సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1362వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

శ్రీసాయి అనుగ్రహ లీలలు - పదనాల్గవ భాగం

సాయిబాబుగారు తమకు బాబా ప్రసాదించిన కొన్ని అనుభవాలు గతవారం పంచుకున్నారు. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నారు.


మాకు తెలిసిన మరికొంతమంది బాబా భక్తుల అనుభవాలు: ఒకరోజు ఒక సాయి భక్తుడు తన బంధువుల ఇంటికి వెళ్ళాడు. వాళ్ళు కూడా సాయి భక్తులే. వాళ్ళు ఇతనికి బాబా ప్రసాదంగా రెండు లడ్డూలు ఇచ్చారు. అతను వాటిని ఒక కవరులో పెట్టుకుని బస్సులో ఇంటికి తిరిగొస్తూ మనసులో, “బాబా! ఈ లడ్డు ప్రసాదాన్ని మా ఇంటి వద్ద ఉన్న ఇద్దరు పిల్లలకు(ఏడు సంవత్సరాల పాప, ఐదు సంవత్సరాల ఆ పాప తమ్ముడు) ఇవ్వదలచాను. నేను వెళ్ళగానే వాళ్ళను నా వద్దకు పంపుతావా?” అని అనుకున్నాడు. అతను ఇల్లు చేరేసరికి రాత్రి పది గంటలైంది. వెంటనే అతని కొడుకు ఒక లడ్డు తీసుకున్నాడు. అంతలో అతను ఎవరికైతే ఇవ్వదలుచుకున్నాడో ఆ పిల్లలిద్దరూ వచ్చారు. అతను ఆనందంతో మిగిలిన లడ్డులో చెరిసగం వాళ్ళిద్దరికీ ఇచ్చాడు. అప్పటినుంచి అతను, “ఈ కలియుగంలో మనకు వెంటనే సహాయం చేసేది బాబా మాత్రమే” అని అంటుంటాడు. సాయితత్వం తెలుసుకుని, ధన్యులవ్వండి.


బెంగుళూరులో నేను ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నప్పుడు నా తోటి ఉద్యోగి ఒకతను చాలా ఇబ్బందుల్లో ఉంటే, అతనికి అప్పుడప్పుడు కొంచెం సాయం చేస్తుండేవాడిని. అతను తన ఇంటి యజమానికి పదివేల రూపాయల అద్దె డబ్బులు బకాయిపడ్డాడు. ఆ ఇంటి యజమాని అతని ఇంటికి తాళం వేసేసి డబ్బు కట్టమని పట్టుబట్టాడు. ఆ విషయం నాకు తెలిసి నేను అతనికి బాబా లీలల గురించి చెప్పి, “మీరు బాబా గుడికి వెళ్ళి ప్రార్ధించండి. అంతా బాబా చూసుకుంటారు" అని అన్నాను. నేను చెప్పినట్లే అతను బాబా గుడికి వెళ్ళి తన కష్టం గురించి విన్నవించుకున్నాడు. అప్పటివరకూ అప్పు పుట్టని అతనికి తర్వాత రోజే అతని పిన్ని ద్వారా పది వేల రూపాయలు అందాయి. ఆ డబ్బులు ఇంటి యజమానికి ఇచ్చేసి సామాను తీసుకుని వేరే ఇంటికి మారాడు. ఆ ఇంటి తలుపులు తీసి ప్యాన్ స్విచ్ వేద్దామని వెళితే, అక్కడ రెగ్యులేటరు మీద ఏదో కనిపిస్తే, అతను 'ఇదేదో బొమ్మలా ఉందే' అనుకుంటూ తీసి చూస్తే, అది బాబా మూర్తి. అతను చాలా ఆశ్చర్యంతో, "మమ్మల్ని రక్షించడానికి ముందుగానే ఇక్కడికి వచ్చావా బాబా?" అని అనుకున్నాడు. ప్రస్తుతం అతను ఆ బాబా మూర్తికి భక్తిశ్రద్దలతో పూజ చేసుకుంటున్నాడు.


బాబా ఎప్పుడు, ఎవరి వద్దకు ఎలా చేరాలో, అలా చేరుతారు. నేను బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్నప్పుడు, నాకు తెలిసిన ఒక ఒరిస్సా వ్యక్తి అదివరకు బెంగుళూరులోని ఒక సాయిబాబా మందిరంలో పని చేసేవాడు. అతను, "బాబా మందిరంలో నాకు చాలా ప్రశాంతంగా ఉండేది. అన్నీ సరియైన సమయానికి నాకు అందేవి" అని నాతో అనేవాడు. ఒకరోజు అతను, "నా దగ్గర బాబా ఫోటో లేదు. మీ దగ్గర ఉంటే చిన్న బాబా ఫోటో ఒకటి నాకు ఇవ్వండి" అని అడిగాడు. నేను అతనితో “చూసి ఇస్తాన"ని చెప్పాను కానీ పనుల ఒత్తిడిలో పడి ఫోటో వెదికి అతనికి ఇవ్వకుండానే వారం రోజులు గడిచిపోయాయి. తరువాత ఒకరోజు అతని వద్ద నుండి నా మొబైల్‍కి 'మీరు మొబైల్ ఫోన్లో నాకు పంపిన బాబా ఫోటో చాలా బాగుంది. ధన్యవాదాలు' అని మెసేజ్ వచ్చింది. అది చూసి నేను ఆశ్చర్యపోతూ, 'నేనతనికి ఫోన్‍లో ఏ బాబా ఫోటో పంపలేదు మరి ఇదెలా సాధ్యమ'ని ఆలోచనలో పడ్డాను. అయితే నేను అతనికి ఫోటో ఇవ్వడం ఆలస్యమవుతున్నందుకు బాబానే స్వయంగా అతని వద్దకు వెళ్ళారని తరువాత నాకు అర్థమైంది. అదెలాగంటే, ఒక ఆదివారం మా మనవడు 'సాయీష్' నా ఫోన్‍తో ఆడుకుంటున్నాడు. వాడికి ఆ ఒరిస్సా అతని పేరుగానీ, ఫోన్ నెంబర్‍గానీ తెలియవు. వాడిచేత బాబానే తమ ఫోటోను ఆ ఒరిస్సా అతని ఫోన్‌కు పంపించారు. అలా మనస్ఫూర్తిగా తమ ఫోటో కావాలనుకున్న తమ భక్తుని దగ్గరకి తామే స్వయంగా వెళ్ళారు.


బాబాని కొలిచే వారికి ఆయన మాటపై పూర్తి నమ్మకం, విశ్వాసం ఉండాలి. అందుకే బాబా ఎప్పుడూ 'శ్రద్ధ, సబూరి' అని అంటూ ఉండేవారు. మా పక్కింట్లో ఉండేవాళ్ళు మెల్లగా బాబాని నమ్మడం, గుడికి వెళ్ళడం, శిరిడీ వెళ్ళడం చేస్తూండేవాళ్లు. ఒకరోజు వాళ్ళు మా ఇంటికి వచ్చి, "ఇల్లు బాగు చేయించుకోవాలనుకుంటున్నాము. ఏ తేదీ మంచిదో బాబాని అడిగి చెప్తారా?" అని అడిగారు. మేము, "అలాగే"నని బాబానడిగి, “21వ తేదీ మంచిద”ని చెప్పాము. అయితే అనుకోని సంఘటనల వల్ల వాళ్ళు ఆ తారీఖున పని మొదలు పెట్టుకోలేకపోయారు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ, "ఎప్పుడు మంచిదో బాబాను అడిగి చెప్పండి” అని అడిగారు. మేము మళ్ళీ బాబాను అడిగితే, బాబా మూడు నెలల వరకు అనుమతి ఇవ్వక "శ్రావణ మాసం వరకూ ఆగమ"ని అన్నారు. అదే విషయం మేము వాళ్లతో చెప్పడమైతే చెప్పాముగాని, అప్పటికే ఇసుక తెప్పించి పెట్టుకున్న వాళ్ళు 'మూడు నెలలు వరకు ఆగుతారో, లేదో?' అని అనుకున్నాము. కాని వాళ్ళు ఏ మాత్రమూ నిరాశ చెందకుండా, అలాగే వర్షానికి ఇసుక కొట్టుకునిపోతుందేమోనాన్న సంశయం కూడా లేకుండా, “బాబా ఎప్పుడు చెప్తే అప్పుడే మొదలుపెట్టుకుంటామ"ని సంతోషంగా అన్నారు. అదీ సబూరీ అంటే.


శిరిడీలో మేము ఎప్పుడూ బస చేసే భవనంలో ప్రారంభోత్సవానికి ముందే ఇరవైరోజులు బాబా అనుగ్రహంతో మేము అక్కడ ఉన్నామని నేను ఇదివరకు చెప్పాను. ఆ భవనం వాచ్మెన్ మాకు తెలిపిన ఒక అద్భుత లీలను ఇప్పుడు చెప్తాను, చదివి ఆనందించండి. ఒకసారి ఆ భవనంలో పనిచేసే ఒకతని భార్య తిరుపతి నుండి భర్తకోసం శిరిడీ వచ్చింది. అయితే అప్పటికే అతను వేరే పని కోసం ముంబయి వెళ్ళిపోయాడు. ఆమె తన భర్త రాకకోసం ఎదురుచూస్తూ అక్కడే ఉండిపోయింది. ఆమెకు ఒక అనారోగ్య సమస్య ఉంది. శిరిడీలో డాక్టరు ఆమె రిపోర్టులు చూసి, "ఆపరేషన్ చేయాలి" అని చెప్పారు. ఆమె వారం రోజుల తర్వాత ఆపరేషన్ చేయించుకోవాలనుకుంది. అది వేసవికాలం. ఒకరోజు రాత్రి పని వాళ్ళందరితో పాటు ఆమె డాబా మీద నిద్రపోతోంది. మధ్య రాత్రిలో తెల్లని బట్టలు ధరించిన వ్యక్తి ఎవరో తనను దాటుకుంటూ వెళుతున్నట్లనిపించి ఆమె కళ్ళు తెరిచి చూస్తే, ఆ వ్యక్తి మెట్లు దిగి వెళ్ళడం కన్పించింది. ఆమె ఆ వ్యక్తి మళ్ళీ వస్తాడేమోనని తెల్లవారేవరకూ ఎదురుచూసింది. కానీ ఆ వ్యక్తి తిరిగి రాలేదు. అతను ఎవరై ఉంటారని ఆమె ఆలోచిస్తుండేది. వారం తర్వాత ఆపరేషన్ చేయించుకుందామని హాస్పిటల్‍కి వెళ్తే, డాక్టరు మళ్ళీ టెస్టులు చేసి, “నీకు ఆపరేషన్ అవసరం లేదు. ఏ అనారోగ్యమూ లేదు” అని చెప్పాడు. ఇదంతా తెలిసి ఆ బిల్డింగ్ వాచ్మెన్, “ఆ వ్యక్తి ఎవరో కాదు, సాక్షాత్తు బాబానే. ఆయన స్వయంగా వచ్చి నిన్ను దాటుకుంటూ వెళ్లి, నీ అనారోగ్యం పోగొట్టి ఉంటారమ్మా” అని ఆమెతో చెప్పాడు. ఆశ్చర్యంతో ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగగా కృతజ్ఞతగా బాబాకి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని ఆయన భక్తురాలైంది. అడగకపోయినా బాబా ఆమె అనారోగ్యాన్ని ఎలా తొలగించారో చూసారా! శిరిడీలో అడుగు పెట్టడమే బాబా అనుమతితో జరుగుతుంది కదా!


మేము తరచూ వెళ్ళే బాబా గుడిలోని పూజారి రోజూ శ్రద్ధ, నిష్టలతో బాబాను పూజిస్తూ తన కష్టసుఖాలను బాబాతోనే చెప్పుకుంటుండేవారు. బాబా అతనికి ఏ లోటూ లేకుండా చూసుకుంటుండేవారు. ఒకరోజు ఆ పూజారి తన మదిలో, 'ఏకముఖి రుద్రాక్ష మెడలో ధరించాలి. స్వచ్చమైన రుద్రాక్ష ఎక్కడ, ఎలా లభిస్తుందో” అని అనుకున్నారు. మరి బాబా అతని కోరిక తీర్చకుండా ఉంటారా? వారం తర్వాత ఒకరోజు గుడిలో పూజారి ఒక కుర్చీలో కూర్చుని బాబా పుస్తకం చదువుకుంటున్నారు. ఆ సమయంలో గుడిలో ఇంకెవరూ లేరు. కొద్దిసేపటికి బయటి నుండి గుడి లోపలికి ఒక వృద్ధుడు నడుచుకుంటూ వచ్చి, నేరుగా పూజారి దగ్గరకు వెళ్లి, తన చేతిలో ఉన్న వెండి తాపడం చేసిన ఏకముఖి రుద్రాక్ష మాలను పూజారి మెడలో వేసి, మారుమాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఆ వచ్చిన వృద్ధుడు ఎవరు? వేరే చెప్పాలా? స్వయంగా బాబానే.  అయితే ఏమి జరిగిందో అర్థంకాని పూజారికి నోట మాట రాలేదు. మాల కొత్తది కాదు, పాతదే అయినప్పటికీ ఆ విధంగా బాబా అతని కోరిక తీర్చారు. ఒకరోజు గుడి మేనేజ్మెంట్ కొన్ని కారణాల వలన పూజారిని అర్చకత్వం మానేయమని అన్నారు. దాంతో ఆ పూజారికి ఏమీ పాలుపోలేదు. అతను నిస్వార్ధపరుడు. అతను వచ్చాకే గుడిలో భక్తుల సంఖ్య పెరిగింది. అతను గుడిని వదలి వెళ్ళడం బాబాకి ఇష్టం లేదనుకుంటాను. ఒకరోజు పూజారి నిద్రలో ఉండగా బాబా కలలో కనపడి, నిల్చుని ఉన్న అతని కాళ్ళ చుట్టూ దారం కట్టారు. అతను బాబాను, "నేను గుడి వదలి వెళ్లకుండా ఈ దారం ఆపుతుందా?" అని అడిగాడు. అందుకు బాబా, “నువ్వు ఈ దారం తెంచుకుని వెళ్ళగలిగితే వెళ్ళు, లేకపోతే ఇక్కడే ఉండు” అని సెలవిచ్చారు. అప్పుడు పూజారి దారం వదిలించుకోవాలని ఎంత ప్రయత్నించినా ఆ సన్నని దారం తెగిపోలేదు. అంతటితో ఆ కల ముగిసింది. తరువాత చాలామంది భక్తులు గుడి మేనేజ్మెంట్‍కు ఫోన్ చేసి ఆ పూజారిని ఉంచమని చెప్పారు. బాబా దయవల్ల ఆ పూజారి అదే గుడిలో అర్చకత్వం చేసుకుంటూ ఉండిపోయారు.


ఇప్పుడు పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లు బాబా తమ భక్తులను ఎలా తమ వద్దకు రప్పించుకుంటారో తెలియజేసే ఈ అద్భుతమైన బాబా లీలను చదవండి. ఆయన ఒక భక్తునికి ప్రాణభిక్ష పెట్టి, అతనితో తమకి గుడి కట్టించి, పూజలందుకుంటున్న వైనం చూడండి. అందులో బాబా దయవల్ల మా ప్రమేయం కూడా ఉంది కనుక మీతో పంచుకుంటున్నాను. గుంటూరులో ఒక ముస్లిం కుటుంబానికి చెందిన ఒకతను కొన్ని సంవత్సరాలు రైల్వేలో చిన్న కాంట్రాక్టరుగా పనిచేసాక కొన్ని కారణాల వల్ల అదే రైల్వే కూలీగా మారాడు. ఆ సమయంలోనే అతనికి ఒక వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి కారణంగా అతను మాట్లాడుతుంటే నోట్లో నుండి రక్తం పడుతుండేది. అతని భార్య అతనిని హాస్పిటల్‍కి తీసుకువెళ్ళి ఎన్నో మందులు వాడింది. కానీ ఏం ప్రయోజనం కనిపించలేదు. పైగా రోజుకు 2000 రూపాయల ఖరీదైన ఇంజక్షన్లు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పు చేసి కొన్ని రోజులు ఇంజక్షన్లు చేయించారు. రానురానూ అప్పు పుట్టడం కష్టమై పోవడంతో ఏమి చేయాలో పాలుపోక అతని భార్య అతనితో "నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపో. కనీసం ఎక్కడో ఒక చోట నువ్వు జీవించే ఉన్నావన్న ఆశతో మేము కాలం గడుపుతాము. ఇక్కడే ఉంటే నువ్వు పడే బాధ చూసి మేం తట్టుకోలేము” అంది. దాంతో అతను ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. రైల్వే కూలీ కాబట్టి ఏదో రైలు ఎక్కి అది ఎంత దూరం పోతే అంత దూరం వెళ్ళేవాడు. అక్కడ దిగి ఇంకో రైలు ఎక్కేవాడు. అలా ఎక్కడెక్కడో తిరుగుతుండేవాడు. అలా రోజులు గడుస్తున్న తరుణంలో ఇంటి వద్ద ఉన్న అతని భార్యకి బాబా గురించి తెలిసింది. ముస్లిం మతస్థురాలైన ఆమె మొదట, 'బాబా మందిరానికి వెళ్తే, ఇతరులు ఏమనుకుంటారో' అని సంశయించినప్పటికీ ధైర్యం చేసి ముసుగు వేసుకుని బాబా మందిరానికి వెళ్ళి, బాబాతో తన బాధను చెప్పుకుని, "ఎక్కడున్నా నా భర్తను రక్షించండి" అని కన్నీళ్ళతో ప్రార్థించింది. బాబా ఊరుకుంటారా? నల్గొండ దగ్గర రైలులో ప్రయాణిస్తున్న ఆమె భర్తని ఒక సాధువు పేరు పెట్టి పిలిచి, "ఇలా రా" అని అన్నారు. అతను ఆ సాధువుని, "నా పేరు మీకెలా తెలుసు?" అని అడిగాడు. ఆ సాధువు, “నాకు నీ పేరే కాదు, నీ గురించి అంతా తెలుసు. నువ్వు వీలైనంత త్వరగా శిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకో. అంతా మేలు జరుగుతుంద"ని చెప్పాడు. దాంతో అతను వెంటనే హైదరాబాద్ వెళ్ళి, శిరిడీ రైలు పట్టుకుని, శిరిడీ వెళ్ళి, స్నానం చేసి, బాబాని దర్శించుకున్నాడు. తరువాత అక్కడ ఇచ్చిన ఊదీ తీసుకుని కొంచెం నుదుటన పెట్టుకుని, మరికొంచెం ఊదీ నీళ్ళలో కలుపుకుని త్రాగాడు. శిరిడీలో ఒక వారం గడిచింది. ఆ వారంలో ప్రతిరోజూ ఉదయం ఎవరో ఒకరు అతని చేతిలో టీ టోకెన్ పెట్టి వెళ్ళి టీ త్రాగమనేవారు. టిఫిన్ సమయానికి 10 రూపాయలు ఇచ్చి, ఏదైనా తినమని ఇంకొకరు చెప్పేవారు. భోజన సమయానికి ప్రసాదాలయం టిక్కెట్టు ఎవరో ఒకరు ఇచ్చేవారు. (అప్పట్లో సమాధి మందిరం పక్కనే ప్రసాదాలయం ఉండేది). వారం రోజుల తరువాత అతను గమనించుకున్నదేమిటంటే, 'బాబాను దర్శించి, ఊదీ నోట్లో వేసుకున్న దగ్గర నుండి తన నోటి నుండి రక్తం పడటం లేదనీ, శరీరంలో కొంచెం ఉత్సాహం వచ్చిందని'. అంతే, “బాబా! నాకు ప్రాణభిక్ష పెట్టావు. నువ్వే నా దైవం ఎవరినీ రూపాయి అడక్కుండా నా స్వహస్తాలతో సంపాదించి మీకు ఒక మందిరం నిర్మిస్తాను" అని మొక్కుకున్నాడు. శిరిడీలోనే ఇంకో పది రోజులుండి పనిచేసి, వచ్చిన డబ్బుతో ఒక బాబా పటం కొనుక్కొని, అక్కడే పూజించి, దాన్ని తీసుకుని తిరిగి ఇంటికి చేరి, జరిగినదంతా తన భార్యకు చెప్పాడు. ఆమె చాలా సంతోషించింది. బాబా దయవల్ల రైల్వేలో అతనికి మళ్ళీ ఉద్యోగమిచ్చారు. డ్యూటీ చేసుకుంటూ వచ్చిన డబ్బంతా ఒక డబ్బాలో దాచి గుంటూరు దగ్గర 'సిరిపురం' అనే గ్రామంలో చిన్న విగ్రహం పెట్టి ఒక చిన్న బాబా మందిరం కట్టించసాగాడు. బాబా సేవలో తరిస్తున్న అతను బాబా మహిమ వల్ల ఎవరైనా తప్పిపోతే, వాళ్ళు ఎక్కడున్నది చెప్పగలిగేవాడు. ఒకసారి ఒక పత్రిక యజమాని మనవడు తప్పిపోతే, ఇతను అతని వద్దకు వెళ్ళి, ఆ కుర్రాడు ఎక్కడ ఉన్నది చెప్పాడు. ఆ యజమాని ఇతని కథంతా విని “నీ గురించి సాయి భక్తులకు తెలియాలి" అని అతని గురించి, అతను కట్టిన మందిరంతో సహా తన పత్రికలో ప్రచురించాడు. ఆ పత్రిక చదివిన మేము అతనికి కబురు చేస్తే, అతనే మా ఇంటికి వచ్చాడు. సాయితత్వం గురించి మాట్లాడుకుని ఒకరికొకరం సాయి బంధువులమయ్యాం. చూశారా! బాబా అతనిని దారం కట్టి తమ వద్దకు లాక్కొనడమేకాక, పరమ భక్తునిగా చేసుకున్నారు. నమ్మితే బాబా మన వెన్నంటే ఉంటారు.


2004వ సంవత్సరంలో మేము నెలనెలా బాబా పేరిట కొంత పైకం తీసి పక్కన పెడుతుండేవాళ్ళము. పది నెలల తర్వాత అవి పదివేల రూపాయలయ్యాయి. ఆ మొత్తం బాబాకు చెందినది కాబట్టి నూతనంగా నిర్మించే బాబా మందిరానికి ఇవ్వాలని అనుకున్నాము. మాకు తెలిసి ఆ సమయంలో తెనాలి, గుంటూరు, సిరిపురంలలో బాబా మందిర నిర్మాణాలు జరుగుతున్నాయి. వాటిలో ఏ మందిరానికి ఆ పైకం ఇవ్వాలని బాబాను అడిగితే, “సిరిపురంలోని మందిరానికి ఇవ్వమ"ని బాబా సెలవిచ్చారు. ఆ మందిర నిర్మాణం చేస్తున్నది వేరెవరో కాదు. పైన చెప్పుకున్న ముస్లిం రైల్వే కూలీనే. అతను తన స్వశక్తితో, సొంత కష్టంతో ఒక్కడే బాబా మందిర నిర్మాణం చేసున్నాడు. బహుశా అందుకే బాబా ఆ మందిరానికి డబ్బులివ్వమని సూచించారు. బాబా ఆదేశానుసారం మేము సిరిపురం వెళ్ళి ఆ పైకం బాబాకి సమర్పించాము. ఆ తర్వాత చాలాసార్లు సిరిపురం వెళ్ళి బాబా మందిరాన్ని దర్శించుకున్నాము. ఎప్పుడు, ఏది, ఎవరికి చెందాలో అలా చేయడంలో బాబాకు బాబాయేసాటి.


తరువాయి భాగం వచ్చేవారం... 


 


ముందు భాగం కోసం
బాబా పాదుకలు తాకండి.




 


 


తరువాయి భాగం కోసం
బాబా పాదాలు తాకండి.

 


6 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Meru ikada pratidhi baba ni adigi chestunam antunaru ante baba ni ela adutaru meru ayana meku kanipinchi cheptara .a samadhanm ela telustundhi.

    ReplyDelete
  3. Jaisairam bless supraja for her neck pain and shoulder pain and help her to get better Jaisairam 🙏

    ReplyDelete
  4. Sai na kapuranni nilabettu sai nannu vamsi ni kalupu sai mi midhe nammakam tho baram antha mi midha vesi yeduruchusthunna sai na jeevitham nilabettu sai nannu na barthani kalapandi sai naaku na anubhavamni blog lo pamchukune adhrustani prasadinchandi sai om sairam

    ReplyDelete
  5. Adbhutam Sai leelalu, chadivina koddi inka chadavali anipistundhi Sai..🙏🏻

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo