సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1345వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సాయి కృప
2. అడిగిన వెంటనే కోరుకున్నట్లు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్న శ్రీసాయినాథుడు
3. డబ్బు సర్దుబాటయ్యేలా సహాయం చేసిన బాబా

సాయి కృప


ఓం శ్రీ సాయినాథాయ నమః!!!

సాయి శరణం - భవభయ హరణం|

సాయి శరణం సగుణ సమీరం||


ముందుగా, సాయిభక్తులకు నమస్కారం. నేను సాయిభక్తురాలిని. నా ప్రతిరోజు, ప్రతిక్షణం బాబా మలిచినదే. నాదంటూ ఏమీ లేదు. అంతా ఆయనే నడిపిస్తూ ఉంటారు. ఆయన ప్రేమను చాలా పంచుకోవాలనిపిస్తుంది. కానీ వ్రాసేది ఎవరు? వ్రాయించేది ఎవరు? ఆ పరమపావనుడే కదా!


నేను చదువుకునే రోజుల్లో సాయిబాబా గుడికి వెళ్ళినప్పుడు ఎవరో నాకు సాయి వేయినామాల పుస్తకం ఇచ్చారు. ఆ పుస్తకంలో, 'మీరు ఏదైనా కోరిక కోరుకుని నామాలు వ్రాస్తే, ఆ కోరిక నెరవేరుతుంది' అని ఉంటే, నేను "నాకు క్లాస్ ఫస్ట్ రావాలి" అని బాబాను ప్రార్థించి, 1,008 సార్లు సాయి నామం వ్రాశాను. కానీ నా కోరిక నెరవేరలేదు. అంతటితో నేను కూడా మర్చిపోయాను. కొన్ని సంవత్సరాల తరువాత ఒక బెస్ట్ ఫ్రెండ్ రూపంలో బాబా నా జీవితంలోకి మళ్ళీ వచ్చారు. ఆనాడు నామం రాస్తే నేను క్లాస్ ఫస్ట్ రాలేదు కానీ, ఈనాడు బాబా నాకు తల్లి మరియు నా వెన్నంటే ఉండి కరుణించి, పాలించే బంగారుతండ్రి అయ్యారు. ఎన్నటికీ వీడని తోడు అయ్యారు. ఆ సద్గురుమూర్తి గురించి చెప్పేంత అర్హత నాకు లేదు. కేవలం ఆయన కృపే నాచేత ఇలా వ్రాయిస్తోంది. శ్రీసాయిసచ్చరిత్రలో, 'బాబాని మనకి పరిచయం చేసినవారికి సాష్టాంగ నమస్కారం చేసి, ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి' అని ఉంది. నేను బాబాను నా జీవితంలోకి తీసుకొచ్చిన నా బెస్ట్ ఫ్రెండ్‍కి సదా కృతజ్ఞతగా ఉండేలా అనుగ్రహించమని బాబాని ప్రార్థిస్తున్నాను.


ఇప్పుడు 2022, సెప్టెంబర్ మొదటి రెండు వారాలలో జరిగిన ఒక అనుభవాన్ని పంచుకుంటాను. నాకు 4 సంవత్సరాల కొడుకు ఉన్నాడు. వాడు మాకు బాబా ప్రసాదం. కోవిడ్ మూలంగా మేము బాబుని స్కూలుకిగానీ, డే-కేర్ సెంటరుకిగానీ పంపలేదు. అందువల్ల బాబు ఆ రెండు సంవత్సరాలు ఇంట్లోనే ఉన్నాడు. ఆ సమయంలో, ఉద్యోగస్తురాలినైన నేను బాబుపై పూర్తిగా దృష్టి పెట్టలేకపోయేదాన్ని. అయినా బాబానే అన్నివిధాలా తనని చూసుకుంటారని బలంగా నమ్మేదాన్ని. అలాగే బాబా తనని ఎల్లప్పుడూ చూసుకుంటున్నారు కూడా. ఇక ఈ సంవత్సరం మేము బాబును డే-కేర్ సెంటర్లో జాయిన్ చేద్దామనుకున్నాము. కానీ ఇక్కడ యు.ఎస్.ఏలో మూడు సంవత్సరాలు పైబడిన పిల్లలకి ప్రాథమిక విషయాలలో శిక్షణ ఇవ్వకపోతే చాలా డే-కేర్‌ సెంటర్లలో, ప్రీస్కూల్స్‌లో పిల్లల్ని అడ్మిట్ చేసుకోరు. మేము డే-కేర్ సెంటర్లో చేర్చుకోవడానికి అవసరమైన ఆ ప్రాథమిక శిక్షణను మా బాబుకి ఇవ్వలేదు. అందువల్ల ఈ సమస్యను ఎలా అధిగమిస్తామోనని భయపడ్డాను. కానీ బాబా దయవల్ల ఒక ప్రీ స్కూల్లో బాబుకి అడ్మిషన్ దొరికింది. కానీ అది శాశ్వత పరిష్కారం కాదని నేను రోజూ ఆలోచిస్తూ బాబా మీద భారం వేశాను. బాబుకి నాలుగేళ్లు రాగానే సెప్టెంబర్ నెల ఆరంభంలో నాకు ఒత్తిడి ఎక్కువై ఇక లాభంలేదని బాబాకి దణ్ణం పెట్టుకుని, "బాబా! మీ దయతో బాబుకి ప్రాథమిక విషయాలలో శిక్షణ ఇవ్వగలిగేలా నన్ను అనుగ్రహించండి" అని వేడుకొని, 21 రోజులు బాబుకి ఊదీ పెడదామని మొదలుపెట్టాను. ఇక బాబా చేసే అద్భుతాల గురించి మనకు తెలిసిందే. రెండు వారాల్లో బాబు శిక్షణ పొందాడు. అసలు ఇది మనుషుల వల్ల సాధ్యమయ్యే విషయం కాదు. ఎందుకంటే, అంత చిన్న బుర్రని ప్రేరేపించగల శక్తి ఆ సర్వసమర్థునికి మాత్రమే ఉంది. బాబా ఊదీ గురించి చెప్పాలంటే, అది నా తండ్రి ఆస్తి.


ప్రీస్కూల్ వాళ్ళు రోజూ 'బాబు సరిగా మాట్లాడట్లేద'ని ఫిర్యాదు చేస్తూండేవాళ్లు. డాక్టర్ దగ్గరకి చెకప్ కోసం బాబుని తీసుకుని వెళ్లడమంటే, 'అసలే సరిగ్గా మాట్లాడలేడు. మళ్ళీ ఏం చెప్తారో ఏమో' అని భయపడ్డాను. కానీ అనుకోకుండా ఒక గురువారం డాక్టరు దగ్గరకి వెళ్లడం, డాక్టర్, "అంతా బాగుంది" అని చెప్పడం జరిగిపోయాయి. నాకైతే బాబానే అలా చెప్పించారనిపించింది. అంతా ఆయన ఆశీర్వాదం.


చిన్నదో, పెద్దదో చాలాసార్లు నా మనసు విమర్శించటానికి ఆకర్షించబడుతోంది. కానీ, బాబా దయ ఏమిటంటే, తప్పుని మనకి గుర్తుచేసి, తమకి శరణువేడేలా చేస్తుంది. ఊరికే అన్నారా, 'ఎంతెంత దయ నీది ఓ సాయీ' అని. 'అసలు వ్రాయడమే చేతకానివారికి కూడా నీ(సాయి) స్ఫూర్తి రచనాధార ఆపకుండా సాగేలా చేస్తుంది' అన్న హేమాడ్‌పంత్ వచనం అక్షరసత్యం. సాయే నాలో ఉండి తమ లీలలను తామే ఈవిధంగా వ్రాయించుకున్నారని నా భావం. "కోటికోటి ప్రాణామాలు పరమాత్మా! మీ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే సాయితండ్రీ. ఎంతోమందికి వెలుగువి నువ్వు, అర్హతలేనివారికి అర్హతనిచ్చి జీవితాలను సరిదిద్దే కారుణ్యమూర్తివి. నీ నామం అమృతం. నీ కరుణ అనంతం. వేయేల, మా జీవితాలకు అర్థం, పరమార్థం నీవే. మా తప్పులని క్షమించి, సదా సన్మార్గంలో నడిచే స్ఫూర్తిని, ఆశీర్వాదాన్ని ఇవ్వండి దేవా!"


సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు!!!


అడిగిన వెంటనే కోరుకున్నట్లు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్న శ్రీసాయినాథుడు


నా పేరు సత్యనారాయణమూర్తి. సుమారు 2022, ఆగస్టు రెండో వారంలో ఉన్నట్టుండి నా భార్యకు 103 డిగ్రీల జ్వరం వచ్చింది. దాంతోపాటు వాంతులు, విరేచనాలు, ఒళ్ళునొప్పులు, తలనొప్పి, విపరీతమైన నీరసంతో నా భార్య చాలా బాధపడింది. ఆలస్యం చేయకుండా ఆ సాయంత్రం డాక్టరుని సంప్రదిస్తే, కరోనా టెస్ట్ చేయించమన్నారు. సరేనని టెస్టు చేయిస్తే, పాజిటివ్ వచ్చింది. వెంటనే శ్రీసాయినాథునికి దణ్ణం పెట్టుకుని, "కరోనా బారినుండి రక్షించమ"ని ప్రార్థించాము. మరునాడు మా బాబు స్కూల్ నుండి 102 డిగ్రీల జ్వరంతో ఇంటికి వచ్చాడు. తర్వాత నాకు కూడా జ్వరం, జలుబు మొదలయ్యాయి. ఇంట్లో అందరికీ కరోనా ఎఫెక్ట్ అయిందని, "బాబా! మీ దయతో మా అందరికీ ఈ కరోనా తొందరగా తగ్గాలి" అని శ్రీసాయినాథుని ప్రార్థించాం. బాబా దయవల్ల మరుసటిరోజుకు జ్వరం తగ్గి, పదిరోజులకు అందరం నార్మల్ అయ్యాము. ముఖ్యంగా భయంతో ఇప్పటివరకు కరోనా వ్యాక్సిన్ వేయించుకోని నా భార్య ఆ సాయినాథుని దయవల్లే ఏ రకమైన ఇబ్బందీ లేకుండా కరోనా నుండి బయటపడింది. కరోనా నుంచి మమ్మల్ని అందరినీ రక్షించిన శ్రీసాయినాథునికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. "ధన్యవాదాలు బాబా".


డబ్బు సర్దుబాటయ్యేలా సహాయం చేసిన బాబా


సాయిబంధువులందరికీ నా ప్రాణామాలు. నా పేరు శ్రీదేవి. నాకు ఏ సమస్య వచ్చినా నేను 'బాబా ఉన్నార'నే ధైర్యంతో ఆయన నామస్మరణ చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటాను. మా అన్నయ్యవాళ్ళు బ్యాంకులో బంగారం పెట్టి డబ్బు తీసుకున్నారు. అయితే ఈమధ్య గడువు సమయానికి వడ్డీ కట్టలేకపోయారు. దాంతో గడువు దాటిన తరువాత బ్యాంకువాళ్ళు బంగారం వేలం వేస్తామని రెండు రోజులు గడువిచ్చారు. కానీ కొంచెం పెద్ద మొత్తం కావడం వల్ల ఎంత ప్రయత్నించినా అన్నయ్యకి డబ్బు సర్దుబాటు చేయడం కష్టమైంది. అప్పుడు నేను బాబాకి దణ్ణం పెట్టుకుని, "బాబా! అన్నయ్యకు డబ్బులు సర్దుబాటు అయి బ్యాంకులో కట్టగలిగేలా సహాయం చేయండి" అని చెప్పుకున్నాను. బాబా దయవల్ల అన్నయ్యకి డబ్బు సర్దుబాటై బ్యాంకులో వడ్డీ కట్టగలిగాడు. "ధన్యవాదాలు బాబా".


5 comments:

  1. Om Sairam 🙏🏻💐🙏🏻

    ReplyDelete
  2. Chala thanks Sai !! Leelani chala Shrama thesukuni translate chesi publish chesinadhuku!! 🙏🏻 Mana baba Krupa eppudu meeku inkaa sakthi ni ivvalani korukuntunnanu. Jai Sairam 🙏🏻

    ReplyDelete
  3. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  4. Om sairam
    Sai always be with me

    ReplyDelete
  5. Jaisairam bless supraja for her neck pain and shoulder pain and help her to get better Jaisairam 🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo