సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 927వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. తేలికగా గమ్యం చేర్చిన బాబా
2. అర్థం చేసుకుని బాధలు తీర్చే బాబా
3. బాబా ఆశీస్సులతో ఉద్యోగం

తేలికగా గమ్యం చేర్చిన బాబా


సాయిబంధువులకు, ఈ బ్లాగ్ నిర్వాహకులకు బాబా అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు సాయి. బాబా నన్ను, నా కుటుంబాన్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఇటీవల బాబా నాకు చేసిన సహాయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను 2021, ఆగస్టులో హాజరు కావాల్సిన ఒక కాంపిటీటివ్ పరీక్షకు సంబంధించిన పరీక్షా కేంద్రం మా ప్రాంతంలో ఉండే అవకాశం లేని కారణంగా తప్పనిసరై హైదరాబాద్ ఆప్షన్ పెట్టుకున్నాను. తీరా పరీక్ష జరగాల్సిన తేదీ నిర్ధారణ అయ్యాక వచ్చిన హాల్ టిక్కెట్టులో చూస్తే, ఆ పరీక్షా కేంద్రం నాకు అస్సలు అవగాహన లేని ప్రాంతంలో ఉంది. మేముండేది కామారెడ్డిలో, పరీక్షా కేంద్రం నాచారం రీజియన్ లోని మల్లాపూర్‌లో ఉంది. అటువైపు నేను ఎప్పుడూ వెళ్ళలేదు. అమ్మానాన్నలు, "ఒక్కదానివే తెలియని ప్రాంతానికి ఎలా వెళ్తావు? మాలో ఎవరైనా నీతో వస్తాం" అని అన్నారు. కానీ ఈ కోవిడ్ కాలంలో వాళ్ళని బయటికి, అదీ తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి కష్టపెట్టడం నాకిష్టం లేదు. గూగుల్‌లోనూ, ఇంకా తెలిసినవాళ్ళని అడిగి చూసినప్పటికీ చిరునామాగానీ, సరైన పరిష్కారంగానీ కనిపించలేదు. దాంతో, నాకు ఇక పరీక్ష వ్రాయలేనేమోనని అనిపించింది. తరువాత పరీక్షకి ఇంకా రెండు రోజులు ఉందనగా బాబా నాకు ఒక స్ఫురణ కలిగించారు. అంతకుముందు ఒకసారెప్పుడో నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ తాను ఆ ఏరియా నుండి ట్రావెల్ చేస్తానని చెప్పటం గుర్తొచ్చి, తనకి కాల్ చేశాను. అతను చాలా తేలికగా పరీక్ష కేంద్రానికి వెళ్లొచ్చని, చాలా స్పష్టంగా చిరునామా చెప్పాడు. దాంతో నాకు చాలా ప్రశాంతంగా అనిపించి అమ్మానాన్నలతో, "నేను సురక్షితంగా వెళ్లి రాగలను. మీరు ఆందోళన చెందకండి" అని చెప్పాను. తరువాత పరీక్ష జరిగేరోజు ఇంటినుండి బయలుదేరి వెళ్ళాను. దాదాపు జె.బి.యస్‍కి చేరుకునేసరికి హఠాత్తుగా నాకు చాలా టెన్షన్‌గా అనిపించింది. ఇంట్లో అంటే ఏదో చెప్పి వచ్చేశానుగానీ, ఒక్కదాన్నే ఎలా వెళ్ళాలా అని భయపడసాగాను. మనసులో, "బాబా! నేను తేలికగా పరీక్షా కేంద్రానికి చేరుకునేలా చేయి. ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబాను తలచుకుంటూ మా ఫ్రెండ్ చెప్పిన విధంగా మెట్రోలో కొంతదూరం వెళ్ళాను. ఇక అక్కడ ఆటో తీసుకోక తప్పని పరిస్థితి. ఎందుకంటే, పరీక్షా కేంద్రం ఉన్న ప్రాంతం వరకు మెట్రో లేదు. కానీ పరీక్షకి ఇంకా సమయం ఉన్నందున తెలియని ప్రాంతంలో ఆటో ఎక్కడానికి ఆలోచిస్తూ నిలుచున్నాను. కొద్దిసేపటికి ఎక్కువమంది ప్రయాణీకులున్న ఒక ఆటోని చూసి, ఆ ప్రాంతానికి వెళ్లాలని చెప్పి ఆటో ఎక్కాను. సగం దూరం వెళ్ళాక ఆటోలో ఉన్న అమ్మాయిలందరూ దిగిపోయారు. దాంతో, 'అయ్యో! మళ్ళీ ఒక్కదాన్నైపోయాను. క్రొత్త ప్రాంతం, ఏమీ తెలియదు, ఎలా?' అని నాకు మళ్ళీ టెన్షన్ మొదలైంది. కానీ ఆటో మెయిన్ రోడ్డులోనే వెళ్తుండడం, ట్రాఫిక్ కూడా ఉండడంతో కొంచెం ప్రశాంతంగా అనిపించినా కూడా జాగ్రత్తగా ఉన్నాను. నా ఆందోళనలనన్నింటికీ అడ్డు వేస్తూ పరీక్షా కేంద్రం మెయిన్ రోడ్డుకి ఆనుకునే ఉంది. ఆటో దిగేసి చాలా సంతోషంగా అమ్మకి ఫోన్ చేసి, "చేరుకున్నానమ్మా" అని చెప్పాను. అప్పుడు అనిపించింది, 'బాబా నన్ను తేలికగా తీసుకెళ్తారని తెలిసి కూడా నేను ఎందుకు అంత టెన్షన్ పడ్డాను?' అని. అంతే, అన్నీ బాబా చూసుకుంటారని తెలిసినా కూడా కొన్నిసార్లు టెన్షన్ పడకుండా ఉండలేము. "థాంక్యూ సో మచ్ బాబా. నాకు ఎప్పుడూ నువ్వు మాత్రమే తోడుగా ఉన్నావు. ఎప్పటికీ ఉంటావని నమ్ముతున్నాను బాబా".


అర్థం చేసుకుని బాధలు తీర్చే బాబా


సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు సౌజన్య. నాకు చిన్ననాటినుండి బాబా అంటే చాలా ఇష్టం. బాబా నాకు ఎన్నో అనుభవాలను ప్రసాదించారు. ఇప్పటికే చాలా అనుభవాలను పంచుకున్న నేను ఈమధ్య జరిగిన మరో అనుభవంతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. కొన్ని నెలల క్రితం ఇండియాలో ఉన్న మా అమ్మానాన్నలకి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే అమ్మకి అంత ఎక్కువగా ఎఫెక్ట్ కాలేదు. అమెరికాలో ఉండే నేను కన్నతల్లిదండ్రులకు కోవిడ్ వస్తే, వాళ్ళ దగ్గరకి వెళ్లలేక, దగ్గరుండి వాళ్ళని చూసుకోలేక చాలా బాధపడ్డాను. బాబా గుడికి వెళ్లి, బాబాతో చెప్పుకుని ఎంతో ఏడ్చాను. బాబాపై పూర్తి నమ్మకముంచి నా బాధను, భారాన్ని ఆయనకి అప్పగించాను. బాబా నా బాధ అర్థం చేసుకున్నారు. హాస్పిటల్లో చేరిన రెండో రోజుకే నాన్న సగానికి పైగా కోలుకున్నారు. కానీ, వారం తర్వాత మళ్ళీ టెస్టులన్నీ చేసి డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. మేము చాలా సంతోషించాము. నాన్న హాస్పిటల్లో ఉన్నన్ని రోజులూ బాబా నామస్మరణ చేస్తూ, బాబా పాటలు వింటూ గడిపారు. వారం తరువాత చేసిన టెస్టుల్లో ఇన్ఫెక్షన్ ఇంకా అలాగే ఉన్నట్లు రిపోర్ట్ వచ్చింది. అయితే నాన్న మాత్రం బాగానే ఉన్నారు. అందువలన డాక్టర్, "ఇన్ఫెక్షన్ రేటు అలాగే ఉన్నా ఏమీ కాదు. పద్నాలుగు రోజులకి తగ్గుతుంది" అని నాన్నని డిశ్చార్జ్ చేశారు. సరేనని నాన్నని ఇంటికి తీసుకొచ్చాము. కానీ ముక్కు దగ్గర కొంచెం నొప్పి ఉండటంతో మళ్ళీ హాస్పిటల్‌కి వెళ్తే, "ఇన్ఫెక్షన్ వలన నొప్పి వస్తుంది. వీలైనంత తొందరగా ఆపరేషన్ చేయాలి" అన్నారు. కానీ మా నాన్నకి షుగర్ ఉంది. అది కూడా ఎక్కువగా ఉంది. అది తగ్గితేగానీ ఆపరేషన్ చేయమన్నారు. మేమంతా బాబాని ప్రార్థించి, ఆయన మీదే భారం వేశాము. కేవలం రెండు రోజుల్లోనే షుగర్ తగ్గడంతో ఆపరేషన్ జరిగింది. అంతా బాబా దయ. ఆయన కృపవల్ల నాన్న ఇప్పుడు బాగున్నారు. అయితే ఆ ఆపరేషన్ చేసిన తరువాత కొన్ని రిపోర్టులు రావడానికి రెండు నెలలు పడుతుంది అన్నారు. బాబా దయవల్ల ఆ రిపోర్టులు నార్మల్ వస్తే సంతోషం. బాబా తప్పకుండా మా ప్రార్థన వింటారు. నాన్న క్షేమంగా ఇంటికి వస్తే, మా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటామని నేను, అమ్మ అనుకున్నాము. కానీ పంచుకోవడం ఆలస్యమైంది. "దయచేసి క్షమించండి బాబా. మీ దయ, కరుణ, ప్రేమ ఎప్పటికీ మాపై ఇలాగే చూపించండి బాబా. మీరు లేకుండా, మిమ్మల్ని తలవకుండా ఒక్క క్షణం కూడా ఉండలేము సాయీ". ఈ అనుభవాన్ని చదివినవారందరికీ నా కృతజ్ఞతలు. బాబా ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.


బాబా ఆశీస్సులతో ఉద్యోగం

సాయిభక్తులకు, ఈ బ్లాగును విజయవంతంగా నిర్వహిస్తున్నవారికి నా నమస్కారం. నా పేరు విజయ. నేను సాయిభక్తురాలిని. బాబా మా రోజువారీ కార్యక్రమాలలో అడుగడుగునా అండగా ఉంటూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్న తీరు నేను ఎన్నటికీ మర్చిపోను. నేనిప్పుడు నా సోదరుడి కుమారుడు అరుణ్ మరియు నా సోదరి కుమార్తె అశ్వినిల ఉద్యోగాలకు సంబంధించిన అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. వాళ్లిద్దరూ చాలాకాలంపాటు ఉద్యోగ ప్రయత్నాలు చేసినప్పటికీ వాళ్ళ కృషి ఫలించలేదు. దాంతో నా సోదరుడు తన కొడుకు తొందరగా జీవితంలో స్థిరపడాలని చాలా ఆందోళన చెందాడు. అప్పుడు నేను వాళ్ళకోసం ప్రతిరోజూ శ్రీసాయి సచ్చరిత్ర పారాయణ చేయడం మొదలుపెట్టాను. తరువాత బాబా ఆశీస్సులతో వాళ్ళిద్దరికీ ఉద్యోగాలు వచ్చాయి. ముందుగా 2021, ఏప్రిల్ నెలలో నా సోదరి కుమార్తె బెంగళూరులోని ఒక కంపెనీలో ఉద్యోగంలో చేరింది. ఇటీవల 2021, సెప్టెంబరు 7వ తేదీన నా సోదరుడి కుమారుడు కూడా ఉద్యోగంలో చేరాడు. "బాబా! దయచేసి వారిద్దరూ ఆయా సంస్థలలో మంచి పేరు తెచ్చుకుని, తొందరగా పదోన్నతులు పొందేలా ఆశీర్వదించండి. ఇంకా నా సోదరుడి కుమారుడు తన మనసులోని ఆలోచనలను తన తల్లిదండ్రులతో పంచుకునేలా అనుగ్రహించమని మిమ్మల్ని అర్థిస్తున్నాను బాబా. దయచేసి మమ్మల్ని విడిచిపెట్టకండి బాబా. మీ అమృతహస్తాన్ని మాపై ఉంచి మమ్మల్ని పుష్కలంగా ఆశీర్వదించండి. ఆలస్యంగా నా అనుభవాలను పంచుకున్నందుకు దయచేసి నన్ను క్షమించండి బాబా. ప్రస్తుత  పరిస్థితుల్లో అన్నీ సరిచేసి మా జీవితాలను శాంతి, సంతోషాలతో నింపండి. ధన్యవాదాలు సాయీ".


- బాబా ప్రేమకు పాత్రురాలైన కుమార్తె విజయ.



9 comments:

  1. Jaisairam bless amma for her eye operation and bless me for my health and wealth. Jai sairam

    ReplyDelete
  2. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  3. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤😀🌼😃🌸🥰🌺🤗🌹

    ReplyDelete
  4. OM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH..Om Sai Ram

    ReplyDelete
  5. Om sai ram baba amma arogyam bagundali thandri sainatha

    ReplyDelete
  6. Baba ma samasayalini theerchu thandri

    ReplyDelete
  7. Still waiting for your blessings baba.hope its fulfill soon.

    ReplyDelete
  8. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo