సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

కాకాసాహెబ్ దీక్షిత్ - ఆరవ భాగం...



బాబాకే అర్పితమైన కవితాహృదయం

ఒకసారి బాబా ఒక బిడ్డను చూపిస్తూ, "ఈ బిడ్డ నిద్రపోతున్నప్పుడు, మనం మెలకువగా ఉండి కాపుకాస్తూ శ్రమపడాలి" అని అన్నారు. అలాగే, బాబా తన భక్తులను సొంత బిడ్డల్లా ప్రేమిస్తూ వారికోసం ఎంతో శ్రమపడుతుంటారు. సమయమేదైనా, ప్రదేశమేదైనా ఆయన ఎల్లప్పుడూ తమ భక్తుల ప్రార్థనలను, సమస్యలను వింటారు, వింటూనే ఉంటారు, వాళ్ళ ప్రార్థనలకు సమాధానమిస్తారు. అటువంటి మహోన్నత వ్యక్తిత్వం గల సాయిబాబా స్వభావం గురించి దీక్షిత్‌కు ఎటువంటి సందేహాలూ లేవు. అతనికి బాబా అంటే సాక్షాత్తూ దైవమే! బాబా సశరీరులుగా ఉన్నప్పుడు, సమాధి చెందాక కూడా అతని అభిప్రాయం అదే. బాబా ఎల్లప్పుడూ తనకు అండగా ఉంటారని అతను సదా భావించేవాడు. అందువలన అతని మనస్సు అన్ని భయాలు, ఆందోళనలు, జాగ్రత్తల నుండి విముక్తి పొంది సంతోషంగా ఉండేది. కాబట్టి అతను నిశ్చింతగా తాను నిత్యమూ పఠించే భావార్థ రామాయణం, ఏకనాథ భాగవతములలోని శ్రీరాముని, శ్రీకృష్ణుని లీలలపైనా, శ్రీసాయిలీలలపైనా తన దృష్టిని నిలిపి తనను తాను మరచిపోయేవాడు. దీక్షిత్‌కు పూజ, పారాయణలంటే చాలా ఇష్టం. ఇంకా భజనలంటే, ముఖ్యంగా సాయిభజన అంటే అతనికి ఎంతో ప్రీతి. భజన జరిగే సమయంలో అతని కళ్ళు ప్రేమాశ్రువులతో పొంగిపొర్లేవి. ఆ విధంగా  అతను భగవంతునితో ప్రత్యేకమైన, గాఢమైన బంధాన్ని ఏర్పరుచుకొనేవాడు. శిరిడీలో ఉన్నప్పుడు వాడాలోని తన గది ముందున్న వరండాలో అటు ఇటు తిరుగుతూ, విల్లేపార్లేలో ఉన్నప్పుడైతే ప్రతిరోజూ సాయంకాలం సమయంలో మేడపైకి వెళ్ళేటప్పుడు, క్రిందకు వచ్చేటప్పుడు, మేడపైన పచార్లు చేస్తున్నప్పుడు బాబాపై రచించిన పాటలను పాడుకుంటుండేవాడు దీక్షిత్‌. అతనికి సంగీతంపై మంచి పరిజ్ఞానం ఉంది. పాటలు కూడా రచించేవాడు. ఒకసారి అతనొక పాట రచించినప్పుడు అందులోని సాహిత్యానికి ముగ్ధుడైన కాకామహాజని, “మీరు ఇంకా మరిన్ని పాటలు రచించవచ్చు కదా!” అని దీక్షిత్‌ను అడిగాడు. అందుకు దీక్షిత్, "ఎందరో మహానుభావులు వ్రాసిన ఎన్నో చక్కటి భక్తిగీతాలుండగా నాలాంటి అయోగ్యుడు కూడా వ్రాసి ఆ నాసిరకమైన పాటలను వాటికి జోడించడమెందుకు?" అని బదులిచ్చాడు. నిజానికి అతని అభ్యంతరం ఏమిటంటే, “పాటల కూర్పు వలన 'నేను స్వరకర్తను, నేను ఇంత గొప్ప పని చేశాను, అంత గొప్ప పని చేశాను' అనే అహం బలపడుతుంది” అని. అటువంటి అభిమానం తనలో పెరగకుండా తనను తానే నియంత్రించుకున్నాడు. తనకు ఎంతటి కవితాహృదయమున్నా, రచనా సామర్థ్యమున్నా వాటిని బాబాపట్ల తనకున్న ప్రేమకు వ్యక్తీకరణగా ఉపయోగించుకున్నాడే తప్ప పరుల మెప్పు కోసం ప్రాకులాడలేదు. సాయి సాంగత్యం వలన అంతటి వినయశీలత, నిరాంబరడత దీక్షిత్‌లో వృద్ధి చెందాయి. బాబా కూడా ఒక సందర్భంలో “కళలను భక్తిప్రపత్తుల కోసమే వినియోగించుకోకుంటే మనిషికి అధోగతి తప్పదు” అని అన్నారు.

దాసగణు రచించిన 'సాయి రహమ్ నజర్ కర్‌నా బచ్చోంకా పాలన్ కర్‌నా' మరియు 'రహమ్ నజర్ కరో అబ్ మోరే సాయీ' అనే రెండు ఆరతి పాటలు బాబాకు చాలా ఇష్టం. ఆ విషయాన్ని శిరిడీకి చెందిన లక్ష్మణ్ భట్ జోషీ ఇలా చెప్పాడు: "నేను అప్పుడు చిన్నవాడిని. రాత్రిళ్ళు బాబాతో కలిసి చావడిలో నిద్రించేవాడిని. తనతో కలిసి చావడిలో నిద్రించేందుకు బాబా ఎవరినీ అనుమతించనప్పటికీ నన్ను మాత్రం అనుమతించేవారు. ఆ సమయంలో అప్పుడప్పుడు బాబా నన్ను పాడమనేవారు. ఆయన, 'దాసగణు వ్రాసిన పాటలు గానీ, తుకారాం రాసిన పాటలు గానీ పాడు' అనీ, లేదా 'గణూ ఏమంటున్నాడు?' అనీ అనేవారు. నేను బాబాను కీర్తిస్తూ 'రహమ్ నజర్ కరో అబ్ మోరే సాయి' మొదలైన పాటలు పాడుతూ పరిహాసం చేసేవాడిని. బాబా ఆ పాటల యొక్క రాగాన్ని, వాటి భావాన్ని ఇష్టపడేవారు". ఇక అసలు విషయానికి వస్తే... దీక్షిత్ పాడుకొనే భజన గీతాలలో దాసగణు వ్రాసిన పై రెండు ఆరతి పాటలు కూడా ఉండేవి. ఆ రెండు ఆరతి పాటలకు దీక్షిత్ చేసుకున్న సవరణలు సాయిబాబాపట్ల అతనికున్న పరిపూర్ణమైన భక్తివిశ్వాసాలకు అద్దంపడతాయి. అవేమిటో చూద్దాం.

దాసగణు తాను రచించిన 'సాయి రహమ్ నజర్ కర్‌నా బచ్చోంకా పాలన్ కర్‌నా' గీతంలోని 'మై అంధా హూ బందా ఆప్‌కా, ముఝ్ కో ప్రభు దిఖలానా' అనే చరణంలో 'నేను అంధుడను, మీ బానిసను. నాకు భగవంతుని దివ్యదర్శనాన్ని ప్రసాదించండి' అని వ్యక్తపరచాడు. సంత్ నామదేవ్ తదితర సత్పురుషులు పొందిన దైవసాక్షాత్కారాన్ని తనకు ప్రసాదించమని దాసగణు బాబాను చాలా సంవత్సరాలుగా వేధిస్తుండేవాడు. అతనలా అడిగిన ప్రతిసారీ బాబా, “వేచి ఉండు” అని మాత్రమే చెప్పేవారు. ఒకరోజు దాసగణు, “బాబా, మీరు చాలాకాలంగా నా అభ్యర్థనను దాటవేస్తున్నారు. మీరు నాకు ఎప్పుడు సాక్షాత్కారం ఇస్తారు?” అని అసంతృప్తి వ్యక్తం చేశాడు. అప్పుడు బాబా, “ఇప్పుడు నన్ను చూస్తున్నావు కదా? అదే సాక్షాత్కారం! నేనే దైవాన్ని!” అని భావగర్భితంగా చెప్పారు. బహుశా బాబా చెప్పిన ఈ మాటలలోని ఆంతర్యాన్ని గ్రహించిన కాకాసాహెబ్ దీక్షిత్ “ప్రభు దిఖలానా” (‘భగవంతుని చూపించు’) అనే చోట ‘పద్’ అని పదాన్ని జోడించి, దానిని ‘ప్రభుపద్ దిఖలానా’గా సవరించి ‘మీ పాదాలను నాకు చూపించండి!’ అనే భావంతో పాడుకునేవాడు.

ఇకపోతే, 'రహమ్ నజర్ కరో, అబ్ మోరే సాయీ' అనే ఆరతి గీతంలోని 'ఖాలీ జమానా మైనే గమాయా, సాథీ ఆఖర్ కా కియా న కోయీ' అనే చరణంలో, 'ఎప్పటికీ తోడుండే సహచరుని కనుగొనలేకపోయాను' అనే భావాన్ని వ్యక్తపరిచాడు దాసగణు. అందులో తీరని వెలితి, నిరాశావాదం కనిపిస్తాయి. కానీ దీక్షిత్ బాబాపట్ల ఉన్న పూర్ణ విశ్వాసంతో ఆ గీతంలో 'కియా న' అనే పదాన్ని 'తుమబినా'తో భర్తీ చేసి, 'సాథీ ఆఖర్ కా తుమబినా కోయీ' అంటే, 'మీరు తప్ప ఎప్పటికీ తోడుండే సహచరుడు నాకు మరెవరూ లేరు!’ అని సవరించి పాడుకునేవాడు. ఆ సవరణ ఆశావాదంతో కూడుకుని ఉండటమే కాకుండా అనన్య భక్తిని కూడా వినిపిస్తుంది. 

తొలిరోజుల నుంచే దీక్షిత్ గురించి ప్రస్తావిస్తూ బాబా, "నేను నా కాకాను విమానంలో తీసుకెళ్తాను" అని చెప్తుండేవారు. అంటే, అంతిమ సమయంలో తోడుగా ఉండి అతనిని ఊర్ధ్వలోకాలకు తీసుకొని వెళ్తామని వారి భావం. సద్గురు స్వరూపులు, సాక్షాత్తూ దైవమైన బాబా నుండి అటువంటి వాగ్దానాన్ని పొందిన దీక్షిత్‌కి బాబా పట్ల అంతటి విశ్వాసముండటంలో ఆశ్చర్యం లేదు.

సద్గురు సాయి పట్ల ఉన్న అపారమైన గురుభక్తితో సమస్యలను పరిష్కరించడంలో కాకాసాహెబ్ యొక్క సమర్థతకు, వ్యవహార దక్షతకు అద్దంపట్టే రెండు సంఘటనలు:

బాబా తరచూ, "నన్ను ప్రేమించేవారిపై నా దృష్టి ఎల్లప్పుడూ ఉంటుంది" అని చెప్పేవారు. ఆయన తమ పూర్తి సమయాన్ని, శ్రద్ధను తమ భక్తుల కోసమే వెచ్చించేవారు. రాత్రివేళల్లో చెక్కబల్లపై గానీ లేదా నేలపై గానీ పడుకొని ఉన్నప్పుడు బాబా నిద్రించేవారు కాదు, అనుక్షణం మెలకువగానే ఉండేవారు. భగవంతుని స్మరణలో ఉంటూ ఏ భక్తునికి ఏ సహాయం అవసరమవుతుందోనని జాగరూకతతో గమనిస్తూ ఉండేవారు. రాత్రంతా మెలకువగా ఉండి కూడా పగలంతా తమ దర్శనానికి వచ్చినవారితో వ్యవహరిస్తూ ఉండేవారు. కాబట్టి బాబా విశ్రాంతికంటూ కొంత సమయం ఉండాలని తలచిన భక్తులు వారి భోజనానంతరం మధ్యాహ్నం ఒంటిగంట, రెండు మధ్య ద్వారకామాయిలో పరదాలు దించేవారు. ఆ సమయంలో బాబా విశ్రాంతికి భంగం కలిగించేందుకు ఎవరికీ అనుమతి ఉండేది కాదు. ఈ నియమం గురించి తెలియని ఒక కూలిమనిషి ఒకరోజు సరిగ్గా ఒంటిగంట సమయంలో శిరిడీ చేరుకున్నాడు. కొంతమంది భక్తులు బాబాకు కానుకగా ఇచ్చిన గుఱ్ఱాన్ని (శ్యామకర్ణని) తీసుకొని వచ్చాడతను. అతను ముందుగా తన కిరాయి డబ్బుల కోసం రాధాకృష్ణమాయి వద్దకు వెళ్ళాడు. ఆమె తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో అతను ఈసారి షామా వద్దకు వెళ్ళాడు. షామా కూడా డబ్బులు లేవని చెప్పడంతో అతను తన కిరాయి డబ్బులను బాబానే అడిగి తీసుకుందామని నేరుగా మసీదుకు వెళ్లి, "బాబా, బాబా! నా కూలి డబ్బులు నాకివ్వండి" అని పెద్దగా అరిచాడు. అతని అరుపుల వల్ల తమ విశ్రాంతికి భంగం కలగటంతో బాబా కోపంతో అతని మీదకి ఒక ఇటుకను విసిరారు. అది అతని తలపై బలంగా తగలడంతో గాయమై రక్తం కారసాగింది. దాంతో ఆ కూలివాడు పెడబొబ్బలు పెడుతూ, బిగ్గరగా రోదిస్తూ బాబా తనను తీవ్రంగా గాయపరిచారని అక్కడున్నవారికి ఫిర్యాదు చేయసాగాడు. అతను బాబాపై పోలీసులకు ఫిర్యాదు చేసే ప్రమాదం కనిపించడంతో అందరూ ఆందోళన చెందసాగారు. అదృష్టవశాత్తూ దీక్షిత్ ఆ సమయంలో శిరిడీలోనే ఉన్నాడు. అతను లోకజ్ఞానం గల వ్యక్తి, ఎల్లప్పుడూ దాతృత్వంతో న్యాయబద్ధంగా మాట్లాడేవాడు. విషయం తన చెవినపడగానే దీక్షిత్ ఆ కూలివాణ్ణి పిలిపించి, కూలి డబ్బులకోసం విశ్రాంతి సమయంలో బాబాను ఇబ్బందిపెట్టడం ఎంత అనుచితమో వివరంగా తెలియపరిచి, "కూలి డబ్బులకు బదులుగా బాబా నీకొక జీవనాధారాన్ని ఏర్పరుస్తున్నారు. ఇప్పుడే నేను నీకు 200 రూపాయలు ఇస్తాను. వాటితో ఎడ్లబండిని కొనుక్కో! అందులో భక్తులను ఎక్కించుకుని వారిని కోపర్‌గాఁవ్ రైల్వేస్టేషన్ నుండి శిరిడీకి, శిరిడీ నుండి కోపర్‌గాఁవ్ రైల్వేస్టేషన్‌కి చేరవేస్తూ ఉండు. తద్వారా కేవలం భక్తులకేకాక సాయికి కూడా సేవ జరుగుతుంది, నీకు కూడా ఎంతో మేలు కలుగుతుంది. స్థిరమైన ఆదాయం లేని ఆ కూలిపని చేయడానికి బదులుగా ఈ పని చేయడం వలన నీకు స్థిరమైన ఆదాయం లభించి నీ కుటుంబపోషణ చక్కగా జరుగుతుంది" అని చెప్పాడు. అందుకతను అంగీకరించడంతో సమస్య అంతటితో సమసిపోయింది. తరువాత అతను దీక్షిత్ చెప్పినట్లు ఎడ్లబండిని కొనుక్కుని శిరిడీ, కోపర్‌గాఁవ్ మధ్య నడపసాగాడు. దీక్షిత్‌కు బాబా పట్ల ఉన్న గురుభక్తి, అతని లౌక్యంతో సమ్మిళితమై బాబాకి, గాయపడిన కూలివానికి మరియు భక్తులందరికీ జరిగిన విశేషమైన సేవకి ఇది ఒక ఉదాహరణ.
 
ఇక రెండవది, బాబా మహాసమాధి చెందిన అనంతరం ఏర్పడిన వివాదాల పరిష్కారానికి, బాబా సమాధి నిర్వహణ, సంస్థాన్ ఏర్పాట్లకు సంబంధించినది. 1918, అక్టోబరు నెల, విజయదశమినాడు బాబా మహాసమాధి చెందారు. అది సాయిభక్తులకు పెద్ద విఘాతం. అప్పటివరకు తమపై అపారమైన ప్రేమను కురిపిస్తూ, తమ కష్టాలను తీరుస్తూ, తమ బాగోగులు చూసుకొనే బాబా ఇకలేరనే నిజాన్ని తట్టుకోలేక భక్తులంతా హృదయవిదారకంగా రోదించసాగారు. బాబా మహాసమాధి చెందారన్న వార్త విని బాబా పార్థివదేహాన్ని చివరిసారిగా దర్శించుకోవడానికి ప్రజలు తండోపతండాలుగా మసీదుకు రాసాగారు. ప్రజలందరూ బాబాను కనులారా దర్శించుకోవడానికి వీలుగా ఆ సద్గురునాథుని పవిత్ర పార్థివదేహాన్ని మసీదులో కూర్చుండబెట్టారు. విపరీతమైన రద్దీ కారణంగా బాబా భౌతికదేహాన్ని  చివరిసారిగా దర్శించుకునే భాగ్యాన్ని పొందేందుకు ఒక్కొక్కరు ఐదారు గంటలు వేచి వుండవలసి వచ్చిందట.

ఇంతలో, ‘బాబాను ఎక్కడ, ఎలా సమాధి చెయ్యాలి?’ అనే విషయంలో వివాదం బయలుదేరింది. దేహత్యాగానికి ముందు, "నాకిక్కడ (మసీదులో) ఏం బాగాలేదు, నన్ను దగ్దీవాడా(బూటీవాడా)కు తీసుకుపోండి! అక్కడ నాకు పెద్ద పెద్దవాళ్ళు సేవలు చేస్తారు!” అని బాబా అన్న మాట, తమ దేహాన్ని బూటీవాడాలో సమాధి చెయ్యమని బాబా ఇచ్చిన ఆదేశంగా భావించి చాలామంది భక్తులు బాబా దేహాన్ని బూటీవాడాలో సమాధి చేయాలని నిశ్చయించారు. తాను నిర్మిస్తున్న భవనంలో బాబా పార్థివ దేహాన్ని సమాధి చేయడం కంటే భాగ్యమేముంటుందని భావించిన బూటీ కూడా అందుకు సంసిద్ధంగా ఉన్నాడు. అయితే, శిరిడీ గ్రామంలోని కొందరు వృద్ధులు, బాబా ముసల్మాననే భావనతోనో లేదా ఊరిమధ్య సమాధి వుండటమేమిటనే ఛాందస మూఢవిశ్వాసాల వల్లనో బాబా దేహాన్ని ఊరి బయట శ్మశానంలో సమాధి చెయ్యాలని వాదించారు. అమీర్ శక్కర్ వంటి చాలామంది ముస్లిం సాయిభక్తులు కూడా బాబా దేహాన్ని ఇస్లాం మత సాంప్రదాయానుసారం ఖబరిస్తాన్ (శ్మశానం)లో ఆరుబయట సమాధిచేసి, దానిపై గోరీ కట్టాలని పట్టుబట్టారు. బూటీవాడా గోపాలరావు బూటీ స్వంత ఆస్తి గనుక, ముందు ముందు భవిష్యత్తులో ముస్లింలను సమాధిమందిరంలోనికి ప్రవేశించేందుకు అడ్డుకోవచ్చనేది వారి భయం. మొదట షామా కూడా బాబాను బూటీవాడాలో సమాధి చేయటానికి వ్యతిరేకించాడు! తాత్యాకోతేపాటిల్ అభిమతం మాత్రం బాబా దేహాన్ని బూటీవాడాలో సమాధి చెయ్యాలని. కానీ, అతను ఆ సమయంలో తీవ్ర అనారోగ్యంతో మంచం దిగలేకున్నాడు. అందువల్ల తాత్యా తన ఆప్తమిత్రుడైన రామచంద్రపాటిల్‌ను పిలిచి, ‘తమ దేహాన్ని బూటీవాడాలో సమాధి చెయ్యడం బాబా అభిమతమనీ, అందువల్ల ఎలాగైనా బాబా ఆదేశాన్ని అమలుపరచేలా చూడమనీ’ కోరాడు. శిరిడీ గ్రామస్తులలో చాలామంది (ముఖ్యంగా యువకులు) బాబా దేహాన్ని బూటీవాడాలోనే సమాధి చేయాలని వాదించారు. ఆ వర్గానికి శ్రీరామచంద్రపాటిల్ నాయకత్వం వహించాడు. ‘బాబాను ఎక్కడ సమాధి చెయ్యాలి?’ అన్న అంశంపై వాదోపవాదాలు, తర్జనభర్జనలు తీవ్రమయ్యాయి. గ్రామం రెండు వర్గాలుగా చీలిపోయింది.

సాయంత్రానికి రహతానుండి ఫౌజుదారు (పోలీసు సబ్ ఇన్‌స్పెక్టరు) వచ్చాడు. శిరిడీ గ్రామ పోలీసుపటేల్ (మునసబు) సంతాజీ పాటిల్ షెల్కే ఆధ్వర్యంలో పంచనామా జరిగింది. బాబాకు వారసులెవ్వరూ లేకపోవడం చేత బాబాకు చెందిన వస్తువులనన్నింటినీ ప్రభుత్వ ఖాతాలో జమచెయ్యాలని నిర్ణయించడం జరిగింది. కానీ, బాబాను ఎక్కడ సమాధి చెయ్యాలన్న అంశంపై వివాదం మాత్రం పరిష్కారం కాలేదు. మంగళవారం రాత్రంతా హెూరాహోరీగా వాదచర్చలు జరిగాయి. 

ఇక తెల్లవారితే బుధవారమనగా, షామా మేనమామయైన లక్ష్మణ్ మామా జోషీకి బాబా స్వప్నంలో కనిపించి, “త్వరగా లే! బాపూసాహెబ్ జోగ్ నేను మరణించాననుకొంటున్నాడు. అందువల్ల అతడు ఆరతి ఇవ్వడానికి రాడు. నీవు వచ్చి కాకడ ఆరతి ఇవ్వు!” అని ఆదేశించారు. బాబా ఆ స్వప్నంలో చెప్పినట్లే ప్రతిరోజూ బాబాకు ఆరతులు నిర్వహించే జోగ్ బుధవారం ఉదయం కాకడ ఆరతి ఇవ్వడానికి రాలేదు! మసీదులో ఉన్న మౌల్వీలు ఎంత అభ్యంతరం పెడుతున్నా లెక్కచెయ్యకుండా లక్ష్మణ్ జోషీ బాబాకు కాకడ ఆరతి చేసి వెళ్ళిపోయాడు. ఆ విషయం తెలిసి జోగ్ మధ్యాహ్న ఆరతికి యథాప్రకారం వచ్చాడు.

బుధవారం ఉదయం కోపర్‌గాఁవ్ మామల్తదారు శిరిడీ చేరుకున్నాడు. బాబాను ఎక్కడ సమాధి చెయ్యాలనే విషయంలో ఒక పరిష్కారం కుదరకపోగా, ఊరిలోని ఇరువర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో, సమస్యను పరిష్కరించేందుకు ఇరువర్గాల సంతకాలు సేకరించమని ఆదేశించాడతను. సహజంగానే హిందువులు అధికసంఖ్యలో ఉండటం వలన ఓటింగులో 1503 సంతకాలు బూటీవాడాలో సమాధి చెయ్యాలనే నిర్ణయానికి, 730 సంతకాలు ఊరి బయట స్మశానంలో సమాధి చెయ్యాలనే నిర్ణయానికి వచ్చాయి. మెజారిటీ అభిప్రాయం బాబా దేహాన్ని బూటీవాడాలో సమాధి చెయ్యడానికి వచ్చినా, ఆ అంశం పెద్ద ఎత్తున గ్రామంలో తగాదాలకు, మతద్వేషానికి కారణమై శాంతిభద్రతల సమస్యగా పరిణమిస్తుందేమోననే భయంతో మామల్తదారు ఇరువర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే తప్ప తానే నిర్ణయం తీసుకోలేననీ, లేకపోతే ఈ విషయంలో జిల్లా కలెక్టరుతో సంప్రదించవలసిందేననీ అన్నాడు. దాంతో, జిల్లా కలెక్టరుతో సంప్రదించడానికి కాకాసాహెబ్ దీక్షిత్ స్వయంగా అహ్మద్‌నగర్ బయలుదేరాడు. దీక్షిత్‌కు ప్రభుత్వాధికారులతో ఉన్న పరిచయం, పరపతి, కార్యసాధనలో ఆయన సామర్థ్యం అందరూ ఎరిగినదే. దీక్షిత్ గనక జిల్లా కలెక్టరును కలిస్తే జరుగబోయేదేమిటో ఊహించిన (బాబా దేహాన్ని ఖబరిస్థాన్‌లో సమాధి చెయ్యాలని వాదించే వర్గానికి చెందిన) భక్తులు రాజీ ప్రయత్నాలకు అంగీకరించారు. ఆ ఒప్పందం ప్రకారం, బాబాను ఇస్లాం మతాచారం ప్రకారం పెట్టెలో పడుకొనబెట్టి సమాధి చెయ్యాలనీ, సమాధి మందిరంలోకి, మసీదులోకి ముస్లింలు వచ్చి ఆరాధించడానికి ఏ ఆటంకం ఉండకూడదనే షరతులపై బాబా భౌతికకాయాన్ని బూటీవాడాలోనే సమాధి చెయ్యడానికి ఏకాభిప్రాయం కుదిరింది. ఈ వ్యవహారమంతా ముగిసేసరికి బుధవారం మధ్యాహ్నమైంది.
 
అది తాత్కాలిక పరిష్కారం మాత్రమే. అంతకంటే ప్రధాన అంశం సంస్థాన్ ఏర్పాటు, దాని విధివిధానాలు మొదలైన భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించినది. దీక్షిత్ గొప్ప న్యాయవాదిగా తన సమర్థతను, తనకున్న పరపతిని ఉపయోగించి భక్తితో ఒక చక్కని ప్రణాళికను రూపొందించి దానిపై ప్రముఖ భక్తుల సంతకాలు సేకరించి అహ్మద్‌నగర్ జిల్లాకోర్టుకు సమర్పించాడు. 1922లో జిల్లాకోర్టు ఆ పథకాన్ని ఆమోదించింది. దానిప్రకారం పదిహేనుమంది సభ్యులతో సంస్థాన్ రూపకల్పన జరిగింది. సంస్థాన్ ఆస్తిపాస్తులను ఆ పదిహేనుమంది సభ్యులతో కూడిన మేనేజింగ్ కమిటీ అధీనంలో ఉంచారు. దీక్షిత్ గౌరవ కార్యదర్శిగా సంస్థాన్ బాధ్యతలను నిర్వర్తించాడు. సమర్థవంతమైన అతని విధినిర్వహణ అన్ని వర్గాలను సంతోషపెట్టింది. సంస్థాన్ ఏర్పాటులో, విధినిర్వహణలో దీక్షిత్ కృషి ఎంతో అభినందనీయం. సంస్థాన్ ప్రస్తుత వైభవానికి అతనే ముఖ్యకారకుడు. సాయికి, సాయిభక్తులకు అతను చేసిన విశిష్టమైన సేవగా దీన్ని పేర్కొనవచ్చు.

1918 తరువాత కూడా బాబాను భగవంతునిగా భావించేవాడు దీక్షిత్. తనలోని చెడు తలంపులను, వ్యర్థ కాలక్షేపాల పట్ల ఆసక్తిని, నిమ్నస్థాయి ఆలోచనలను, చర్యలను జయించడానికి అతనెంతో శ్రమించేవాడు. తనను సరిదిద్దమనీ, తనకు తగిన మార్గనిర్దేశం చేయమనీ బాబాను ఎంతో ఆర్తిగా ప్రార్థించేవాడు. అప్పటికీ తన ఆలోచనలు తప్పుదారిపడితే, ‘తనను క్షమించమనీ, అటువంటి ఆలోచనలలో పడి పతనం కాకుండా ఉండేలా తనను బలోపేతం చేయమనీ’ బాబాను అర్థిస్తుండేవాడు.

బాబాపై దీక్షిత్ ఎంతగా ఆధారపడేవాడంటే, ఏ విషయంలోనైనా నిర్ణయం తీసుకునేముందు బాబాను సంప్రదించి వారి ఆదేశానుసారం నడుచుకొనేవాడు. బాబా మహాసమాధి చెందాక కూడా అతను అలాగే చేసేవాడు. బాబా చెప్పింది తన అభిప్రాయాలకు, తన స్నేహితులు మరియు సంబంధీకుల భావాలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ అతను బాబా చెప్పినట్లే నడచుకొనేవాడు. గురువుపై అంతలా ఆధారపడుతూ అంతటి సన్నిహిత సంబంధం ఏర్పరుచుకున్నాక ఆ గురువు దేహాన్ని విడిచిపెడితే అంతవరకు ఆ గురుశిష్యుల మధ్యనున్న అనుబంధం తెగిపోతుందని కొందరు అనుకోవచ్చు. కానీ అలా ఏమీ జరగదు. బాబా దేహత్యాగం చేసిన తరువాత కూడా దీక్షిత్, మరికొందరు అంకిత సాయిభక్తులు మునుపటిలాగే సాయిబాబాపై ఏకాగ్రదృష్టి నిలిపారు. వాళ్ళు బాబాను ప్రార్థించి, బాబా ఫోటో ముందు చీటీలు వేసి, ఎవరైనా పిల్లలతో యాదృచ్ఛికంగా వాటిలోంచి ఒక చీటీ తీయించేవారు. ఆ చీటీలో ఉన్నదానిని బాబా ఆదేశంగా భావించి తదనుగుణంగా నడుచుకొనేవారు. అలా అనుసరించడం వల్ల ఎప్పుడూ మంచే జరిగేది. చీటీల ద్వారా బాబాను సంప్రదించడంలో దీక్షిత్‌కున్న నమ్మకాన్ని, అతనికి, అతని సంబంధీకులకు బాబాను మంచి సహాయకారిగా మరియు ఆ పద్ధతి విశ్వసనీయమైనదిగా ఋజువు చేసిన ఒక సంఘటన గురించిన వివరాల్లోకి వెళదాం. 

బాబా మహాసమాధి చెందిన తరువాత దీక్షిత్ సోదరుడు సదాశివ్ దీక్షిత్ బి.ఎ, ఎల్.ఎల్.బి పూర్తిచేసి నాగపూర్ తదితర ప్రదేశాల్లో ప్రాక్టీస్ ప్రారంభించేందుకు ప్రయత్నించాడు. కానీ అతనికి ఎక్కడా కలిసి రాలేదు. అప్పుడు దీక్షిత్ చీటీల ద్వారా బాబాను సంప్రదించి, బాబా ఇచ్చిన సందేశానుసారం సదాశివ్‌ను బొంబాయికి రప్పించాడు. కానీ అక్కడ కూడా ఉద్యోగాన్ని సంపాదించడంలో సదాశివ్ విజయాన్ని సాధించలేకపోయాడు. బాబా ఆదేశం ఎలా నిరుపయోగమైందా అని దీక్షిత్ ఆశ్చర్యపోయాడు. సదాశివ్ కూడా తిరిగి వెళ్ళిపోవాలని అనుకున్నాడు. అయితే దగ్గరలోనే దీపావళి పండుగ ఉన్నందున పండుగ తరువాత వెళ్ళమని చెప్పాడు దీక్షిత్. అదే సమయంలో కచ్ రాజసంస్థానానికి చెందిన ప్రముఖ వ్యక్తులు దీక్షిత్ వద్దకు వచ్చి, తమ సంస్థానంలో వెయ్యిరూపాయల (ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తం) జీతానికి ఆఫీసరుగా పనిచేసేందుకు విశ్వాసపాత్రుడైన వ్యక్తి కోసం తాము అన్వేషిస్తున్నామనీ, అందుకు అర్హులైన వారెవరైనా ఉంటే సూచించమనీ అడిగారు. దీక్షిత్ తన తమ్ముడు సదాశివ్ పేరును సూచించగానే వాళ్ళు సంతోషించి అతనిని తమ సంస్థానానికి దివానుగా నియమించారు. ఆ విధంగా చివరి క్షణంలో బాబా తమ ఆశీస్సులతో దీక్షిత్‌ను ఆశ్చర్యపరచి, తమయందు అతనికున్న విశ్వాసాన్ని దృఢపరిచారు. దామోదర్ సావల్రాం రాస్నే కూడా ఇదే విధంగా చీటీలు వేసి బాబా అభిప్రాయాన్ని తీసుకునేవాడు. అలా వచ్చిన బాబా సమాధానాలు ఎప్పుడూ సరియైనవిగా ఋజువయ్యేవి. బాబా సందేశం ఎన్నటికీ వ్యర్థం కాదు. అయితే బాబా చెప్పినట్లు మనకెంతో విశ్వాసముండాలి. మనం మన రాగద్వేషాలను మాత్రమే సేవిస్తూ బాబా ముందు చీటీలు వేయడం మాత్రం సరికాదు.

source: Arati Saibaba by Pujya sri sainathuni Sharat Babujee,
సాయిపథం - ప్రధమ సంపుటము,
లైఫ్ అఫ్ సాయిబాబా by బి.వి.నరసింహస్వామి
రిఫరెన్స్: దీక్షిత్ డైరీ బై విజయకిషోర్.

 


ముందు భాగం కోసం
బాబా పాదుకలు తాకండి.




 


 


తరువాయి భాగం కోసం
బాబా పాదాలు తాకండి.


4 comments:

  1. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  2. Very very nice story.Deshit is baba's devotee.he added some lines to baba harati.Deeshit is baba's favorite devotee. Baba gave him sadgati.very nice story telling.new things in this story we know now. Om sai ram ❤❤❤

    ReplyDelete
  3. Om sai ram baba amma arogyam bagundali thandri ma andari arogyalu kuda bagundali thandri

    ReplyDelete
  4. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo