సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 745వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. బాబాను కలిసినప్పటినుండి ప్రశాంతంగా ఉంది!
  2. అనుభవాలన్నీ సాయి కృపకు నిదర్శనాలు

బాబాను కలిసినప్పటినుండి ప్రశాంతంగా ఉంది!


పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:


నేను బాబా గురించి చెప్పేంత పెద్దదాన్ని కాదు, అలాగని చిన్నదాన్నీ కాదు. నా వయసు 28 సంవత్సరాలు. కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ నేను నా అనుభవాలను పంచుకోకుండా ఉండలేను. అందుకే, బాబా నాకు ప్రసాదించిన అనుభవాన్ని, నా అనుభూతిని మీ అందరితో పంచుకుంటున్నాను. 2011లో నేను యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు నా సీనియర్ ఒకమ్మాయి నన్ను చాలా అభిమానంగా చూసుకొనేది. ఒకరోజు తను నా జబ్బ పట్టుకొని మరీ నన్ను బాబా వద్దకు లాక్కొని వెళ్ళింది. ఆమె ద్వారా బాబా నన్ను తమ దగ్గరకు తీసుకొన్నారు. అలా నాకు బాబాతో పరిచయం జరిగింది. క్రమంగా నా మానసిక పరిపక్వతను బట్టి నేను బాబాకు చేరువయ్యాను. ఆయన దయతో నా చదువు చురుకుగా, చలాకీగా సాగిపోయింది. నాలుగురమున్న నా కుటుంబంలో 'సమస్యలనేవి ఇవా?' అని ఎప్పుడో అనిపించినా చాలా సుఖంగా, సంతోషంగా, ఆడుతూ పాడుతూ నా జీవితం సాగిపోతుండేది. అమ్మ నన్ను బాగా చూసుకుంటుండేది. అలాంటిది హఠాత్తుగా ఒకరోజు నాన్నకు హార్ట్ ఎటాక్ లాగా వచ్చింది. ఆయనను ఆ స్థితిలో చూడటం నా మనసుని తీవ్రంగా కలచివేసింది. దాంతో నేను బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. బాబా దయవలన నాన్నకు ఆపరేషన్ జరిగి బాగానే ఉన్నారు. కానీ నా పరిస్థితి మాత్రం ఇప్పటికీ అలానే ఉంది. బాబా దయతో రోజులు వెళ్ళదీస్తున్నాను. అంతలా ప్రభావం నా మీద పడటానికి చెప్పుకోదగ్గ బరువుబాధ్యతలేమైనా నా మీద ఉన్నాయా అంటే, అదేమీ లేదు. అంతా మా అన్నయ్యే చూసుకుంటాడు. కానీ నేను పూర్తిగా అనారోగ్యంపాలై దాదాపు మూడేళ్లగా మంచం పట్టాను. ఇంగ్లీష్ మందులు వాడుతూ మంచంమీదే ఉండేదాన్ని. అప్పుడు 'సాయి యుగ నెట్వర్క్' రూపంలో బాబా నా దగ్గరకు వచ్చారు. కొన్నాళ్లపాటు రోజూ సిన్సియర్‌గా బ్లాగులోని అనుభవాలు చదువుతూ ఉండేదాన్ని. మంచం మీద ఉన్న నాకు అదే లోకం. ఏదో కొద్దిగా కోలుకునేసరికి నా పొగరు అనుకోవాలేమో, బాబాకు దూరమయ్యాను. మళ్ళీ ఆయన దయవల్ల అనుకోని పరిస్థితుల్లో నాకు నా స్నేహితులతో గొడవ జరిగింది. అప్పటికిగానీ మాయపొర తొలగలేదు. దాంతో మళ్ళీ బాబా కోసం పరుగెత్తాను. "బాబా! నాకెందుకు వివాహం చేయట్లేదు? ఉద్యోగాన్నిచ్చి ఇంట్లోవాళ్ళకి అండగా ఉండే పరిస్థితిని కూడా కలిపించడం లేదు. నా బ్రెయిన్ చాలా చిన్నది, ఆనందమే తప్ప బాధ అంటే తెలియని నాకు ఎందుకింత కష్టాన్ని ఇచ్చారు?" అని బాబాను అడుగుతూ ఆయనను వెతికే ప్రయత్నంలో నేను ఒంగోలు వెళ్లడం, అక్కడి లాయర్‌పేటలోని బాబాను దర్శించడం జరిగింది. ఆయన ఆశీస్సులతో అక్కడుండే ఒక హోమియో వైద్యుడిని కలవడం జరిగింది. అతను బాబా భక్తుడు. అతను మన స్వభావాన్ని అనుసరించి మందులిస్తారు. ఆశ్చర్యం! అతను నన్ను చూసి, నా వ్యాధిని కనిపెట్టి, ఇంగ్లీష్ మందులు ఆపమని చెప్పి, హోమియో మందులిచ్చారు. ఇప్పుడు నేను ఆ మందులే వాడుతున్నాను. దయతో బాబా నా తలమీద నుండి పెద్ద భారం తీసేసినట్లు అనిపించింది. ఇప్పుడు నా ఆరోగ్యం చాలావరకు బాగుంది. బాబాను కలిసినప్పటినుండి నాకు ప్రశాంతంగా ఉంది. అంతా ఆయన ప్రణాళికేనేమో! "అదే నిజమైతే బాబా, నా చంచల స్వభావాన్ని, అనుకునేది జరగదు అనే ప్రతికూల భావాలను తొలగించి నాకెప్పుడూ ఆనందాన్ని ప్రసాదించండి. సానుకూల దృక్పథాన్నిచ్చి నలుగురితో కలిసేలా చేయండి. నా వయస్సువారికి ఉండే అవసరాలు మీకు తెలుసు. అవన్నీ నెరవేర్చండి. చదువుకునే రోజుల్లో ఉన్నటువంటి మంచి జీవితాన్ని నాకు ఇవ్వండి. ప్రతిదీ మీ నియంత్రణలో ఉంటుంది. నా సమస్యలన్నీ తీర్చేది మీరేనని నా నమ్మకం బాబా. మీ అనుగ్రహంతో నా కోరికలన్నీ నెరవేరితే నేను నా అనుభవాన్ని మీ బ్లాగులో మళ్ళీ పంచుకుంటాను".


'అనుభవాలు అందరితో పంచుకోవాలి, అప్పుడే సమస్యలు తీరుతాయ'ని నా మనసుకి అనిపించింది నిజమేనని నిరూపిస్తూ అప్పుడే బాబా నాకు అనుభవాలు చూపిస్తున్నారు. నా అనుభవాన్ని పంచుకోగానే సరిగ్గా నాలాంటి పరిస్థితినే అనుభవిస్తున్న ఒక భక్తుని అనుభవం నా కంటపడేలా చేశారు. అంతేకాదు, "చింతించవద్దు! వెంటనే వచ్చి నా దర్శనం చేసుకో! నా దర్శనానికి వస్తానని మాటిస్తే నీ జబ్బు వెంటనే తగ్గిపోతుంది" అనే సందేశం రూపంలో భరోసా కూడా ఇచ్చారు. తరువాత ఒకరోజు హెడ్‌సెట్ పెట్టుకొని బాబా గురించి వినాలని, బొమ్మలతో కూడుకున్న బాబా పుస్తకం కావాలని అనుకున్నాను. మరుసటిరోజుకే బాబా నా చేతికి హెడ్‌సెట్ వచ్చేలా చేశారు. ఇంకా, బొమ్మలతో ఉన్న బాబా పుస్తకం తాలూకు పిడిఎఫ్ ఒక గ్రూపులో వచ్చింది. హెడ్‌సెట్‌లో బాబా గురించి వింటుంటే బాబాను పదేపదే చూడాలనిపించింది. వెంటనే ఆ కోరికను నెరవేర్చారు బాబా. అలాగే ఒకసారి 'సాయిబాబా కీ జై!' అనే స్మరణఘోష వింటే ఆరోగ్య సమస్యలు పోతాయని అనిపించింది. అనుకోకుండా బాబా అది వినిపించారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, బాబా ఎన్నో అనుభవాలు ఇస్తూనే ఉన్నారు. నిజంగా ఇది ఎంత మంచి బ్లాగో! చివరిగా ఒక మాట: 'సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య వైపు వెళ్ళేకన్నా బాబా వైపు వెళ్తే అంతా బాగుంటుంది. ఆయన ఉన్నచోటునుంచే సమస్యను తొలగిస్తారు’.


అనుభవాలన్నీ సాయి కృపకు నిదర్శనాలు


ముందుగా సాయిభక్తులకు తమ అనుభవాలను తోటి భక్తులతో పంచుకునే అద్భుతమైన అవకాశాన్నిచ్చిన ఈ బ్లాగ్ నిర్వాహకులకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సాయిభక్తులందరికీ నా వినయపూర్వకమైన ప్రణామాలు. నేను సాయిభక్తుడిని. నా పేరు బాలాజీ. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన రెండు అనుభవాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 


నా తల్లిదండ్రులు సాయిబాబాకు అంకిత భక్తులు. నాకు 10 సంవత్సరాల వయసున్నప్పుడు నా తల్లిదండ్రులు నాకు సాయి మార్గాన్ని పరిచయం చేశారు. అందుకు నేను వారికి సదా కృతజ్ఞుడనై ఉంటాను. నాకు అంతా సాయే. నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ ఆలయాన్ని సందర్శించినా మొదట నా మనసులోకి వచ్చేది సాయినామమే. నేను అంతటా సాయినే చూస్తాను. నేను సాయికి సర్వస్య శరణాగతి చెందాను. నేను నా రోజువారీ ప్రార్థనలో, "సర్వేజనాః సుఖినోభవంతు" అని బాబాను ప్రార్థిస్తాను. ఎందుకంటే, అడగడానికి అంతకంటే ఏమీ లేదు. ఆయన కామధేనువు, కల్పవృక్షంలా అడగకుండానే అన్నీ ఇస్తారు. ఇకపోతే నేను పంచుకోవాలన్న అనుభవాలు ఏమిటంటే.. 


ఇటీవల CA ఫైనల్ ఒక గ్రూపులో ఉత్తీర్ణత సాధించేలా నా కొడుకును సాయి ఆశీర్వదించారు. ఇంకా నా ప్రియమైన సాయి నా సిబ్బందిలో ఒకరు తన భార్యతో అభిప్రాయభేదాల వలన విడాకుల వరకు వెళ్లకుండా కాపాడారు. ఇలా చెప్పుకుంటూపోతే సాయి అనుగ్రహాల జాబితా కొనసాగుతూనే ఉంటుంది. ప్రతిరోజూ ఏదో ఒక అనుభవం జరుగుతూనే ఉంటుంది. ఈ అనుభవాలన్నీ సాయి కృపకు నిదర్శనాలే తప్ప మరొకటి కాదని నా దృఢవిశ్వాసం. సవినయంగా సాయిబాబా పాదకమలాలకు ప్రణామాలు సమర్పించుకుంటూ...


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


ప్రేమతో..

బాలాజీ.


7 comments:

  1. Om sai ram devotee said with sai very problem can be solved by baba.if we trust baba there is no problem.baba loves his devotees. Om sai ram�� ❤❤❤❤

    ReplyDelete
  2. Om sai ram baba Amma problem tondarga cure cheyi thandri pleaseeee

    ReplyDelete
  3. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete
  4. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI.. OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo