సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 756వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. బాబా అనుగ్రహించిన కొన్ని అనుభవాలు
  2. పుత్ర సంతానాన్ని ప్రసాదించిన బాబా

బాబా అనుగ్రహించిన కొన్ని అనుభవాలు


హైదరాబాదు నుండి శ్రీమతి దీప్తి తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.


సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్ నిర్వాహకులకు, సాటి సాయిబంధువులకు నా నమస్కారం. నా పేరు దీప్తి. నేను ఇంతకుముందు బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను కొన్నింటిని మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకోబోతున్నాను. 


మొదటి అనుభవం:


లాక్‌డౌన్ తరువాత 2020, నవంబరు నెలలో శిరిడీ సాయి సంస్థాన్ వారు బాబా దర్శనానికి అనుమతి ఇచ్చారు. దాంతో, శిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకుందామని మావారిని అడిగితే, తను ‘మహారాష్ట్రలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయ’ని శిరిడీ వెళ్ళడానికి ఒప్పుకోలేదు. శిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకోవాలని మనసు ఎంతగా తపిస్తున్నా మావారు ఒప్పుకోలేదని మౌనంగా ఉండిపోయాను. డిసెంబరు 21వ తేదీన గూగుల్ ఫోటోస్ చూస్తుంటే, 2019లో అదే తేదీన మేము శిరిడీ వెళ్ళినప్పుడు తీసిన ఫోటోలు కనిపించాయి. అవి చూసి ఆరోజు నేను ఎంతగానో ఏడ్చాను. అప్పుడు మా అమ్మ నన్ను ఓదార్చి, ‘రెండురోజులలో పిల్లలకు సెలవులు వస్తాయి కదా, ఎక్కడికైనా వెళదాము’ అని చెప్పింది. మేము గాణ్గాపురంగానీ, కురువపురంగానీ వెళ్దామని అనుకుని, ఎక్కడికి వెళ్ళమంటారో తెలుపమని బాబాను ప్రార్థించి బాబా ఫోటో ముందు చీటీలు వేస్తే, ‘కురువపురం వెళ్ళమ’ని చీటీలో వచ్చింది. మేము బాబా దయవలన కురువపురంలో శ్రీపాద శ్రీవల్లభ తపోభూమి దర్శనానికి వెళ్ళాము. ఆరోజు స్వామి శ్రీనృసింహసరస్వతి అవతారంలో దర్శనమిచ్చి, ‘దత్తావతారాలన్నీ ఒక్కటే, ఎక్కడైనా తామే ఉన్నామ’న్న సందేశాన్నిచ్చారు. 


రెండవ అనుభవం: 


సంక్రాంతి సెలవులకు మా అత్తగారింటికి వెళుతూ శంషాబాద్ దగ్గర ఉన్న ధర్మసాయిక్షేత్రాన్ని దర్శించుకున్నాను. మా ఊరిలో పండుగ జరుపుకున్నాక ఇంటికి తిరిగి వచ్చే ముందురోజు పిల్లలందరూ కలిసి మా పొలంలో నిర్మిస్తున్న ప్రాజెక్టును చూడటానికి వెళ్ళారు. మా చిన్నమ్మాయిని, మా తోడికోడలు కొడుకుని మా మామయ్య తన బండిపై తీసుకెళ్ళారు. తిరిగి వచ్చేటప్పుడు దారిలో ఉన్న రాయిని తప్పించబోయి బండి బ్యాలెన్స్ తప్పిపోయి అందరూ క్రిందపడ్డారు. మా అమ్మాయికి చీలమండ దగ్గర వాచింది. మామయ్యకి కొద్దిగా గీరుకుపోయింది. మా పాప కాలివాపు చూసి తనకు ఫ్రాక్చర్ అయిందేమోనని భయపడి, ‘పాప కాలికి ఫ్రాక్చర్ అవకుండా చూడమ’ని సాయిని ప్రార్థించసాగాను. పాప కాలిని పరీక్షించిన డాక్టర్, ‘ఫ్రాక్చర్ ఏమీ లేదు, కేవలం టిష్యూస్ మాత్రమే ప్రక్కకు జరిగాయి. మందులతోనూ, పట్టీతోనూ వాపు తగ్గిపోతుంది’ అని చెప్పారు. అంతా బాబా అనుగ్రహం. అంతేకాదు, అంతకుముందు మా మామయ్య కాలికి knee joint replacement surgery జరిగింది. కానీ ఆ కాలికి దెబ్బలేమీ తగలలేదు. బండి చక్రం తగలకుండా, కాలికి ఫ్రాక్చర్ అవకుండా మా పాపని, మా మామయ్యని సాయిబాబానే కాపాడారు. 


మూడవ అనుభవం:


2020, డిసెంబరు 30వ తేదీన, సాయిబాబా గుడిలో సాయిభక్తుల ఫోటోలు మరియు వారి గురించిన వివరాలను ఒక ఫ్లెక్సీలో ప్రింట్ చేయించే విషయమై ఒక సాయిబంధువు నాకు ఫోన్ చేసి, ‘2 గంటలలో అబ్దుల్‌బాబా, భాగోజీషిండే, స్వామిశరణానంద గురించి వ్రాసి పంపమ’ని కోరింది. ఆ భక్తుల వివరాల కోసం ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి ఫోన్ చేశాను. కానీ తన ఫోన్ చాలాసేపు ఎంగేజ్ వచ్చింది. ఇప్పుడేం చేయాలా అని ఆలోచిస్తూ ఆ భక్తుల గురించి బ్లాగులోనూ, గూగుల్లోనూ సెర్చ్ చేస్తూ, ‘అందరి భక్తుల గురించి ఒకే దగ్గర పెట్టవచ్చు కదా’ అని అనుకున్నాను. సరిగ్గా ఒక వారంరోజుల్లో, జనవరి 5వ తేదీన ఈ బ్లాగులో ‘అనుగ్రహసుమాలు’ శీర్షికతో బాబా సమకాలీన భక్తుల వివరాలన్నీ ఒకేచోట ఉండటం కనిపించింది. అది చూస్తూనే బాబా నా కోరికను నెరవేర్చారని ఎంతో సంతోషించాను. “నా అనుభవాలను ఇంత ఆలస్యంగా పంచుకుంటున్నందుకు నన్ను క్షమించండి బాబా!”


చివరిగా ఇంకో చిన్న అనుభవం:


మా ఇంటికోసం అవసరమై బ్యాంకులో గోల్డ్ లోన్ తీసుకున్నాము. కానీ అనుకోకుండా బాబా కృపవలన కొంత డబ్బు రావడంతో 2021, ఏప్రిల్ 1, గురువారంనాడు మొత్తం బంగారాన్ని విడిపించుకున్నాము. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


పుత్ర సంతానాన్ని ప్రసాదించిన బాబా


పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


ముందుగా బాబాకు నా పాదాభివందనాలు. నేను ఇంతకుముందు ఒక అనుభవాన్ని పంచుకున్నాను. ఇది నా రెండవ అనుభవం. బాబా దయవలన మేము ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాము. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న ఒక కోరిక 2021, ఏప్రిల్ 6న నెరవేరింది. అసలు విషయం ఏమిటంటే, మా తాతయ్యకు ముగ్గురు ఆడపిల్లలు. ఆ ముగ్గురు ఆడపిల్లలకి మళ్ళీ ఆడపిల్లలే పుట్టారు. ఊళ్ళోవాళ్ళంతా ‘మీకు మగపిల్లలు లేర’ని అంటుండేవారు. తనకు ఒక్క మనవడైనా పుడితే బాగుంటుందని మా అమ్మమ్మకు ఎంతో కోరిక. ఇలా రోజులు గడుస్తుండగా కొన్ని రోజులకు మా చిన్న పిన్ని గర్భవతి అయింది. అప్పుడు నేను బాబాకు నమస్కరించుకుని, "బాబా! మా చిన్న పిన్నికి కొడుకు పుట్టేలా అనుగ్రహించండి. మీ అనుగ్రహంతో తనకు కొడుకు పుడితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను మనస్ఫూర్తిగా వేడుకున్నాను. బాబా దయవలన మా పిన్నికి ఏప్రిల్ 6న బాబు పుట్టాడు. మా ఆనందానికి అవధులు లేవు. "బాబా! మీరు ఎల్లప్పుడూ ఇలాగే మాతో ఉంటూ మాకు ఆనందాన్ని ఇవ్వాలనీ, ఇలాగే మరిన్ని అనుభవాలు పంచుకోవాలనీ కోరుకుంటున్నాను. మీకు చాలా చాలా కృతజ్ఞతలు".


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo