1. ఒక్క నెలరోజుల్లో పొందిన బాబా అనుగ్రహం
2. బాబా దయ
ఒక్క నెలరోజుల్లో పొందిన బాబా అనుగ్రహం
అందరి బంధువు బాబాకు, సాటి సాయిబంధువులకు, ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. నేను ఒక సాయిభక్తురాలిని. బాబా మా జీవితంలోకి వచ్చి ఐదు, ఆరు నెలలు అయింది. నేను ఇంతకుముందు కొన్ని అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు నెలరోజుల వ్యవధిలో బాబా మాకు ప్రసాదించిన మరికొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను. ఈమధ్య మా పాపకు స్కూల్లో స్క్రీనింగ్ టెస్ట్ పెట్టారు. అందులో వచ్చిన ర్యాంకుల ఆధారంగా సెక్షన్లు డివైడ్ చేస్తారు. మా పాప బాగానే చదువుతుంది. తనకి సెకండ్ ర్యాంకు రావడంతో జీ1 సెక్షన్ వచ్చింది. కానీ తన బెస్ట్‌ఫ్రెండ్‌కి 33వ ర్యాంకు వచ్చినందువల్ల మా పాపకి అస్సలు సంతోషం లేదు. ఎందుకంటే, జీ1 సెక్షనులో ముప్పైమందిని మాత్రమే వేసినట్లయితే తన ఫ్రెండ్‌ని ఆ సెక్షనులో వేసే అవకాశం రాదు. అందువల్ల మా పాప, "బాబా! నా ఫ్రెండ్ కూడా నాతోపాటు నా సెక్షనులోనే ఉండాలి" అని బాబాను అడిగింది. బాబా దయవల్ల తన ఫ్రెండ్‌ని జీ1 సెక్షన్‌లోనే వేశారు. మా పాప చాలా సంతోషించింది. "మీ మనవరాలిని సంతోషపెట్టినందుకు థాంక్యూ బాబా". తరువాత నేను, మా పాప ఒక పని విషయంలో 'ఐదురోజులు ఎలా గడపాలా' అని చాలా టెన్షన్ పడ్డాము. కానీ బాబా దయవల్ల ఆ ఐదురోజులు చాలా తేలిగ్గా గడిచిపోయాయి. మా అమ్మ చేయినొప్పి కూడా బాబా దయవల్ల తగ్గింది. ఇకపోతే, కొన్నిరోజులుగా నా జుట్టు బాగా రాలిపోతూ ఉంటే, "బాబా! జుట్టు రాలటం తగ్గాలి" అని అనుకున్నాను. అది కూడా బాబా దయవల్ల తగ్గిపోయింది.
ఇంకోసారి మా పాప అనారోగ్యం పాలైతే, నేను తన ఆరోగ్యం గురించి చాలా టెన్షన్ పడి, "బాబా! హాస్పిటల్‍కి వెళ్ళకుండా పాపకి నయం కావాలి" అని బాబాను వేడుకున్నాను. కానీ భయంతో పాపని హాస్పిటల్‍కి తీసుకెళ్ళాను. డాక్టరు 'మూడు నెలలపాటు పవర్‌ఫుల్ మందులు నిరంతరాయంగా వాడాలి' అన్నారు. నాకు ఆ క్షణంలో 'అంత పవర్‌ఫుల్ మందులు పాపకు ఎలా వేయాలా' అని అనిపించి మందులు తీసుకోకుండానే వెనక్కి వచ్చేశాను. బాబా దయవల్ల రెండు రోజుల తర్వాత పాప ఆరోగ్యం నార్మల్ అయింది. బాబాను అడిగిన నేను సహనంతో వేచిచూడాల్సింది. కానీ మనం మామూలు మనుషులం, టెన్షన్ పడటం సహజం. అయినా బాబా మన తప్పులు ఎంచక మనకు మంచే చేస్తారు. "లవ్ యు బాబా".
ఆ తర్వాత మా బాబు శరీరమంతా ఇన్ఫెక్షన్ వస్తే, "బ్లాగులో పంచుకుంటాను" అని అనుకోగానే బాబుకి తగ్గింది. మరొకరోజు మా బాబు మోకాలికి చాలా గట్టి దెబ్బ తగిలింది. బాబు నాతో, "అమ్మా! కొద్దిగా ఊదీ రాసి, ఈ దెబ్బ తగ్గిపోగానే బ్లాగులో పంచుకుందాం" అని అన్నాడు. బాబా దయవల్ల ఒక్క వారంలో ఆ దెబ్బ తగ్గిపోయింది. "చిన్నబాబుకు కూడా మీ మీద నమ్మకం కలిగించావు బాబా. చాలా సంతోషంగా ఉంది బాబా. మమ్మల్ని ఇలాగే సదా కాపాడండి బాబా. థాంక్యూ సో మచ్ బాబా".
మేము దత్తభక్తులం. ఈమధ్య ఒకరోజు దత్తపీఠంలో 'అనఘాష్టమివ్రతం' చేస్తారని తెలిసి వెళ్ళాలనుకున్నాము. పాప కూడా మరుసటిరోజు పూజకి వస్తాను అంది. కానీ ముందురోజు అర్థరాత్రి పాపకు జలుబు, తీవ్రంగా, జ్వరం వచ్చాయి. ఆ స్థితిలో వెళ్లాలా, వద్దా అనుకున్నాము. చివరికి, "బాబా! మేము పూజకు ఆలస్యం కాకూడదు. పూజ బాగా జరగాలి" అని అనుకున్నాను. బాబా దయవల్ల మేము వెళ్ళిన తర్వాతే పూజ మొదలై చాలా బాగా జరిగింది. మా పాపకి జలుబు, జ్వరం తగ్గాలని మ్రొక్కుకోగానే తగ్గిపోయాయి. "చాలా కృతజ్ఞతలు సాయీ".
ఒకరోజు రాత్రి నా భర్త మెట్ల మీద నుంచి పడిపోయారు. ఆయన ఎడమచేయి మణికట్టు దగ్గర వాపు వచ్చింది. నేను ఎక్స్-రే తీయిద్దామంటే, "నొప్పి తక్కువగానే ఉంది. రేపు చూద్దాం" అన్నారు మావారు. నేను భయపడతానని నొప్పి ఉన్నా లేదని చెప్తున్నారనుకున్నాను. నాకు టెన్షన్‌గా అనిపించి, "బాబా! మావారి చేతికి ఫ్రాక్చర్ ఏమీ ఉండకూడదు" అని బాబాను వేడుకుని, మావారి చేతికి ఊదీ రాశాను. మరుసటిరోజు మూడు డయాగ్నస్టిక్ సెంటర్లకి వెళితే వాళ్ళు 'డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎక్స్-రే తీయము' అన్నారు. నా టెన్షన్ మరింత పెరిగిపోయింది. చివరిగా ఒక డయాగ్నస్టిక్ సెంటరులో అడుగుదామని వెళ్ళాము. వెళుతూనే ఎదురుగా బాబా ఫోటో దర్శనమిచ్చింది. దాంతో 'మావారి చేతికి ఏమీ కాదులే' అని ధైర్యం వచ్చింది. వాళ్ళు ఎక్స్-రే తీసి, "ప్రాబ్లం ఏమీ లేదు" అని చెప్పారు. సంతోషంతో నేను బాబాకు వేలవేల నమస్కారాలు చెప్పాను.
ఒకరోజు మా పాప స్కూల్లో తన మాథ్స్ నోట్‌బుక్ మర్చిపోయింది. మరుసటిరోజు తనకి మాథ్స్ పరీక్ష ఉంది. అయితే అప్పటికే తను చదివేసినందువల్ల సమస్య లేదు. కానీ ఆ నోట్స్ దొరక్కపోతే, తను మూడు నెలల నోట్స్ అంతా వ్రాసుకోవాలి. అందువల్ల తను చాలా టెన్షన్ పడి, "ఎలాగైనా బుక్ దొరికేలా చూడమ"ని బాబాను వేడుకుంది. మరుసటిరోజు తను స్కూలుకి వెళ్లి దాదాపు తన క్లాసులో అందరినీ తన మాథ్స్ నోట్‌బుక్ గురించి అడిగింది. అందరూ 'తాము తీయలేద'ని అన్నారు. అయినా నమ్మకంతో సాయంత్రం నాలుగు గంటల వరకు తను వేచి చూసింది. ఇక అప్పుడు తనకి బాగా ఏడుపొచ్చింది. చాలా బాధతో, "ఎందుకు బాబా నాకు బుక్ దొరకట్లేదు? ఇప్పుడు నేను ఆ నోట్స్ అంతా ఎలా వ్రాయాలి? నాకు చేయినొప్పి చాలా ఎక్కువగా వస్తుంది(పాప ఎడమచేయి వాటం. తనకి వర్క్ ఎక్కువగా ఉంటే చేయినొప్పి వస్తుంది). నన్ను ఎందుకు బాధపెడుతున్నావు?" అని బాబాను కాస్త కోపంగా అడిగింది. తరువాత స్కూలు వదిలే సమయానికి ఒక ఫ్రెండ్ మా పాపతో, "మార్నింగ్ రాగానే ఇద్దామనుకున్నాను కానీ, మర్చిపోయాను. ఇదిగో తీసుకో" అని తన నోట్‌బుక్ తనకి ఇచ్చింది. పాప సంతోషంగా ఆ నోట్‌బుక్ తీసుకుని, "కోపంగా మాట్లాడినందుకు క్షమించు బాబా" అని బాబాకి క్షమాపణ చెప్పింది. తరువాత తను నన్ను, "మార్నింగ్ నుంచి ఈ బుక్ ఎందుకు దొరకలేదమ్మా?" అని అడిగింది. నేను, "బాబా నీకు సహనం నేర్పారు. అలాగే, నీ వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నీకు తెలిసేలా చేశారు" అని చెప్పాను. పాప చక్కగా అర్థం చేసుకుంది. మా నాన్నగారు నా చిన్నప్పుడే చనిపోయారు. మా మామగారు కూడా ఈమధ్యనే చనిపోయారు. నేను బాబానే నా తండ్రి అనుకుంటాను. మా పిల్లలతో, "బాబానే మీ తాతగారు. ఆయన్ని మీరు ఏదైనా అడగొచ్చు" అని చెప్తాను. కాబట్టి పాప బాబా మీద అంత నమ్మకంగా ఉంది. "చిన్నపాపకు మీ మీద నమ్మకం కలిగించినందుకు చాలా చాలా ధన్యవాదాలు సాయిదేవా".
ఒక గురువారం సాయంత్రం స్వీట్స్ పంచుదామని మేము గుడికి వెళ్ళాము. అక్కడ పూజారి, "స్వీట్లు పంపిణీ చేశాక ఒకసారి వచ్చి కలవండి" అని అన్నారు. అయితే మా స్వీట్ల పంపిణీ పూర్తయ్యాక చూస్తే, పూజారి కనపడలేదు. బయట వర్షం వచ్చేలా ఉండటంతో మేము పూజారి కోసం చూడకుండా బయలుదేరిపోయాము. నేను, మా పాప కారులో, మావారు, బాబు బైక్ మీద గుడి నుంచి రెండు మూడు నిమిషాల దూరం వెళ్ళాక వర్షం మొదలైంది. కుండపోత వర్షానికి రోడ్లు బ్లాక్ అయ్యాయి. ఎలాగో నేను, పాప ఇంటిముందు వరకు చేరుకున్నప్పటికీ 30 నిమిషాల వరకు ఇంట్లోకి వెళ్లలేకపోయాము. బైక్ మీద వస్తున్న మావారు, బాబు వర్షానికి ఎక్కడో ఒక షాప్ దగ్గర ఆగారు. నేను టెన్షన్‌తో, "బాబా! వర్షం తగ్గి మావారు, బాబు క్షేమంగా ఇంటికి చేరుకోవాలి. అలా జరిగితే, మీ కృపను బ్లాగులో పంచుకుంటాన"ని మొక్కుకున్నాను. మా పాప నిశ్చింతగా, "బాబా ఉన్నారు. నువ్వు టెన్షన్ పడకు" అని చెప్తూనే ఉన్నా నేను కుదురుగా ఉండలేకపోయాను. 30 నిమిషాల తర్వాత వర్షం తగ్గింది. మావారు, బాబు క్షేమంగా ఇంటికి వచ్చారు. అప్పుడు నాకు పూజారి స్వీట్ల పంపిణీ అయిన తర్వాత తనని కలవమని చెప్పిన విషయం గుర్తొచ్చి, 'మేము కాసేపు ఆయనకోసం వేచివుంటే గుడిలో ఉండగానే వర్షం మొదలయ్యేది. మేము నలుగురం గుడిలోనే ఉండేవాళ్ళం. నాకు టెన్షన్ తప్పేది' అనిపించింది. ఈ అనుభవం ద్వారా బాబా ఎప్పుడూ మనల్ని కనిపెట్టుకుంటూ ఉంటారని, వారి సంకేతాలను అవగాహన చేసుకోవాలని నాకు అర్థమైంది. "థాంక్యూ బాబా. లవ్ యు బాబా".
మా ఇంటి వెనక ఖాళీ స్థలం ఉంది. ఒకరోజు అటువైపు నుండి ప్రహరీగోడ గుండా మా ఇంటిలోకి, పక్కింటిలోకి ఏవో పురుగులు చాలా ఎక్కువగా రావడం మొదలైంది. వాటివల్ల చాలా ఇబ్బంది అయి అవి వెళ్లిపోవడానికి ఏదైనా చేయాలి అనుకున్నారు. నేను, "బాబా! వాటిని ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోయేలా చేసి వాటి ప్రాణాలకు హాని జరగకుండా చూడండి" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవల్ల సాయంత్రానికల్లా అవి చాలావరకు వెళ్లిపోయాయి. ఎవరి వల్లా వాటికి ఏ హానీ జరగలేదు. "అన్ని ప్రాణులను రక్షించేది నువ్వే కదా దేవా. ఎప్పుడూ ఇలాగే అందరినీ అనుక్షణం కాపాడండి బాబా. థాంక్యూ సో మచ్ బాబా. కోటికోటి నమస్కారాలు చెప్పడం తప్ప మీకు ఏమి ఇవ్వగలం తండ్రీ? ఏవైనా తప్పులు ఉన్నా, ఏవైనా అనుభవాలు పంచుకోవడం మర్చిపోయినా మన్నించండి బాబా". చివరిగా, ఒక నెలరోజుల్లో జరిగిన ఇన్ని అనుభవాలను ఓపికగా చదివినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.
బాబా దయ
సాయిబంధువులందరికీ నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని. బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటాను. నేనొక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నాను. నేను నా ఉద్యోగానికి సంబంధించి ఒక పరీక్ష వ్రాసి, పాస్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. అందువల్ల నేను, "బాబా! మీ దయతో నేను ఆ పరీక్ష పాస్ అయితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. ఆయన దయవల్ల నేను ఆ పరీక్షలో మంచి మార్కులతో పాస్ అయ్యాను. "థాంక్యూ బాబా".
కొన్నిరోజుల క్రితం మేము శిరిడీ వెళ్ళొచ్చాము. శిరిడీకి ప్రయాణమయ్యే ముందు నేను, "బాబా! ఎటువంటి ఆటంకాలు లేకుండా మేము మీ దర్శనం చేసుకుని తిరిగి వస్తే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. తరువాత మేము శిరిడీ చేరుకుని బాబా దర్శనం చేసుకున్నాక సమాధి మందిరంలో మా తాతయ్య తప్పిపోయారు. ఎంత వెతికినా ఆయన కనిపించలేదు. మేమంతా చాలా కంగారుపడి అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చాము. కానీ ప్రయోజనం లేకపోయింది. అప్పుడు నేను, "బాబా! తాతయ్య కనపడేలా చూడండి. మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని మొక్కుకుని తాతయ్యను మళ్ళీ మందిరం లోపల వెతుకుదామని క్యూలైన్‍లోకి వెళ్లాను. సరిగ్గా బాబా ముందుకు వెళ్లేసరికి మా నాన్నగారు నన్ను వెతుక్కుంటూ వచ్చి, "తాతయ్య కనిపించాడు" అని చెప్పారు. ఇలా కొన్ని అవాంతర సంఘటనలు ఎదురైనప్పటికీ బాబా దయవల్ల క్షేమంగా శిరిడీ యాత్ర పూర్తి చేసుకుని వచ్చాము. "ధన్యవాదాలు బాబా. ఇలాగే ఎప్పుడూ నన్ను, మీ సహాయం కోరిన అందరినీ అనుగ్రహించండి తండ్రి".
Om sairam 🙏
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Jaisairam bless supraja for her neck pain and shoulder pain and help her to get better Jaisairam 🙏
ReplyDeleteOm sairam
ReplyDeleteSai always be with me