సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

కాకాసాహెబ్ దీక్షిత్ - ఏడవ భాగం.....



"గురువినా కౌన్ బతావే బాట్" అనే గేయంలో, 'గురువు లేకపోతే మార్గమెవరు చూపుతారు? గురువు లేదా మార్గదర్శి సహాయం ఉంటే ఎటువంటి కష్టమూ ఉండదు, వాళ్ళు సురక్షితంగా తమ లక్ష్యాన్ని చేరుకుంటారు' అని కబీరు వివరించారు. అయితే శిష్యుడు నిష్ఠ(విశ్వాసం), సబూరి(ధైర్యం, పట్టుదలతో కూడిన ఓరిమి)లు కలిగివుండటంతో పాటు ఫలాపేక్ష లేకుండా తను, మన, ధన, ప్రాణములను గురువు యొక్క చరణాలకు సంపూర్ణంగా సమర్పించుకోవడం అత్యంత ఆవశ్యకం. వాటితోపాటు ప్రాపంచిక అనురక్తి నుండి, కామం, క్రోధం మొదలైన అరిషడ్వర్గాల నుండి బయటపడకపోతే శిష్యుడు ఎన్నటికీ భగవంతుని లేదా గురువుని స్థిరంగా అంటిపెట్టుకోలేడు. కాకాసాహెబ్ దీక్షిత్ సంపూర్ణ విశ్వాసంతో తన తను, మన, ధనములను బాబా పాదాలకు అర్పించుకున్నాడు. అతను తన ప్రాక్టీసును, రాజకీయంగా, సామాజికంగా తనను వరించిన అన్ని గౌరవాలనూ వదులుకొని బాబాకు, ఆయన భక్తులకు సేవ చేస్తూ 1918కి ముందు, ఆ తరువాత, ఒక్క మాటలో చెప్పాలంటే తన జీవితాంతమూ శిరిడీకి అతుక్కుపోయాడు. ఎవరైనా, "కాకా వైరాగ్యంతో సంపాదనను వదులుకుంటే, అతనిపై ఆధారపడిన వారి పరిస్థితి ఏమిటీ?" అని అతని బంధువులు అడిగినట్లే అడగవచ్చు. ఇదే ప్రశ్నను బాలక్‌రామ్ మాన్కర్ విషయంలో కూడా అతని బంధువులు బాబాను అడిగారు. కుటుంబానికి ముఖ్య సంపాదకుడైన మాన్కర్ అకస్మాత్తుగా బాబాకు ఆకర్షితుడై అన్నీ విడిచిపెట్టి బాబా సన్నిధిలోనూ, బాబా ఆదేశం మేరకు ఒంటరిగా మచ్ఛీంద్రగఢ్‌లోనూ గడిపాడు. అప్పుడు అతని బంధువులు, "అతనిలా సంపాదించడం మానేస్తే అతని కొడుకు పరిస్థితి ఏమిటి?" అని బాబాను అడిగారు. అందుకు బాబా, "అతని కొడుకుకి కావలసినవి నేను సమకూరుస్తాను" అని అన్నారు. తాను మాటిచ్చినట్లే బాబా వాళ్ళకు కావాల్సినవన్నీ అందించారు. భవిష్యత్తులో వాళ్లంతా ఆర్థికంగా ఆశించిన ఉన్నతస్థాయిని పొందారు. కాకాసాహెబ్ దీక్షిత్ విషయంలో బాబా ఈ ప్రశ్నకు తొలిరోజుల్లోనే, "కాకా! నీకెందుకు చింత? చింత అంతా నాది (కాకా తులా కైజీ కస్లీ? మాలా సారా కల్జీ అహే)" అని అతనితో చెప్పారు. చెప్పడమే కాదు, దీక్షిత్ బాధ్యత, అతని బంధువుల బాధ్యతంతా తాము తీసుకుని అతనికిచ్చిన వాగ్దానాన్ని నిలుపుకున్నారు. బాబా తమ మహాసమాధికి ముందు, తరువాత కూడా ఆ బాధ్యతను నెరవేర్చారని నిరూపించే అనేక సంఘటనలు ప్రస్తావించవచ్చు.

1913వ సంవత్సరంలో దీక్షిత్ శిరిడీలో బాబా సన్నిధిలో కాలం గడుపుతున్నాడు. ఆ సమయంలో బొంబాయి, విల్లెపార్లేలో చదువుకుంటున్న అతని కొడుకు ఒకటి, రెండు నెలల్లో పరీక్షలున్నాయనగా జ్వరంతో బాధపడ్డాడు. పిల్లవాని జ్వరం రోజులు తరబడి కొనసాగుతుండటంతో దీక్షిత్ సోదరుడు, "ఇక్కడికొచ్చి పిల్లవాణ్ణి చూసుకోమ"ని దీక్షిత్ కి ఉత్తరం వ్రాసాడు. కాకాసాహెబ్ ఆ ఉత్తరాన్ని బాబాకు చూపించినప్పుడు బాబా అతనితో, "నువ్వు వెళ్ళవద్దు. పిల్లవాణ్ణే ఇక్కడికి పంపమ"ని లేఖ వ్రాయమన్నారు. శిరిడీలో సరైన వైద్యసౌకర్యం అందుబాటులో ఉండదేమోననే భయంతో శిరిడీకి పంపడం ఇష్టంలేనప్పటికీ బాబా ఆజ్ఞానుసారం పిల్లాడిని శిరిడీకి పంపాడు దీక్షిత్ సోదరుడు. ఆశ్చర్యంగా శిరిడీ చేరుకున్నాక పిల్లవాని ఆరోగ్యం మెరుగుపడి పూర్తిగా కోలుకున్నాడు. తరువాత దీక్షిత్ సోదరుని వద్దనుండి, ‘నవంబరు రెండవ తారీఖున వార్షిక పరీక్ష ఉందనీ, కాబట్టి చదువుని దృష్టిలో పెట్టుకొని వెంటనే పిల్లవాణ్ణి ముంబాయికి పంపమనీ’ ఉత్తరం వచ్చింది. అప్పుడు బాబాను అనుమతిని అడిగితే, “చూద్దాం” అని మాత్రమే చెప్పి పిల్లవాణ్ణి పంపడానికి ఒప్పుకోలేదు, కనీసం పరీక్ష సమయానికి వెళ్ళడానికి కూడా అనుమతించలేదు. బాబా పిల్లవాని భవిష్యత్తును పాడుచేస్తున్నారని అందరికీ అన్పించింది. కానీ దీక్షిత్ చెదరని విశ్వాసంతో బాబా ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాడు. అతని నమ్మకం వమ్ము కాలేదు. పరీక్షా కేంద్రంలో ప్లేగుతో చచ్చిన ఎలుక కనిపించడంతో 02-11-1913న జరగాల్సిన పరీక్ష 06-11-1913వ తేదీకి వాయిదాపడింది. దాంతో దీక్షిత్ సోదరుని వద్దనుండి “పిల్లవాణ్ణి 6వ తేదీ పరీక్షకు బొంబాయి పంపమ”ని ఉత్తరం వచ్చింది. అప్పుడు కూడా బాబా పిల్లవాణ్ణి పంపడానికి అనుమతించలేదు. అయితే మళ్ళీ పరీక్ష కేంద్రంలో చచ్చిన ఎలుక కనిపించడంతో పరీక్ష 13-11-1913వ తేదికి వాయిదా పడింది. ఈసారి పిల్లవాణ్ణి పంపడానికి బాబా అనుమతించారు. పిల్లవాడు బొంబాయి వెళ్లి పరీక్ష వ్రాసి, ఉత్తీర్ణుడయ్యాడు. బాబా అజ్ఞానుసారం నడుచుకోవడం వల్ల పిల్లవాని ఆరోగ్యం బాగుపడటంతో పాటు పరీక్షలలో కూడా ఉత్తీర్ణుడయ్యాడు.

బాబా దేహత్యాగం చేసిన తరువాత కూడా దీక్షిత్ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండేది. చాలాకాలం పాటు ఆర్థికమాంద్యంలో ఉన్నప్పటికీ అతనెప్పుడూ బాధపడలేదు, నిరాశకు లోనుకాలేదు. 'దేవుడు మనకిచ్చిన దానితో సంతృప్తిగా ఉండాలి' అని తన మనసుకి చెప్పుకొని అంతటి కష్టకాలంలోనూ అతను సంతృప్తిగా, మనశ్శాంతితో ఉండేవాడు. అయితే బాబాపై తనకున్న విశ్వాసాన్ని పరీక్షించి, నిర్ధారించిన కొన్ని ప్రత్యేక సందర్భాలు తలెత్తాయి. బాబా సమాధి చెందిన కొంతకాలానికి ఒక మార్వాడీకి 30,000 రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి దీక్షిత్‌కు ఎదురైంది. గడువు సమీపిస్తున్నా అంత పెద్ద మొత్తాన్ని ఎలా సమకూర్చుకోవాలో అతనికి తెలియలేదు. అటువంటి సమయంలో ఒకరాత్రి అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో మార్వాడీ తనను డబ్బులిమ్మని ఒత్తిడి చేస్తుంటే, దీక్షిత్ ఆ మార్వాడీతో, "మీరేమీ భయపడవద్దు. నాకు చున్నీలాల్, చమన్‌లాల్ వంటి గొప్ప ధనవంతులైన స్నేహితులున్నారు. వాళ్ళనడిగి డబ్బు తీసుకొచ్చి గడువు లోపల మీ బాకీ తప్పక తీరుస్తాను" అని చెప్పాడు. తరువాత అతనికి మెలకువ వచ్చి, కలలో తాను సంభాషించినదానిని గుర్తుచేసుకుని బాధపడ్డాడు. కొండంత దేవుడు సాయిబాబా తనకు అండగా ఉండగా అవసరమైన సమయంలో అక్కరకురాని సామాన్యమానవుల సహాయం పొందాలనుకోవడం తెలివితక్కువతనమని తలచి పశ్చాత్తాపం చెంది, వెంటనే బాబా పటం ముందు కూర్చుని తను చేసిన తప్పును మన్నించమని కన్నీరు కారుస్తూ ఆర్తిగా ప్రార్థించాడు. బాబా తమ భక్తులను కష్టసమయంలో ఆదుకుంటారని భావించి తన బరువు బాధ్యతలన్నీ బాబాపై వేసి నిశ్చింతగా గడపసాగాడు. కానీ, అప్పు తీర్చవలసిన గడువు తేదీ దగ్గరపడినప్పటికీ డబ్బు అందే అవకాశమేదీ కనపడలేదు. సరిగ్గా గడువు తేదీకి ముందురోజు దీక్షిత్ ఆఫీసులో ఉండగా అతని సన్నిహిత స్నేహితుని కుమారుడు అతని వద్దకు వచ్చాడు. తన వద్ద 30 వేల రూపాయలు ఉన్నాయనీ, ఆ మొత్తాన్ని ఎలా పెట్టుబడి పెడితే బాగుంటుందో తెలుపమనీ దీక్షిత్‌ను అడిగాడు. దీక్షిత్ మొదట పెట్టుబడులు, వాటి సాధకబాధకాల గురించి వివరించాడు. ఒకవేళ ఆ డబ్బును తన దగ్గర మదుపు చేసే ఆలోచన గనుక ఉంటే తనను చివరగా పరిగణనలోకి తీసుకోమనీ, అతని తండ్రితో ఉన్న సాన్నిహిత్యాన్ని ఆధారంగా చేసుకుని లాభపడాలనే ఉద్దేశ్యం తనకు ఎంతమాత్రం లేదనీ చెప్పాడు. అంతేకాదు, ప్రస్తుతం తన ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆ డబ్బును గడువులోగా బహుశా తిరిగి చెల్లించలేకపోవచ్చని నిస్సంకోచంగా చెప్పాడు. ఇదంతా విని ఆ వ్యక్తి ఏ మాత్రం భయపడకపోగా అంత నిజాయితీగా అన్ని విషయాలూ చెప్పడం వల్లే దీక్షిత్‌కు ఆ డబ్బు ఇవ్వాలని నిర్ణయించుకున్నానని చెప్పి, తండ్రి సమానులకు కష్టసమయంలో సహాయం చేయడం కుమారునిగా తన కర్తవ్యమనీ, అందువల్ల ఆ డబ్బును స్వీకరించవలసిందేననీ పట్టుబట్టి ఆ డబ్బును దీక్షిత్‌కు ఇచ్చాడు. దాంతో దీక్షిత్ గడువులోగా అప్పును తీర్చగలిగాడు. తమను సంపూర్ణంగా నమ్మినవారిని బాబా తప్పక ఆదుకుంటారనే దానికి ఇదొక ఉదాహరణ. 

తమ భక్తులకు సహాయపడే కార్యంలో భాగంగా ఎంతోమంది ఆలోచనల్లో, సంకల్పాలలో మార్పు తేగలరనీ, వేలాది రూపాయలను తమ భక్తుల కోసం సమకూర్చిపెట్టగల సమర్థులనీ ఈ లీల ద్వారా బాబా నిరూపించారు. కొన్ని సంకట పరిస్థితుల్లో బాబా వ్యవహరించే తీరు తరచూ ఈ విధంగానే ఉండేది. ఉదాహరణకు, జోగ్ పితృశ్రాద్ధము చేసే సమయానికి వచ్చేలా బ్రాహ్మణుల మనస్సును బాబా మలిచారు. ఇంకోసారి, శిక్షపడబోయే తమ సేవకుడు రఘుపాటిల్‌కు న్యాయం చేయడానికి తీర్పు చెప్పే న్యాయమూర్తి మనస్సును ప్రభావితం చేశారు. మరో సందర్భంలో, ఖపర్డేపై న్యాయవిచారణకు అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వ అధికారుల మనసును ప్రభావితం చేశారు. 1911, జూన్ నెలలో ఉపాసనీ మహరాజ్ శిరిడీకి వచ్చేలా చేయడంలో బాబా కొందరి మనస్సులను ప్రభావితం చేశారు. ఇలా ఎన్నో సంఘటనలను ప్రస్తావించవచ్చు. బాబాకు అన్నీ తెలుసు, అందరి మనస్సులూ వారి అధీనంలో ఉంటాయి. కనుక తమనే నమ్ముకున్న దీక్షిత్‌ను ఋణవిముక్తుణ్ణి చేయడానికి సరైన సమయానికి అతని స్నేహితుని కుమారుడిని 30,000 రూపాయలతో తీసుకొచ్చారు. దీక్షిత్‌కు ఇలాంటి ఎన్నో అనుభవాలున్నాయి. అవి పసిబిడ్డ తన తల్లిపై పూర్తిగా ఆధారపడినట్లు అతను తన గురువైన బాబాపై ఆధారపడటాన్ని ధ్రువీకరిస్తాయి.

కానీ ఆర్థికపరమైన విషయాలు అంత ప్రాధాన్యమైనవి కావు. అంతకంటే, ఆత్మ యొక్క పరిపక్వత, పూర్వార్జిత వాసనా క్షయం, బలాన్ని పెంపొందించుకోవడం మరియు పరిపూర్ణమైన నిష్ఠ, సబూరీల ఆధారంగా శాంతిని పరిపూర్ణం చేసుకోవడం అత్యంత ఉత్తమమైనవి. దీక్షిత్ యొక్క ఈ విషయాలలో కూడా బాబా బాధ్యత వహించారు. ఆయన తన కాకాను విమానంలో తీసుకెళ్తామని తొలిరోజులలోనే స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ మాటల మర్మమేమిటి? దాని గురించి పురాణాల్లో చెప్పబడింది. ఇంకా తుకారాం వంటి వ్యక్తుల పవిత్ర ఆత్మలు మరణానంతరం విమానంలో స్వర్గాన్ని చేరుకుంటాయని అంటారు. ఆ దృష్ట్యా బాబా మాటలను పరికిస్తే, కాకాకు అత్యంత ఉత్తమమైన సద్గతి ప్రాప్తిస్తుందనీ, అతని భవిష్యత్తు, మరణం సంతోషంగా, ప్రశాంతంగా ఉంటాయన్న గొప్ప హామీని బాబా ఇచ్చారనీ అర్థమవుతుంది.

భగవద్గీత, 8వ అధ్యాయం, 6వ శ్లోకం: 

యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరమ్|
తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః||  
 
భావం: కౌంతేయా! మనుష్యుడు అవసానదశయందు ఏ ఏ భావములను స్మరించుచూ దేహత్యాగం చేయునో అతను మరుజన్మలో ఆయా స్వభావములనే పొందును. ఏలనన అతడు సర్వదా వానినే స్మరించుచుండును.

కాబట్టి శ్రీకృష్ణుడు ఇచ్చిన సలహా ఏమిటంటే:-

తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ|
మయ్యర్పితమనోబుద్ధిః మామేవైష్యస్యసంశయమ్||

భావం: కావున ఓ అర్జునా! నీవు సర్వదా నన్నే స్మరించుచుండుము. యుద్ధమును (కర్తవ్యకర్మను) కూడా చేయుము. ఈవిధముగా నీ మనోబుద్ధులను నాయందే నిలిపియున్నచో నిస్సందేహంగా నన్నే పొందుదువు.

అందుకే చాలామంది తమ అంత్యకాలమందు భగవంతుని గురించి ఆలోచించేందుకు ప్రయత్నిస్తారు. కానీ జీవితకాలమంతా ప్రాపంచిక అనుబంధాలలో తలమునకలై చివరిక్షణంలో దేహాన్ని విడిచిపెట్టేటప్పుడు భగవంతుని గురించి ఆలోచించడమన్నది ఎంత మాత్రమూ సులభం కాదు. కానీ, దీక్షిత్ మాత్రం ఎల్లప్పుడూ బాబా స్మరణలోనే గడిపేవాడు. అతను ప్రతినిత్యం, "బాబా! మీ పాదాల యందు ప్రేమ, భక్తి అధికమవ్వనీ. దేవా! మీ పాదాల యందు ప్రేమ పెరగనీ. బాబా! మీ పాదాల యందు నా ప్రేమ వృద్ధి కానివ్వండి. ఇదే నా చివరి ప్రార్థన" అంటూ అచంచల భక్తితో బాబాను ప్రార్థించేవాడు. అంతటి భక్తునికి బాబా సద్గతిని ఎలా ప్రసాదించారో చూద్దాం. 

కాకా మరణం – సద్గతి

అందరూ తమ ప్రస్తుత జన్మకు మంచి ముగింపు లభించాలని కోరుకుంటారు. సాధారణంగా ఏకాదశి రోజున మరణిస్తే స్వర్గానికి చేరుకుంటామని ఎంతోమంది విశ్వసిస్తారు. ఆ విశ్వాసం దీక్షిత్‌కి బలంగా ఉండేది. ఆ విషయాన్ని అతను తాను సచ్చరిత్రకు వ్రాసిన ముందుమాటలో ప్రస్తావించారు. అది అతని సంతకంతో పాటు 1923, సాయిలీల మాసపత్రికలో ప్రచురితమైంది. అందులో దీక్షిత్, 'హరి భక్తుల మరణం హరికి ప్రియమైన ఏకాదశిరోజున సంభవిస్తుంది' అని పేర్కొనడమే కాకుండా కాశీరాం, అప్పాభిల్ వంటి కొంతమంది సాయిభక్తులకు బాబా ఏకాదశిరోజున మరణాన్ని ప్రసాదించారని కూడా వ్రాశాడు. తరువాతి కాలంలో మహల్సాపతి, నానాసాహెబ్ చాందోర్కర్, తాత్యాకోతేపాటిల్ మొదలైన సాయిభక్తులు కూడా ఏకాదశి రోజున మరణించారని మనం గమనించవచ్చు. భగవంతునిపై ఏకాగ్రదృష్టి నిలిపేందుకు ఏకాదశి ప్రశస్తమైన రోజనీ, ఆ రోజున ఉపవాసం, భజన, పవిత్రగ్రంథాల అధ్యయనం మరియు ధ్యానములలో గడపాలని శాస్త్రాలలో చెప్పబడింది. కాకాసాహెబ్ దీక్షిత్ విషయంలో ఇవన్నీ తన ఆచరణలో ఉండేవి. దీక్షిత్ ప్రతిరోజూ భావార్థ రామాయణం, ఏకనాథ భాగవతం గ్రంథాలను పఠిస్తూ ఉండేవాడు. సాయిబాబాతో లోతైన అనుబంధమున్న సచ్చరిత్ర రచయిత అన్నాసాహెబ్ దభోల్కర్‌తోనూ మరియు సాయిబాబా భజనమాల పేరుతో సాయిబాబాపై అసంఖ్యాక భజన గీతాలు స్వరపరిచిన టెండూల్కర్ కుటుంబంతోనూ దీక్షిత్‌కు చెప్పుకోదగ్గ గొప్ప సాహచర్యం ఉండేది. వారిరువురూ దీక్షిత్ చేసే ఏకనాథ భాగవత పారాయణ శ్రవణం చేయడానికి నిత్యమూ హాజరవుతుండేవారు. 1926, జూలై 4న పారాయణకు హాజరైన వారిరువురూ భారీవర్షం కారణంగా ఆరోజు అక్కడే ఉండిపోయారు. మాధవరావు దేశ్‌పాండే కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నాడు. ఆరోజు రాత్రి దీక్షిత్ తన పారాయణలో భాగంగా ఏకనాథ భావార్థ రామాయణంలోని 21వ అధ్యాయమైన సుందరకాండ పఠించాడు. అందులో గజేంద్రమోక్షము గురించి వచ్చింది. అదేరోజు రాత్రి అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో అతనికి బాబా దర్శనమిచ్చారు. బాబా నేరుగా వచ్చి దీక్షిత్ కప్పుకున్న దుప్పట్లో దూరారు. దీక్షిత్ ఎంతో ప్రేమగా బాబాను ఆలింగనం చేసుకున్నాడు. అంతటితో కల ముగిసింది(ఒక్కో ఆర్టికల్ లో ఒక్కోలా ఉన్న ఈ కల గురించి విజయకిషోర్ గారు తమ దీక్షిత్ డైరీలో లోతుగా విశ్లేషించి, ఒక స్పష్టత ఇచ్చారు. దాన్నే ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది). మరుసటిరోజు 1926, జులై 5, ఏకాదశి. ఉదయం నిద్రలేచాక దీక్షిత్ తనకొచ్చిన కల గురించి అన్నాసాహెబ్, షామా, లగాటే తదితరులతో పంచుకున్నాడు. ఆ తరువాత వాళ్ళంతా కొంతసమయం భజన, గ్రంథపారాయణలో గడిపారు. దీక్షిత్ చేసిన ఏకనాథ భాగవత పారాయణలో 25వ అధ్యాయం, ఏకాదశ స్కంథంలో, ముఖ్యంగా 23వ శ్లోకంలో అష్టమహాసిద్ధుల గురించి ఇలా చెప్పబడింది.

'పరకాయం విశన్ సిద్ధః ఆత్మానం తత్ర భావయేత్,
పిండం హిత్వా విశత్ ప్రాణో వాయు భూత షడంఘ్రివత్'

భావం: పరకాయ ప్రవేశం చేయాలనుకునే యోగి ముందుగా ఆ జీవితో మానసికంగా తాదాత్మ్యం చెందుతాడు. ఆ తరువాత, తేనెటీగ ఒక పువ్వును విడిచిపెట్టి మరొక పువ్వు మీద వాలినంత తేలికగా యోగి తన శరీరాన్ని విడిచి, సూక్ష్మరూపంలో ఆ జీవి శరీరంలోకి ప్రవేశిస్తాడు.

పై చరణానికి ఏకనాథుడు ఇచ్చిన అత్యంత అద్భుతమైన వ్యాఖ్యానాన్ని గుండెలనిండా పొంగిపొర్లుతున్న భక్తిప్రేమలతో పఠించాడు దీక్షిత్. భవిష్యత్ పరిణామాల దృష్ట్యా అది ఆ సందర్భానికి ఎంత సముచితమైన శ్లోకమో తరువాత అందరికీ అర్థమైంది. పారాయణ ముగిసిన తరువాత దభోల్కర్, టెండూల్కర్‌లు తమ తమ ఇళ్లకు బయలుదేరుతుండగా, బొంబాయిలోని డాక్టర్ దేశ్‌ముఖ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన కొడుకు రామకృష్ణను చూడటానికి దీక్షిత్ కూడా వాళ్లతో పాటు బయలుదేరాడు. వాళ్ళంతా కాస్త ఆలస్యంగానే స్టేషనుకి చేరుకున్నప్పటికీ వాళ్ళు ఫ్లాట్‌ఫారం మీదికి వెళ్ళగానే రైలు వచ్చి ఆగింది. ముగ్గురూ ఒక బోగీలోకి ఎక్కారు. అప్పుడు దభోల్కర్‌తో దీక్షిత్, "అన్నాసాహెబ్! చూడండి, బాబా ఎంతటి దయామయులో! మనం రాగానే రైలు అందేలా చేశారు. ఒక్క నిమిషమైనా మనల్ని వేచివుండనివ్వలేదు" అని అన్నాడు. తరువాత అతను తన జేబులో ఉన్న రైల్వే టైమ్‌టేబుల్ తీసి చూస్తూ, "బాబానే రైలు ఆలస్యంగా వచ్చేలా చేసి మనం సమయానికి అందుకునేలా చేశారు. లేకుంటే మనం కొలాబాలో దిగి వేరొక రైలుకోసం నిరీక్షిస్తూ నిరుత్సాహపడేవాళ్ళం. ఇదే సాయి దయ!" అని అన్నాడు. అన్నాసాహెబ్, కాకాసాహెబ్ ఎదురెదురుగా కూర్చున్న తరువాత ప్రేమపూర్వకమైన బాబా కరుణను గుర్తుచేసుకుంటూ కాకాసాహెబ్ కళ్ళు మూసుకున్నాడు. అంతలోనే దీక్షిత్ తూలుతున్నట్లు గమనించిన అన్నాసాహెబ్, బహుశా అతనికి నిద్రవస్తోందని తలచి, నిద్రలో అతని తల ప్రక్కకు వాలిపోకుండా తన భుజాన్ని ఆసరా ఇవ్వాలని భావించి దీక్షిత్ ప్రక్కకు వెళ్లి, "మీకు నిద్రొస్తోందా?" అని అడిగారు. దీక్షిత్ నుండి ఎటువంటి సమాధానమూ రాకపోవడంతో అతనికి స్పృహతప్పిందేమోనని భయపడి కాకాను బెర్తు మీద పడుకోబెట్టాడు అన్నాసాహెబ్. రైలు వేగంగా పరుగులు తీస్తోంది. అన్నాసాహెబ్ తన స్నేహితుడు టెండూల్కర్‌తో, "నేను వచ్చే స్టేషనులో దిగి గార్డుతో మాట్లాడతాను. మనం కాకాను క్రిందికి దించుదాం" అని చెప్పాడు. కానీ భారీవర్షం మరియు రద్దీ కారణంగా అన్నాసాహెబ్ బాంద్రాలో రైలు దిగలేకపోయాడు. తరువాత వచ్చిన మాహిమ్ స్టేషనులో దిగి గార్డుతో మాట్లాడి విషయం చెప్పాడు. వెంటనే గార్డు ఫోన్ చేసి పరేల్ స్టేషన్లో ఒక స్ట్రెచర్, డాక్టర్ సిద్ధంగా ఉండేలా ఏర్పాటు చేశాడు. తరువాత పరేల్ రాగానే కాకాసాహెబ్‌ని క్రిందికి దించారు. డాక్టర్ పరీక్షించి కాకాసాహెబ్ మరణించినట్లు నిర్ధారణ చేశాడు. ఆకస్మిక మరణమైనందున విచారణ జరుపకుండా శరీరాన్ని అప్పగించే పరిస్థితి లేదు. పైగా ఇంకెన్నో సమస్యలు తలెత్తే అవకాశముంది. అయినప్పటికీ అదృష్టవశాత్తూ ఆ డాక్టర్ దీక్షిత్ మరణ ధృవీకరణ పత్రంతో పాటు, దీక్షిత్ పార్థివదేహాన్ని కూడా అన్నాసాహెబ్‌కు అప్పగించారు. అటు తర్వాత దీక్షిత్ పార్థివదేహానికి అంత్యక్రియల ఏర్పాట్లు చేశాడు అన్నాసాహెబ్. ‘నా కాకాను విమానంలో తీసుకెళ్తామ’న్న తమ బాధ్యతను బాబా ఎలా నెరవేర్చారో ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం. దేహత్యాగానికి ముందు దీక్షిత్‌కి ఎటువంటి బాధా, భయమూ లేవు. తన దైవమైన సద్గురు సాయి కృపకు పరవశిస్తున్న క్షణంలో అతనికి మరణం ప్రాప్తించింది. అటువంటి మరణాన్ని పొందిన అతను గీతలో భగవానుడు చెప్పినట్లు సాయి సాయుజ్యాన్ని ఖచ్చితంగా పొందివుంటాడు. భక్తతుకారాం విమానంలో స్వర్గానికి తీసుకొని వెళ్ళబడటం ఒక చక్కని, ఆనందకరమైన, అద్భుతమైన ముగింపు. కానీ అది ఒక చమత్కారం. అయితే ఏ చమత్కారమూ లేకుండా బాబా తన కాకాకు ఎంతో ఉత్తమమైన ముగింపునిచ్చి తమ వాగ్దానాన్ని నెరవేర్చారు.

"భగవంతుడి ప్రతినిధులు అంతటా ఉన్నారు. వారికి విస్తారమైన శక్తులున్నాయి. నాకూ విస్తారమైన శక్తులున్నాయి" అని చెప్పిన బాబా, తాము ఆ శక్తులను ఎలా ఉపయోగిస్తున్నారో పేర్కొంటూ వివిధ సందర్భాలలో, "నువ్వు నిశ్చలంగా కూర్చో, అవసరమైనదంతా నేనే చేస్తాను. చివరికంటా నిన్ను గమ్యం చేరుస్తాను" అనీ, "ఈ సద్బ్రాహ్మణుడు లక్షలాదిమందిని శుభ్రమార్గాన గమ్యం చేరుస్తాడు" అనీ, "మరణ సమయమున నా భక్తులను నేను నా వద్దకు లాక్కుంటాను” అనీ, “శిరిడీకి వేల మైళ్ళ దూరంలో ఉన్నా అంత్యకాలమందు నా భక్తులను నా వద్దకు లాక్కుంటాను" అనీ, "నేను నా భక్తుని నష్టపోనివ్వను” అనీ, “భగవంతుడు నాకప్పగించిన ప్రతిజీవినీ తిరిగి నేను ఆ భగవంతునికి అప్పగించాలి" అనీ చెప్పారు. అంతేకాదు, 1912, జనవరిలో మరణించిన ఉపాసనీ భార్యను ప్రస్తావిస్తూ బాబా, "ఆమె (ఆత్మరూపంలో) నా దగ్గరకు వచ్చింది" అని అన్నారు. "నేను రోహిల్లా పిష్యా మరియు రావుసాహెబ్ గాల్వంకర్‌లను వారి వారి తల్లుల గర్భంలో ఉంచాను" అని అన్నారు. మరణించిన రేగే బిడ్డ గురించి, "తను నా హృదయాన్ని చేరుకుంది. శాశ్వతంగా అక్కడే ఉంటుంది" అని చెప్పారు. దీనిని బట్టి సద్గతిని ప్రసాదించడమే బాబా కర్తవ్యమని అవగతమవుతుంది.

శ్రీవాసుదేవ సరస్వతి ఇలా చెప్పారు:

సంతపస్చి సదా జావే త్యాంచే జవాలి బైసావే
ఉపదేశ తే నా దేతి తారి ఐకవ్య త్యా గోష్ఠి
తేచి ఉపదేశ హోతి త్యాచి కష్ట నష్ట హోతి
వాసుదేవ హ్మణే శాంత సంగే కరీతి పాశంత

భావం: మనం సత్పురుషుల చెంతకు వెళ్లి వాళ్ళ సాంగత్యంలో ఉందాము. వాళ్ళు ఎటువంటి ఉపదేశం ఇవ్వకపోయినా వారి పెదవుల నుండి జాలువారే ప్రతి మాటనూ ఆలకిద్దాం. వారి ప్రతిమాటా ఉపదేశమవుతుంది. వారి ప్రభావంతో మన కష్టాలన్నీ సమసిపోతాయి. సత్సంగం వలన పరమసుఖం కలుగుతుంది.

ఇది దీక్షిత్‌కు మాత్రమే కాదు, బాబా దర్శనం కోసం శిరిడీ వెళ్లిన ప్రతి భక్తుని అనుభవం కూడా. బాబా ఎప్పుడూ ఎవరికీ ఎటువంటి ఉపదేశాన్ని ఇవ్వకపోయినా వారి ప్రతి మాట, చర్య పూర్తి బోధతో కూడుకొని స్ఫూర్తిదాయకంగా ఉండేవి. దీక్షిత్ 1909 నుండి 1918 వరకు తొమ్మిదేళ్ళ కాలంలో బాబా ప్రతి మాటను, చర్యను, కృత్యాన్ని అధ్యయనం చేశాడు. ఈ అధ్యయనం బాబాతో అతనికున్న వ్యక్తిగత అనుబంధానికి తోడు ప్రత్యేక సత్సంగమైంది. అలా అతను తన మది నిధిలో నిక్షిప్తం చేసుకున్న బాబా పలుకులను, చర్యలను 1923లో తాను ప్రారంభించిన శ్రీసాయిలీల మాసపత్రికలో 'మహరాజాంచే అనుభవ్', 'మహరాజాంచి బోధ్ పద్ధతి' మరియు 'మహరాజాంచి బోల్' అనే శీర్షిక క్రింద వ్యాసాలుగా ప్రచురించాడు. అంతేకాదు, దాదాపు శిరిడీ సందర్శించే ప్రతి భక్తుడూ దీక్షిత్‌ని కలసి తమ అనుభవాలను అతనితో పంచుకుంటూ ఉండేవారు. వాటిని కూడా సాయిలీల పత్రికలో ప్రచురించి సాయిబాబాకు, సాయి ఉద్యమానికి దీక్షిత్ చేసిన సేవ ఎనలేనిది.

సామాన్య భక్తులకు ఉపాసనీ మహరాజ్, కుశాభావు వంటి భక్తుల అనుభవాల కంటే దీక్షిత్ అనుభవాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. ఎందుకంటే, దీక్షిత్ సద్గురువు, అతీతమైన ఆధ్యాత్మిక జీవితం వంటి వాటి ఛాయలే లేని సాధారణ న్యాయవాద జీవితాన్ని గడిపి, 45 ఏళ్ళు నిండిన తరువాత అపారమైన బాబా దయవల్ల మొదటి దర్శనంతోనే తనకు తాను తన సద్గురువైన సాయికి అప్పగించుకోగలిగాడు. ఫలితంగా తన పూర్తి బాధ్యత తమదన్న గొప్ప భరోసాను బాబా నుండి పొందాడు. ఆ హామీపై సంపూర్ణంగా ఆధారపడటం వలన శాంతి, నిశ్చలతను అనుభవించాడు. సద్గురువునందున్న పూర్ణమైన నిష్ఠ, సబూరీలతో తన ప్రాపంచిక, ఆధ్యాత్మిక వ్యవహారాలను కొనసాగిస్తూ అత్యంత ఉత్తమమైన జీవిత లక్ష్యాన్ని చేరుకోగలమన్న భరోసాను పొందాడు. చివరికి సద్గురువు తనను విమానంలో తీసుకొనిపోగా సంతోషకరమైన మరణాన్ని పొందాడు. మనలో చాలామంది లక్ష్యంగా పెట్టుకోవాల్సింది ఇదే. అయితే 1902-1918 మధ్యకాలంలో దీక్షిత్‌కు బాబాతో ఉన్న ప్రత్యక్ష అనుబంధం ఈనాడు మనకు లేదని ఎవరైనా అనవచ్చు. కానీ సాయిబాబా మరణించలేదు. ఆయన భగవంతుడు, ఆయనకు మరణంలేదు. కాలం సాయిని కనుమరుగు చేయలేదు, ఆచారం అనంతమైన ఆయన గొప్పతనాన్ని చప్పబరచలేదు. 

1918లో బాబా దేహత్యాగం చేసిన తరవాత వారి పార్థివదేహం ద్వారకామాయిలో ఉండగానే తెల్లవారితే బుధవారమనగా, షామా మేనమామయైన లక్ష్మణ్ మామా జోషీకి బాబా స్వప్నంలో కనిపించి, “త్వరగా లే! బాపూసాహెబ్ జోగ్ నేను మరణించాననుకొంటున్నాడు. అందువల్ల అతడు ఆరతి ఇవ్వడానికి రాడు. నీవు వచ్చి కాకడ ఆరతి ఇవ్వు!” అని ఆదేశించారు. (బాబా ఆ స్వప్నంలో చెప్పినట్లే ప్రతిరోజూ బాబాకు ఆరతులు నిర్వహించే జోగ్ బుధవారం ఉదయం కాకడ ఆరతి ఇవ్వడానికి రాలేదు! మసీదులో ఉన్న మౌల్వీలు ఎంత అభ్యంతరం పెడుతున్నా లెక్కచెయ్యకుండా లక్ష్మణ్ జోషీ బాబాకు కాకడ ఆరతి చేసి వెళ్ళిపోయాడు. ఆ విషయం తెలిసి జోగ్ మధ్యాహ్న ఆరతికి యథాప్రకారం వచ్చాడు.) అంతేకాదు, బాబా తరచూ, "నా సమాధి మాట్లాడుతుంది, సర్వస్య శరణుజొచ్చినవారి వెంటే తిరుగుతుంది. నేను నా సమాధి నుండి కూడా అప్రమత్తుడనై ఉంటాను. సమాధి చెందిన తరువాత కూడా నేను మీతో ఉంటాను. మీరు ఎక్కడున్నా నన్ను తలచుకున్న మరుక్షణం నేను మీతో ఉంటాను. ఎవరైనా నన్ను ప్రేమతో పిలిచిన వెంటనే నేను వారి ముందుంటాను. నా ప్రయాణానికి వాహనం అవసరం లేదు" అని చెప్తుండేవారు. కాబట్టి సాయిపై దృష్టి కేంద్రీకరించాలనే ధృఢమైన కోరిక, పట్టుదల ఉంటే గనక నేడు కూడా బాబా మాట వినవచ్చు, వారి సాంగత్యాన్ని పొందవచ్చు. అది కూడా ఎటువంటి అద్భుత చమత్కారాలు లేకుండా, వివిధ భాషలలో అందుబాటులోనున్న సాయి సాహిత్యాల అధ్యయనం, శ్రవణం, మననం, నిధిధ్యాసనం మొదలైన చాలా సాధారణ మార్గాల ద్వారా. ఇంకా ఆనాడు దీక్షిత్ చేసిన అదే పూజ, భజన, పవిత్ర గ్రంథాల పారాయణ, ధ్యానం నేడు కూడా మనం చేయవచ్చు. సాయిబాబాకు, సాయి సంస్థాన్‌కు 14 సంవత్సరాలపాటు ఆత్మసమర్పణ భావంతో సేవ చేసుకునే గొప్ప అవకాశాన్ని, సామర్థ్యాన్ని దీక్షిత్ కలిగి ఉన్నాడనడంలో సందేహం లేదు. అయితే అలాంటి సేవ ఇప్పుడు కూడా చాలామందికి వారి వారి శక్తిసామర్థ్యాలు, అవసరాలననుసరించి అందుబాటులో ఉంది. ముఖ్యంగా దీక్షిత్‌ను సాయి అధీనంలో స్థిరంగా ఉంచిన రెండు ప్రధానాంశాలైన 'సాయి సేవ, సాయి ధ్యానం' ఇప్పటికీ మన అందరి అందుబాటులో ఉన్నాయి. అయితే బాబాపై మరింత సమర్థవంతంగా ఏకాగ్రదృష్టి నిలిపేందుకు దీక్షిత్‌కు బాబా విధించిన తొమ్మిది నెలల ఏకాంతవాసం ఉందని అనవచ్చు. కానీ అటువంటి ఏకాంతవాసం చేస్తామంటే, ఏకాగ్రదృష్టి నిలుపుతామంటే ఎవరు మనల్ని అడ్డుకుంటారు? కొందరు, ‘సాయిబాబా భౌతికదేహంతో ఉండి, అన్ని బాధ్యతలు తీసుకొని అన్నివిధాలా దీక్షిత్ కిచ్చిన రక్షణ కంటే అధిక రక్షణను నేడు బాబా మనకి ఇవ్వగలరా?’ అని అనుకోవచ్చు. కానీ ఆ అభిప్రాయం తప్పు. బాబా దేహత్యాగం చేసిన తరువాత కూడా 1918 నుండి 1926 వరకు దీక్షిత్ బాబా రక్షణను పొందాడు. ఇదివరకు చెప్పుకున్న 30,000 రూపాయల ఋణాన్ని తీర్చిన ఉదంతాన్ని ఇందుకు ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. అయినప్పటికీ ‘ఈ విధంగా బాబా తమకు రక్షణ కల్పిస్తారా?’ అని అజ్ఞానులు, చెడు మనస్తత్వం గలవారు మాత్రమే క్షణక్షణం అనుమానపడుతూ ఉంటారు. ఇలా సందేహించడమంటే, "సమాధి అనంతరం కూడా మీరు నన్ను తలచుకున్న మరుక్షణం ఏ ప్రదేశంలోనైనా నేను మీతో ఉంటాను" అని చెప్పిన బాబాయందు, వారి బోధనల యందు విశ్వాసం లేకపోవడమే! కాస్త శ్రమ తీసుకొని ఉత్సుకతతో 1918 తరువాత భక్తులు పొందిన అనుభవాలను చదివితే, 1918కి ముందు ఉన్నట్లే నేడు కూడా బాబా రక్షణ ఖచ్చితంగా ఉందని రూడి అవుతుంది. దీక్షిత్ గురించి జాగ్రత్తగా అధ్యయనం చేస్తే, చాలామంది తమ జీవితాలను సరిగ్గా దీక్షిత్ జీవించిన మార్గంలో నడుపుకోగలిగే వీలు కల్పించుకోగలుగుతారు, రోజురోజుకీ విశ్వాసం, సహనం మరింతగా వృద్ధిపరచుకుంటారు. వారి సహనం దీక్షిత్ చెప్పిన సంతృప్తి అనే సూత్రం మీద ఆధారపడి ఉంటుంది (‘ఠేవిలే అనంతే తైసేచ్ రహావే’ - అంటే భగవంతుడు మనకు కేటాయించిన దానితో సంతృప్తి చెందాలని). కాబట్టి దీక్షిత్ కనబరిచిన అదే విశ్వాసం, అదే శరణాగతుల ద్వారా మనలో ప్రతి ఒక్కరూ సద్గురు సాయి నుండి దీక్షిత్ పొందినటువంటి అభయాన్ని పొందవచ్చు. పర్యవసానంగా నిర్భయత్వాన్ని, ప్రశాంతతను, దీక్షిత్ పొందినటువంటి సంతోషకరమైన మరణాన్ని నిశ్చయంగా పొందవచ్చు.

రాస్నే, ధుమాళ్, ఎమ్.బి.రేగే మొదలైన చాలామంది, ఇంకా ఇప్పుడు కూడా మనలో చాలామంది తమను సంరక్షించే దైవమైన సాయి దయ, జాగరూకతల యొక్క ప్రయోజనాలను తమ రోజువారీ వ్యవహారాలలో అనుభూతి చెందుతూ, తాము బాబాకు చెందినవారమనీ, ‘నా భక్తుల యోగక్షేమాలకు నేనే బాధ్యత వహిస్తాన’న్న తమ వాగ్దానాన్ని బాబా నిలుపుకుంటున్నారనీ మనకు భరోసా ఇస్తున్నారు. ఇదంతా విశ్వాసానికి సంబంధించినది. విశ్వాసం దృఢంగా ఉన్నట్లయితే ఫలితం త్వరగా లభిస్తుంది, అపారమైన బాబా రక్షణను ఆస్వాదించాలనే భావన ఏర్పడుతుంది మరియు మానసిక ప్రశాంతత, సంతోషం చేకూరుతాయి.

షేక్‌స్పియర్ రచించిన హామ్లెట్ లేదా కాళిదాస శకుంతల వంటి క్లాసిక్ రచనలు పదేపదే చదువుతుంటే క్రొత్త అర్థాలు మరియు క్రొత్త అందాలు వెల్లడవుతాయి. అలాగే బాబా జీవితం, వారి బోధనలు, చర్యల గురించి చదవటంలో శ్రద్ధను పెంపొందించుకుంటే క్రొత్త అర్థాలు, క్రొత్త అన్వయాలు మరియు మనల్ని మనం మార్చుకోవడానికి, బాబాను సేవించడానికి క్రొత్త అవకాశాలు తెలుస్తాయి. సాయి ప్రేమ, వారి బోధనలలో నిత్య తాజాదనం విశ్వాసాన్ని దృఢపరుస్తుంది.

సమాప్తం...

source: సాయిపథం - ప్రధమ సంపుటము,
లైఫ్ అఫ్ సాయిబాబా by బి.వి.నరసింహస్వామి
రిఫరెన్స్: దీక్షిత్ డైరీ బై విజయకిషోర్.

  ముందు భాగం కోసం బాబా పాదుకలు తాకండి. 


15 comments:

  1. Super very nice you have written.Deekshit is baba's devotee.he worshipped baba with hole heart.very nice story.where we get sai leela magazine book.om sai ram ❤��������

    ReplyDelete
  2. sai leela magazine available only at shiridi samsthan. we may subscribe thru samsthan app or website

    ReplyDelete
  3. ఓం సాయిరాం!🙏🙏🙏🙏

    ReplyDelete
  4. Kothakonda SrinivasApril 25, 2021 at 12:55 PM

    ఓం సాయిరాం!����������

    ReplyDelete
  5. Kothakonda SrinivasApril 25, 2021 at 12:57 PM

    ఓం సాయిరాం!��������

    ReplyDelete
  6. Suryanarayana Murthy NittalaApril 25, 2021 at 12:58 PM

    Really by saibaba grace, The Article on Kakasaheb Deekshit was an excellent golden diamonded one.Those who gone through your article they mould themselves as True Saibhaktas.Once again thanking you and praying Baba to bless you all.

    ReplyDelete
  7. OM Sairam
    Sai Always be with me

    ReplyDelete
  8. Sai ram ammki thoduga undu
    treatment ki help chieyi sai

    ReplyDelete
  9. Om sai ram baba ma andari arogyalu bagundela chudu sai thandri pleaseeee

    ReplyDelete
  10. While reading dixit's article, tears are continously flowing through my eyes with bliss and overwhelming joy. My respect tripled towards dixit after reading these articles. May baba bless me at least one quality in dixit. I wonder how could be possible to live or follow baba's words without a single thought in a such a difficult situations. You are such a great soul ������

    ReplyDelete
  11. Om sairam
    Jai sairam
    🙏🙏🙏

    ReplyDelete
  12. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్ధం కావట్లేదు. దీక్షిత్ జీవించిన విధానం, బాబా పైన చూపించిన అచంచలమైన భక్తివిశ్వాసాలు మనందరికీ మార్గదర్శకత్వాలు. బాబా పాదాలను నమ్ముకుంటే చాలు, అన్నీ ఆయనే చూసుకుంటాడు అన్న విశ్వాసం ఉన్నవాళ్లకు, దీక్షిత్ జీవితం, ఆ నమ్మకాన్ని ఇంకా దృఢపరుస్తుంది.

    ఒకసారి చదివి వదిలేసే వ్యాసం కాదు ఇది. మళ్ళి మళ్ళీ చదవాల్సిన వ్యాసం.... ఇందులో కూడా చదివిన ప్రతిసారీ ఎదో ఒక కొత్తకోణం కనిపిస్తుంది.

    This is an article to be preserved and read again and again. Thanks a lot for writing this and introducing us to great bhakt like Deekshit. Thank you for showing us through Deekshit how to surrender to Baba

    శతకోటి ప్రణామములు 🙏🙏🙏

    ReplyDelete
  13. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo