శ్రీసాయి అనుగ్రహ లీలలు - పదమూడవ భాగం
సాయిబాబుగారు తమకు బాబా ప్రసాదించిన కొన్ని అనుభవాలు గతవారం పంచుకున్నారు. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నారు.
మాకు తెలిసిన కొంతమంది బాబా భక్తుల అనుభవాలు: ఒక అతనికి నలుగురు ఆడపిల్లలు. ఆ పిల్లలు మా స్కూల్లో చదువుతుండేవాళ్లు. వాళ్ళు చదువుతోపాటు బాబాపట్ల భక్తి పెంచుకున్నారు. వాళ్ళ వల్ల కొన్ని సంవత్సరాలకు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా బాబా భక్తి అబ్బింది. అతనికి పొలంగానీ, ఇల్లుగానీ లేవు. ఒక పొలం కౌలుకు తీసుకుని కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషించుకుంటుండేవాడు. ఒకరోజు ఆ పొలంలో చిన్న బాబా ఫోటో అతనికి కనిపించింది. అతను ఆ ఫోటోను అక్కడే ఉన్న ఒక పెద్ద చెట్టుకు తగిలించి తరచూ బాబాకి నమస్కరించుకుంటుండేవాడు. బాబా దయవలన తన పొలంలో వేసిన వరి అధిక దిగుబడినిచ్చింది, మంచి ధర కూడా పలికింది. అతను ఆ పంటని అమ్మి మొదట తన చేతికొచ్చిన డబ్బుతో ఒక పెద్ద పూలదండ కొని గుడికి వెళ్ళి బాబాకి సమర్పించాడు. ఒకరోజు అతను ఆటోలో వెళ్తుంటే, పక్కన కూర్చున్న వాళ్ళు, "మంగళగిరి ప్రక్క గ్రామంలో ఒక సాయిబాబా గుడి ఉంది. అక్కడ బాబా ముందు నిలబడి మనస్ఫూర్తిగా, నమ్మకంతో ప్రార్ధిస్తే, తప్పక నెరవేరుతుంది" అని మాట్లాడుకున్నారు. ఆ మాటలు విన్న ఇతను ఆ బాబా గుడికి వెళ్లి, "బాబా! నాకు నలుగురూ ఆడపిల్లలే. వంశం నిలబడాలి, ఒక్క మగబిడ్డను ప్రసాదించు" అని వేడుకున్నాడు. మరుసటిరోజు అతను నా దగ్గరకు వచ్చి జరిగిందంతా చెప్పి, “బాబా గురించి నాకేమీ తెలియదు. ఆయన్ని ఎలా పూజిస్తే, నా కోరిక నెరవేరుతుంది" అని అడిగాడు. నేను అతనితో, “ఏదైనా బాబాకి మ్రొక్కుకో, ఆ మ్రొక్కు గురించి ఎవరికీ చెప్పొద్దు. రోజూ బాబాని దర్శించుకో. ఎల్లప్పుడూ బాబా నామం స్మరించు. ఇంట్లో ఉదయం, సాయంత్రం దీపారాధన చేసి, నైవేద్యం పెట్టి, హారతి ఇవ్వు. ముఖ్యంగా నీకు ప్రీతికరమైన ఆహార పదార్థం నీ కోరిక తీరేంతవరకూ 'తినను' అని సంకల్పించుకుని ఆయన మీద శ్రద్ధ, నమ్మకం ఉంచు” అని చెప్పాను. అతను అన్నీ పాటిస్తానని చెప్పాడు. కొంతకాలానికి అతని భార్య గర్భవతి అయింది. హాస్పిటల్లో తెలిసిన నర్సు స్కానింగ్ తీసి వీళ్ళను బాగా తిట్టింది. ఆమె ప్రవర్తనను బట్టి, 'ఈసారి కూడా ఆడపిల్లేనేమో! ఆ విషయం బయటికి చెప్పకూడదు కాబట్టి, మనల్ని ఇలా తిడుతోంద'ని అతనికి అనిపించింది. తరువాత ఆ భార్యాభర్తలు భయంతో నా వద్దకు వచ్చారు. నేను వాళ్లతో, "బాబాపై దృఢ విశ్వాసముంచి నేను ఇదివరకు చెప్పినట్లుగానే పూజ చేస్తుండు” అని చెప్పాను. అతను అలాగే చేసాడు. బాబా దయవల్ల తొమ్మిది నెలల తర్వాత ఆ దంపతులకి మగబిడ్డ పుట్టాడు. అతని ఇంట్లో ఎవరూ నమ్మలేకపోయారు. అదే బాబా లీల. అతను నా వద్దకు వచ్చి ఆనందంగా మగపిల్లవాడు పుట్టాడని, మ్రొక్కు తీర్చుకోవాలని అన్నాడు. ఇంతకీ అతని మ్రొక్కు ఏమిటంటే, 'మగపిల్లవాడు పుడితే, ఆరునెలలపాటు బిడ్డ ముఖం చూడకుండా శిరిడీ వెళ్లి పిల్లవాడికి అన్నప్రాసన చేయించి, అప్పుడు పిల్లవాడి ముఖం చూస్తాన'ని. అతను ఆ కఠిన నియమానికి కట్టుబడి అలాగే చేసాడు కూడా. తరువాత బాబా దయవల్ల అతనికి ఒక చిన్న ఇల్లు కూడా అమరింది. బాబా అనుగ్రహంతో ఏదైనా సుసాధ్యమే.
అప్పట్లో ఏడవ తరగతి పరీక్షలు పాసైతేనే ఎనిమిదో తరగతికి పంపేవాళ్ళు. పాసవ్వకపోతే ఏడో తరగతిలోనే ఉండాలి. ఏడవ తరగతి చదువుతున్న ఒకబ్బాయి తండ్రి మా దగ్గరకు వచ్చి, “పరీక్షలకు నెల రోజులు మాత్రమే ఉన్నాయి. మా అబ్బాయి సరిగ్గా చదవలేదు. మీరు ట్యూషన్ చెప్పండి. సంవత్సరం మొత్తానికి ఎంత ఫీజు తీసుకుంటారో ఈ నెల రోజులకు అంత ఇస్తాను" అని అన్నాడు. మేము బాబాని అడిగితే, “ట్యూషన్ చెప్పమ"ని వచ్చింది. దాంతో మేము ఆ అబ్బాయికి ట్యూషన్ చెప్పడానికి ఒప్పుకుని, “ఒకవేళ మీ అబ్బాయి ఫెయిల్ అయితే మీరిచ్చిన ఫీజు వాపసు ఇస్తామ"ని చెప్పాము. ఆ అబ్బాయి పరీక్షలు వ్రాసి, మంచి మార్కులతో పాసయ్యాడు. బాబా పరీక్షలు వ్రాయిస్తే నెల రోజులేంటి, కేవలం వారం రోజులే చదివినా పాసవుతారు.
ఒక పాఠశాలలో జరిగే వ్యాసరచన పోటీలో భాగంగా 'గురువు యొక్క విశిష్టత' గురించి వ్రాయమన్నారు. ఎనిమిదవ తరగతి చదువుతున్న ఒక అమ్మాయికి ఎందుకో, 'గురువులకు గురువు, సద్గురువు అయిన బాబా గురించి వ్రాయాలనిపించి, బాబా గురించి తెలుసుకోవడానికి బాబా మందిరానికి వెళ్ళింది. అక్కడున్న పూజారి, ఆ అమ్మాయిని బాబా గురించి తెలుసుకోవడానికి నా దగ్గరకు పంపించారు. నేను నాకు తెలిసిన సాయితత్వం గురించి వివరంగా ఆ అమ్మాయికి చెప్పి, "వ్యాసం వ్రాసే ముందు బాబాని తలచుకుని మొదలుపెట్టమ"ని కూడా చెప్పాను. ఆ అమ్మాయి అలాగే చేసింది. కొన్నిరోజుల తర్వాత వచ్చి, "నేను బాబా గురించి వ్రాసిన వ్యాసానికి నాకు మొదటి బహుమతి వచ్చింద"ని చాలా సంతోషంగా చెప్పింది. అది విని నాకు కూడా సంతోషం కలిగింది. ఆశ్చర్యమేమిటంటే, ఆ అమ్మాయి ఒక క్రిస్టియన్.
మా దగ్గర సాయితత్వం నేర్చుకున్న ఒక విద్యార్థి ఇప్పుడు పెద్దవాడై, వాళ్ళ పెదనాన్న చేసే వ్యాపారంలో సహాయకారిగా ఉంటున్నాడు. అతని పేరు సాయికుమార్. ఒకసారి అతను వ్యాపారానికి సంబంధించి డబ్బుల వసూలు కోసం నిజామాబాద్ వెళ్ళాడు. పైకం వసూలు చేసుకునేసరికి రాత్రి అయింది. చాలా ఒత్తిడికి గురై ఉన్నాడు. బస్టాండుకి వెళితే మా ఊరు వెళ్లే బస్సులు రెండే ఉన్నాయి. రాత్రి సమయం, చేతిలో డబ్బుల సంచితో ఒంటరిగా దూరప్రయాణం చేయాల్సి ఉన్నందున అతను బాబాను ప్రార్ధించాడు. అంతలో ఒక బస్సు వచ్చింది. కానీ బాగా రద్దీగా ఉంది. అతనికి ఏం చేయాలో అర్ధంగాక, ఒక నిమిషం తర్వాత బాబాను తలుచుకుని డ్రైవర్ కిటికీ వద్దకు వెళ్ళి, “ఎలాగైనా బస్సులో ఎక్కించుకొమ్మ"ని అడిగాడు. ఆ డ్రైవర్ అతనికి తన వెనుక సీటులో చోటిచ్చాడు. బాబా దయవల్ల అతను సుఖంగా ప్రయాణం చేసి గమ్యం చేరుకున్నాడు. సహాయం చేసిందెవరు? డ్రైవరా? లేక బాబా? మీరే గుర్తించండి. డ్రైవర్ రూపంలో సాయపడిన బాబాకి కృతజ్ఞతలు.
ఒకప్పటి మా విద్యార్థి పెద్దవాడై ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం చేసుకుంటుండేవాడు. తన పేరు గోపాలకృష్ణ. తను హైదరాబాదులో ఉద్యోగం చేస్తుండగా బెంగుళూరులో మంచి ఉద్యోగావకాశాలు ఉన్నాయని తెలిసి అతను, అతని స్నేహితులు ముగ్గురు అప్లై చేశారు. అందరికీ ఇంటర్వ్యూ లెటర్స్ వచ్చాయి. బెంగుళూరు వెళ్లడానికి టికెట్లు రిజర్వు చేయించుకున్నారు. తరువాత వాళ్లంతా ప్రయాణమవ్వాల్సిన రోజు ఉదయం గోపాలకృష్ణ బెంగుళూరులో ఉన్న మా అమ్మాయికి, అల్లుడికి ఫోన్ చేసి, ఇంటర్వ్యూ సంగతి చెప్పి, బాబాని సలహా అడగమని చెప్పాడు. వాళ్ళు బాబాను అడిగితే, “ఇంటర్వ్యూ కి రావద్దు” అనే సమాధానం వచ్చింది. అదే విషయం వాళ్ళు గోపాలకృష్ణతో చెప్పారు. అతను చిన్నప్పటి నుండి బాబా భక్తుడైనందున బాబా నిర్ణయంపై నమ్మకంతో “మీరు వెళ్ళండి, నేను బెంగుళూరు రావడం లేదు” అని తన స్నేహితులతో చెప్పాడు. వాళ్ళు, “మంచి అవకాశం, వదులుకోవద్దు" అని అన్నా, అతను తన నిర్ణయం మార్చుకోలేదు. దాంతో మిగిలినవాళ్ళు బస్సులో బెంగుళూరుకు బయల్దేరారు. బస్సు హైదరాబాదు సిటీ దాటిన తర్వాత ఆ ముగ్గురిలో ఒకతను, "గోపాలకృష్ణ కారణం లేకుండా ఆగిపోడు. ఎందుకైనా మంచిది, నేను కూడా వెళ్ళను” అని అనుకోని మిగిలిన ఇద్దరితో, "నేను రాను. మీరు వెళ్ళండి" అని బస్సు దిగిపోయాడు. ఆ ఇద్దరు బెంగుళూరు వెళ్లి, హోటల్లో రూమ్ తీసుకుని, ఫ్రెష్ అయి, ఇంటర్య్యూకని ఆఫీసుకు వెళ్లారు. వాళ్ళు సాయంత్రం వరకూ వేచి ఉన్నాక, లోపలికి పిలిచారు. తీరా వెళ్తే లోపల, “టెలీకాలర్స్ జాబ్, జీతం తక్కువ" అని చెప్పారు. వీళ్లకి కోపమొచ్చి, “మేము ఇంటర్య్యూకి వచ్చిన జాబ్ వేరే కదా!" అని అడిగితే, “అవి ఖాళీ లేవు" అని చెప్పారు. వాళ్ళిక చేసేదిలేక నిరాశతో తిరుగు ప్రయాణమయ్యారు. వాళ్ళకి బస్సు చార్జీలు, రూమ్ అద్దె, సమయం వృధా అయ్యాయి. బాబా తమ భక్తుడైన గోపాలకృష్ణను వాటి నుండి తప్పించారు. ఆయన సమాధానానికి విలువ ఇచ్చి, అతను హైదరాబాదులోనే ఆగిపోవడం మంచిదైంది. విషయం తెలుసుకున్న అతని స్నేహితులు గోపాలకృష్ణకు బాబా మీద ఉన్న నమ్మకం చూసి వాళ్ళు కూడా బాబా భక్తులయ్యారు. మీరడగవచ్చు, "విషయం చెప్పి ముందే స్నేహితులను కూడా బెంగుళూరు వెళ్ళకుండా ఆపొచ్చు కదా!" అని. కానీ అనుభవమయ్యాక చెపితే, బాబా లీలలు నమ్మి ఆచరిస్తారు గాని, ముందే చెబితే ఎవరూ నమ్మరు కదా!
తరువాత గోపాలకృష్ణకి వివాహం నిశ్చయమైంది. అయితే వివాహానికి ముందే ఒక సొంతిల్లు ఏర్పరుచుకోవాలని అతని ఆలోచన. కానీ చేతిలో డబ్బు చాలా చాలా తక్కువగా ఉంది. ఒకరోజు అతను నా దగ్గరకు వచ్చి విషయం చెప్పాడు. అప్పుడు నేను అతనితో, “నువ్వు బాబా మందిరానికి వెళ్ళి, ఆయన ముందు నిల్చుని, నీ సమస్య చెప్పుకో. ఆయన నీ సమస్యకు పరిష్కారం తప్పకుండా చూపిస్తారు" అని చెప్పాను. మరుసటిరోజు అతను నేను చెప్పినట్లే చేసి, గుడి నుండి తన స్నేహితుడిని డబ్బు అడుగుదామని వెళ్తున్నాడు. అంతలో అతని బంధువు నుండి అతనికి ఫోన్ వచ్చింది. అతను ఆ బంధువుతో మాట్లాడుతూ మాటల మధ్యలో తన సమస్య గురించి చెప్తే, "వెంటనే నా దగ్గరకు రా" అని అన్నాడు ఆ బంధువు. సరేనని గోపాలకృష్ణ వెళితే, ఆ బంధువు పెద్ద మొత్తంలో డబ్బు సర్దుబాటు చేశాడు. గోపాలకృష్ణ ఆశ్చర్యపోతూ బాబాకి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. అతను కోరుకున్నట్లే కొద్దిరోజుల్లో అతనికి ఒక మంచి ఇల్లు అమరి, ముందు అనుకున్న అమ్మాయితోనే నిశ్చితార్థం అయింది. ఆమె కూడా బాబా భక్తురాలే. వాళ్ళిద్దరూ నిశ్చితార్ధ ఫ్లెక్సీలో తమ ఫోటోలకు బదులు సింహాసనం మీద ఆశీనులై ఉన్న బాబా ఫోటోను వేయించి వారి భక్తిని చాటుకున్నారు. బాబానే ముందు తర్వాతే మనం.
మా మామయ్యగారు శివారాధకులు. ఆయన వయస్సు 70 సంవత్సరాలు. కొంచెం కోపం ఎక్కువ కానీ, మనసు మంచిదే. ఒకరోజు ఆయన మా ఇంటికి వచ్చి, ఒక ముఖ్యమైన పని గురించి చెప్పి, మమ్మల్ని చేయమన్నారు. మేము, "బాబాని అడిగి, బాబా చేయమంటే చేస్తాము” అని చెప్పాము. అందుకు ఆయనకు కోపం వచ్చి, “ప్రతిదానికి బాబానడిగి చేస్తామంటారేంటి? మీ ఒక్కరికే ఉన్నాడా బాబా?" అని దురుసుగా మాట్లాడి, కోపంగా వెళ్ళిపోయారు. మాకు బాధేసింది. అదేరోజు రాత్రి గుంటూరులో ఉన్న ఆయన కొడుకు ఇంట్లో దొంగలు పడి డబ్బు, బంగారం దోచుకుపోయారు. అప్పుడు ఆయన, 'ఉదయం బాబాని అలా అన్నందుకే రాత్రికి దొంగతనం జరిగి అన్నీ పోయాయని భావించి, "తప్పైంది క్షమించమ"ని బాబాని వేడుకుని, అప్పటినుండి బాబాని శ్రద్ధ, నిష్టలతో పూజించసాగారు. నాలుగైదుసార్లు శిరిడీ వెళ్ళొచ్చారు. బాబా కృపవలన పోయిన డబ్బు, బంగారం దొరికాయి.
ఏ విషయంలోనైనా సమాధానం కోసం బాబాను అడిగినప్పుడు, ఆయన చెప్పింది మనం పాటించి తీరాలి. అలా కాకుంటే మనం పాటించేలా ఆయనే చేస్తారు. ఒకసారి నా భార్య అమ్మమ్మకి కడుపునొప్పి వచ్చి తీవ్రంగా బాధపడింది. డాక్టరు స్కాన్ చేసి ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఆవిడకప్పుడు 94 సంవత్సరాలు. 'ఆ వయస్సులో ఆమె శరీరం తట్టుకుంటుందా?' అనే సందేహమొచ్చి బాబాను అడిగితే, ఆయన సమాధానం “ఆపరేషను అవసరంలేద”ని వచ్చింది. బాబా మాటపై నమ్మకంతో ఆమెను ఇంటికి తీసుకుని వెళ్ళారు. కానీ నాలుగు రోజుల తర్వాత ఆమె, "నేను నొప్పి భరించలేను. ఆపరేషన్ చేయించుకుంటాను" అంది. దాంతో ఆ ఇంట్లోవాళ్ళు ఆపరేషన్ చేయిద్దామని డబ్బు కట్టడానికి వరుసగా మూడు రోజులు హాస్పిటల్‍కి వెళ్లినప్పటికీ ఏదో ఒక కారణంతో కట్టలేకపోయారు. వాళ్ళకు ఏమి చేయాలో తోచక స్కాన్ రిపోర్టులు వేరే డాక్టరుకు చూపించారు. ఆయన, "ఆపరేషను అవసరం లేదు. మందులతో తగ్గిపోతుంద”ని మందులిచ్చారు. అప్పుడు మేము, 'మొదట చూపించిన డాక్టరు డబ్బుకోసం అలా చెప్పి ఉంటారు. అందుకే బాబా ఆపరేషన్ అవసరం లేదని చెప్పి, వారి ఆదేశానికి వ్యతిరేకంగా వాళ్ళు ఆపరేషన్ చేయించడానికి సిద్ధపడితే డబ్బులు కట్టనివ్వకుండా ఆపి, వేరే డాక్టరును సంప్రదించేలా చేసి, తమ ఆదేశాన్ని పాటించేలా చేయడమేకాకుండా డబ్బుల ఖర్చు కూడా లేకుండా చేశార'ని అనుకున్నాము. బాబా తమ భక్తులను ఏ విధంగానూ నష్టపోనివ్వరు. "ధన్యవాదాలు బాబా".
ఒకసారి నా భార్యకు చెల్లెలు వరసయ్యే ఒకామె కొంచెం కుటుంబ కష్టాల్లో ఉన్నప్పుడు నా భార్య ఆమెకు ధైర్యం చెప్పి, “బాబాను నమ్మి పూజించు. అంతా మేలు జరుగుతుంద”ని చెప్పింది. మరుసటిరోజు ఉదయం ఆమె పాల ప్యాకెట్టు కోసం షాపుకెళితే అక్కడ టేబుల్ మీద ఒక ఫోటో తిరగవేసి ఉందట. అది ఏమిటో చూద్దామని ఆమె ఆ ఫోటోని చేతిలోకి తీసుకుని తిప్పి చూస్తే, ఆ ఫొటోలో బాబా ఉన్నారు. “నన్ను నమ్మితే నీ ముందుంటాన”ని బాబా అలా తెలియజేసారు. ఆమె ఆశ్చర్యంతో వెంటనే నా భార్యకు ఫోన్ చేసి ఫోటో విషయం చెప్పి, “రాత్రే కదా బాబా గురించి చెప్పావు. ఉదయాన్నే బాబా దర్శనమిచ్చారు" అని చెప్పింది. అప్పటినుంచి ఆమె బాబాను నమ్మింది. ఎన్నో సంవత్సరాలుగా వీడని చిక్కుముడులన్నీ చాలా త్వరగా విడిపోయి ఈ రోజున తనకొక చక్కటి జీవితం ఏర్పడింది.
మా బంధువులలో ఒకామెకు ఒకనాటి రాత్రి అకస్మాతుగా గుండె నొప్పి వచ్చి, సహాయం కోసం ఎవరినైనా పిలిచే శక్తి లేక ఇబ్బంది పడింది. అయితే, అట్టి స్థితిలో కూడా ఆమె ఒకరిని పిలిచింది, అరిచింది. ఏమనంటే, 'బాబా బాబా' అని. తరువాత ఆమె కళ్ళు మూతలు పడుతున్న క్షణంలో ఆమెకు బాబా కనిపించి, “భయపడవద్దు. నీకేమి కాదు ఉదయం కల్లా సరి అవుతుంది. నేనున్నాను” అని అభయం ఇచ్చారు. ఆమె ఉదయం మామూలుగానే లేచి తన పనులు తాను చేసుకుంటుంటే ఆశ్చర్యంగా అనిపించి, “నాకేనా రాత్రి అలా అయింది” అని అనుకుంది. అప్పటినుండి ఆమె నిర్భయంగా ఉండసాగింది. కారణం 'బాబా పిలిస్తే పలుకుతార'ని. ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు. అతను చాలా బుద్ధిమంతుడు. చాలా అందంగా ఉంటాడు. అయినా ఎన్ని సంబంధాలు చూసినా అతనికి పెళ్లి కుదరలేదు. చాలా సంవత్సరాలు ప్రయత్నం చేసాక విషయం నాకు తెలిసి వాళ్లని బాబా పూజ చేయమన్నాను. అప్పుడు ఆమె నాతో, “మా అబ్బాయి పెళ్లి విషయంలో బాబా తొందరపడవద్దన్నారు. కాబట్టి ఆలస్యమైనా మంచి సంబంధం కుదురుతుంద"ని అంది. అక్షరాలా అలాగే జరిగింది.
నా భార్య స్నేహితురాలి కొడుకు బాగా తెలివైనవాడు. ఆ అబ్బాయి మంచి మార్కులతో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. కాలేజీ ఫంక్షనులో మెడల్ ఇచ్చారు. పై చదువులకోసం యు.ఎస్.లోని ఒక యూనివర్శిటీలో సీటు కూడా వచ్చింది. బ్యాంకు లోను కూడా శాంక్షన్ అయింది. కానీ హైదరాబాదులో ఒకసారి, చెన్నైలో ఒకసారి వీసాకోసం ప్రయత్నించినా వీసా రాలేదు. పోనీ కెనడా వెళ్ళాలనుకుంటే అప్పుడు కూడా వీసా రాలేదు. అలా ఒకటిన్నర సంవత్సరం గడిచింది. స్నేహితులందరూ పై చదువులకోసం విదేశాలకు వెళ్లిపోవడంతో ఈ అబ్బాయి బాధపడ్డాడు. తనని చూసి తల్లిదండ్రులు కూడా బాధపడసాగారు. ఈ విషయం ఆ అబ్బాయి తల్లి నా భార్యకి చెప్పి చాలా బాధపడింది. అప్పుడు మేము, “నిరాశపడవద్దు. మీరు అధైర్యపడితే అబ్బాయి కూడా అధైర్యపడతాడు. బాబా మీ అబ్బాయి మంచికే అలా చేసుంటారు” అని చెప్పి బాబాని వేడుకోమని సలహా ఇచ్చాము. మేము కూడా వాళ్ళకోసం బాబాని ప్రార్థించి ఆ అబ్బాయి పేరు, ఫోన్ నంబరు ఒక చిన్న తెల్ల కాగితం మీద వ్రాసి 'సచ్ఛరిత్ర' పుస్తకంలో ఉంచాము. వారం రోజుల తర్వాత బాబా నాకు తెలిపిన విషయమేమిటంటే, "త్వరలో ఆ అబ్బాయి చదువుకోసం ఆస్ట్రేలియా వెళతాడు" అని. వెంటనే మేము వాళ్ళకు ఈ విషయం చెప్పాము. కానీ వాళ్ళు నమ్మలేదు. పది రోజుల తర్వాత మేము అనుకోకుండా వాళ్ళింటికి వెళ్తే, ఆ అబ్బాయి హడావిడిగా లగేజ్ సర్దుకుంటూ కన్పించాడు. విషయం ఏమిటని అడిగితే, “ఆస్ట్రేలియాలో సీటు వచ్చింది. ఇప్పుడే బయలుదేరుతున్నాను” అని చెప్పాడు. అనుకోకుండా ఆస్ట్రేలియా యూనివర్శిటీలో సీటు రావడం, వీసా, ఫైటు టిక్కెట్టు, బ్యాంకు పనులు మొదలైనవన్నీ అంత త్వరితగతిన జరగటం బాబా దయేనని మేము ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకున్నాము. మనం మనకోసం కోరుకున్న కోరికల కంటే ఎదుటివారికోసం కోరిన కోరికలను భగవంతుడు త్వరగా నెరవేరుస్తాడు అనడానికి ఇది ఒక నిదర్శనం.
తరువాయి భాగం వచ్చేవారం...
ముందు భాగం కోసం బాబా పాదుకలు తాకండి. |
|
తరువాయి భాగం కోసం బాబా పాదాలు తాకండి.
|
Bless supraja for her neck pain and shoulder pain and foot pain and help her to get better Jaisairam
ReplyDeleteOm sai Ram 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
ReplyDeleteOm Sainathaya Namaha
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
All experiences are very nice to listen, please help us regarding my husband's health,and show me the correct path which treatment we have to take for recovery,and job security.please bless us to have healthy and happy life.
ReplyDelete