సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1350వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

శ్రీసాయి అనుగ్రహ లీలలు - పన్నెండవ భాగం

సాయిబాబుగారు తమకు బాబా ప్రసాదించిన కొన్ని అనుభవాలు గతవారం పంచుకున్నారు. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నారు.

ఒకసారి నా భార్య స్నేహితురాలి కుటుంబం శిరిడీ వెళ్ళారు. వాళ్ళు వెళ్ళింది నూతన సంవత్సరం ఆరంభంలో కనుక మేము వాళ్ళను శిరిడీ సంస్థానం వారు అచ్చు వేయించే బాబా ఫోటోలతో కూడుకున్న క్యాలెండర్ తెచ్చిపెట్టమని చెప్పాము. దానికోసం మేము ఎంతో ఆశతో ఎదురుచూశాము. కానీ, వాళ్ళు శిరిడీ నుండి తిరిగి వచ్చాక, కేవలం బాబా ప్రసాదం మాకిచ్చి, 'క్యాలెండర్ తీసుకురాలేద'ని చెప్పారు. ఆ క్యాలెండర్ రూపంలో బాబా వస్తారని ఎదురుచూసిన మేము నిరాశ చెందాము. అదే రోజు సాయంత్రం మేము మా అత్తగారింటికి వెళ్ళాము. మా అత్తగారు నాతో, “టేబుల్ మీద క్యాలెండర్ ఉంది. అది మీకోసమే, తీసుకోండి” అని అన్నారు. మేము మామూలు క్యాలెండర్ అనుకుని దాన్ని చేతులోకి తీసుకుని తెరచి చూస్తే, బాబా ఉన్నారు! మాకు చాలా ఆనందమేసింది. అలా బాబా మా మనసులోని ఆవేదనను కనిపెట్టి మా దగ్గరకు వచ్చి మా బాధను తీసేశారు. సర్వాంతర్యామి అయిన ఆయనకు ఎవరి అంతరంగంలో ఏముందో తెలుసు.


ఇప్పుడు నా మనసులో మెదిలే ఒక సందేహాన్ని బాబా ఎలా తీర్చారో చదవండి. శిరిడీ సమాధిమందిరంలోని బాబా మూర్తిని చెక్కిన బాలాజీ వసంత తాలిమ్‍కు బాబా సశరీరులుగా దర్శనమిచ్చారని నేను చాలాకాలం క్రిందట చదివాను. కానీ ఒక టీవీ ప్రోగ్రాంలో బాబా అతనికి తమ విగ్రహం చెక్కమని ఆదేశించినట్లుగా చెప్పారు. దాంతో నేను ఏది సరైనదన్న సందిగ్ధంలో పడ్డాను. ఆ విషయం గురించి గురువారంనాడు బాబానే అడిగితే సరైన సమాధానం ఇస్తారని గురువారం కొరకు వేచిచూశాను. ఆలోపే బాబా నా మనసులో సందేహాన్ని గ్రహించి దాన్ని తీర్చారు. అదెలాగంటే, నేను ఒకరోజు యూట్యూబ్‍లో బాబా గురించి వింటుంటే, అప్పట్లో తాలిమ్ కుమారుడు చెప్పిన మాటలు వచ్చాయి. అతను తన తండ్రికి బాబా నిజరూప దర్శనమిచ్చి, తమని బాగా పరిశీలించి విగ్రహం చెక్కమని చెప్పారని, ఆ గదిలో ఉన్న ఒక చిన్న బల్లపై బాబా కూర్చుంటే, తాలిమ్ విగ్రహం చెక్కారని చెప్పాడు. అందుకేనేమో బాబా విగ్రహం కుడివైపుకు ఒదిగి ఉండి, ఎడమవైపు కొంచెం ఖాళీ ఎక్కువగా ఉన్నట్లు ఉంటుంది. అలా బాబా నా సందేహం తీర్చారు.


2018వ సంవత్సరం, మార్చి 18, తెలుగు నూతన సంవత్సరాది. అంటే ఉగాది పండుగ. ఆరోజు మేము బాబాకు నైవేద్యంగా స్వీట్ పెట్టి ఆ ప్రసాదాన్ని మేము మొదట స్వీకరించాము. తర్వాత బాబా మందిరానికి వెళ్ళి, పూజ చేసుకున్నాము. ఆ గుడి పూజారి ప్రక్కనే ఉన్న వాళ్ళింటికి వెళ్ళి రెండు గ్లాసుల నిండా పాయసం తెచ్చి నాకు, నా భార్యకు ఇచ్చారు. మేము ఆ పాయసం బాబాకి సమర్పించి తీసుకున్నాము. అలా ఉగాది రోజున రెండవసారి బాబా మాతో తీపి తినిపించారు. ఇకపోతే ఎవరో భక్తులు శిరిడీ వెళ్లొచ్చి బాబా ప్రసాదం(స్వీట్) మందిరంలో పంచిపెట్టమని ఇచ్చారు. ఆ ప్రసాదం మాకూ లభించింది. అలా ఉగాది రోజున మూడోసారి బాబా మాచేత తీపి తినిపించారు. మామూలుగా ఉగాది రోజున అందరూ ఆరు రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి తీసుకుంటారు. కానీ, బాబా మాకు ఆరోజు కేవలం తీపిని మాత్రమే తినిపించారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, ఉగాది పండక్కి మూడు రోజుల ముందు మాకు తెలిసినవాళ్ళు శిరిడీ వెళ్తుంటే, వాళ్ళకి బాబాకి సమర్పించమని దక్షిణ ఇచ్చి, "వచ్చేటప్పుడు ఊదీ, ప్రసాదం తీసుకుని రండి" అని చెప్పాము. వాళ్ళు ఉగాది రోజునే వస్తారు కానీ, ఏ సమయంలో వస్తారో మాకు తెలియదు. కానీ మా మనసు తెలిసిన బాబా వాళ్ళు వచ్చి ప్రసాదం ఇవ్వడానికన్నా ముందే మాకు శిరిడీ ప్రసాదం అందేలా చేశారు.


ఇంకోసారి బాబా మన మనసులోని మాటను గ్రహించి ఎలా నెరవేర్చారో చూడండి. 2018, జూలై 27వ తేదీన గురుపూర్ణిమ వచ్చింది. ఆ సందర్భంగా చేబ్రోలులోని శ్రీసాయి మందిరంలో వారం రోజుల ముందు నుంచి దాదాపు 25 మందితో సచ్చరిత్ర పారాయణ చేశారు. మొదట ఆ విషయం మాకు తెలియదు. మూడవరోజు ఉదయం ఆ గుడి పూజారి మాకు ఫోన్ చేసి, విషయం చెప్పి గుడికి రమ్మన్నారు. వెంటనే మేము బాబా మందిరానికి వెళ్ళి పారాయణలో పాల్గొన్నాము. ఒక్కొక్కరు ఒక్కొక్క అధ్యాయం చొప్పున ఆరోజు చదవవలసిన అధ్యాయాలను అందరికీ వినపడేలా మైకులో పెద్దగా చదువుతున్నారు. నా భార్య కూడా ఒక అధ్యాయం చదవాలని మనసులో అనుకుంది. అయితే మేము వెళ్ళేసరికి ఆరోజు చదవవలసిన అధ్యాయాలు పూర్తవుతున్నందున ఆమెకు అవకాశం రాలేదు. మరుసటిరోజు యథావిధిగా మేము బాబా మందిరానికి వెళ్ళాము. ఒకరు ఒక అధ్యాయం పూర్తిచేసి, ఇంకొకరు ఇంకో అధ్యాయం మొదలుపెట్టబోతుండగా పూజారి వారిని, “ఒక్క నిమిషం ఆగండి” అని, వారి చేతిలోని మైకు తీసుకుని నా భార్య చేతికిచ్చి, “మీరు చదవండి” అని అన్నారు. నా భార్య ఆనందంగా ఆ అధ్యాయం చదివింది. ఆమె ఆరోజు నుండి చివరిరోజు పూర్ణాహుతి వరకూ ప్రతిరోజు ఒక అధ్యాయం చదివింది. అంతేకాదు, చివరిరోజు చివరి అధ్యాయం చదివి పారాయణ సమాప్తి చేసే భాగ్యం కూడా మాకు దక్కింది. మేము ఆరోజు గురుపూర్ణిమ ఉత్సవాలలో పాల్గొని బాబా ప్రసాదం స్వీకరించి ఇంటికి తిరిగి వచ్చాము.


2018, అక్టోబరు నెలలో నవరాత్రులు జరుగుతుండగా ఒకరోజు బాబా గుడికి వెళ్ళాలనిపించి నేను, నా భార్య వెళ్ళి బాబా దర్శనం చేసుకున్నాము. ఆ గుడి హాలులో ఒక ప్రక్కగా అమ్మవారి ఫోటో పెట్టి, రోజూ కుంకుమపూజ చేస్తున్నందువల్ల ఒక పెద్ద బేసిన్ నిండా కుంకుమ ఉంది. అవి చూసిన నా భార్య, "మనం కూడా కుంకుమపూజ చేసుకుంటే బాగుండు” అని మనసులో అనుకుంది. కొద్దిసేపటికి పూజారి, “సమయానికి మీరు వచ్చారు. కుంకుమపూజ మొదలు కాబోతోంది. మీరు కూడా పూజ చేయండి. పూజాసామాగ్రి అంతా సిద్ధంగానే ఉంది” అని అన్నారు. దాంతో మేము అప్పటికే పూజకు కూర్చుని ఉన్న ఇద్దరు దంపతుల పక్కన కూర్చున్నాము. పూజారి మాకు పెద్ద కుంకుమపొట్లం ఇచ్చి, “సహస్రనామాలు చదివేటప్పుడు మూడు వేళ్ళతో కుంకుమ తీసుకుని కొంచెం కొంచెం వేయండి. పూజ రెండు గంటలు పడుతుంది" అని చెప్పారు. పూజ మొదలైంది. మేమందరం కుంకుమ తీసుకుని వేయసాగాము. అప్పుడొక అద్భుతం జరిగింది. అదేమిటంటే, నా భార్య ఒకే ఒక్కసారి మూడు వేళ్ళతో తీసుకున్న కుంకుమను రెండు గంటలపాటు కళ్ళు మూసుకుని అమ్మవారిపై వేస్తూనే ఉంది. అదంతా గమనిస్తున్న నేను 'తను పొట్లంలోని కుంకుమ తీసుకోకుండా అలా ఎలా వేస్తోందా?' అని అనుకున్నాను. పూజయ్యక ఆమెని అడిగితే, “నా వేళ్ళ సందులోంచి అలా కుంకుమ వస్తూనే ఉంది, నేను వేస్తూనే ఉన్నాను. కళ్ళు తెరిస్తే, ఏకాగ్రత పోతుందని అమ్మవారి పాదాలు గుర్తుచేసుకుంటూ వేస్తూనే ఉన్నాను” అని అంది. నాకు వెంటనే బాబా కుశాభావు అనే భక్తునితో 'తమను తలచుకోగానే చేతిలోనికి ఊదీ వస్తుంద'ని చెప్పిన మాట గుర్తొచ్చింది.


బెంగళూరులోని మారతహళ్ళిలో ఒక బాబా మందిరం ఉంది. మేము బెంగళూరులో ఉన్నప్పుడు తరచూ, ముఖ్యంగా గురువారం ఆ గుడికి తప్పకుండా వెళ్తుండేవాళ్ళము. అది చాలా పెద్ద గుడి. అక్కడికి చాలామంది భక్తులు వస్తారు. అందువల్ల అక్కడ చేసే పల్లకీ సేవలో మందిరానికి సంబంధించినవారే పల్లకీ పట్టేవారు. పల్లకీ వెనుక భక్తులు వెళ్లేవారు. నేను, నా భార్య కూడా పల్లకీ వెంట నడుస్తూ ఉండేవాళ్ళము. ఒక గురువారం ఆ మందిరం ఛైర్మన్ నన్ను పిలిచి, పల్లకీ పట్టమన్నారు. ఎంత అదృష్టం! బాబానే పిలిచి మరీ పల్లకీ సేవ చేసుకునే భాగ్యాన్ని ఇచ్చారని అనుకున్నాము. ఆ తర్వాత కూడా చాలాసార్లు పల్లకీ సేవ నాకు దక్కింది.


ఒకప్పుడు బాబా అనుమతితో మా అల్లుడు మైసూరులో ఒక స్థలం కొన్నాడు. ఒకరోజు రిజిస్ట్రేషన్ పనిమీద నేను, మా అల్లుడు మైసూరు వెళ్ళడానికి బయలుదేరాము. ఆరోజు కార్తీకపౌర్ణమి. ఉదయం 9 గంటలకి నేను, నా అల్లుడు, అతని స్నేహితుడు కలిసి శివాలయానికి వెళ్ళి పూజ జరిపించాము. శివలింగానికి 20 అడుగుల దూరంలో మేము ఉన్నాము. మా అల్లుడికి, అతని స్నేహితుడికి మధ్యలో నేను నిల్చుని నమస్కారం చేసుకుంటూ, "రిజిస్ట్రేషన్ పని ఏ ఆటంకం లేకుండా జరిపించండి బాబా" అని బాబాను ప్రార్థిస్తూ ఆయన్నే తలచుకుంటున్నాను. అంతే, పానపట్టం మీద ఉన్న ఒక ఆపిల్ జరిగి క్రిందకు దొర్లి, సరాసరి నా వద్దకి వచ్చి నా ముందు ఆగింది. పానపట్టం అంచు ఎత్తుగా ఉంది. దానిమీద పెట్టిన ఏదైనా దొర్లటానికి అవకాశం లేదు. ఒకవేళ దొర్లినా ఇరవై అడుగుల దూరం రావడం అసంభవం. అలాంటిది ఆ ఆపిల్ అంతదూరం వచ్చింది. పూజారి దాని వెనకాలే వచ్చి, ఆ ఆపిల్‍ను చేతిలోకి తీసుకుని, నాకు ఇచ్చి, "మీరు ఏ పనిమీద వెళ్తున్నారో అది దిగ్విజయంగా నెరవేరుతుంది” అని అన్నారు. అలాగే జరిగింది.


ఒకసారి దసరా పండుగ ముందురోజు రాత్రి నేను కిరాణా షాపుకు వెళ్ళి కొన్ని వస్తువులు తీసుకున్నాక రంగు చాక్‌పీస్ బాక్స్ అడిగాను. ఆ షాపతను వెతికి, “తెల్ల చాక్‌పీస్ బాక్సులే ఉన్నాయి. రంగువి లేవు” అని అన్నాడు. నేను నా మనసులో, “బాబా, ఇప్పుడెలా? రేపు ఉదయం నా భార్య రంగు చాక్‌పీసులతో వాకిట్లో ముగ్గులు పెడుతుంది. ఈ షాపతను 'తెల్లవే ఉన్నాయి, రంగువి లేవు' అంటున్నాడు” అని అనుకున్నాను. అంతే, మరుక్షణంలో ఒక వ్యక్తి షాపుకి వచ్చి, ఒక బాక్స్ తిరిగి ఇస్తూ, “ఇవి రంగు చాక్‌పీసులు. నాకు తెల్ల చాక్‌పీసుల బాక్సులు కావాలి” అని చెప్పి తెల్ల చాక్‌పీసులు తీసుకుని వెళ్ళిపోయాడు. అతను తిరిగి ఇచ్చిన రంగు చాక్‌పీసుల బాక్స్‌ను షాపతను నాకు ఇచ్చాడు. సమయానికి ఆ వ్యక్తి ద్వారా రంగు చాక్‌పీసులు పంపడం, అవి నాకు లభించడం ఇదంతా బాబా లీల కాదా! తమకు ఎన్నో పనులున్నా ఇంత చిన్న చాక్‌పీసుల విషయంలోనే అంత శ్రద్ధ తీసుకున్నప్పుడు, ఇక పెద్ద పెద్ద విషయాల్లో వేరే చెప్పాలా? మనం మన చర్మం వలిచి బాబాకు చెప్పులు కుట్టించినా ఆయన ఋణం తీర్చుకోలేము. బాబాని గట్టిగా నమ్ముకోండి.


2005వ సంవత్సరంలో నేను, నా భార్య బెంగళూరు నుండి ఊటీ వెళ్ళాము. మాతోపాటు ఇరవై ఐదు మంది ఉన్నారు. ఊటీ నుండి 'కూనూరు' వరకు వ్యాన్‍లో వెళ్లి అక్కడినుండి తిరిగి 'ఊటీ'కి రైలులో వస్తే, ఆ ఆనందమే వేరు. మూడు బోగీలే ఉండే చిన్న రైలు, దగ్గరగా ఉండే రైలు పట్టాలు, కొండల నడుమ ప్రయాణం, చాలా తక్కువ ఎత్తులో మేఘాలు మనల్ని తాకుతూ సంచరిస్తుంటాయి. అటువంటి ప్రయాణం ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు? మేమంతా కూనూరు రైల్వేస్టేషనుకు చేరుకున్నాము. రైలు బయలుదేరటానికి సిద్ధంగా ఉంది. కానీ టికెట్లు అయిపోయాయి. మాతో వచ్చిన అందరూ నిరుత్సాహపడి తిరిగి వ్యాన్‍లో ఊటీ వెళ్ళిపోయారు. నేను, నా భార్య మాత్రం ఉండిపోయాము. ఎందుకంటే, మేము బాబాను అడిగితే, 'రైలులోనే వెళతార'ని సమాధానం వచ్చింది. అందుచేత మేము బాబాపై మాకున్న నమ్మకంతో టిక్కెట్లు లేకపోయినా ధైర్యం చేసి ఫస్ట్ క్లాస్ బోగీ ఎక్కి కూర్చున్నాము. టీసీ వస్తే అతనికి టిక్కెట్ డబ్బులు మాత్రమే ఇచ్చాము. అతనేమీ అనలేదు. మా ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా సాగింది. ప్రయాణంలో ఒక తెలుగు కుటుంబంతో మాకు పరిచయమైంది. మాటల మధ్యలో వాళ్ళు మా ఊరి  కరణంగారి బంధువులని తెల్సింది. ఊటీలో రైలు దిగగానే వాళ్ళకోసం ఒక కారు వచ్చింది. ఆ కారులో వాళ్ళు మమ్మల్ని మేమున్న హోటలుకు చేర్చారు. అప్పటికి మేము తిరిగి బెంగళూరు వెళ్లడానికి బస్సు సిద్ధంగా ఉంది. అందరూ మమ్మల్ని, "మీరెలా వచ్చారు?" అని అడిగితే, "రైల్లో" అని చెప్పాము. అందరూ ఆశ్చర్యపోయారు. బాబాని అడిగినప్పుడు వారి సమాధానం ఏదైనా తదనుగుణంగా మనం నడుచుకుంటే, అంతా తామై మనల్ని నడిపిస్తారు బాబా. చిన్న విషయమైనా, పెద్ద విషయమైనా నమ్మకం ఉండటమే ముఖ్యం.


2015, ఆగస్టు 23, సాయంత్రం 7 గంటల బస్సుకు గుంటూరు నుండి మా చిన్నత్త, మామగార్లు బెంగళూరు వెళ్తుంటే, వాళ్ళని కలుద్దామని మేము అనుకున్నాము. ఆరోజు మాకు వేరే పని కూడా ఉండటంతో ఉదయం 11 గంటలకే బయలుదేరి గుంటూరు వెళ్ళాము. మా పని పూర్తయ్యాక బస్సుకు చాలా సమయముందని మేము మాకు తెలిసినవాళ్ళింటికి వెళదామనుకొని ముగ్గురి పేర్లను బాబాకు చెప్పి, 'ఎవరింటికి వెళ్ళాలో సెలవివ్వమ'ని అడిగాము. అప్పుడు బాబా మాకు చూపిన ఒకరింటికి వెళ్ళి సాయంత్రం 5 గంటల వరకూ అక్కడే ఉన్నాము. ఆ సమయంలో మైకులో బాబా పాటలు చిన్నగా వినిపిస్తుంటే అక్కడికి వెళ్ళి విషయం అడిగితే, “శిరిడీ నుండి జ్యోతి తెచ్చి బాబా పూజ చేస్తున్నాము. మీరూ రండి” అని ఆహ్వానించారు. సరేనని నేను, నా భార్య కొంచెంసేపు బాబా పూజలో పాల్గొందామని వెళ్ళాము. ఆ ఇంటివారు మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి బాబా పూజ జరిగే చోట కూర్చోబెట్టారు. అభిషేకం, పూజ, జ్యోతి ప్రజ్వలన అన్నీ పూర్తయ్యేసరికి రాత్రి 9 గంటలయ్యింది. అప్పుడు బాబా ప్రసాదం తీసుకుని, వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుని ఆనందంగా బయల్దేరాము. బాబాకి భవిష్యత్తు తెలుసు కనుక మేము అడిగిన ముగ్గురి పేర్లులో ఒకరి ఇంటికి పంపి, తద్వారా తమ అద్భుత పూజలో పాల్గొనేటట్లు చేసి మాకు అమితమైన ఆనందాన్ని ప్రసాదించారు.


2015వ సంవత్సరం, మాఘమాసం మొదటిరోజున మేము అనుకోకుండా మా బంధువుల ఇంటికి వెళ్ళాము. వాళ్ళు మాకు శిరిడీ ప్రసాదం, బాబా ఫోటో ఇచ్చారు. ఆ ఇంటాయన ఆ ఊరి ప్రెసిడెంట్. ఆయనింటికి ప్రతిరోజూ చాలామంది వస్తుంటారు. వాళ్ళెవరికీ ఆ శిరిడీ ప్రసాదం పెట్టకుండా మమ్మల్ని చూడగానే శిరిడీ ప్రసాదం గుర్తుకు వచ్చి ప్రసాదం అంతా మాకే ఇచ్చేశారు. బాబా తమ ప్రసాదం కోసమే చాలా సంవత్సరాల తర్వాత మమ్మల్ని వాళ్ళింటికి పంపించారని మేము అనుకున్నాము. బాబాకు తమ భక్తులకు ఏది, ఎక్కడ, ఎలా అందించాలో బాగా తెలుసు.


2015, అక్టోబరులో నా భార్య పుట్టినరోజునాడు ఉదయం నేను, నా భార్య చేబ్రోలులోని బాబా గుడికి వెళ్ళి పూజ చేయించుకుని అక్కడే కొంతసేపు కూర్చున్నాము. సరిగ్గా అప్పుడే నా భార్యకు తన స్నేహితురాలి వద్ద నుండి ఫోన్ వచ్చింది. ఆమె ఆరోజు శిరిడీలో ఉంది. ఆమె బాబా దర్శనం చేసుకుని బయటకు వస్తూనే నా భార్యకు ఫోన్ చేసి, "నేను ఇప్పుడే బాబా దర్శనం చేసుకుని బయటకు వచ్చాను. నీ పుట్టినరోజని గుర్తొచ్చి ఫోన్ చేశాను. బాబా తరఫున శిరిడీ నుండి నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు” అంది. అవి బాబా ఆశీస్సులు. ఆమె ద్వారా చెప్పించారు బాబా. మేము బాబా గుళ్ళో ఉండటం, అదే సమయానికి ఆమె శిరిడీలో బాబా దగ్గరవుండి ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పడం బాబా లీలకాక మరేమిటి?


ఒకప్పుడు కొన్నిరోజులపాటు మా దగ్గర ఉన్న 'యాపిల్ ఐ ఫోన్' ఛార్జింగ్ అవ్వలేదు. కేవలం యాపిల్ బొమ్మ వచ్చి స్విచ్ ఆఫ్ అయిపోతుండేది. నేను, నా భార్య సుమారు ఒక రెండు వందల సార్లు ఆ ఫోన్‍కి ఛార్జింగ్ పెట్టి విసిగిపోయాము. చివరికి ఒక గురువారంనాడు సాయంత్రం యథావిధిగా పూజ ముగించిన తరువాత ఆ ఫోన్‌ను బాబా ఫోటోకు తాకించి, కొంచెం ఊదీ పెట్టి ఆ రాత్రంతా బాబా దగ్గర ఉంచాము. మరుసటిరోజు ఉదయం పూజ అయ్యాక ఫోన్ స్విచ్ ఆన్ చేశాను. అది ఆన్ అవ్వడమేకాక అన్ని యాప్స్ కనిపించాయి. ఆశ్చర్యపోవడం మా వంతు అయింది.


మా ఇంట్లో ఉన్న పెద్ద నీళ్ళతొట్టిలో ఒక తాబేలు ఉంది. ఒకరోజు తొట్టి శుభ్రంచేసి నీళ్ళు మారుద్దామని ఆ తాబేలును కొంచెంసేపు బయటికి తీసి, తర్వాత నీళ్ళలో వేశాము. అయితే అది ఎందుకో అంతకుముందు ఉన్నంత హుషారుగా ఉండక డల్‍గా అయిపోయింది. దాన్నలా చూసి మాకు భయమేసింది. తాబేలు అంటే శ్రీమన్నారాయణుని అవతారం కదా! అదో సెంటిమెంట్. నా భార్య కొద్దిగా బాబా ఊదీని నీళ్ళలో వేయమని చెప్పింది. నేను వెంటనే బాబాకు దణ్ణం పెట్టుకుని, ఊదీ తీసుకెళ్ళి నీళ్ళతొట్టిలో వేశాను. రెండు రోజుల్లో ఆ తాబేలు తిరిగి కోలుకుని మళ్ళీ హుషారుగా నీళ్ళల్లో తిరిగింది. అప్పట్నించి అది బాగానే ఉంది. బాబా ఊదీకి ఉండే శక్తి ఏ మందుకూ లేదు.


ఎన్నో సంవత్సరాలుగా నేను ఎప్పుడు, ఎక్కడ, ఏ బాబా గుడికి వెళ్ళినా 10 రూపాయలు బాబాకు దక్షిణగా హుండీలో వేయడం తప్పనిసరిగా చేస్తున్నాను. అలాంటిది ఒకరోజు సాయంత్రం బాబా గుడికి వెళ్లిన నేను దక్షిణ సమర్పించడం మరచిపోయాను. తీరా ఇంటికి వచ్చి చూసుకుంటే, ఇంటి తాళంచెవులు లేవు. ఆ పూట బాబాకు హారతి ఇవ్వలేదు సరికదా, రాత్రంతా మేము ఇంటి బయటే ఉండాల్సి వచ్చింది. అప్పుడు 'దక్షిణ విషయంలో బాబా చాలా ఖచ్చితంగా ఉంటార’న్న విషయం గుర్తుకు వచ్చి, ఆ తండ్రికి క్షమాపణలు చెప్పుకున్నాను.


2016, ఆగస్టులో రాఖీ పండుగ వచ్చింది. ఆరోజున నా భార్య, తన తమ్ముడికి రాఖీ కట్టి, బట్టలు పెట్టడం ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఆ సంవత్సరం కూడా ఎప్పటిలాగే రాఖీ కొని, ప్యాంటు, షర్టు కొందామని ఉదయం నుండి సాయంత్రం వరకూ చాలా షాపులు తిరిగాం. కానీ బట్టలు తీసుకోలేకపోయాము. తిరిగి తిరిగి అలసిపోయి, “ఎందుకు బాబా మమ్మల్ని ఇలా తిప్పుతున్నావు?” అని అనుకున్నాము. ఆ తరువాత ఒక షాపులో బాబా ఫోటో కనిపిస్తే, ‘ఈ షాపులో పని జరగవచ్చ’ని లోపలికి వెళ్ళాము. ఎప్పుడూ ప్యాంటు, షర్టు పెడుతున్నామని, అలాగే దగ్గరలో వినాయకచవితి ఉందనీ, ఆసారి ప్రత్యేకంగా పట్టుబట్టలు(లుంగీ, షర్టు, కండువా) ఇప్పించారు బాబా. ఆయన ఏది చేసినా ఒక అర్థం ఉంటుంది. మట్టిబుర్రలం, మనకే అవి తొందరగా అర్థం కావు.


ఒకసారి నేను మినీ లారీలో ఐస్‌క్రీం లోడ్ చేసి గుంటూరు నుండి వైజాగ్ పంపించాను. లారీ బయలుదేరిన 2 గంటల తర్వాత వాతావరణం మారిపోయి తుఫాను మొదలైంది. ఒకవేళ లారీ సకాలంలో గమ్యం చేరకపోతే ఐస్‌క్రీం లోడ్ అంతా కరిగిపోయి నష్టపోయే పరిస్థితి. నేను బాబాను, "లారీని సకాలంలో గమ్యానికి చేర్చండి బాబా" అని ప్రార్థించాను. బాబా దయవల్ల లారీకి ఎటువంటి ఆటంకం కలుగలేదు, సకాలంలో గమ్యం చేరుకుంది. మేము పూజ చేసి ఒక బాబా మెర్క్యురీ విగ్రహం ఆ లారీలో ఉంచాము. ఆయన ఉండగా భక్తులకు నష్టమా!

తరువాయి భాగం వచ్చేవారం...

 


ముందు భాగం కోసం
బాబా పాదుకలు తాకండి.




 


 


తరువాయి భాగం కోసం
బాబా పాదాలు తాకండి.

 


2 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Jaisairam bless supraja for her neck pain and shoulder pain and help her to get better Jaisairam 🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo