మన్నించి, సెలవు తీసుకోవడానికి బాబా దగ్గరకి వెళ్ళాడు. బాబా అతనితో, "వెళ్లొద్దు. అక్కడ గొడవ జరుగుతుంది" అని అన్నారు. అయినప్పటికీ అతను తనకొచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించలేక ఆ గ్రామానికి వెళ్లి పురాణ పఠనం చేయసాగాడు. అంతలో భోజనానికి కూర్చున్న కొంతమంది సభ్యత, సంస్కారం లేని ఆకతాయి కుర్రాళ్ళకు మిగతా కుర్రాళ్లతో మాటామాటా పెరిగి కర్రలతో కొట్లాటకు దిగారు. దాంతో పురాణ పఠనం వినడానికి కూర్చున్నవాళ్లంతా భయంతో పారిపోయారు. మహల్సాపతి కూడా తన పఠనాన్ని ఆపి, వాళ్ళని అనుసరించాడు. తిరిగి శిరిడీ చేరుకున్నాక మహల్సాపతి బాబా దగ్గరికి వెళ్లి, "బాబా! మీ మాటలే నిజమయ్యాయి" అని అన్నాడు. ఈ విధంగా మహల్సాపతి జీవితంలో జరగబోయే ఎన్నో సంఘటనల గురించి బాబా ముందే చెప్పేవారు.

భగవద్గీతలో శ్రీకృష్ణుడు, ”మనం ఎంచుకున్న రూపంలో భగవంతుడు మనలను గమ్యం చేరుస్తాడు” అని చెప్పాడు. ఖండోబా, విఠలుడు, అల్లా మొదలైన దేవతలందరూ ఒకటే. ఏ దేవతారాధన అయినా ఒకటిగానే బాబా పరిగణించేవారు. మహల్సాపతికి ఖండోబాపై దృఢమైన విశ్వాసం. అతనికి ఖండోబా కృప చాలాసార్లు వ్యక్తమైంది. అతనికి కష్టాలు వచ్చినప్పుడల్లా ఖండోబా అతనికి దర్శనమిచ్చేవారు. ఒకసారి మహల్సాపతి కష్టాలలో ఉన్నప్పుడు ఖండోబా అతనికి దర్శనమిచ్చి, "పండరీపురం వెళ్లి విఠలుని దర్శనం చేసుకో" అని ఆదేశించారు. తనతో పాటు తన కుటుంబీకుల కడుపు నింపుకోవడం కోసం భిక్షపై ఆధారపడే మహల్సాపతి వంటి పేదవానికి పండరియాత్ర చేయడమంటే ఆషామాషీ కాదు. కానీ, ఖండోబా దయవల్ల అతనికి ధనసహాయంతో పాటు, స్థితిమంతులైన ఒక కుటుంబ సాహచర్యం లభించింది. వాళ్లతో కలిసి మహల్సాపతి పండరిపురం చేరుకున్నాడు. పండరీపురంలో ఎప్పుడూ జనసందోహం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ జనాన్ని దాటుకొని విఠలుని దర్శనం చేసుకోవడం అంత తేలిక కాదు. అందువలన అత్యాశాపరులైన కొంతమంది పూజారులు భక్తుల వద్ద ధనం గుంజి విఠలుని దర్శనం చేయిస్తుండేవారు. కానీ పేదవాడైన మహల్సాపతి వద్ద ధనం లేనందున జనంలో అలాగే తోసుకుంటూ మెల్లగా ముందుకు వెళ్ళసాగాడు. విఠలుని సమీపిస్తుండగా అకస్మాత్తుగా అతని ముఖం అందరికీ ఖండోబాలా కనిపించసాగింది. దాంతో, ‘సాక్షాత్తూ ఖండోబానే విఠలుని దర్శనానికి వచ్చారా!’ అని అందరూ అతనికి దారి ఇచ్చారు. అక్కడున్న పూజారులకు కూడా అదే అనుభూతి కలిగి వెంటనే మహల్సాపతికి విఠలుని దర్శనం చేయించారు.

అదేవిధంగా జజూరీ యాత్రలో మహల్సాపతికి, అతని బృందానికి సహాయం అందిన కొన్ని సందర్భాలున్నాయి. శిరిడీ నుండి 150 మైళ్ళ దూరంలో ఉన్న పూణే జిల్లాలోని జజూరీ ఖండోబా దేవత యొక్క మూలస్థానం. ఖండోబా ఉపాసకుడు, ఖండోబా ఆలయంలో పూజారి అయిన మహల్సాపతి సాంప్రదాయానుసారం ప్రతి యేడూ మాఘశుద్ధపౌర్ణమికి శిరిడీ నుండి జజూరీకి వెళ్ళి, అక్కడ జరిగే ఉత్సవాలలో పాల్గొనేవాడు. అతను తమ కులాచారం ప్రకారం పల్లకీని తీసుకొని, మరికొందరు ఖండోబా భక్తుల బృందంతో డప్పు మొదలైన వాయిద్యాలు వాయించుకుంటూ ఊరేగింపుగా అంతదూరమూ కాలినడకనే వెళ్ళేవాడు. శిరిడీ నుండి బయలుదేరినప్పటినుండి ఉపవాస దీక్షలో ఉండి, కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోకుండా యాత్ర చేసేవాడు. తిరుగు ప్రయాణంలో 'కరా' అనే నదిలో స్నానం చేసి, ఉపవాసదీక్ష విరమించి, పారణ చేసేవాడు. ఇలా ప్రతి యేడూ నియమంగా చేసేవాడు మహల్సాపతి.

ఒకసారి మహల్సాపతి జజూరీ యాత్రకు బృందంగా బయలుదేరాడు. అప్పట్లో కొన్ని భద్రతాకారణాల దృష్ట్యా అనుమతి పత్రాలు (pass) లేకుండా ఊరేగింపుగా స్వస్థలం వదలి వెళ్ళకూడదనే ప్రభుత్వ నిషేధం ఉంది. మహల్సాపతి బృందం పారనేరు అనే గ్రామం చేరేసరికి రాత్రయింది. బాజాభజంత్రీలతో సాగుతున్న ఆ బృందాన్ని పోలీసులు ఆపి, వారి పాసులు తనిఖీ చేశారు. ఆ బృందంలో ఒకరికి పాసు లేకపోవడంతో అతణ్ణి అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కి తీసుకెళ్ళారు. దాంతో మహల్సాపతి బృందం అక్కడే ఆగిపోయింది. మరుసటిరోజు ఉదయాన్నే మహల్సాపతి పోలీసు అధికారిని కలిసి విషయం వివరించాడు. ఆ గ్రామాధికారి (కులకర్ణి) నుండి రిమాండులో ఉన్న వ్యక్తి పేర పాసు తీసుకొస్తే అతణ్ణి వదిలేస్తామన్నాడా పోలీసు అధికారి. మహల్సాపతి ఆ గ్రామ కులకర్ణిని కలిసి, పాసు వ్రాసి ఇప్పించవలసిందని ప్రార్థించాడు. ఆ కులకర్ణికి తనతో పనిబడినవారితో ఏదో ఒక పని చేయించుకొనిగానీ సహాయం చేసే అలవాటు లేదు. అందువల్ల, “అలానే పాసు వ్రాయించి ఇస్తాను, ఈ లోపల ఆ కట్టెలు కొంచెం కొట్టిపెట్టు" అని మహల్సాపతికి పురమాయించాడు. మహల్సాపతికి తప్పింది కాదు. గొడ్డలి తీసుకొని రెండు దెబ్బలు వేసేసరికి గొడ్డలికున్న పిడికట్టె విరిగిపోయింది. కులకర్ణి మరో గొడ్డలి ఇచ్చాడు. అదీ విరిగింది. అలాగే మూడో పిడికట్టె కూడా విరగడంతో కులకర్ణి ఆశ్చర్యపోయాడు. మహల్సాపతి పూర్వాపరాలు క్షుణ్ణంగా విచారించి, “మీచేత కట్టెలు కొట్టించడం ఆ భగవంతుడికి ఇష్టంలేదు" అంటూ, పాసు వ్రాసి ఇచ్చి, కొన్ని బొప్పాయిపండ్లు కూడా దేవునికి నైవేద్యం పెట్టమని ఇచ్చి పంపాడు.

అలాగే ఒక సంవత్సరం మహల్సాపతి, అతని బృందం జజూరీ యాత్రకు వెళ్లి తిరిగి వస్తున్నారు. వాళ్లతోపాటు ‘మాలం భగత్’ అనే మరో పల్లకీ బృందం కూడా ఉంది. దారిలో ఓ చోట ముఖాలకు మందపాటి వస్త్రంతో ముసుగులు వేసుకున్న దొంగలముఠా గొడ్డళ్లతో వాళ్లను అటకాయించారు. వాళ్ళు తమను గాయపరుస్తారనే భయంతో మహల్సాపతి అక్షింతలు, చందనం చేతుల్లోకి తీసుకుని వాళ్ళపైకి విసిరి, తనవారితో కలిసి ప్రక్కనే ఉన్న చెట్ల చాటున దాక్కున్నాడు. కొంతసేపటి తరువాత దొంగలముఠా వెళ్ళిపోవడంతో మహల్సాపతి, అతని బృందం పల్లకీని మోసుకుంటూ వడివడిగా ముందుకు సాగిపోయారు. కొంతదూరం వెళ్ళాక చూస్తే, తమ పల్లకీలో ఉండాల్సిన విగ్రహాలేవీ కనిపించలేదు. అప్పుడు బృందంలోని ఒక వ్యక్తి, "మనమిప్పుడు ఈ ఖాళీ పల్లకీని శిరిడీ తీసుకెళ్తామా?" అని అన్నాడు. ఆరోజు ఆదివారం, ఖండోబాకు ప్రీతికరమైన రోజు. అందువలన మహల్సాపతి, "ఆదివారంనాడు యాత్ర ఉండదు" అని అన్నాడు. అయితే, అతని మాటకు బృందంలోని మిగతా సభ్యులు ఒప్పుకోలేదు. అప్పుడు మహల్సాపతి, “ఆదివారంనాడు యాత్ర చేయడం మంచిది కాదు" అని అన్నాడు. అంతలో అకస్మాత్తుగా మహల్సాపతిని ఖండోబా ఆవహించి, "అరే, ఇది ఏ రోజు? ఇది నా రోజు కాదా? మీరు ఎందుకు పల్లకీని తీసుకువెళుతున్నారు? ఈరోజు నేను కొండపై వేటలో నిమగ్నమై ఉన్నాను. వేట పూర్తయిన తర్వాత నేను శిరిడీకి వస్తాను. మీరు ఇక వెళ్లడం మంచిది" అని అన్నాడు. వెంటనే మహల్సాపతి మామూలు స్థితికి వచ్చాడు. అందరూ పల్లకీ తీసుకుని తమ ప్రయాణాన్ని సాగించి శిరిడీలోని ఖండోబా మందిరం వద్దకు చేరుకున్నారు. సఖారాం కందుకర్ మొదలైన గ్రామస్థులు ఖండోబా దర్శనం కోసం పల్లకీ వద్దకు వచ్చారు. బృందంలోని సభ్యులు పల్లకీలో విగ్రహాలు లేవని వాళ్లతో చెప్పారు. సఖారాం పల్లకీలో చూస్తే, పల్లకీలో ఉండాల్సిన అన్ని విగ్రహాలూ ఉన్నాయి. దాంతో అతను, "విగ్రహాలు లేవంటారేమిటి? విగ్రహాలన్నీ ఉన్నాయి కదా!" అంటూ వాటిని చూపించాడు. పల్లకీలో విగ్రహాలను చూసి మహల్సాపతితో సహా అందరూ ఆశ్చర్యపోయారు. ఆ విధంగా మహల్సాపతికి బాబా అనుగ్రహం వలన ఎప్పటికప్పుడు దివ్యానుభవాలు కలుగుతుండేవి. 

ఒకసారి అతను భక్తబృందంతో ఖండోబా యాత్రకు వెళ్ళినప్పుడు దారిలో బాగా దాహమై ఒక బావి వద్ద ఆగారు. ఆ ప్రాంతంలో తీవ్రమైన నీటి ఎద్దడి ఉందని తెలుసుకున్న మహల్సాపతి భక్తితో బాబాను స్మరించుకున్నాడు. వెంటనే ఆ బావి వద్ద చిన్న నీటి ప్రవాహం ప్రత్యక్షమైంది. మహల్సాపతికి, తోటి ప్రయాణీకుల అవసరాలకు ఆ నీరు సరిపోయింది. మరోసారి మహల్సాపతి ఖండోబాను పల్లకీలో తీసుకొని జజూరీ యాత్రకు బృందంగా బయలుదేరాడు. వాళ్ళు జజూరీ సమీపిస్తుండగా ఆ ప్రాంతమంతటా ప్లేగు మహమ్మారి ప్రబలంగా వ్యాపించి ఉందని తెలిసింది. దాంతో తోటి భక్తులందరూ భయపడిపోయారు. మహల్సాపతి కూడా నిరాశచెంది ఏమి చేయాలో అర్థంకాక నిస్సహాయంగా పల్లకీనానుకొని కూర్చున్నాడు. అంతలో తన వెనుక ఎవరో ఉన్నట్లనిపించి అటువైపు చూశాడు. అక్కడ అతనికి బాబా కనిపించి అంతలోనే అదృశ్యమయ్యారు. బాబా దర్శనం అతనికి ఎంతో ధైర్యాన్నిచ్చింది. వెంటనే తనకు కలిగిన అనుభవం గురించి తోటి భక్తులతో చెప్పి, "బాబా మనతో ఉన్నారు. మనం ఆందోళన చెందనవసరం లేదు" అని అన్నాడు. అది విని అందరూ ఆనందభరితులై ఎంతో ఉత్సాహంగా బాబాను, ఖండోబాను కీర్తిస్తూ జజూరీ చేరుకున్నారు. అక్కడున్న నాలుగురోజుల్లో వాళ్ళకు ఏ చిన్న కష్టమూ కలుగలేదు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనా జరగకుండా వారి యాత్ర విజయవంతంగా పూర్తయింది. శిరిడీకి తిరిగి వచ్చిన తరువాత మహల్సాపతి మసీదుకు వెళ్ళగానే బాబా అతనిని చూస్తూ, "అరే భగత్, యాత్ర బాగా జరిగింది కదా! నేను అక్కడికి వచ్చినప్పుడు నువ్వు పల్లకీనానుకొని కూర్చుని కనిపించావు" అని అన్నారు. దాంతో, తన కళ్ళు తనను మోసం చేయలేదనీ, బాబా అంతటా ఉంటూ తమ భక్తులను సంరక్షిస్తున్నారనీ అనుకున్నాడు మహల్సాపతి. ఏదేమైనా, అతని ప్రతి కదలికపై ఉన్న బాబా దృష్టి వారి యొక్క గొప్ప అద్భుతశక్తిని, భక్తులపై తమకున్న అద్భుతమైన ప్రేమను, సంరక్షణను తెలియజేస్తాయి. ఈవిధంగా భక్తుడైన మహల్సాపతి బాధ్యత తమదని బాబా అనేక సందర్భాలలో నిరూపిస్తూ వచ్చారు.




సోర్స్: శ్రీసాయిసచ్చరిత్ర,
శ్రీసాయిభక్త విజయం బై పూజ్యశ్రీ సాయినాథుని శరత్‌బాబూజీ,
శ్రీసాయిబాబా బై శ్రీసాయిశరణానంద,
లైఫ్ ఆఫ్ శ్రీసాయిబాబా బై శ్రీబి.వి.నరసింహస్వామి,
సాయిలీల మ్యాగజైన్ జూలై-ఆగస్టు 2005 సంచిక.

 


ముందు భాగం కోసం
బాబా పాదుకలు తాకండి.




 

నిర్ధిష్టమైన భాగం కోసం పైన నెంబర్లను తాకితే, ఆ నెంబరుకి సంబంధించిన భాగం ఓపెన్ అవుతుంది.

 


తరువాయి భాగం కోసం
బాబా పాదాలు తాకండి.

 


8 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  2. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤🌼😀🌹🤗🌸🥰🌺

    ReplyDelete
  3. Ome sri sachidhanandha samardha sadguru SAINATH maharaj ki jai

    ReplyDelete
  4. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  5. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo