సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 280వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా నా మాటలు వింటున్నారు
  2. బాబా తోడుంటే భయమెందుకు?

బాబా నా మాటలు వింటున్నారు

సాయి భక్తురాలు శ్రీమతి సుచిత్ర తన అనుభవాలను ఇలా పంచుకుంటున్నారు: 

నా తండ్రి బాబా ఇటీవల నాకు రెండు లీలలను ప్రసాదించారు. వాటిని మన సాయికుటుంబంతో ఇప్పుడు పంచుకుంటున్నాను. ఈమధ్య మా ఇంటికి కొందరు బంధువులు వచ్చారు. నేను వారితో మాట్లాడుతూ, "నేను మాట్లాడే ప్రతి మాటా బాబా వింటున్నారు" అని చెప్పాను. వాళ్లు నా మాటల్ని అంతగా పట్టించుకోలేదు. కానీ, నేను చెప్పింది నిజమని రెండు లీలల ద్వారా బాబా నిరూపించారు. 

మొదటి లీల

నేను ప్రతి గురువారం బాబా మందిరానికి వెళ్తుంటాను. అలాగే ఒక గురువారం (12-12-2019) బాబా మందిరానికి వెళ్లేముందు తలుపు తాళం వేస్తుండగా పువ్వులు పెట్టుకునే క్లిప్ ఒకటి కనిపించింది. ఎందుకో దాన్ని చూడగానే, 'ఈరోజు బాబా నాకు ఒక పువ్వును ఇవ్వబోతున్నార'ని అనిపించి ఆ క్లిప్పును నాతో తీసుకెళ్ళాను. మందిరానికి వెళ్ళి బాబా దర్శనం చేసుకుని, కాసేపు కళ్ళు మూసుకుని బాబాను ప్రార్థించి కళ్ళు తెరిచేసరికి పూజారి ఒక పువ్వు నా చేతిలో పెట్టారు. ఆ పువ్వును చూడగానే నాకు చెప్పలేని సంతోషమేసింది. ఎంతో ఆనందంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. 

రెండవ లీల

బాబా నాకు ఒక స్నేహితురాలిని(అక్కని) ప్రసాదించారు. వాళ్ళ ఇల్లు మా ఇంటికి చాలా దూరంలో వుంటుంది. తను కూడా తనకి వీలైన గురువారాల్లో బాబా మందిరానికి వస్తూ ఉంటుంది. ఒక బుధవారంరోజు (18-12-2019) సాయంత్రం నేను తనకి ఫోన్ చేసి రేపు మందిరానికి వెళ్ళేటప్పుడు దారిలో నన్ను పికప్ చేసుకోమని చెబుదామనుకున్నాను. మళ్ళీ కొద్దిగా ఆలోచించి తనను ఇబ్బందిపెట్టడం ఎందుకులే అని ఫోన్ చేయలేదు. మరుసటిరోజు గురువారం నేను మందిరానికి వెళ్లడానికి సరిగ్గా ఒక గంట ముందు అక్కే నాకు ఫోన్ చేసి, "నేను బాబా మందిరానికి వెళ్తున్నాను, దారిలో నిన్ను పికప్ చేసుకుంటాను" అని చెప్పింది. నేను ఆశ్చర్యపోయాను. చూశారా! బాబా నా మాటలు వింటున్నానని నిరూపించారు. మరి ఆయన మన మనసులోనే కొలువై ఉంటారు కదా! "నా మనసులో కొలువై, మనసులో మెదిలే మాటలను(ఆలోచనలను) గ్రహించి, వాటిని తీర్చి నాకు ఆనందాన్ని ప్రసాదించిన మీకు చాలా చాలా ధన్యవాదాలు బాబా!"

బాబా తోడుంటే భయమెందుకు?

సాయిభక్తురాలు మినీ మీనన్ తన అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు:

నేను మహాపారాయణ (MP-270) గ్రూపులోని సభ్యురాలిని. ఇప్పుడు చెప్పబోయే లీల నేను మహాపారాయణలో చేరాక జరిగినది. నేను మహాపారాయణలో చేరకముందు కూడా బాబా నాకు ఎన్నో అనుభవాలిచ్చారు. అవి బాబాపట్ల నాకున్న భక్తివిశ్వాసాలను దృఢం చేశాయి.

విమాన ప్రయాణం అంటే నాకు చాలా భయం. ప్రయాణం కొద్దిరోజుల్లో ఉందని తెలిసినప్పటి నుండి నేను ఆందోళనపడుతూ వణికిపోతుంటాను. అది ఎంతో భయానకమైన పరిస్థితి. అలాంటిది ఒకసారి విమానంలో ఉన్నప్పుడు నేను శిరిడీలో బాబా పాదాల చెంత ఉన్నట్టు ఊహించుకొని, నాకు తోడుగా ఉండి నా భయాన్ని తొలగించమని బాబాని వేడుకున్నాను. ఆనాడు నేను బాబా ఆశీస్సులు ఎలా ఉంటాయో పరిపూర్ణంగా అనుభూతి చెందాను. బాబా కృపతో ప్రయాణం ఎంతో ప్రశాంతంగా, సాఫీగా సాగింది. ఆ సంతోషంలో నేను ఊపిరి గట్టిగా తీసుకున్నాను. ఆ క్షణం నుండి నా భయాందోళనలన్నీ పోయాయి. ఇప్పుడు నేను 'మళ్ళీ ఎప్పుడు విమాన ప్రయాణం చేస్తానా?' అని ఎదురు చూస్తున్నాను. నన్ను నమ్మండి, బాబా వలనే నాలో ఇంత మార్పు సంభవించింది. మరో విషయం, నేను విమాన ప్రయాణం చేసినప్పుడల్లా నాతో పాటు సాయిసచ్చరిత్ర తీసుకొని వెళ్తాను.

ఇక నా మహాపారాయణ అనుభవానికి వస్తే... 

నేను అకౌంట్స్ డిపార్టుమెంటులో క్లియరెన్స్ నిమిత్తం ఒక బిల్ పెట్టాను. దాదాపు ఒక సంవత్సర కాలంగా నేను బాబాను ప్రార్థిస్తూ, బిల్లు క్లియర్ అయితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటానని చెప్పుకొని, ఎప్పటికప్పుడు దాని పురోగతి గురించి తెలుసుకుంటూనే ఉన్నాను. కానీ పనిలో పెద్దగా మార్పు కనిపించేది కాదు. చివరికి నేను మహాపారాయణలో చేరిన వారానికి ఆ బిల్లు క్లియర్ అయ్యింది. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు". బాబా చెప్పిన శ్రద్ధ-సబూరీలను నేను సదా గుర్తుపెట్టుకుంటాను. బాబాని నమ్మి ఆయనకు శరణనండి. అంతా ఆయన చూసుకుంటారు.

ఓం సాయిరామ్!!!

source:http://experiences.mahaparayan.com/2019/12/baba-got-my-bill-cleared.html

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo