సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 757వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. ఎటువంటి క్లేశాన్నయినా తప్పించగలరు బాబా
  2. అన్నీ బాబానే చూసుకుంటారు

ఎటువంటి క్లేశాన్నయినా తప్పించగలరు బాబా


నా పేరు వెంకటరావు. పెళ్ళయిన కొన్ని నెలలకే మా కొడుకు, కోడలికి మధ్య ఏదో చిన్న విషయంలో కాస్త మాటా మాటా పెరిగింది. దాంతో ఇద్దరూ కోపంతో అలిగి ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా మౌనంగా ఉండిపోయారు. అంతేకాదు, ఇంట్లోవారితో కూడా మాట్లాడటం మానేశారు. ఆ మాటపట్టింపులు సాయంత్రం దాకా కొనసాగాయి. మనం మధ్యలో కలిపించుకుంటే వాళ్ళేమనుకుంటారో ఏమోనని మేము కూడా మౌనంగా ఉండిపోయాము. అలా అని ఊరకే కూర్చోవటానికి మనసొప్ప లేదు. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో, “సాయినాథా, నీదే భారం” అని బాబాను తలచుకొని వాళ్ళతో మాట్లాడటానికి ప్రయత్నించాము. ఇద్దరూ ఎవరి వాదనను వాళ్ళు వినిపించారు. ఎవరినీ తప్పుపట్టటం మా ఉద్దేశ్యం కాకపోయినప్పటికీ ఈ ప్రక్రియ వాళ్ళ మధ్య అసంపూర్తిగా ఆగిపోయిన వాద ప్రతివాదాలను మళ్ళీ బయటకు తెచ్చింది. దాంతో పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టయింది మా పరిస్థితి. కనుచూపు మేరలో పరిష్కారమేమీ కనిపించలేదు. ఇక బాబా మాత్రమే ఈ సమస్యను పరిష్కరించగలరనే నమ్మకంతో మనసులోనే బాబాకు నమస్కరించుకుని, "బాబా! ఇలా జరుగుతుందేమిటి తండ్రీ? ఈ సమస్యను పరిష్కరించే బాధ్యత నీదే సాయినాథా" అని ఎంతో ఆర్తిగా బాబాను వేడుకున్నాను. ఒకవైపు వాళ్ళిద్దరి మాటలు వింటూనే మాకు సాయం చేయమని ఆ సాయినాథుని అర్థిస్తున్నాను. బాబా కరుణించాడో లేక వాళ్ళు అలసిపోయారో తెలియదుగానీ - ఒక్కసారిగా నిశ్శబ్దం! కాసేపటికి ఇద్దరూ దగ్గరై ఒకరికొకరు సారీ చెప్పుకున్నారు. తరువాత ఇద్దరూ మా దగ్గరకొచ్చి, "మీకు ఇబ్బంది కలిగించినందుకు మాకెంతో సిగ్గుగా ఉంది. ఇలాంటి పరిస్థితి మీకెప్పుడూ రానీయం. ఇదే మా మాట" అంటూ మా చేతులు పట్టుకున్నారు. “ధన్యవాదాలు సాయిదేవా! ఎటువంటి క్లేశాన్నయినా మీరే తప్పించగలరు. మిమ్మల్ని ఎల్లవేళలా నమ్మటమే మేం చేయాల్సింది. మీ భక్తులను మీరెల్లప్పుడూ కరుణిస్తూనే ఉంటారు”.  

         

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


అన్నీ బాబానే చూసుకుంటారు


సాయిబంధువులకు నా నమస్కారం. నా పేరు శ్రీనివాస్. ప్రస్తుతం మేము విదేశాలలో నివసిస్తున్నాము. బాబా ఈ బ్లాగులో పంచుతున్న లీలల ద్వారా ఎందరికో బాబా పట్ల నమ్మకం పెరిగేలా, వారివారి సమస్యలకు పరిష్కారం దొరికేలా చేస్తున్నారు. సాయిభక్తులందరి అనుభవాలు చదువుతుంటే చాలా సంతోషంగా ఉంటుంది. మనసు బాగాలేనప్పుడు ఈ బ్లాగులోని అనుభవాలు చదువుతాము. వాటి ద్వారా బాబా చెప్పిన శ్రద్ధ, సబూరీలు ఎంత అవసరమో నేను స్వయంగా తెలుసుకున్నాను. బాబా నాకు ప్రసాదించిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి చెప్తాను. 15 సంవత్సరాల క్రితం ఒకరోజు రాత్రి స్వప్నంలో బాబా నాకు దర్శనమిచ్చారు. ఆ స్వప్నంలో బాబా నా నుంచి దూరంగా పరిగెడుతున్నారు. దాని అంతరార్థమేమిటో నాకేమీ అర్థం కాలేదు. అప్పట్లో నేను కేవలం బాబాకి రోజూ దణ్ణం పెట్టుకునేవాడిని, అంతే. అందుకేనేమో, నేను ఆ స్వప్నాన్ని అంతగా పట్టించుకోలేదు. అసలు ఆ స్వప్నం ఎందుకు వచ్చిందో కూడా అర్థం కాలేదు. ఆ తరువాత అనుకోకుండా అసలు ఊహించని ఒక క్లిష్టమైన సమస్యలో ఇరుక్కున్నాను. అయితే బాబా దయవల్ల అందులో నుండి క్షేమంగా బయటపడ్డాను. తరువాత నాకు నచ్చిన అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాను. బాబా నా ఉద్యోగ విషయంలోనూ, మా పిల్లల విషయంలోనూ ఎంతో సహాయం చేశారు. ఇంతకుముందు నేను బాబాకు చేసే ప్రార్థనలో కేవలం నా కోరికలను తొందరగా తీర్చమని ఆత్రుతగా అడిగేవాడిని. అంతేగానీ, బాబా పట్ల నమ్మకం ఉండేది కాదు. ఎప్పుడైతే బాబా పట్ల స్థిరమైన నమ్మకం మరియు ఓపిక వచ్చిందో అప్పటినుంచి చాలా మార్పును గమనిస్తున్నాను. ముఖ్యంగా, నా ఉద్యోగం విషయంలోనూ, మా బేబీ విషయంలోనూ అద్భుతాలు జరుగుతున్నాయి. సాయిభక్తులకు చిన్న మనవి: మీరు అనుకున్నవి జరగాలంటే ఒక్కటే మార్గం, ‘అన్నీ బాబానే చూసుకుంటారు’ అనే స్థిరమైన నమ్మకంతో మీ ప్రయత్నం చేయండి. ఓపిక పట్టండి. ఏది వచ్చినా మన మంచికే అవుతుంది. ఇది నా స్వానుభవంతో చెబుతున్నాను. అందరికీ మంచి జరగాలని సాయినాథుని మనసారా కోరుకుంటున్నాను.


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo