సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 919వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సాయిబాబాకు భక్తుడైన వైనం - సాయి అనుగ్రహం
2. బాబా అనుగ్రహంతో సుఖప్రసవం మరియు సొంతిల్లు
3. తలచిన క్షణాన తన బిడ్డల చెంతనుంటారు సాయితండ్రి

సాయిబాబాకు భక్తుడైన వైనం - సాయి అనుగ్రహం


సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు మహేష్. బాబా నాకు ఎన్నో అనుభవాలను ప్రసాదించారు. వాటిలో నుండి రెండు అనుభవాలను శ్రీసాయిబాబాకి, మా కులదైవం కొమురవెల్లి శ్రీమల్లిఖార్జునస్వామికి నమస్కరిస్తూ తెలియజేస్తున్నాను. 


బాబా నా జీవితంలోకి 2021, గురుపౌర్ణమి ముందు వచ్చారు. అయితే, నా మనసులో ఎప్పటినుండో సాయిబాబాని పూజించాలని కోరిక ఉండేది. 2021, జూలై నెలలో నేను గురుచరిత్ర పారాయణ చేయాలని సంకల్పించుకుని ఆ పుస్తకం కొన్నాను. తరువాత గురుపౌర్ణమి ముందురోజు నేను మొట్టమొదటిసారి సాయిబాబా మందిరానికి వెళ్లి బాబా దర్శనం చేసుకుని, సాయిబాబా చిత్రపటమొకటి ఇంటికి తెచ్చుకున్నాను. ఆ విధంగా బాబా మా ఇంటికి వచ్చినప్పటినుండి మాకు ఎన్నో మహిమలు చూపించారు. మరుసటిరోజు గురుపౌర్ణమి. బాబాకి పూజ చేసి గురుచరిత్ర పారాయణ చేశాను. నా మనస్సులో శిరిడీ వెళ్ళాలని కోరిక కలిగింది. కానీ శిరిడీ వెళ్ళాలంటే చాలా దూరప్రయాణం చేయాలి. అందువల్ల ఎలా వెళ్ళాలా అని దిగులు చెందాను. మా అన్నయ్య హైదరాబాదులో ఉంటాడు. నాకు శిరిడీ వెళ్లాలని ఉందని తనతో చెప్పాను. అప్పుడు అన్నయ్య, "సరే, వీలుచూసుకుని వెళ్దాం" అని అన్నాడు. తరువాత ఆగస్టు 30న నాకు తీవ్రంగా జ్వరం వచ్చింది. అదేరోజు రాత్రి అన్నయ్య నాకు ఫోన్ చేసి, "శిరిడీ వెళ్ళడానికి టికెట్లు బుక్ చేశాన"ని అన్నాడు. అది వింటూనే సంతోషంగా అనిపించినప్పటికీ రైలు ప్రయాణమంటే భయమేసింది. అసలే తీవ్రమైన జ్వరంతో ఉన్నాను. ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ జ్వరం తగ్గలేదు. అయితే, ఆరోజు తెల్లవారుఝామున 4 గంటలకు నాకు ఒక కల వచ్చింది. నేను ఇంటర్మీడియట్ చదివిన కాలేజీ ప్రిన్సిపాల్‌గారు సాయిబాబాకి పరమభక్తుడు. ఆయన రూపంలో నాకు సాయిబాబా ఆ కలలో కనిపించి, నా భుజం తట్టి లేపి, ఒక జాతర వంటి ప్రదేశాన్ని చూపిస్తూ కొంతదూరం నడిపించారు. నాకు మెలకువ వచ్చేసరికి జ్వరం చాలావరకు తగ్గింది. స్నానం చేసి పూజగదికి వెళ్లి పూజ మొదలుపెట్టాను. అద్భుతం! పూజ పూర్తయ్యేసరికి బాబా దయతో జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. ఇక సంతోషంగా శిరిడీ ప్రయాణానికి సిద్ధమై ముందుగా హైదరాబాదులో అన్నయ్య వద్దకు చేరుకున్నాను. ఆరోజు సాయంత్రం గం.4.30ని.లకి ట్రెయిన్ ఉంది. కానీ రైలు ప్రయాణం అంటే భయంగా ఉంది. బయలుదేరేముందు బాబా ఊదీని నీళ్ళలో వేసుకుని త్రాగి బయలుదేరాము. బాబా అనుగ్రహంతో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా శిరిడీ చేరుకున్నాము. దూరప్రయాణమైనప్పటికీ బాబా దయవలన ప్రయాణం చాలా బాగా జరిగింది. ఇలా అంత త్వరగా బాబా నన్ను అనుగ్రహించారు. "చాలా సంతోషం సాయీ. చాలా చాలా ధన్యవాదాలు సాయి గురుదేవా. ఏవైనా తప్పులు ఉంటే ఈ చిన్ని భక్తుణ్ణి క్షమించండి సాయిదేవా". ఈ విధంగా సాయిబాబాకి నేను భక్తుడినయ్యాను.


ఒకరోజు నేను మా పొలం వద్ద ప్రత్తి చేనులోని గడ్డిమొక్కల కుప్పలు తీస్తున్నాను. ఒక కుప్ప సగం తీశాక అందులో చిన్న పాము కనిపించింది. ఆ పాము నాకు తగిలిందేమోనని చాలా భయపడ్డాను. అదలా ఉంటే, అదేరోజు రాత్రి నేను ఇంటికి వెళ్ళగానే ఒక పెద్ద బల్లి నా శిరస్సు మీద పడింది. శిరస్సు మీద బల్లి పడకూడదని విని ఉన్నందున ఆందోళనపడసాగాను. అంతలో మధ్యాహ్నం పాము కనిపించిన సంగతి కూడా గుర్తొచ్చింది. ఆ పాము నాకు తగిలిందో, లేదో, అది నన్ను ఏమైనా చేసిందో, లేదో తెలీదుగానీ నాకు ఏం జరుగుతుందో ఏమోనని చాలా భయమేసింది. వెంటనే పూజగదికి వెళ్లి, బాబా ఊదీని ధరించి, "బాబా! నన్ను ఈ ఆపద నుండి రక్షించండి" అని బాబాను వేడుకున్నాను. పిలిచిన వెంటనే పలికే దైవం సాయిబాబా. ఆయన అనుగ్రహంతో నేను క్షేమంగా ఉన్నాను. "మీకు శతకోటి వందనాలు సాయినాథా".


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


బాబా అనుగ్రహంతో సుఖప్రసవం మరియు సొంతిల్లు


సాయిభక్తులందరికీ నా ప్రణామాలు. నా పేరు మహేశ్వరి. నా చిన్నతనంనుండి బాబా నాకు ఎల్లవేళలా తోడుగా ఉన్నారు, ఎన్నో ఆపదల నుండి నన్ను కాపాడారు. సాయి కరుణకు అంతులేదు. బాబా ఎన్నో సంవత్సరాలుగా నాపై దయ చూపిస్తున్నారు, వెంట ఉండి సదా కాపాడుతూ లెక్కలేనన్ని అనుభవాలు ప్రసాదించారు. మా పాప డెలివరీ విషయంలో, సొంత ఇంటి విషయంలో బాబా ఎంతో అనుగ్రహాన్ని చూపించారు. ఆ అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటాను.


మా పాప చిన్నప్పటినుంచి బాబా భక్తురాలు. చదువు, ఉద్యోగం, పెళ్లి ఇలా ప్రతి ఒక్క విషయంలో బాబా తన వెన్నంటి ఉండి తనను కాపాడుతూ వచ్చారు. ఇకపోతే, మా పాపకి పదినెలలు నిండినా డెలివరీ కాలేదు. అప్పుడు మేము తనకు త్వరగా డెలివరీ అయ్యేలా అనుగ్రహించమని బాబాని వేడుకున్నాము. తరువాత మా పాప 18 గంటలు ప్రసవవేదన అనుభవించి, చివరికి బాబా దయవల్ల నార్మల్ డెలివరీ అయి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బాబుకి ‘శివసాయి’ అని పేరు పెట్టుకున్నాము. తరువాత బాబా అనుగ్రహంతో వాళ్ళు ఒక సొంత ఇల్లు కూడా తీసుకున్నారు. "బాబా! మీ ఋణం జన్మలో తీర్చుకోలేనిది. మీ అనుగ్రహం ఎల్లవేళలా మాపై ఉండాలని కోరుకుంటున్నాను తండ్రీ".


బాబా అనుగ్రహంతో మేము కూడా ఒక సొంత ఇంటిని కొనుక్కున్నాము. దానికి సంబంధించిన అనుభవాన్ని ఇప్పుడు చెప్తాను. ముందుగా మేము కొంత డబ్బిచ్చి సేల్ అగ్రిమెంట్ చేసుకున్నాము. అప్పటినుండి 45 రోజుల్లో మేము మిగతా డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లేకపోతే, మేము ఆ ఇంటిని అమ్ముతున్నవాళ్ళకి లక్షరూపాయలు ఇవ్వాలి. అదీగాక, ఆపై ఆ ఇల్లు మాకు దక్కుతుందో, లేదో కూడా తెలియదు. కాబట్టి మేము వెంటనే బ్యాంకులో లోన్ కోసం దరఖాస్తు చేశాము. అయితే, 30 రోజులు పూర్తవుతున్నా లోన్ ప్రక్రియ కొంచెం కూడా ముందుకు పోలేదు. మాకింక చాలా తక్కువ సమయం ఉండటం వలన ఏం చేయాలో దిక్కుతోచలేదు. ‘లోన్ ప్రక్రియ ఈ వారంలో పూర్తి అవుతుంది’ అన్నారు కానీ, ఏదో ఒక ఆటంకం వస్తుండేది. చివరికి రిజిస్ట్రేషన్ గడువులో ఒక్క వారం మాత్రమే ఉంది. అప్పుడు నేను, "బాబా! మాకు లోన్ వచ్చి, ఎలాగైనా గడువు లోపల రిజిస్ట్రేషన్ పూర్తవ్వాలి" అని బాబాకి చెప్పుకున్నాను. బాబా అనుగ్రహంతో ఏ ఆటంకాలు లేకుండా రిజిస్ట్రేషన్ సకాలంలో పూర్తయ్యింది. "ధన్యవాదాలు బాబా. మీ దయ మా కుటుంబానికి ఎల్లవేళలా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను".


తలచిన క్షణాన తన బిడ్డల చెంతనుంటారు సాయితండ్రి


సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. మీరు ఎల్లప్పుడూ బాబా కృపకు పాత్రులుగా ఉండాలనీ, బాబా ప్రేమ సదా మనందరి మీద సమానంగా వర్షించాలని బాబాను ప్రార్థిస్తున్నాను. నేను సాయిభక్తురాలిని. 2021, సెప్టెంబరు 6వ తేదీ రాత్రి జరిగిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. నాకు ప్రతి నెలా పీరియడ్స్ సమయంలో విపరీతంగా కడుపునొప్పి వస్తుంది. అలాగే ఆ రాత్రి కూడా 2 గంటల ప్రాంతంలో నొప్పి మొదలై, తట్టుకోలేక మెలికలు తిరిగిపోయాను. వెంటనే నాకు బాబా గుర్తుకొచ్చారు, 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ గుర్తుకొచ్చింది. అంతే! వెంటనే, "బాబా! నొప్పి తట్టుకోలేకపోతున్నాను. నొప్పి తగ్గించు, ఉదయాన్నే నా అనుభవాన్ని బ్లాగుకి పంపుతాను" అని అనుకున్నాను. తరువాత పొట్టపై చెయ్యి వేసి, బాబా నామస్మరణ చేస్తూ కళ్ళు మూసుకుని పడుకున్నాను. ఎప్పుడు నిద్రపట్టిందో తెలియదు. హాయిగా నిద్రపోయాను, ఉదయానికి అంతా బాగుంది. వంట చేసుకుంటూ నా అనుభవాన్ని వ్రాశాను. తలచిన వెంటనే తల్లి అయినా స్పందిస్తుందో, లేదో తెలియదుగానీ బాబా మాత్రం తలచిన క్షణాన తన బిడ్డల దగ్గర ఉంటారు. "బాబా! ఈ జన్మకే కాదు, ఏ జన్మలోనూ మా చెయ్యి వదలవద్దు. మాకు నువ్వు ఉంటే చాలు, ఇంకేమీ వద్దు".


- భవాని, వైజాగ్.



8 comments:

  1. Jaisairam bless amma for her eye operation and bless me for my health and wealth. Jai sairam

    ReplyDelete
  2. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤😀🌼🤗🌹😃🥰🌸🌺

    ReplyDelete
  3. Om sai ram baba amma arogyam bagundali thandri pleaseeee

    ReplyDelete
  4. Baba ma samasayalini teerchu thandri sainatha

    ReplyDelete
  5. Om Sairam
    Sai Always be with me

    ReplyDelete
  6. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Ki Jai ����

    ReplyDelete
  7. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo