సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

కాకాసాహెబ్ దీక్షిత్ - ఐదవ భాగం....



దీక్షిత్ సహృదయుడు, చక్కటి నడివడిగల యోగ్యుడు. ఎప్పుడూ ఎవరినీ నిందించి ఎరుగనివాడు. ఆ విషయాన్ని బాబా ఇతరుల ముందు కూడా వెల్లడించారు. ఒకసారి అన్నాసాహెబ్ దభోల్కర్‌తో, "కాకాసాహెబ్ మంచివాడు. అతను చెప్పినట్లు నడుచుకో" అని చెప్పారు బాబా. మరోసారి ఆర్.బి.పురంధరేతో, "కాకాసాహెబ్‌తో ఉంటూ అతనికి సహాయపడు" అని అన్నారు. అంతటి యోగ్యత కలిగిన దీక్షిత్ ఒకసారి కొంతమంది ఏసుక్రీస్తుని నిందిస్తున్న చర్చలో అసంకల్పితంగా పాల్గొన్నాడు. కొంతసేపటి తరువాత అతను బాబా వద్దకు వెళ్లి, వారి పాదాలు ఒత్తబోయాడు. బాబా కోపంగా తమ పాదాలు తాకవద్దని అతనిని వారించారు. వెంటనే దీక్షిత్‌కి కొంతసేపటి క్రితం తాను ఏసుక్రీస్తుని నిందించిన సంగతి గుర్తుకొచ్చి, అందుకే బాబా కోపంగా ఉన్నారని గ్రహించి, తన పొరపాటుకు పశ్చాత్తాపపడి, మళ్ళీ ఎన్నడూ అటువంటి తప్పు చేయకూడని నిర్ణయించుకున్నాడు.

ఒకసారి బాబా కాకాసాహెబ్‌తో, "నువ్వు చెడుగా మాట్లాడినా లేదా ఎవరిలోనైనా తప్పులెంచినా ఆ క్షణమే నాకు బాధ కలుగుతుంది" అని అన్నారు. ఆ మాటలు అతనిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపాయి. అంతటితో అప్పటివరకు తనలో ఉన్న కోప్పడే స్వభావం పోయి పూర్తిగా అతను శాంతస్వభావిగా మారిపోయాడు. బాబా మనల్ని ఎలా తీర్చిదిద్దుతారో, ఎలా సంరక్షిస్తారో అన్నదానికి నిదర్శనమిది.

మరో సందర్భంలో, ఆరతి పూర్తయిన తర్వాత బాబా అక్కడున్న భక్తులతో, "మీరు ఎక్కడ ఉన్నా, ఏమి చేసినా, ఏది మాట్లాడినా నిశ్చయంగా నాకు తెలుసు" అని అన్నారు. దీనినే ‘ఋతంభర ప్రజ్ఞ’ అంటారు. సాయి వంటి కొద్దిమంది సత్పురుషులు మాత్రమే దానిని కలిగి ఉంటారు. కొంతమంది యోగాభ్యాసం, మంత్రశక్తి, ఆత్మలను వశపరుచుకోవడం ద్వారా మనసును చదవడం, దివ్యదృష్టి వంటివి సాధించి కొంత పరిధి మేరకు వ్యక్తులు ఏమి మాట్లాడుతున్నారో, ఏమి చేస్తున్నారో చెప్పగలరు. కానీ సాధారణంగా అటువంటివాళ్ళు ఎల్లవేళలా అలా చెప్పలేరు. కేవలం బాబా వంటి మహాత్ములు మాత్రమే ఎటువంటి ప్రయత్నం లేకుండా విశ్వమంతటా జరిగే ప్రతిదీ తెలుసుకోగలరు. పై సంఘటనల ద్వారా బాబా దైవిక లక్షణాలను, భవిష్యత్తును తెలుసుకోగల, నియంత్రించగల దివ్యశక్తిని కలిగివున్నారని, తనకు రక్షణనిచ్చేది వారేనని దీక్షిత్ విశ్వసించాడు. బాబాతో నిరంతర సహవాసం వలన వారు అంతర్‌జ్ఞాని (చిత్తసంవిత్ లేదా ఋతంబర ప్రజ్ఞ) అనీ, ప్రకృతిలోని మానవులు, ఇతర జీవులు, జీవంలేని పదార్థాలపై కూడా వారు గొప్ప నియంత్రణ కలిగి ఉన్నారనీ అతను గ్రహించాడు.

అంతర్‌జ్ఞాని అయిన బాబాకు భక్తుల మనసులో ఉండే కోరికలన్నీ తెలుసు. ఆ కోరికలు సాత్వికమైనవైనప్పుడు బాబా వాటిని నెరవేర్చి భక్తులను తృప్తిపరుస్తారు. తద్వారా వాళ్లలో విశ్వాసాన్ని దృఢపరచి, ప్రేమ వృక్షాన్ని బలపరుస్తారు. ఒకసారి కాకాసాహెబ్ దీక్షిత్ నవరాత్రులు ప్రారంభమయ్యే సమయానికి నాగపూరు నుండి శిరిడీ చేరుకొని దసరా వరకు అక్కడే ఉన్నారు. దసరారోజున భక్తులందరూ బాబాకు రకరకాల పండ్లు, మిఠాయిలు సమర్పించుకుంటున్నారు. ఏ కారణం చేతనో తన వద్ద పండ్లు లేనందున, “దసరా వంటి పవిత్రమైనరోజున బాబాకు సమర్పించేందుకు నా వద్ద పండ్లేమీ లేవ”ని నిరాశకు గురయ్యాడు దీక్షిత్. ఎప్పటిలాగే అతని పూజ సాధారణంగా జరిగింది. కొంతసేపటికి ఎవరో భక్తుడు తమకు నివేదించిన ద్రాక్షపండ్లను బాబా అక్కడున్న అందరికీ పంచిపెట్టారు. దీక్షిత్‌కి కూడా కొన్ని ద్రాక్షపండ్లు ఇచ్చారు. బాబా తమకోసం ఒక్క పండైనా ఉంచుకోకుండా పండ్లన్నీ పంచిపెట్టేయడం చూసి తనకిచ్చిన పండ్లలో నుంచి కొన్ని బాబాకు ఇవ్వాలని దీక్షిత్‌కి అనిపించి, కొన్ని ద్రాక్షపండ్లను బాబాకు సమర్పించాడు. బాబా వాటిని ఎంతో ఇష్టంగా తిన్నారు. ఆ విధంగా బాబా అతని మనసులోని కలతను తీసేసి సంతోషపెట్టారు.

మరోసారి, బాబాకు ఒక పూలమాలను, 25 రూపాయల దక్షిణను సమర్పించాలన్న సంకల్పంతో బాబా దర్శనానికి మసీదుకు వెళ్ళాడు దీక్షిత్. అతను పూలమాలను సమర్పించగానే బాబా, "ఈ పూలమాల 25 రూపాయలు కోరుతోంది" అన్నారు. బాబా యొక్క అంతర్యామిత్వానికి పరవశుడైన దీక్షిత్ ఎంతో సంతోషంగా బాబాకు 25 రూపాయలు దక్షిణ సమర్పించాడు.

భక్తుల ప్రతి చర్యను, ఆలోచనను గమనిస్తూ, వాళ్ళు తమ వద్దకు వచ్చినప్పుడు అందుకు తగ్గట్టు మందలించటమో, అడగటమో చేసేవారు బాబా. ఒకసారి దీక్షిత్ తన గదిలో బాబాకు పూజచేసి నైవేద్యం సమర్పించాడు, కానీ తాంబూలం అర్పించడం మర్చిపోయాడు. తరువాత అతను బాబా దర్శనానికి మసీదుకు వెళ్ళినప్పుడు బాబా, “నువ్వీరోజు నాకు అన్ని సేవలూ చేశావుగానీ తాంబూలమివ్వలేదు. నాకు ఆకు, వక్క ఇవ్వు” అని అడిగారు. బాబా తన ప్రతి చర్యనూ గమనిస్తున్నారని గుర్తించి బాబాకు తాంబూలం సమర్పించాడు దీక్షిత్. ఆ విధంగా అతని పూజలో జరిగిన లోపాన్ని బాబా సరిదిద్దారు.

ఒకసారి దీక్షిత్ రాత్రివేళల్లో ఉపవాసం ఉండాలని నిశ్చయించుకున్నాడు. అర్థంలేని ఆచారాలను ప్రోత్సహించని బాబా ఆరోజు సాయంత్రం దీక్షిత్ మసీదుకు రాగానే, "రాత్రి భోజనానికి ఏం తయారుచేయిస్తున్నావు?" అని అడిగారు. అందుకతను, "మీరేది చేయించమంటే అది చేయిస్తాను బాబా" అని బదులిచ్చాడు. అప్పుడు బాబా, "ఏముంది, మామూలే! రొట్టెలు, కూర. వాటిని అక్కడే నివేదించి నువ్వు తిను" అని అన్నారు. "బాబా! ఈరోజు తింటాను, కానీ రేపట్నుంచి రాత్రివేళల్లో తినను" అని అన్నాడు దీక్షిత్. "రేపటి సంగతి తర్వాత చూద్దాంలే" అన్నారు బాబా. అలా ప్రతిరోజూ బాబా అతనిని, “తిన్నావా?” అని అడగసాగారు. దాంతో, ఉపవాసం ఉండటం బాబాకు ఇష్టం లేదని అర్థమై తన సంకల్పాన్ని విరమించుకున్నాడు దీక్షిత్.

1917లో బొంబాయిలో ఉన్న కాకామహాజని యజమాని అనారోగ్యం పాలయ్యాడు. ఆ యజమాని కొడుకు కాకామహాజనితో, "మీరు శిరిడీ వెళ్లి బాబాను సంప్రదించి, నా తండ్రి ఆరోగ్యం విషయంలో చికిత్సకు సంబంధించి మంచి సలహా తీసుకోండి” అని చెప్పాడు. అందుకు కాకా, "ప్రస్తుతం దీక్షిత్ శిరిడీలోనే ఉన్నారు. ఆయనకు ఉత్తరం వ్రాస్తే సరిపోతుంది" అని చెప్పాడు. కానీ అతని యజమాని కొడుకు, "స్వయంగా మీరే శిరిడీ వెళ్ళాలి. మరేదీ నా తండ్రిని సంతృప్తిపరచలేదు" అని చెప్పాడు. ఈ సంభాషణ బొంబాయిలో జరుగుతుండగా అదే సమయంలో శిరిడీలో బాబా దీక్షిత్‌తో, "అక్కడ ఏమి సంప్రదింపులు, చర్చలు జరుగుతున్నాయి?" అని అన్నారు. అర్థాంతరంగా బాబా అలా ఎందుకన్నారో దీక్షిత్‌కి గానీ, అక్కడున్న ఇతరులకు గానీ అర్థం కాలేదు. మరుసటిరోజు కాకామహాజని శిరిడీ చేరుకొని తన యజమాని అనారోగ్యం గురించి బాబాతో చెప్పాడు. అప్పుడు బాబా దీక్షిత్‌తో, "మనం నిన్న ఈ విషయం గురించే మాట్లాడుకున్నాం కదూ?" అని అన్నారు. తరువాత దీక్షిత్ మహాజనితో మాట్లాడిన మీదట ఎక్కడో దూరాన బొంబాయిలో మహాజనికి, అతని యజమాని కొడుకుకి మధ్య జరుగుతున్న చర్చ అంతా శిరిడీలో ఉన్న బాబాకు తెలుసునని గ్రహించాడు.

ఒకసారి తాత్యాసాహెబ్ నూల్కర్, కాకాసాహెబ్ దీక్షిత్‌లు తమ స్నేహితులతో కలిసి శిరిడీ నుండి బయలుదేరబోయేముందు బాబా అనుమతి కోసం మశీదుకు వెళ్లారు. అప్పుడు బాబా వాళ్లతో, "రేపు ఉదయం బయలుదేరండి. కోపర్గాఁవ్‌లో భోజనం చేయండి" అని చెప్పారు. వారు బాబా ఆజ్ఞను శిరసావహించి, తాము మరుసటిరోజు కోపర్గాఁవ్‌ వస్తున్నామనీ, తమకోసం ఆహారాన్ని సిద్ధంగా ఉంచమనీ కోపర్గాఁవ్‌కు కబురు పంపారు. కానీ మరుసటిరోజు వాళ్ళు కోపర్గాఁవ్‌ చేరుకొనే సమయానికి ఆహారం సిద్ధంగా లేదు. రైలు వచ్చే సమయం దగ్గర పడుతుండటంతో భోజనం చేయకుండానే వాళ్ళు రైల్వేస్టేషన్‌కు బయలుదేరారు. తీరా అక్కడికి వెళ్ళాక రైలు రెండున్నర గంటలు ఆలస్యంగా వస్తుందని తెలిసింది. దాంతో, తమను అక్కడికి తీసుకొచ్చిన ఆ బ్రాహ్మణ టాంగావాణ్ణి వెనక్కి పంపి, ఆహారాన్ని తెప్పించుకొని అందరూ స్టేషన్‌లోనే భోజనం చేశారు. వాళ్ళు భోజనం పూర్తిచేసిన పది నిమిషాలకి రైలు వచ్చింది.

ఒకసారి కాకాసాహెబ్ దీక్షిత్ కోపర్గాఁవ్‌ నుండి శిరిడీకి టాంగాలో వెళ్తున్నప్పుడు అతనికి ఒక ఆసక్తికరమైన అనుభవం కలిగింది. శిరిడీకి వెళ్ళే దారిలో జామపండ్లు అమ్ముకునే ఒక స్త్రీ అతనికి కనిపించింది. వెంటనే అతను టాంగాను ఆపించి, బాబా కోసం కొన్ని జామపండ్లు తీసుకొని తన ప్రయాణాన్ని కొనసాగించాడు. జామపండ్లు వెదజల్లే ఘుమఘుమలాడే కమ్మని వాసనకు తనలో జామపండు తినాలన్న బలమైన కోరిక తలెత్తింది. వెంటనే అతను, "ఎందుకిలా జరుగుతోంది బాబా?" అని మనసులోనే బాబాను ప్రార్థించాడు. ఆ మరుక్షణం ఆ వాసన ఆగిపోయి, తనలో జామపండు తినాలన్న కోరిక నశించింది.

ఒకసారి దీక్షిత్ రైలులో తన కార్యాలయానికి వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా అతనికి జ్వరం వచ్చింది. అప్పుడతను, "జ్వరం తీవ్రమైతే గనక తనను శిరిడీకి పిలవమ"ని బాబాను ప్రార్థించాడు. ఆ రోజంతా అతను జ్వరంతో బాధపడ్డాడు. దాంతో, అదే బాబా పిలుపుగా భావించి వెంటనే శిరిడీకి ప్రయాణమయ్యాడు దీక్షిత్. చిత్రంగా, ప్రయాణ సమయమంతా తనను బాధిస్తున్న జ్వరం శిరిడీలో అడుగుపెడుతూనే తగ్గిపోయింది. ఇంకా చిత్రమేమిటంటే, అదే సమయంలో బాబా జ్వరంతో బాధపడ్డారు.

ఒకరోజు సాయంత్రం కాకాసాహెబ్ దీక్షిత్ తన కార్యాలయం నుండి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు దృఢకాయుడైన ఒక యువకుడు అతనిని సమీపించి భిక్ష అడిగాడు. ఆ యువకుని చూస్తూనే భిక్ష ఇవ్వాలనిపించి దీక్షిత్ అతనికి కొన్ని నాణేలను ఇచ్చాడు. ఆ నాణేలను అందుకున్నాక ఆ యువకుడు నవ్వుతూ అక్కణ్ణించి వెళ్ళిపోయాడు. అతను కనుమరుగయ్యేవరకు దీక్షిత్ అతనినే గమనించసాగాడు. ఆ యువకుడు ఇంకెవరినీ ఏమీ అడగకుండా వెళ్ళిపోయాడు. ఆ యువకుడు బాబానే అయివుంటారని దీక్షిత్‌కు తోచింది. అదేరోజు అతను శిరిడీ ప్రయాణమయ్యాడు. శిరిడీ చేరి బాబాను దర్శించినప్పుడు తనను భిక్ష అడిగిన యువకుని గురించి బాబా వద్ద ప్రస్తావించాడు దీక్షిత్. అందుకు బాబా, "అవును, మారువేషంలో నేనే వచ్చాను" అని అన్నారు. అది విని దీక్షిత్ ఎంతో సంతోషించాడు.

ముందుగా చెప్పుకున్నట్లు, ఇంగ్లాండులో జరిగిన ప్రమాదం వలన కొన్ని ఫర్లాంగుల దూరం నడిస్తే చాలు, కాలినొప్పి ఎక్కువై ఇక నడవలేకపోయేవాడు దీక్షిత్. ఆ విషయం తెలిసి కూడా ఒకసారి బాబా నీంగాఁవ్ వెళ్తూ తమతోపాటు రమ్మని అతనిని పిలిచారు. నిజానికి ఆ సమయంలో అతని కాలు బాగా నొప్పిగా ఉంది. కనీసం ఫర్లాంగు దూరం కూడా నడిచే స్థితిలో లేడు. అయినప్పటికీ బాబా పిలవగానే, "ఆ, వస్తాను బాబా" అంటూ లేచాడు. ఆ గతుకుల మార్గంలో రానూపోనూ 6 కిలోమీటర్ల దూరం నడిచినప్పటికీ అతనికి ఎటువంటి నొప్పీ, బాధా కలగలేదు. అంతేకాదు, అంతటితో తనకున్న కాలినొప్పి పూర్తిగా పోయిందని అతను గుర్తించాడు.

మరో సందర్భంలో దీక్షిత్ భావోద్వేగానికి లోనై, "బాబా! నన్నెప్పటికీ మీ సహవాసంలో ఉండనివ్వండి" అని బాబాను వేడుకున్నాడు. అప్పుడు బాబా అతనితో, “ఈ షామాను నీతో ఉంచుకో! అతను నీతో ఉంటే నేను నీతో ఉన్నట్లే!” అని చెప్పారు.

ఒకసారి బొంబాయి హైకోర్టులో ఒక కేసు విచారణకు వచ్చింది. ఆ కేసులో సజీవుడై ఉన్న ఏకైక సాక్షిదారుడు దీక్షిత్. కాబట్టి కోర్టువారు శిరిడీలో ఉన్న దీక్షిత్‌కు కోర్టుకు హాజరుకమ్మని సమన్లు జారీచేశారు. సదరు పార్టీకి చెందిన ఒక వ్యక్తి అతనిని బొంబాయి తీసుకొని వెళ్ళడానికి శిరిడీ వచ్చాడు. కానీ దీక్షిత్ బొంబాయి వెళ్ళడానికి బాబా అనుమతించలేదు. చట్టప్రకారం తప్పనిసరిగా హాజరుకావాల్సిన కోర్టు కేసులో దీక్షిత్ గైర్హాజరీ వలన ఎదురయ్యే పరిణామాలను తలచుకొని అందరికీ పరిస్థితి ఆందోళనకరంగా అనిపించింది. కానీ ఆ కేసు మరొక తేదీకి వాయిదాపడిందని తరువాత తెలిసింది. అయితే, ఆ తేదీన కూడా విచారణ జరగదని తెలిసిన బాబా తదుపరి విచారణకు వెళ్ళడానికి కూడా దీక్షిత్‌కు అనుమతినివ్వలేదు. దాంతో సదరు పార్టీకి సంబంధించినవాళ్ళు విసుగుచెంది దీక్షిత్‌ను కోర్టులో హాజరుపరచడానికి వారెంట్ జారీచేయడమొక్కటే మార్గమని తలచారు. అయితే ఈసారి తంతి రాగానే బాబా దీక్షిత్‌ను బొంబాయికి పంపించడం, కోర్టులో అతనిని విచారించడం జరిగిపోయాయి. ఇటువంటి సంఘటనల ద్వారా బాబా యొక్క దూరదృష్టి, భవిష్యత్ జ్ఞానాలు ఖచ్చితమైనవని దీక్షిత్ తెలుసుకున్నాడు.

బాబా అనుగ్రహదృష్టి కేవలం కాకాసాహెబ్ పైనే కాదు, అతని బంధువులందరిపైన కూడా ఉంది. ఒకసారి దీక్షిత్‌కి నాగపూరులో ఉన్న తన సోదరుడు జబ్బుపడినట్లు ఉత్తరం వచ్చింది. వెంటనే అతను ఆ ఉత్తరాన్ని తీసుకొని బాబా వద్దకు వెళ్లి, "బాబా! నా తమ్ముడికి నేను ఏ సేవా చేయలేకపోతున్నాను" అని విచారాన్ని వ్యక్తం చేశాడు. అప్పుడు బాబా, "నేను సేవ చేస్తాను" అని అన్నారు. బాబా అలా ఎందుకన్నారో అతనికి అర్థం కాలేదు. సరిగ్గా అదే సమయంలో నాగపూరులో ఉన్న అతని తమ్ముడికి ఒక సాధువు కనపడి అతనికి సేవచేసి స్వస్థత చేకూర్చారు. ముఖ్యమైన విషయమేమిటంటే, "నేను సేవ చేస్తాను" అన్న బాబా మాటలనే ఆ సాధువు దీక్షిత్ తమ్ముడితో అన్నాడు. ఈ అనుభవం ద్వారా బాబా వేలమైళ్ళ దూరంలో ఉన్న తమ భక్తుల బంధువులకు ఏమి జరుగుతుందో చూడగలరని, వాళ్ళకు అవసరమైనది చేయగలరని దీక్షిత్ తెలుసుకున్నాడు.

రోమన్ కాథలిక్‌లు 'దేవుని సమక్షంలో అభ్యాసం' అని ఒక విషయం గురించి చెప్తారు. అందుకోసం వాళ్ళు కనిపించని దేవునితో వ్యవహరిస్తూ, ప్రతిక్షణం తమ ముందు ఆయన ఉన్నాడని అనుభూతి చెందడానికి ఎంతో శ్రమపడతారు, కొంతమంది ఆ కఠినమైన సాధనలో విజయం సాధిస్తారు. అయితే ఎటువంటి శ్రమా లేకుండా దీక్షిత్ ఆ ప్రయోజనాన్ని పొందాడు. అతని విషయంలో దైవం అనుక్షణమూ తనను జాగరూకతతో గమనిస్తూ మార్గనిర్దేశం చేస్తుండటం ఎంతో స్పష్టం. పర్యవసానంగా తన ఉద్ధరణ గురించిన భయాలను, జాగ్రత్తలను చాలా సులభంగా, సహజాతిసహజంగా విస్మరించగలగడం అతనికి మాత్రమే సాధ్యమైంది.

source: లైఫ్ అఫ్ సాయిబాబా by బి.వి.నరసింహస్వామి, some other websites
రిఫరెన్స్: దీక్షిత్ డైరీ బై విజయకిషోర్.

 


ముందు భాగం కోసం
బాబా పాదుకలు తాకండి.




 


 


తరువాయి భాగం కోసం
బాబా పాదాలు తాకండి.

5 comments:

  1. ఓం సాయి రాం జై సాయి మాస్టర్ 🙏🙏

    ReplyDelete
  2. Om sai ram baba kapadu thandri pleaseeee

    ReplyDelete
  3. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo