సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శ్రీరఘువీర్ భాస్కర్ పురందరే - ఐదవ భాగం


పురందరే ఎప్పుడు శిరిడీ వెళ్లినా బాబా అతని కుటుంబసభ్యులందరి గురించి ఆరా తీసేవారు. తరువాత బాబా అతనిని ప్రత్యేకంగా దక్షిణ అడిగేవారు. అంతేకాక‌, "నాకోసం తినడానికి ఏం తెచ్చావు?" అని కూడా అడుగుతుండేవారు. ఎందుకంటే, పురందరే భార్య ఎప్పుడూ బాబాకు నివేదించడం కోసం ఏదో ఒకటి పంపుతుండేది. పురందరే ఇంటికి తిరిగి వెళ్లాలనుకున్నప్పుడు బాబా అతనితో ఇలా అనేవారు: "భావూ! రెండు మూడురోజుల తరువాత తిరిగి ఇక్కడికి రా! కొద్దిసేపు నాతో మాట్లాడి, తర్వాత వెళ్ళు. నువ్వు ఇక్కడే ఉన్నా నాకేం అభ్యంతరం లేదు. వెళ్ళు, భయపడవద్దు. అల్లా మాలిక్ హై! నేను నీతోనే ఉన్నాను" అని అనేవారు. కానీ పురందరే బయలుదేరే చివరిక్షణంలో "వెళ్లవద్ద"ని అనేవారు. అతను తన సామానంతా గుర్రపుబండిలో సర్దుకొని కూడా బాబా నుండి పూర్తి అనుమతి వచ్చేవరకు వేచి చూసేవాడు.

ఒకరోజు పురందరే బాబా వద్ద కూర్చుని ఆయన పాదాలు ఒత్తుతూ ఉన్నాడు. బాబా పురందరేను దక్షిణ ఇమ్మని అడిగారు. "నా వద్ద డబ్బేమీ లేదు బాబా!" అని బదులిచ్చాడు పురందరే. ఆ సమయంలో అక్కడే ఉన్న పురందరే భార్య వెంటనే వాడాకు వెళ్లి, అంతకుమునుపు లక్ష్మీపూజలో వచ్చిన డబ్బంతా తీసుకొచ్చి బాబా పాదాల వద్ద ఉంచింది. అప్పుడు బాబా సరదాగా, "డబ్బంతా నాకు ఇచ్చేశావు. ఇతను(పురందరే) నిన్నిప్పుడు కొడతాడులే" అన్నారు. దానికామె, "లేదు బాబా! ఆయన ఎన్నటికీ అలా చేయరు. ఈ డబ్బును నేను ఇంకెవరికైనా ఇచ్చినా సరే ఆయనకు కోపం రాదు. పైగా నేను డబ్బు ఇచ్చింది మీకు. ఇంత మంచిపని చేసినందుకు ఆయన చాలా సంతోషిస్తారు" అని బదులిచ్చింది. అప్పుడు బాబా సంతోషంగా, "సరే, సరే, అల్లా చూసుకుంటారు. ఇలాంటి భర్త లభించినందుకు నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి. నా మాటలు గుర్తుంచుకో! ఇతనిని ఎప్పుడూ నొప్పించవద్దు. ఇతను నావాడు" అన్నారు. వెంటనే, "మరి నేను బాబా?" అని అడిగింది పురందరే భార్య. అప్పుడు బాబా, "నువ్వు కూడా నా బిడ్డవే. నీకు ఏ లోటూ లేకుండా నేను చూసుకుంటాను. నీకు దేనికీ కొరత ఉండదు. ఎప్పుడూ ఉదారస్వభావంతో ఉండు. అప్పుడు అల్లా సంతోషిస్తాడు. అల్లాయే రక్షకుడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన కంటే మిన్న ఏదీ లేదు" అన్నారు. తర్వాత బాబా వారిద్దరికీ ఊదీ ఇచ్చి ఆశీర్వదించి, ఇంటికి వెళ్ళడానికి అనుమతినిచ్చారు.

ఒకసారి పురందరే భార్య ప్రసవానికి ముందు అనారోగ్యానికి గురైంది. అప్పుడు ఆమెకు కలలో బాబా దర్శనమిచ్చి ఊదీ రాశారు. తరువాత ఆమెకు ఆరోగ్యం చేకూరింది. ఆ విధంగా ఆమెకు ఎన్నోసార్లు బాబా దర్శనమిచ్చేవారు.

ఒకసారి బాబా పురందరేతో అతని వద్ద ఉన్న పాత రాగినాణాలన్నీ తమకు ఇవ్వమన్నారు. వెంటనే అతను తన వద్ద ఉన్నవన్నీ తెచ్చి ఆయనకిచ్చాడు. వాటిని బాబా ఏమి చేశారో అతడు గమనించలేదు. కానీ బాబా తమ వద్ద ఉన్న నాణాలన్నీ శబ్దం చేయకుండా ఒక గుడ్డలో చక్కగా కట్టి తమ పక్కజేబులో ఉంచుకొనేవారు. ఒకసారి బాబా పురందరేను దక్షిణ ఇవ్వమని అడిగారు. వెంటనే అతడు తన వద్ద ఉన్నదంతా ఆయనకు ఇచ్చాడు. అతడు ఇక తనవద్ద డబ్బులు లేవని అనుకోగానే బాబా, "నీ జేబులో ఇంకా రెండు అణాలు ఉన్నాయి, చూడు!" అన్నారు. చూస్తే, నిజంగానే అతని జేబులో రెండు  అణాలున్నాయి. వాటిని అతడు బాబాకు సమర్పించాడు.

పురందరే రైల్వే వర్క్‌షాపులో పనిచేస్తుండేవాడు. ఒకసారి అతను శిరిడీ వెళ్లాలని నిర్ణయించుకొని రైల్వే పాసులు కూడా ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఆ సమయంలో వర్క్‌షాపులో కొన్ని అల్లర్లు జరిగే అవకాశం ఉన్నందున అతని పైఅధికారి అతన్ని వెళ్లవద్దని చెప్పి, ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటే తాజాగా మళ్ళీ పాసులు ఇస్తానని మాట ఇచ్చాడు. అయితే పురందరే బాబాని చూడాలని చాలా ఆతృతగా ఉన్నాడు. అందువలన తాను అనుకున్నట్లు శిరిడీ వెళ్ళడానికే నిర్ణయించుకొని ఆ రాత్రి నిద్రపోయాడు. తెల్లవారుఝామున అతనికొక కల వచ్చింది. కలలో బాబా చేతిలో సటకా పట్టుకొని కోపంగా అతని మీదకు పరుగెత్తుకుంటూ వచ్చి సటకాను చూపిస్తూ, "బుద్ధిగా ఉండు! నువ్వు రావద్దు. వచ్చావో కొడతాను జాగ్రత్త! మాటిమాటికీ ఎందుకిక్కడికి వస్తావు? నీవెక్కడున్నా నేనెప్పుడూ నీతోనే ఉన్నాను. నేను ఎప్పటికీ నీ నుండి దూరంగా వెళ్ళను. మూర్ఖుడిలా ఉండకు, అర్థం చేసుకో" అని అన్నారు. దాంతో అతను తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నాడు.


మరుసటిరోజు రైల్వే వర్క్‌షాపులో సమ్మెకు పిలుపునిచ్చారు. ముందు అనుకున్నట్లుగా అతను శిరిడీ వెళ్ళివుంటే, సమ్మెలో అతనికి కూడా భాగముందని అధికారులు అనుమానించి అతనిపై చర్య తీసుకొనే అవకాశముండేది. అటువంటిదేమీ జరగకుండా బాబా రక్షించారు. ఆ సమ్మె కారణంగా పురందరే నెలరోజుల వరకు శిరిడీ వెళ్ళలేకపోయాడు. ఆ తరువాత అతను శిరిడీ వెళ్ళినప్పుడు బాబా అతనితో, "భావూ, ఇక్కడకు రావడానికి ఎందుకంత ఆరాటపడతావు? మనకు చాలా పనులున్నాయి. నీవు ఎక్కడ ఉన్నా ప్రశాంతంగా ఉంటూ నా నామాన్ని స్మరించు. నేను నీ దగ్గరే ఉంటాను. సరే! నీతో ఇంకెవరు వచ్చారు?" అని అన్నారు. "ఎవరూ లేరు బాబా, నేను ఒక్కడినే వచ్చాను" అని అతను బదులిచ్చాడు. అప్పుడు బాబా, "మరి ఎన్ని రోజులుంటావు?" అని అడిగారు. అందుకతను, "మీరు అనుమతించేవరకు నేను ఇక్కడే ఉంటాను" అని అన్నాడు. ఇలా నాలుగు రోజులు గడిచాక ఐదవరోజు బాబా అతను వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. అతను బాబా పాదాలపై పడి కన్నీళ్లు పెట్టుకున్నాడు. బాబా, "అరే భావూ, ఎందుకు భయపడుతున్నావు? నువ్వు రెండుచోట్లా ఉండాలి. ఇక్కడా, అక్కడ నీ ఉద్యోగంలో కూడా. చింతించకు, నీ పని నువ్వు చెయ్యి. అల్లా నిన్ను చూసుకుంటాడు" అని అతనిని ఓదార్చారు. బాబా మాటలతో ఊరట చెంది, తను చేస్తున్న సేవను కొనసాగించాడు పురందరే.

ఒకసారి ముంబాయి వెళ్ళడానికి బాబాను అనుమతి కోరాడు పురందరే. కోపర్గాఁవ్ నుండి మన్మాడుకు చివరి రైలు సాయంత్రం 6.30 గంటలకు ఉంది. కానీ సాయంత్రం 4.30 దాటినా బాబా అనుమతి ఇవ్వలేదు. తరువాత అతనికి అనుమతినిస్తూ రేగేను తోడుగా పంపారు. ఇద్దరూ ఎండ్లబండిలో బయలుదేరారు. వాళ్ళు గోదావరి నది వద్దకు చేరుకునేసరికి 6.45 అయింది. అక్కడినుండి కోపర్గాఁవ్ స్టేషన్ చేరేసరికి 7.45 అయింది. అప్పటికే రైలు వెళ్లిపోయి ఉండటంతో 'ఆ రైలు అందదని తెలిసి కూడా బాబా మమ్మల్ని ఎందుకు ప్రయాణం చేయించారో' అనుకున్నారు. కానీ నాటి రాత్రి ప్రత్యేక రైలు ఉంది. అది 8.15 కి కోపర్గాఁవ్ వచ్చింది. ఆ రైలెక్కి మన్మాడ్ చేరుకుని‌, అక్కడినుండి వేరే రైలెక్కి ఇద్దరూ తమ తమ ఇళ్లకు చేరుకున్నారు. ఆ రోజుల్లో సాయంత్రం 6.30 తరువాత కోపర్గాఁవ్ నుండి మన్మాడుకు రైళ్లు ఉండేవి కావు. కానీ బాబా ఆశీస్సుల వలన వారికి ప్రత్యేక రైలు దొరికి, క్షేమంగా వారి వారి ఇళ్లకు చేరుకున్నారు.

బాబా తమ భక్తులను ధనం, బంగారం వంటి విషయాలలో ఆకర్షింపబడతారో లేదోనని పరీక్షించేవారు. ఒకసారి బాబా పురందరేను తమతోపాటు లెండీబాగ్‌కి తీసుకొని వెళ్లారు. ప్రక్కనే ఉన్న లెండీ వాగు వద్దకు వెళ్ళాక, బాబా ఆ వాగులో ఉన్న మూడు బంగారు పలకలను అతనికి చూపించి, వాటిని తీసుకోమని చెప్పారు. పేదవాడైనప్పటికీ, పురందరే వాటిపై పెద్దగా ఆసక్తి చూపలేదు, చూడటానికి కూడా కూడా ఇష్టపడలేదు. అంతేకాదు, అసలు ఏమాత్రం చలించలేదు. అందుకే అతను ఆధ్యాత్మికంగా వృద్ధి చెందాడు.

బాబా లీలావిశేషంతో ఆహారం అందరికీ సరిపోగా ఇంకా చాలా మిగిలింది.

ఒకసారి గుడ్ ఫ్రైడే సెలవులలో పురందరే తన కుటుంబంతో శిరిడీ వెళ్ళాడు. ఒకరోజు బాబా పురందరేతో, "భావూ, నేను ఈరోజు భోజనానికి మీ ఇంటికి వస్తాను" అన్నారు. ఆ సమయంలో అతని కూతురు బాబీ అనారోగ్యంతో బాధపడుతోంది. "ఇంకెవరినైనా ఆహ్వానించమంటారా బాబా?" అని అడిగాడు పురందరే. అందుకు బాబా, "నీ కూతురి ఆరోగ్యం బాగాలేదు కదా, అందువల్ల ఎక్కువమంది వద్దులే! మనిద్దరితోపాటు ఇద్దరు ముగ్గురు ఫకీర్లను మాత్రమే పిలువు" అన్నారు. అందుకతను, "సరే బాబా, మరి భోజనానికి ఏమి సిద్ధం చేయించమంటారు?" అని అడిగాడు. అందుకు బాబా, "ఖిచిడీ, రవ్వ కేసరి, అన్నం, ఒక కూర చాలు!" అన్నారు. బాబా మాట ప్రకారమే అతడు తన భార్యను వంటలు తయారుచేయమని  చెప్పాడు. బాబా స్వయంగా తమ ఇంటికి భోజనానికి వస్తున్నందుకు ఆమె చాలా సంతోషించింది. వంట మొదలుపెట్టడానికి ముందు అనారోగ్యంతో ఉన్న తన కూతురు బాబీని తీసుకొని బాబా దర్శనానికి వెళ్ళింది. బాబా ఆమెకు ఊదీ ఇచ్చి ఆశీర్వదించి పంపారు. 

ఆమె బసకు వచ్చి ముందుగా అనుకున్నంతమందికి సరిపడా వంట వండింది. పురందరే ఆ వంటకాలను భోజనాలు వడ్డించే చోట సిద్ధంగా పెట్టాడు. అప్పుడే ఐదారుగురు ఫకీర్లు వచ్చారు. వాళ్ళకు భోజనం వడ్డించాడు పురందరే. వాళ్ళంతా భోంచేసి వెళ్తూ, "ఇంకా చాలామంది వస్తున్నారు. బాబా మా అందరినీ మీ ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానించారు" అని చెప్పారు. అది విన్న పురందరే వండిన పదార్థాలు అందరికీ సరిపోవేమోనని కంగారుపడ్డాడు. వాళ్ళు చెప్పినట్లుగానే కాసేపట్లో ఇరవై మంది ఫకీర్లు వచ్చారు. వాళ్ళందరికీ పురందరే భోజనం వడ్డించాడు. వాళ్ళు భోంచేసి వెళ్ళాక మరో పదిమంది ఫకీర్లు వచ్చి భోంచేశారు. అంతమంది వచ్చినప్పటికీ బాబా అనుగ్రహం వల్ల వండిన ఆహారపదార్థాలు అందరికీ సరిపోవటమే కాక ఇంకా మిగిలిపోయాయి కూడా. తరువాత పురందరే మశీదుకు వెళ్ళాడు. బాబా ఆ సమయంలో ఫకీర్‌బాబాతో మాట్లాడుతూ ఉన్నారు. పురందరే బాబాకి నమస్కరించి భోజనానికి రమ్మని ఆహ్వానించాడు. బాబా నవ్వి, "నేను కడుపునిండా తృప్తిగా భోంచేశాను. నువ్వు ఇంటికి వెళ్లి బాలాషింపీతో కలిసి భోంజనం చెయ్యి" అన్నారు. పురందరే బాబాకు దక్షిణ, తాంబూలం సమర్పించి ఇంటికి వెళ్లి, బాలాషింపీ (పురందరే ఎప్పుడు శిరిడీ వెళ్లినా బాలాషింపీ ఇంటిలో బస చేసేవాడు.) కుటుంబసభ్యులతోను, తన కుటుంబసభ్యులతోను కలిసి భోజనం చేశాడు. వాళ్లంతా తిన్న తరువాత కూడా ఆహారపదార్థాలు మిగిలే ఉన్నాయి. తరువాత బాలాషింపీ ద్వారకామాయికి వెళ్ళాడు. బాబా అతనితో, "ఏం బాలా? వచ్చిన వారందరికీ ఆహారం సరిపోయిందా?" అని అడిగారు. అప్పుడతను, "బాబా! మాలాంటి పేదవారిని మీరెందుకు పరీక్షిస్తారు? మీరు ఇద్దరు ముగ్గురు ఫకీర్లు వస్తారని చెప్పారు. కానీ వచ్చినవాళ్ళు ముప్ఫైమందికి పైగానే ఉన్నారు. కానీ అపారమైన మీ లీలావిశేషంతో ఆహారం మా అందరికీ సరిపోయింది. ఇంకా చాలా మిగిలిపోయింది కూడా" అని అన్నాడు. అప్పుడు బాబా నవ్వుతూ, "అల్లా అందరినీ చూసుకుంటాడు. చూడు! భావూ నా భక్తుడు. అతను అంతటి భారాన్ని మోయలేడని నాకు తెలుసు. మరి అతన్నెందుకు పరీక్షిస్తాను? నేను అతనికి సహాయం చేశాను. ఇది పరీక్ష కాదు. నా భక్తుడి ఆనందం కోసమే నేనిలా చేశాను" అని అన్నారు. బాబా చూపిన ప్రేమకి మాటలురాక మూగబోయాడు బాలాషింపీ. ఆ తరువాత పురందరే మరో మూడురోజులు శిరిడీలో ఉన్నాడు. ఆ మూడురోజుల పాటు ఆ ఆహారపదార్థాలు తిన్నప్పటికీ అవి ఇంకా మిగిలే ఉన్నాయి. వాళ్లంతా మిగిలిన ఆ ఆహారపదార్థాలను తీసుకొని సంతోషంగా ముంబాయికి తిరుగు ప్రయాణమయ్యారు. పురందరే ఆ ఆహారాన్ని తన స్నేహితులకు, బంధువులకు బాబా ప్రసాదంగా పంచి, బాబా చూపిన ఈ అద్భుతమైన లీలను అందరితో ఆనందంగా పంచుకున్నాడు.

బాబా తాము మహాసమాధి చెందడానికి పన్నెండు, పదిహేను రోజుల ముందు పురందరే, దీక్షిత్‌లతో, “నేను ముందు వెళ్తాను. మీరు నన్ను అనుసరిస్తారు. నా సమాధి మాట్లాడుతుంది. నా నామం పలుకుతుంది. నా మట్టి సమాధానమిస్తుంది” అని చెప్పి, వారిని ముంబాయి వెళ్లిపొమ్మని ఆదేశించారు బాబా. బాబా ఆదేశానుసారం వాళ్ళిద్దరూ ఎడ్లబండిలో బయలుదేరి వెళ్లిపోయారు. అంతకుమునుపు కూడా బాబా అవే మాటలు చెప్పారు, అందువలన బాబా మాటలలోని ఆంతర్యం వాళ్లకు బోధపడలేదు. పైగా అప్పటికి బాబాలో ఎలాంటి అనారోగ్య సూచనలు లేనందున బాబా దేహత్యాగం చేస్తారని వాళ్ళు ఊహించలేకపోయారు.

1918లో బాబా సమాధి చెందిన తరువాత, భక్తులు ఆధ్యాత్మిక విషయాలలో గాని, వ్యక్తిగత సమస్యలకు గాని నేరుగా బాబా సలహాను పొందే అవకాశాన్ని కోల్పోయారు. అయితే బాబాకు ప్రముఖ భక్తులైన కాకాసాహెబ్ దీక్షిత్, భావూసాహెబ్ ధుమాల్, పురందరే మొదలైన వారు క్లిష్టసమస్యలు ఎదురైనప్పుడు బాబా సలహాను పొందేందుకు ఆసక్తికరమైన పద్ధతిని ఉపయోగించారు. వాళ్ళు బాబా పటం ముందు రెండు చీటీలను (ఒకదాంట్లో అనుసరించమని, రెండవ దానిలో అనుసరించవద్దని వ్రాసేవారు.) ఉంచి ఒక చిన్నపిల్లవాడి చేతి ఆ చీటీల నుండి ఒకదాన్ని తీయించేవారు. అందులో వచ్చిన దాన్ని బాబా సలహాగా భావించి అందులో వచ్చినట్లు నడచుకునేవారు. అలా నడచుకున్నందువల్ల ఎల్లప్పుడూ మంచే జరిగేది, చాలాసార్లు ప్రమాదాల నుండి రక్షింపబడినట్లు ఋజువయ్యేది.

1920లో పురందరే భార్య ఇన్‌ఫ్లూయంజాతో తీవ్ర అనారోగ్యానికి గురై ప్రమాదస్థితికి చేరుకొంది. ఆమె రాబోయే ఉరుసు-రామనవమి ఉత్సవాలకు శిరిడీ వెళ్ళలేకపోతున్నందుకు బాధపడింది. ఆ రాత్రి ఆమెకు కలలో బాబా కనబడి, “బాధపడకు, నేను నిన్ను ఉరుసు ఉత్సవానికి తప్పక తీసుకెళతాను” అని హామీ ఇచ్చారు. మరునాటి ఉదయం ఆమె కొద్దిగా కోలుకొని, ఆ కల విషయం  పురందరేతో  చెప్పింది. కానీ ఆమె అనారోగ్యం అలాగే కొనసాగుతూ వచ్చింది. చివరకి శ్రీరామనవమినాడు ఆమె "బాబా, బాబా” అంటూ తుదిశ్వాస విడిచింది.

తాము సమాధి చెందిన తరువాత కూడా బాబా పురందరేకి కలలో దర్శనం ఇస్తుండేవారు. అలా ఒకసారి దర్శనం ఇచ్చినప్పుడు, "శిరిడీ వెళ్లి సంస్థాన్‌కు సంబంధించిన విధులలో పాలుపంచుకో"మని చెప్పారు బాబా. బాబా ఆదేశంతో అతను శిరిడీ చేరుకొని సాయిబాబా సంస్థాన్ సంయుక్త కోశాధికారిగా పనిచేస్తూ బాబా సేవలో నిమగ్నమయ్యాడు. ఆవిధంగా బాబా అతని రోజువారీ కార్యకలాపాలపై పూర్తి నియంత్రణ తీసుకున్నారు. కాకాసాహెబ్ దీక్షిత్‌కి సహకరించమని పురందరేను ఆదేశించారు, అదేవిధంగా పురందరేకు సహకరించమని కాకాసాహెబ్ దీక్షిత్‌ను ఆదేశించారు బాబా. బాబా ఆదేశానుసారం ఆ ఇద్దరూ ఒకరికొకరు సహకరించుకుంటూ మంచి సమన్వయంతో పనిచేస్తూ సంస్థాన్ కార్యకలాపాలను బాధ్యతాయుతంగా నిర్వర్తించారు.

1932లో పురందరే సయాటికా(నడుమునొప్పి), రుమాటిజం(వాతరోగం)లతో బాధపడుతూ మృత్యువుతో పోరాడుతున్నాడు. యమదూతలు తనని సమీపిస్తున్న సమయంలో బాబా వచ్చి, అతని మంచంపై కూర్చొని, అతని చేతిని తమ మోకాలిపై ఉంచుకున్నారు. ఆ తరువాత అతడిని గాని, అతను పడుకున్న మంచాన్ని గాని యమదూతలు తాకనివ్వకుండా నిరోధించి అతన్ని రక్షించారు బాబా.

బాబా పురందరేకు చెప్పిన కొన్ని హిత వాక్యాలు

“ఎవరైతే ఈ మసీదులో అడుగిడతారో వాళ్ళు గమ్యాన్ని చేరుకుంటారు(జో కోయీ యే మజిద్ మే ఆవే, జికా మజిద్ మే పాయ్ లగా, ఉసాకా బేడా పార్ హాయ్), ఎవరి మంచితనం యెట్లా ఉంటే వారి అభివృద్ధి కూడా అట్లాగే ఉంటుంది (జైసీ జిస్ కీ నియత్, వైసీ ఉస్ కూ బర్కత్)" అనేవారు బాబా.

బాబా అప్పుడప్పుడు పురందరేతోను, ఇతర భక్తులతోను, “నావాడు వెయ్యిమైళ్ళ అవతల ఉన్నప్పటికీ (మరణించినప్పటికీ), పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లు లాగి అతనిని నా వద్దకు చేర్చుకుంటాను” అని చెప్పేవారు. ఇంకా, "నావాడిని నా నుండి దూరంగా వెళ్ళడానికి అనుమతించను” అని కూడా చెప్పేవారు.

పురందరేకు కోపం ఎక్కువ, త్వరగా ఆవేశానికి లోనయ్యేవాడు. బాబా తరచూ అతనితో, "నిన్నెవరైనా దూషించినా, దండించినా వారితో గొడవకు దిగవద్దు. సహించలేకపోతే ఒకటి రెండు మాటలతో సమాధానమివ్వు, లేదంటే ఆ చోటు వీడి వెళ్ళిపో, అంతేగానీ వారితో పోట్లాడవద్దు(కిసీసే వాదావాదీ (బరోబరీ) కర్ నా నహీ). నువ్వు ఎవరితోనైనా తగవు పెట్టుకుంటే నాకు అసహ్యము, బాధ కలుగుతుంది" అని చెప్పేవారు. ఈ హితవాక్యాలు బాబా పురందరేతోనే కాక ఇతర భక్తులతోనూ అనేకసార్లు చెప్పేవారు.

పురందరే స్వయంగా చెప్పిన కొన్ని విషయాలు:

నేను కష్టాల్లో ఉన్నప్పుడు బాబా పటం ముందు కూర్చొని ఏడ్చేవాడిని. బాబా వెంటనే నా ముందు ప్రత్యక్షమై నన్ను ఓదార్చేవారు.

బాబా చాలామంది భక్తుల దగ్గరున్న డబ్బంతా తీసేసుకునేవారు. వారలా ఎందుకు చేసేవారో నాకు తెలియదు. కానీ కొందరు భక్తులు బాబాను అంత డబ్బు ఎందుకు తీసుకుంటారని అడిగినపుడు ఆయన, "నేనందరినీ అడగను. ఆ ఫకీరు(దేవుడు) ఎవరిని చూపిస్తారో వాళ్లనే అడుగుతాను. కానీ బదులుగా వాళ్ళకి నేను తీసుకున్న దానికి పదింతలు ఇవ్వవలసి ఉంటుంది. నేను నా స్వంతానికి ఏమీ తీసుకోను. నాకు ఏ సంసారమూ లేదు" అని బదులిచ్చేవారు. 

అద్వైతము మొదలైన వాటి గురించి బాబా మాట్లాడగా నేను ఎప్పుడూ వినలేదు. ఎల్లప్పుడూ “అల్లా రక్షిస్తాడు", "పేదలకు పెన్నిధి భగవంతుడు (గరీబ్ కో అల్లా వలీ హై, అల్లా అచ్ఛా కరేగా)” అని పలికేవారు. అన్ని జీవులలో తామున్నట్లు బాబా నాకెప్పుడూ చెప్పలేదు. కానీ వారు తరచుగా దైవంతో తాదాత్మ్యాన్ని చెంది ఉండేవారు. ప్రాణాయామం, కుండలిని మొదలైన సాధనల గూర్చి కూడా వారెప్పుడూ మాట్లాడలేదు. నేను కూడా వాటిని గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు.

బాబా ధ్యానం గురించి ఎప్పుడూ నాతో చెప్పలేదు. తమనే ప్రార్థించమని ఆయన ఎవ్వరితోనూ చెప్పలేదు. అందుకు బదులుగా, "అలవాటు ప్రకారం మీ మీ ఇష్టదేవతలని ఆరాధించండి" అని చెప్పేవారు. భక్తుడు ఏ దేవతలను ఆరాధించినా బాబా ఆయా రూపాలలో భక్తులకు దర్శనం ఇచ్చేవారు.

నా సమక్షంలో బాబా ఎప్పుడూ జీవితలక్ష్యం, ముక్తి, మోక్షం, కైలాసం, వైకుంఠం, స్వర్గం వంటి వాటి గురించి మాట్లాడలేదు. కానీ, ఒకసారి బాబా ఇలా అన్నారు: "నేను నా కాకాను విమానంలో తీసుకుపోతాను" అని. విమానంలో తీసుకెళ్ళడమంటే సద్గతినివ్వడమని. అట్లాగే 1926లో ఒక ఏకాదశినాడు బాబా గురించి మాట్లాడుతూ ప్రశాంతంగా ప్రాణాలు విడిచాడు దీక్షిత్. నాకు తెలిసి కొందరు ఏకాదశినాడు శిరిడీలో మరణించారు. వారు తప్పక స్వర్గానికి చేరి ఉంటారని నా అభిప్రాయం.

బాబా ఒకటి రెండుసార్లు పాటలు పాడగా నేను విన్నాను. భక్తులు పాటలు పాడినప్పుడు బాబా ప్రసన్నంగా వినేవారు. సాయిబాబా చెవులు కుట్టబడి ఉండటం నేను చూశాను. ఆయన నగ్నంగా స్నానం చేసేటప్పుడు నేను గమనించాను, ఆయనకు సున్తీ చేయబడి లేదు. బాబా మాంసాహారాన్ని తినడం నేను చూడలేదు. ముస్లింలు నివేదన తెచ్చినప్పుడు బాబా ఫకీర్లను "ఫత్యా"(ప్రార్థన) చదవమని చెప్పేవారు.

బాబా ప్రతిదినం వేకువఝామున ధుని దగ్గర దక్షిణాభిముఖంగా స్తంభాన్ని ఆనుకొని కూర్చొని ఏదో చేస్తూ ఉండేవారు. ఆయన ఏం చేసేవారో నాకు తెలియదు. ఆ సమయంలో ఎవరినీ వారి వద్దకు రానిచ్చేవారు కాదు. భక్తులు వారికి 50 అడుగుల దూరంలో ఉండేవారు. సేవకులు మాత్రం చిమ్మడం, శుభ్రం చేయడం, ధునిలో కట్టెలు వేయడం మొదలైన పనులు చేస్తూ ఉండేవారు. బాబా ఆ సమయంలో "యాదేహక్" వంటి పదాలను ఉచ్ఛరిస్తూ ఉండేవారు. కానీ అవి దూరంగా ఉన్న మాకు అరుదుగా వినపడేవి. వారు తరచుగా "భగవంతుడే యజమాని, రక్షించేవాడు (అల్లామాలిక్, అల్లావలీ హై") అనేవారు.

మేఘుడు మరణించడానికి రెండు మూడు రోజుల ముందు అనారోగ్యంతో ఉన్నప్పుడు బాబా అతనికి ఊదీ ఇచ్చారు. అతను మరణించినప్పుడు బాబా చూడటానికి వెళ్లారు. అతని శవాన్ని పూలతో కప్పి కన్నీరు కార్చారు. అంతేకాదు, శవాన్ని దహనం చేసినప్పుడు స్మశానానికి కూడా వెళ్లారు.

ఇక శిరిడీలో శ్రీరామనవమి ఉత్సవాలు ఎలా జరుగుతాయో వివరిస్తాను. ఉదయం 10 గంటలకు జెండాలను గ్రామమంతా ఊరేగించి మసీదుపైన కడతారు. తరువాత 12 గంటలకు హిందీలో 'రామజన్మ' కీర్తన పాడడం మొదలవుతుంది. మహమ్మదీయులు కూడా ఖురాను చదవడం మొదలుపెట్టి చందనాన్ని గ్రామమంతా ఊరేగింపుగా తీసుకువెళతారు. చందనోత్సవంలో హిందువులు, హిందువులు చేసే జెండా ఉత్సవంలో మహమ్మదీయులు పాల్గొనేవారు. అందుకే "హిందూ ముస్లింల మధ్య విభేదాలు తొలగించి సోదరభావం నెలకొల్పేటందుకే బాబా జన్మించారు" అని బాబాకు పాడే ఆరతి గీతాలలో కీర్తిస్తారు. (యవనస్వరూపీ ఏక్యా దర్శన త్వాధిదలే|| సంశయ నిరసునియా తద్వైతా ఘాలవిలే|| గోపీచందా మందా త్వాంచీ ఉద్ధరిలే|| మోమిన వంశీ జనుని లోకా తారియలే!)

బాబా అప్పుడప్పుడు భవిష్యత్తును గురించి చెప్పేవారు. కానీ నేనెప్పుడూ నా భవిష్యత్తు గురించి వారిని అడగలేదు. 1914-16 మధ్యలో ఒకామె బాబా దగ్గరకొచ్చి "నాకు ఎప్పుడు మంచి జన్మ లభిస్తుంది?" అనడిగింది. బాబా "నీ మరుజన్మలో" (దూస్‌రే జనమ్ మే) అని సమాధానమిచ్చారు. ఆ మరుసటిరోజు ఆమె తన ప్రస్తుత జన్మను అంతం చేసుకోదలచి వెళ్లి బావిలో దూకేసింది. కానీ ఆమెనెవరో రక్షించారు.

మేము సాఠేవాడాలో బాపూసాహెబ్ జోగ్ నిర్వహిస్తున్న ఏకనాథ భాగవత పారాయణకు హాజరయ్యేవాళ్ళం. అద్భుతమైన విషయమేమంటే, జోగ్ పారాయణ చేసే భాగంలో అంతకుముందు మసీదులో బాబా మాతో మాట్లాడిన మాటలు ఉండేవి. మేమంతా ఆశ్చర్యపోయేవాళ్ళం. అలాంటి అనుభవం చాలాసార్లు జరిగింది. కానీ నాకు ఆ వివరాలు ఒక్కటి కూడా గుర్తులేవు.

బాబా సశరీరులుగా ఉన్న సమయంలో ఒకసారి సగుణమేరు నాయక్‌తో, "అన్నం మీద కొంచెం నెయ్యివేసి, ధునికి కొంత సమర్పించి, మిగిలినది నాకు తీసుకొని రా" అన్నారు. అతడు ఆరోజు నుండి అలాగే చేయడం మొదలుపెట్టాడు. (అంతకుముందు అతను తెచ్చే నివేదనలో నెయ్యి ఉండేది కాదు.) బాబా ఆ నివేదనను స్వీకరించారు. ప్రతిరోజూ నివేదన అతని ఇంటినుండి వచ్చేది. ఆ పద్ధతి బాబా సమాధి అనంతరం కూడా కొనసాగింది.

బాబా ఛాయాచిత్రం:- 

బాబా తమ భక్తులకు చాలా ధనాన్ని ఇచ్చారు. కొంతమందికి తమ ఫోటోలను ఇచ్చారు. కొంతమందికి గ్రంథాలనిచ్చి చదివి, మననం చేయమని చెప్పారు. అలాగే బాబా పురందరేకు తమ ఫోటోను ఇచ్చారు. అతను ఆ ఫోటోను ప్రతిరోజూ పూజించేవాడు. అతనికి ఏ కష్టం వచ్చినా ఆ ఫోటో ముందు కూర్చుని హృదయపూర్వకంగా బాబాను ప్రార్థించేవాడు. వెంటనే బాబా ప్రత్యక్షమై అతనిని ఓదార్చేవారు.


బాబా వెండి విగ్రహం:-

తరచూ బాబా పురందరేకు వెండి నాణేలను ఇస్తుండేవారు. అతడు ఆ నాణేలను జాగ్రత్తగా పూజలో భద్రపరుస్తుండేవాడు. వాటి విషయంలో అతని కొడుకు కూడా అంతే శ్రద్ధ వహించేవాడు. అయితే భవిష్యత్ తరాలకు వాటి విలువ తెలియవచ్చు, తెలియకపోవచ్చు అని పురందరే మనుమడికి అనిపించింది. దాంతో అతను ఆ వెండి నాణేలను ఒక స్వర్ణకారుడి వద్దకు తీసుకెళ్లి, వాటితో ఒక వెండి బాబా విగ్రహాన్ని తయారుచేయించాడు. ఇప్పుడు ఆ వెండి విగ్రహాన్ని పురందరే కుటుంబీకులు నిత్యం పూజించుకుంటున్నారు.
ఈవిధంగా సాయిబాబాకు తన జీవితాన్ని అంకితం చేసిన రఘువీర్ భాస్కర్ పురందరే 1948వ సంవత్సరంలో ప్రశాంతంగా కన్నుమూశాడు. అతని వారసులు ఇప్పటికీ బాబా ఆదేశానుసారం పురందరే బాంద్రాలో నిర్మించిన ఇంట్లో నివాసముంటున్నారు.

 సమాప్తం
Amrosia in Shirdi & Baba's Runaanubandh by vinny chittluri.

 


ముందు భాగం 

కోసం

బాబా పాదుకలు తాకండి.




 నిర్ధిష్టమైన భాగం కోసం పైన నెంబర్లను తాకితే, ఆ నెంబరుకి సంబంధించిన భాగం ఓపెన్ అవుతుంది.

5 comments:

  1. Om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya jaya sai🙏🙏🙏🙏

    ReplyDelete
  2. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  3. Om sai ram, naaku manashanti nivandi dayachesi ofce lo anta bagunde la chayandi, amma nannalani kshamam ga chusukondi vaallaki manchi arogyanni prasadinchandi vaalla badyata meede tandri. Naaku manchi arogyanni prasadinchandi.

    ReplyDelete
  4. Baba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu vadini bless cheyandi house construction complete cheyandi pl

    ReplyDelete
  5. Omsaisri Sai Jai Jai Sai kapadu Tandri omsairamRaksha Raksha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo