- అడిగిన ప్రతిసారీ కాపాడుతున్న బాబా
అందరికీ నమస్కారం! ముఖ్యంగా, ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికోసం ఇలాంటి ఒక వేదికని నెలకొల్పి బాబాని చేరుకోవటానికి ఒక మాధ్యమాన్ని కల్పించినందుకు ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా వందనాలు. నా పేరు మృణాళిని. నేను బాబా భక్తురాలిని. బాబా అడుగడుగునా నన్ను కాపాడుతున్నారు. అసలు నాకు ఉద్యోగం రావటమే నా జీవితంలో బాబా చేసిన గొప్ప అద్భుతం. ఉద్యోగం వచ్చిన తరువాత కూడా ప్రతి నిమిషం బాబా నాకు తోడుగా ఉండి సహాయం చేస్తూనే ఉన్నారు. నాకు ఏదైనా సమస్య వచ్చిన ప్రతిసారీ బాబాకు నమస్కారం చేసుకుని, “బాబా! నాకు మీరే దిక్కు, దయచేసి నాకు సహాయం చేయండి, నేను నా అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో షేర్ చేసుకుంటాను” అని చెప్పుకోగానే నాకు సహాయం చేస్తున్నారు బాబా. అసలు ఒక మ్యాజిక్ లాగా బాబా నన్ను ఆ సమస్య నుండి తప్పిస్తున్నారు. నేను ఇంతకుముందు నా అనుభవాలన్నీ ఈ బ్లాగ్ ద్వారా మీతో షేర్ చేసుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను షేర్ చేసుకుంటాను. “బాబా, కొంచెం ఆలస్యంగా నా అనుభవాలు షేర్ చేసుకుంటున్నందుకు నన్ను క్షమించండి”.
ఈమధ్య పిల్లలకు స్కూళ్ళు ప్రారంభమయ్యాయి. నాకు ఇద్దరు పిల్లలు. చిన్నవాడు 3వ తరగతి, పెద్దవాడు 7వ తరగతి చదువుతున్నారు. వాళ్లకు ఏ టీచర్ వస్తారో, వాళ్ళు ఏ గ్రూపులో ఉండాలో స్కూలువాళ్ళు నిర్ణయించేముందు నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! ప్లీజ్, మా పిల్లలకు మంచి టీచరుని, మంచి గ్రూపుని కేటాయించేలా చూడు” అని వేడుకున్నాను. మా పెద్దవాడికి వాడు కోరుకున్న గ్రూపునే స్కూలువాళ్ళు కేటాయించారు. కానీ, మా చిన్నవాడికి మాత్రం నేను ఏ టీచరైతే రాకుండా ఉంటే బాగుంటుందనుకున్నానో అదే టీచరుని కేటాయించారు. నేను, “ఎందుకు బాబా ఇలా అయింది?” అని అనుకుంటుంటే, ‘మా చిన్నవాడి బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ అదే క్లాసులో ఉన్నారు’ అని వాడి ఫ్రెండ్స్ పేరెంట్స్ నాకు మెసేజ్ పెట్టారు. నాకు చాలా సంతోషం అనిపించింది. అదే జరగకపోయివుంటే మా చిన్నవాడు చాలా బాధపడేవాడు. అప్పటికే స్కూలువాళ్ళు తనకి ఆ టీచరుని కేటాయించారని తను చాలా నిరాశగా ఉన్నాడు. తన ఫ్రెండ్స్ అందరూ తన గ్రూపులోనే ఉన్నారని తెలిసి ఇప్పుడు మా చిన్నవాడు ఎంతో సంతోషంగా ఉన్నాడు. అలా బాబా ఏది చేసినా మన మంచి కోసమే చేస్తారు.
ఇక, నా ఉద్యోగంలో బాబా ఎలా సహాయం చేశారో చెబుతాను. ఆఫీసులో నా టీంలో నా క్రింద పనిచేసే ఒక చైనీస్ అమ్మాయి నేను ఆ టీంలో చేరిన 10 రోజుల్లోనే డెలివరీకోసం సెలవుపై వెళ్ళింది. డెలివరీ అయిన తరువాత తను తిరిగి ఈమధ్యే ఆఫీసుకి రావడం మొదలుపెట్టింది. ఆ అమ్మాయి వచ్చినపుడు నేను చాలా మంచిగా రిసీవ్ చేసుకుని, "నీకు బేబీ ఉంది కదా, తక్కువ వర్క్ ఇవ్వటానికి ట్రై చేసి, మాగ్జిమమ్ నేను హ్యాండిల్ చేసుకుంటాను" అని మంచిగా చెప్పాను. అప్పుడు ఆ అమ్మాయి నాతో బాగానే మాట్లాడింది. కానీ నేను రావడానికంటే ముందునుండే తను ఆ టీంలో ఉన్నదనే కారణంగా(నా క్రింద పనిచేసే అమ్మాయి అయినప్పటికీ) నాపై అధికారం చెలాయించాలని చూసేది. నేను మంచిగా ఉండటాన్ని అలుసుగా తీసుకుని, నాకు తెలియకుండానే అన్నీ తనే టేకోవర్ చేసేది. అలా అని ఆ అమ్మాయిని ఏమైనా అని నెగిటివిటీ తెచ్చుకోవటం ఇష్టంలేక నేను చాలా ఓపికగా వ్యవహరిస్తుండేదాన్ని. తను దాన్ని ఇంకా అలుసుగా తీసుకుని ఇంకా ఎక్కువ అజమాయిషీ చేసేది. ‘తనని ఏమైనా అనటానికి ఒక్క నిమిషం చాలు. కానీ అన్న తరువాత మళ్లీ మనమే డీల్ చేయాలి, ఒకే టీంలో ఉంటాము కదా’ అని నేను తనని ఏమీ అనకుండా ఉండేదాన్ని. కానీ మనసంతా చాలా బాధగా ఉండేది. అప్పుడు నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా, ప్లీజ్! మీరే నాకు సహాయం చేయాలి. ఆ అమ్మాయి మంచిగా ఉండేలా చేసి, నాకు మనశ్శాంతి కలుగజేయండి. నా అనుభవాన్ని వెంటనే బ్లాగులో షేర్ చేసుకుంటాను” అని మొరపెట్టుకున్నాను. ఆ మరుసటిరోజునుండే బాబా దయవలన ఆ అమ్మాయి తన అతి ప్రవర్తనను తగ్గించటం మొదలుపెట్టింది. ఆ అమ్మాయిలో చాలా మార్పు వచ్చింది.
తరువాత ఒకసారి మా మేనేజర్ హఠాత్తుగా ఎందుకో నాతో అంతకుముందులా ఉండట్లేదని అనిపించింది. ఇన్ని రోజులు టీంలో మిగతావాళ్ళతో నా గురించి చాలా మంచిగా చెప్పే ఆమె, నేను రాకుంటే తామంతా ఏమయ్యేవాళ్ళమో అన్న ఆమె ఉన్నట్టుండి నాతో అలా ప్రవర్తిస్తుండేసరికి నాకు చాలా బాధగా అనిపించింది. నా జూనియర్ నాకంటే ముందునుండే ఆ టీంలో ఉండేది కాబట్టి మా మేనేజరుకి సన్నిహితంగా ఉండేది. ఆ అమ్మాయేమైనా నా గురించి మేనేజరుతో నెగటివ్‌గా చెప్పిందేమోనని నాకనిపించింది. ఒకరోజు నేను ఆఫీసుకు బయలుదేరేముందు బాబాకు నమస్కరించుకుని, “బాబా, దయచేసి నాకు సహాయం చేయండి. ఆమె(మా మేనేజర్) నాతో బాగా మాట్లాడేలా చూడండి బాబా. నేను అన్ని అనుభవాలనూ ఒకేసారి బ్లాగులో షేర్ చేసుకుంటాను” అని వేడుకుని ఆఫీసుకి వెళ్ళాను. అంతకుముందు నా క్యూబ్ (నేను పనిచేసే చోటు) దాటి వెళ్ళేటప్పుడు ఆగి నాతో బాగా మాట్లాడే ఆమె, ఆరోజు నాకు కేవలం ‘గుడ్ మార్నింగ్’ చెప్పి వెళ్ళిపోయింది. తరువాత నా ప్రక్కనుండి వెళ్తూ కూడా నన్ను చూడనట్లుగా వెళ్లిపోతుంటే నాకు చాలా బాధ అనిపించింది. నేను మావారికి కాల్ చేసి, “ఉదయం నుండి సీట్ నుండి కదలకుండా వర్క్ చేస్తూ ఆ జూనియర్‌కి వర్క్ నేర్పిస్తున్నాను. అయినప్పటికీ మా మేనేజర్ ఇలా ప్రవర్తిస్తోంది. నాకు చాలా చిరాకుగా ఉంది” అని చెప్పి ఫోన్ పెట్టేశాను. తరువాత, ప్రతిసారీ ఆఫీసుకి వెళ్ళేటపుడు నాతోపాటు తీసుకుని వెళ్లే ‘శ్రీసాయిలీలామృతం’ పుస్తకం తీసి, ఆ పుస్తకం పైన ఉన్న బాబాని చూస్తూ, “బాబా, చాలా బాధగా ఉంది” అని చెప్పుకుని, మళ్లీ నా పనిలో లీనమైపోయాను. ఒక 15 నిమిషాలు గడిచిన తరువాత మా మేనేజర్ తనంతట తానే నా క్యూబ్ దగ్గరకి వచ్చి, “ఇండియాకి ట్రిప్‌కి వెళ్తున్నాను” అని చెప్పి, ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా నాతో మొత్తం వివరాలన్నీ ఒక 30 నిమిషాల పైనే మాట్లాడింది. ఆవిడ ఒక అమెరికన్. అందువల్ల, ఆ ట్రిప్‌లో ఎక్కడెక్కడికి వెళ్తున్నారో ఆ ప్లానింగ్ అంతా చాలా వివరంగా నాతో మాట్లాడింది. ఇన్ని రోజులూ మేము చనువుగానే మాట్లాడుకుంటున్నప్పటికీ, ఆమె నాతో మరీ ఇంత సన్నిహితంగా మాట్లాడుతుందని నేనసలు ఊహించలేదు. బాబా చేసిన అద్భుతం వలన మాత్రమే ఆమెలో ఇంత మార్పు వచ్చింది. ఈ సంఘటన తలచుకుంటుంటే, ‘బాబా మిరాకిల్ కాకుంటే అసలిది ఎలా సాధ్యం?’ అనిపిస్తుంది. పైగా, నాకు ఫుల్ వర్క్ ఉంది, నేను చాలా బిజీ అని తెలిసి కూడా, ఆవిడ పరవాలేదన్నట్లు అలా 30 నిమిషాల పైనే నాతో మాట్లాడిందంటే అది కేవలం బాబా వల్లనే సాధ్యం.
ఇకపోతే, ఆ చైనీస్ అమ్మాయి కొన్ని రోజులు మంచిగానే ఉంది కానీ, ఎవరైనా నన్ను మెచ్చుకుంటూ ఇ-మెయిల్ చేయగానే తన ప్రవర్తనలో చాలా మార్పు కనపడేది. అలా ఏదో ఒక రకమైన అశాంతి ఉండేది రోజూ. నేను మళ్ళీ, "బాబా! మీరే ఎలాగైనా ఇద్దరి మధ్య సమస్య లేకుండా చూడాలి. నేను మీ అనుగ్రహాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి'లో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. తరువాత అదే వారంలో నా అంతట నేనే ఓపెన్ అయి, "ఇద్దరం మంచిగా ఉండి, వర్క్ చేసుకుందాం. సంతోషకరమైన వర్క్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకుందాం. నేను నీ సీనియరుని, లీడ్‌ని అయినా కూడా ఇద్దరం ఒకటే. మనం కలిసి టీం వర్క్ చేద్దాము" అని చెప్పాను. అందుకు ఆ అమ్మాయి కూడా మంచిగా సరేనని తర్వాత రోజు నుండి బాగానే ఉంది. కానీ ఆమె ఏం చేస్తుందో అని నాకు ఎక్కడో ఒక భయం ఉండేది. అందుకే నేను వెంటనే నా అనుభవాన్ని బ్లాగుకి పంపలేదు. నేను భయపడినట్లే ఆ అమ్మాయి ఎవరైనా నన్ను పొగిడితే దాన్ని బుర్రలో పెట్టుకుని, బాగా అలోచించి మరుసటిరోజు పనిలో ఏదో ఒక రకంగా చూపించేది.
ఇలా ఉండగా నేను నాకున్న సెలవులు వాడుకుందామని అక్టోబర్ నెల రెండో వారంలో నాలుగు రోజులు (ఆ శుక్రవారం ఎలాగూ సెలవుదినం కాబట్టి వారాంతంతో కలిపి మొత్తం ఒక వారం) సెలవు పెట్టుకున్నాను. నేను సెలవులో ఉండే ఆ వారంలో ఒక ముఖ్యమైన వర్క్‌కి సంబంధించి ఫస్ట్ రిపోర్ట్ రెడీ చేయాల్సి ఉంది. దాని ప్రాసెస్, టెస్టింగ్ అన్నీ ముందువారంలో చేయాలి. అవన్నీ పాస్ అయితే రిపోర్టింగ్ మరుసటివారం నుండి ప్రతి శుక్రవారం జరుగుతుంది. అందుచేత నేను ముందువారంలో రాత్రి 9 వరకు ఉండి ఆ పనికి సంబంధించి అన్నీ ఫిక్స్ చేసి శుక్రవారంనాడు ఆ అమ్మాయిని, ఇంకొక అతన్ని(ఆ అమ్మాయికి హెల్ప్ చేస్తాడు) కాన్ఫరెన్స్ కాల్లో పెట్టి వాళ్ళిద్దరికీ ప్రాసెస్ అంతా వివరించి, "వచ్చే వారం ఇలా రిపోర్టు పంపు" అని ఆ అమ్మాయితో చెప్పాను. అతను కూడా "హెల్ప్ కావాలంటే నన్ను అడుగు" అని చెప్పాడు. ఆ అమ్మాయి కూడా, "మీరు నాకు తప్పకుండ హెల్ప్ చేయాలి" అని అంది. అలా ఆరోజు జాగ్రత్తలు చెప్పి నేను లాగ్ ఆఫ్ అయ్యాను.
అయితే, మరుసటివారం మొదలవుతూనే, అంటే సోమవారం నుండి ఆ అమ్మాయి చాలా డిఫరెంట్‍గా ప్రవర్తించడం మొదలుపెట్టింది. అదెలా అంటే, "నేను వర్క్ నేర్చుకుంటాను. నువ్వు ఎలా చేస్తున్నావో చూపించు" అని తను అంటే, నేను నా సిస్టమ్ స్క్రీన్ షేర్ చేసి తనకి చూపిస్తూ వర్క్ చేశాను. అలా నేను నేర్పించిన వర్క్‌ని ఆ అమ్మాయి 'నేను ఇది టెస్ట్ చేశాను' అని అందరికీ ఇ-మెయిల్ పెట్టింది. 'అది నేను చేసిన వర్క్ కదా!' అని నేను తనకి మెయిల్ చేస్తే, "కాదు. ఇష్యూస్(సమస్యలు) ఉంటే నేను మార్పు చేశాను" అని అంది. నేను చాలా బాధపడ్డాను. నాకు అసలు అలా ఎలా చేస్తారో, వాళ్ళకి ఆ ధైర్యం ఎలా వస్తుందో అర్థం కాలేదు. ఆ అమ్మాయి నేను ప్రిపేర్ చేసిన వర్క్‌ను, అలాగే ఇద్దరం కలిసి చేసిన పనిని కూడా తనొక్కతే చేసినట్లు మేనేజరుకి, మాపై సీనియర్స్‌కి అప్డేట్ చేస్తే, అందరూ తనని చాలా మెచ్చుకున్నారు. క్రెడిట్ అంతా తనకే ఇచ్చారు. నేను అంతా సెట్ చేసి సెలవు తీసుకుంటే మొత్తం ఆ అమ్మాయి చేసినట్లు అయిపోయిందని నాకు చాలా బాధేసింది. కానీ ఆ మీటింగ్‍లో ఉన్న నేనుగానీ, ఆ అమ్మాయికి హెల్ప్ చేసే అతనుగానీ ఆమెను ఏమీ అనలేదు. ఎందుకంటే, మేనేజర్ ముందు గొడవలా అవుతుంది. అసలు అయినా గొడవపడటం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే, అదేదో ఒక రోజుతో పోయేది కాదు. ఒచోట కలిసి పనిచేయాల్సినవాళ్ళం, గొడవపడితే మళ్ళీ ఎలా కలిసి పని చేయగలం? ప్రశాంతత కూడా లేకుండా పోతుంది. అందుకే నేను భరిస్తూ ఉండిపోయాను. అదీకాక, ఆ అమ్మాయికి చిన్న బేబీ ఉందని మా మేనేజరుకి కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంది. ఆ అమ్మాయి కూడా మాట్లాడేటప్పుడు చాలా మంచిగా మాట్లాడుతుంది. నాతో కూడా అలానే మాట్లాడుతుంది. కానీ అలాంటి పనులు చేస్తూ రోజురోజుకీ నన్ను ఓవర్‌టేక్ చేయాలని చూస్తుండేది. అది రానురాను మరీ ఎక్కువవడంతో నా మనసంతా ఒకటే అలజడిగా ఉంటుండేది. అందుకే సెలవు తీసుకున్నాను.
సరే, అప్పటివరకు ఆ వర్కులో ఏవైనా సమస్యలు వస్తే హెల్ప్ చేయాలని ఆఫీస్ ఫోన్ ఎప్పుడూ దగ్గరే పెట్టుకున్న నేను ఇక ఫోన్ సైలెంట్‍లో పెట్టేసి చివరి మూడురోజులు గడిపాను. రాత్రిళ్ళు కనీసం ఒక మూడు గంటలు కూడా నిద్రపట్టేది కాదు. నిజానికి నా జీవితంలో నిద్రపట్టని రోజులు చాలా అరుదు. సెలవు తీసుకున్నానన్న మాటేకానీ ఒక్క నిమిషం కూడా నాకు మనశ్శాంతి లేక నరకం అనుభవించాను. చాలా అశాంతిగా ఉండేది. ఆ స్థితిలో నేను, "బాబా! నాకు మనఃశాంతిని ప్రసాదించండి. ఎదుటివారు చేసేవి మన కంట్రోల్లో ఉండవు కాబట్టి వాటివల్ల నేను ప్రభావితం కాకుండా చూడండి" అని బాబాను వేడుకున్నాను. ఇంక సోమవారం తిరిగి ఆఫీసుకి వెళ్లాలంటే చాలా బాధేసి, "ప్లీజ్ బాబా, నన్ను కాపాడు. ఆఫీసులో మేనేజర్ నాతో మంచిగా ఉండేలా చూడు. నేను ఇలాంటి (పైన చెప్పినటువంటి) విషయాలు ఏవీ పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటూ సంతోషంగా ఉండేలా చూడు. ఈసారి నేను వెంటనే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని వేడుకున్నాను. తరువాత నేను ఆఫీసుకి వెళ్ళగానే మా మనేజర్ వచ్చి నాతో చాలా బాగా మాట్లాడింది. తన మాటలలో ఆ వర్క్ నేనే చేశానన్న అవగాహన తనకి ఉందని నాకనిపించింది. అంతా బాబా దయ.
“బాబా! మీకు శతకోటి నమస్కారములు. 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ ద్వారా నాకు సూచనలు ఇస్తూ, నాలో నమ్మకాన్ని పెంచుతూ, 'నన్ను కాపాడతానని మీరు నాకిచ్చిన మాట'ని నిలబెట్టుకుంటూ అడిగిన ప్రతిసారీ కాపాడుతూ, మీ బిడ్డలాగా నన్ను ఆశీర్వదిస్తున్నందుకు మీకు నేనెలా కృతజ్ఞతలు చెప్పగలను? మీ దయ లేకుంటే నేను అసలు ఇన్ని సమస్యల నుండి బయటపడేదానినే కాదు. ప్లీజ్ బాబా, నన్ను ఈ సమస్య నుండి శాశ్వతంగా కాపాడి నాకు మనశ్శాంతిని ప్రసాదించండి. ఇంతవరకు మీరు ప్రసాదించిన అన్నింటికీ శతకోటి ధన్యవాదాలు. నా అనుభవాలను ఆలస్యంగా షేర్ చేసుకుంటున్నందుకు మరియు నా వలన ఏమయినా తప్పులు జరిగితే నన్ను క్షమించండి బాబా. నా వలన ఒకరికి ఇబ్బంది రాకుండా, ఒకరి వలన మాకు ఇబ్బంది రాకుండా చూడండి బాబా. ప్లీజ్ బాబా, నన్ను వదిలేయవద్దు. మీ దీవెనలు ఎల్లప్పుడూ మా అందరి మీదా ఉండేలా ఆశీర్వదించండి బాబా".
సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు !!!
అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
Jaisairam bless supraja for her neck pain and shoulder pain and help her to get better Jaisairam 🙏
ReplyDeleteSai nannu vamsi ni kalupu sai na kapuram nilabettu sai pls nenu na barthani dhuram ga undalenu sai nannu na barthani kalupu sai nenu na anubhavamni blog lo panchukuntanu sai om sai ram
ReplyDelete