- జీవితంలో అత్యంత ఉత్తమమైన శిరిడీ యాత్ర
పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు ఇటీవల తనకు బాబా ప్రసాదించిన అద్భుతమైన శిరిడీ దర్శనానుభవం గురించి మనతో పంచుకుంటున్నారు.
భక్తులందరికీ నమస్తే. బాబా ప్రసాదించిన అనుభవాలను పంచుకొనే అవకాశాన్ని మాకు కల్పిస్తున్నందుకు బ్లాగ్ బృందానికి చాలా ధన్యవాదాలు. ఇలాంటి అత్యున్నతమైన కార్యాన్ని కొనసాగించేలా బాబా బ్లాగ్ బృందాన్ని ఆశీర్వదించాలి. బాబా నన్ను తిరిగి తమ దగ్గరకు ఎలా తీసుకున్నారో ఇటీవల నేను మీ అందరితో పంచుకున్నాను. ఆ అనుభవం చివరిలో 'నేను ఇంక బాబాను దర్శనానికి వేచి ఉండలేను. ఈ నెల చివరివారంలో నేను శిరిడీ వెళ్లాలని ప్రణాళిక చేసుకుంటున్నాను' అని ప్రస్తావించాను. ఇప్పుడు దాని గురించి, అంటే నా శిరిడీ సందర్శనలోని అనుభవాలను పంచుకోబోతున్నాను. నా అనుభవం కాస్త వివరంగా, పెద్దదిగా ఉండబోతున్నందుకు నన్ను క్షమించమని అడుగుతున్నాను.
బాబా ఆశీస్సులతో, వారి అనుమతితో 2021, మార్చి నెలాఖరులో నేను నా శిరిడీ ప్రయాణానికి రైలు టిక్కెట్లు బుక్ చేసుకుని, ప్రయాణమయ్యే రోజు కోసం ఆత్రంగా ఎదురుచూడసాగాను. ప్రతిచోటా బాబా ఉన్నారని అనుభవమవుతున్నప్పటికీ జీవితంలోని అడ్డంకులను అధిగమించి ముందుకు సాగడానికి కావాల్సిన నూతన శక్తిని నేను శిరిడీలో పొందుతుంటాను. అందుచేత నేను సాధారణంగా సంవత్సరానికి 5-6 సార్లు శిరిడీ సందర్శిస్తుండేదాన్ని. కానీ కొంతకాలం నేను బాబాకు దూరమై, ఆ తరువాత బాబాకు దగ్గరైనప్పటికీ కోవిడ్ కారణంగా శిరిడీ వెళ్ళలేకపోయాను. చివరికి బాబా నన్ను శిరిడీ పిలిచినందుకు నిజంగా నేను పొందిన ఆనందాన్ని మాటల్లో వ్యక్తం చేయలేను. బాబా ప్రేమకు నేను ఎంతో కృతజ్ఞురాలినై ఉంటాను. ఇకపోతే, ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో దర్శన వేళల గురించి తెలియనందున దర్శనం గురించి, శిరిడీలో బస చేయడం గురించి కాస్త ఆందోళన చెందాను. ఒక వారం ముందు దర్శనానికి మరియు రూమ్స్ బుక్ చేసుకోవడానికి ఆన్లైన్‌లో ఓపెన్ అయ్యాయి. నేను శిరిడీలో ఉండే ఒకటిన్నర రోజుకు గానూ రెండుసార్లు దర్శనానికి బుక్ చేసుకున్నాను. అంతకంటే ఎక్కువసార్లు బుక్ చేసుకోవడానికి సంస్థాన్ వెబ్‌సైట్ అనుమతించలేదు. అయితే నేను ఆరతికి బుక్ చేసుకోలేదు. ఎందుకంటే, శిరిడీ సందర్శించిన నా స్నేహితులలో ఒకరు సంస్థాన్ వాళ్ళు ఆరతికి అనుమతించడం లేదని నాతో చెప్పినందువలన నేను కూడా అదే భ్రమలో ఉన్నాను. ఇక రూమ్ విషయానికి వస్తే, ఒక్క వ్యక్తి కోసం మాత్రమే అయితే రూమ్ బుక్ చేయడానికి సంస్థాన్ వెబ్‌సైట్ అనుమతించలేదు. కోవిడ్ కారణంగా ప్రైవేట్ హోటళ్ళలో రూమ్ బుక్ చేయడానికి నేను సంకోచించి, ఏమి చేయాలో అర్థంకాక, నేను ఒంటరిగానే శిరిడీ వెళ్తున్నప్పటికీ, "ఇద్దరి కోసం సంస్థాన్‌లో రూమ్ బుక్ చేసుకోవచ్చా?" అని బాబాను అడిగాను. బాబా నుండి సానుకూల సమాధానం వచ్చింది. దాంతో బాబాపై విశ్వాసముంచి రెండవ ఆలోచన లేకుండా నేను రూమ్ బుక్ చేసుకున్నాను. కోవిడ్ సమయంలో 24 గంటలపాటు ప్రయాణమంటే నా కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. కానీ నా ప్రయాణాన్ని ప్లాన్ చేసింది బాబా కాబట్టి నేను ఏ మాత్రమూ ఆందోళన చెందలేదు. నా ఆందోళనంతా శిరిడీలో బాబా దర్శనం గురించే.
చివరికి నేను ప్రయాణం చేయాల్సినరోజు రానే వచ్చింది. నేను శిరిడీ వెళ్లే రైలు ఎక్కాను. నేను కూర్చున్న చోట మరో ఇద్దరు ఉన్నారు. అయితే ఆ కోచ్ లోని మిగతా బెర్తులన్నీ ఖాళీగా ఉన్నాయి. అందువలన వాళ్లిద్దరూ వేరే బెర్త్‌లకు మారారు. సామాజిక దూరం పాటించాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో నేను ఒంటరిగా ఉండేలా బాబానే చేశారు. నా ప్రయాణం చాలా సాఫీగా సాగింది. ఏ అవాంతరాలు లేకుండా సమయానికి శిరిడీ చేరుకున్నాను. అంతలా సురక్షితమైన యాత్రను బాబా నాకోసం ఏర్పాటు చేశారు. శిరిడీ చేరుకున్నాక నేను నేరుగా ఆటోలో ద్వారావతి వసతి గృహానికి వెళ్ళాను. ఇక్కడ కూడా బాబా తమ అనుగ్రహాన్ని చూపించారు. నేను ఇద్దరి కోసం రూమ్ బుక్ చేసినప్పటికీ ఎటువంటి ఇబ్బందీ లేకుండా నాకు ఒక్కదానికి రూమ్ కేటాయించారు. నిజానికి చెక్-ఇన్ టైం ఉదయం 11 గంటలకైతే, నేను 2 గంటలు ముందుగా వెళ్ళాను. అయినప్పటికీ అదనంగా డబ్బు చెల్లించమని నన్ను అడగలేదు. సాధారణంగా ప్రైవేట్ హోటళ్లలో అయితే అదనపు మొత్తాన్ని వసూలు చేస్తారు.
నేను మధ్యాహ్నం 2 గంటల సమయంలో దర్శనానికి బుక్ చేసుకొని ఉన్నప్పటికీ అంతవరకూ బాబా దర్శనం కోసం వేచి ఉండదలచుకోలేదు. కాబట్టి త్వరగా తయారై ఉదయం 11 గంటల సమయంలో మందిరానికి బయలుదేరాను. అయితే ద్వారావతిలో బయోమెట్రిక్ టికెట్లు ఇస్తున్న సంగతి గమనించక చకచకా మందిరానికి వెళ్ళిపోయాను. దర్శనం కోసం సెక్యూరిటీని విచారిస్తే, "బయోమెట్రిక్ టికెట్లు 11.30 వరకు మాత్రమే ఇస్తారు. కాబట్టి త్వరగా వెళ్ళండి" అని అన్నారు. అయితే అప్పటికే 11.20 అయింది. నేను పరుగున వెళ్లి టికెట్ తీసుకొని, నా మొబైల్, చెప్పులు సంబంధిత కౌంటర్లలో విడిచిపెట్టి 10 నిమిషాల్లో క్యూ లైన్‌లోకి వెళ్ళాను. క్యూ కాంప్లెక్స్ లోపలికి వెళ్ళాక 11.30 అవడంతో లైన్ ఆపేశారు. నేను ఆరతికి అనుమతి లేదన్న ఆలోచనలో ఉన్నందున ఆరతి పూర్తయిన తరువాత మమ్మల్ని లోపలికి పంపుతారని అనుకున్నాను. కానీ 15 నిమిషాల తరువాత సెక్యూరిటీవాళ్ళు కొద్దిమందిని లోపలికి పంపారు. కేవలం నలుగురం మాత్రమే ఉండిపోయాము. నేను కొంచెం నిరాశ చెంది, "ఆరతికి అనుమతించమ"ని బాబాను అడిగాను. కానీ తరువాత, “బాబా నన్ను శిరిడీకి పిలవడమే గొప్ప ఆశీర్వాదం. నేను మరీ అత్యాశతో ఉండకూడదు. నాకన్నా ప్రస్తుతం ఆరతికి లోపలికి వెళ్ళిన వాళ్ళకి బాబా ఆశీస్సులు అవసరం ఉండి ఉండవచ్చు. అయినా ఈ సంఘటన ద్వారా ఆరతికి అనుమతి ఉందని తెలిసింది, లేకపోతే దీని గురించి నాకు తెలిసేది కాదేమో! కేవలం దర్శనం చేసుకొని శిరిడీ నుండి తిరుగు ప్రయాణం అయివుండేదాన్ని. ఇప్పుడు ఆరతికి వెళ్లొచ్చని తెలిసింది, కాబట్టి సాయంత్రం ఆరతికి ప్లాన్ చేసుకుందామ”ని అనుకున్నాను.
ఆరతి పూర్తయిన తరువాత మమ్మల్ని లోపలికి అనుమతించారు. సమాధిమందిరంలోని బాబాను దూరం నుండి దర్శించుకుంటూ ప్రధాన హాలు గుండా ముందుగా ద్వారకామాయిలోకి పంపారు. ద్వారకామాయిలోకి అడుగుపెట్టిన క్షణాన నాకు కన్నీళ్లు ఆగలేదు. మొత్తానికి ఒక సంవత్సరం కన్నా ఎక్కువ కాలం గడిచాక బాబా ముందు ఉండే అవకాశం నాకు వచ్చినందుకు ఆ సమయమంతా నా కళ్ళనుండి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. తరువాత ద్వారకామాయి నుండి ప్రధాన హాలు గుండా బాబా దగ్గరకు చేరుకున్నాను. బాబాను చూసి కన్నీళ్ల పర్యంతమయ్యాను. వెనుక నుండి నెట్టేవారెవరూ లేనందున బాబాను దర్శించుకునేందుకు మాకు తగినంత మంచి సమయం దొరికింది. అటువంటి అందమైన మరియు ఆనందకరమైన దర్శనాన్ని నేను మాటలలో వర్ణించలేను. బాబాను చూస్తూ పరవశించిపోయాను. ఆరతి విషయంలో అత్యాశ పడినందుకు హృదయపూర్వకంగా బాబాకు క్షమాపణలు చెప్పుకున్నాను. తరువాత గురుస్థాన్ వద్ద దర్శనం చేసుకొని చివరిగా ప్రసాదం తీసుకున్నాను. కోవిడ్ గురించి ఏ మాత్రమూ భయపడాల్సిన పనిలేనంతగా సంస్థాన్ వారు మందిరం లోపల, వెలుపల సామాజిక దూరం పాటించేలా చక్కటి ఏర్పాట్లు చేశారు.
బాబా ప్రసాదించిన అద్భుతమైన దర్శనంతో నేను ఆనందంతో భోజనానికి వెళ్ళి తృప్తిగా భోజనం చేసి, మళ్ళీ నేను బుక్ చేసుకున్న 2 గంటల దర్శనానికి వెళ్ళాను. అప్పుడు నా ముందు ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉన్నారు. ఈసారి దర్శనం మరింత ప్రశాంతంగా అనిపించింది. నేను చాలాసేపు బాబాను చూస్తూ ఉండిపోయాను. నన్ను ఎవరూ నెట్టడం గానీ, వెళ్ళమనడం గానీ జరగలేదు. కావాల్సినంతసేపు తృప్తిగా బాబా దర్శనం చేసుకున్నాను. ఇదే శిరిడీ సందర్శించడానికి అత్యంత ఉత్తమమైన సమయమని అనిపించింది. నేనెప్పుడూ అంత ప్రశాంతమైన దర్శనభాగ్యాన్ని పొందలేదు. వెంటనే రాత్రి 8 గంటలకు నేను బుక్ చేసుకొని ఉన్న దర్శనం టికెట్ మీద మరోసారి దర్శనానికి వెళ్ళాను. ఆ సమయంలో ఒక సెక్యూరిటీ నాతో కొద్దిసేపు మాట్లాడి ఆరతికి, దర్శనానికి సంబంధించిన అంశాలను చక్కగా వివరించాడు. దాంతో నేను సాయంత్రం ఆరతి సమయానికి ఖచ్చితంగా అక్కడ ఉండాలని అనుకున్నాను. బాబా ఇవ్వాలనుకుంటే ఆరతికి అనుమతించి ఆశీర్వదిస్తారు, లేకుంటే వారి దర్శనంతో నేను సంతృప్తి చెందుతాను, అంతేగానీ అత్యాశ కూడదని అనుకొని ప్రశాంతంగా బాబా దర్శనం చేసుకున్నాను.
దర్శనానంతరం నేను నా గదికి వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకొని, ఆ తరువాత బస చేసిన చోటే బయోమెట్రిక్ టికెట్ తీసుకొని మందిరానికి బయలుదేరాను. ముందుగా అనుకున్నట్లు ఆరతి లైన్ ఆపే సమయానికి నేను క్యూ లైన్‌లో ఉన్నాను. కొద్దిసేపటికి ఆరతి కోసం లోపలికి పంపడానికి సెక్యూరిటీ గేట్ తీశారు. వావ్! బాబా అద్భుతాన్ని చూడండి. బాబా తమ ఆరతి దర్శనానికి నన్ను అనుమతించారు. ఆరతికి కేవలం 35-40 మంది మహిళలను, 35-40 మంది పురుషులను మాత్రమే అనుమతిస్తున్నారు. సామాజిక దూరాన్ని పాటిస్తూ భక్తులు కూర్చోడానికి/నిలబడటానికి అనువుగా స్లాట్‌లు ఏర్పాటు చేశారు. తొలుత ఆన్‌లైన్ ద్వారా ఆరతి బుక్ చేసుకున్నవారిని పంపి, ఆపై మిగిలిన స్లాట్‌లను లెక్కించి అందుకు తగ్గట్టు ఉచిత పాస్ ద్వారా వచ్చిన భక్తులను మాత్రమే ఆరతికి అనుమతిస్తున్నారు. అందులో నేను కూడా ఒకదాన్ని కావడం బాబా కృపావిశేషం. ఆ సమయంలో నా ఆనందాన్ని మీరు ఊహించగలరని నేను అనుకుంటున్నాను. బాబాను స్పష్టంగా చూస్తూ నిలబడి ఆరతి పాడాను. ఆ సమయంలో నేను పట్టలేని ఆనందంలో మునకలేశాను, కొన్ని నిమిషాలపాటు కన్నీళ్లపర్యంతమయ్యాను. "బాబా! మీరు మాత్రమే మీ బిడ్డలపై అటువంటి ఆశీస్సులను కురిపించగలరు. నేను ఈ స్థితిని ఎలా వివరించగలను? ఆ ఆనందాన్ని అనుభూతి చెందాల్సిందే. బాబా! దయచేసి మీ బిడ్డలందరికీ అలాంటి ఆనందాన్ని ప్రసాదించండి".
అద్భుతమైన ఆరతి దర్శనం తరువాత భోజనం చేసి నేను నా గదికి వెళ్లి, నాలో నేనే, "రేపు దర్శనానికి మాత్రమే వెళ్ళాలి, ఆరతికి ప్లాన్ చేసుకోకూడదు. ఎందుకంటే, నాలాగే తోటి భక్తులు కూడా ఆరతి దర్శనాన్ని కోరుకుంటారు. పైగా నేను తిరుగు ప్రయాణానికి కోపర్గాఁవ్‌లో రైలు అందుకోవాలి. కాబట్టి మధ్యాహ్నానికల్లా నేను శిరిడీ నుండి బయలుదేరాలి. అందుచేత ఉదయాన్నే రెండుసార్లు దర్శనం చేసుకొని మధ్యాహ్నం వరకు విశ్రాంతి తీసుకొని శిరిడీ విడిచి వెళ్ళాల'ని అనుకున్నాను. ఇంకా నేను శిరిడీ సమీపంలో ఉన్న ఇతర ప్రదేశాలను దర్శించాలని అనుకొని బాబా అనుమతి అడిగాను. అయితే బాబా నుండి అనుమతి లభించలేదు. బాబా అనుమతి ఎందుకు ఇవ్వలేదో నాకు తరువాత అర్థమైంది.
మరుసటిరోజు ఉదయం నేను ముందుగా ఖండోబా ఆలయాన్ని దర్శించాను. (నేను శిరిడీ వెళ్ళినప్పుడల్లా ఖండోబా ఆలయాన్ని దర్శించేలా చూసుకుంటాను.) తరువాత ముందుగా అనుకున్నట్లు మరో రెండుసార్లు బాబా దర్శనానికి వెళ్ళబోతున్నానని చాలా ఉత్సాహంగా మందిరానికి వెళ్ళాను. బాబా చక్కటి దర్శనాలను అనుగ్రహించారు. రెండవ దర్శనం తరువాత బయటికి వచ్చేముందు గురుస్థాన్ దగ్గర అదివరకు ఉండే ముఖదర్శనం ఇప్పుడు లేదని నేను గుర్తించాను. నిజానికి అక్కడినుంచి బాబాను చూడటం నాకు చాలా ఇష్టం. కారణం తెలియదుగానీ అక్కడినుండి బాబాను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. సరే, "ఈసారి యాత్రలో ఇదే నా చివరి దర్శనం" అనుకొని, చివరిగా బాబాకు వీడ్కోలు చెప్పి, "మళ్ళీ త్వరలోనే నన్ను శిరిడీకి పిలవమ"ని బాబాను అడిగాను. తరువాత అక్కడినుండి బయలుదేరబోతుండగా అకస్మాత్తుగా ముఖదర్శనం వైపునుండి ఒక కుక్కపిల్ల నా దగ్గరకు వచ్చింది. ఆ రూపంలో వచ్చింది బాబానే అని భావించి, నా దగ్గర ఉన్న బాబా ప్రసాదాన్ని దానికి తినిపించి, నీళ్లు కూడా అందించాను. కానీ ఆ కుక్కపిల్ల ప్రసాదం మాత్రమే తీసుకుంది, నీళ్లు ముట్టలేదు. నేను ఆ కుక్కపిల్లతో కొంతసేపు గడిపాను. నిజానికి కోవిడ్ కారణంగా మందిర ప్రాంగణంలో ఉండటానికి భక్తులను అనుమతించడంలేదు, వెళ్లిపొమ్మని చెప్తున్నారు. అయితే నేను కుక్కపిల్లతో అంతసేపు ఉన్నప్పటికీ నన్ను ఎవరూ ఏమీ అనలేదు. ఆ కుక్కపిల్లని విడిచిపెట్టి రావడానికి నాకు బాధగా అనిపించింది. అది కూడా నా వెనుకనే ఎగ్జిట్ గేట్ వరకు వచ్చింది. నన్ను పంపించడం బాబాకి కూడా ఇష్టం లేదని నాకనిపించింది.
నేను బయటికి వచ్చాక అల్పాహారం తిని తిరిగి నా గదికి వెళ్ళాను. నేను విశ్రాంతి తీసుకుంటుండగా సుమారు 10.30కి నా సోదరి ఫోన్ చేసి, తన పక్కింట్లో ఉన్నావిడ తన తరపున బాబాకు దక్షిణగా హుండీలో కొంత మొత్తాన్ని వేయమని చెప్పారని చెప్పింది. నేను తనతో, "ఇక నేను దర్శనానికి వెళ్ళడం లేదు. డొనేషన్ కౌంటర్లో డబ్బు కడతాను" అని చెప్పాను. కానీ కొద్దినిమిషాల్లో నా మనసుకి, ‘బాబా నన్ను తమ దర్శనానికి మళ్ళీ రమ్మని పిలుస్తున్నట్లు’గా అనిపించి, కొంతసేపటి క్రితం కుక్కపిల్ల రూపంలో బాబానే స్వయంగా వచ్చి, 'నేను ఇప్పుడే నిన్ను పంపడం లేదు, నువ్వు మళ్ళీ దర్శనానికి రా' అని సూచించినట్లుగా అప్పుడు అనిపించింది. వెంటనే నేను బాబాను, "మరోసారి మీ దర్శనానికి రానా?" అని అడిగాను. బాబా నుండి "రమ్మ"ని సమాధానం వచ్చింది. అయితే ఆరతి సమయం కావొస్తున్నందున నేను ఆరతికి వెళ్లాలని, ఒకవేళ కేవలం దర్శనమే లభించినప్పటికీ తృప్తి చెందాలని అనుకున్నాను. వావ్.. ఎంత అద్భుతం! బాబా నాకు మళ్ళీ ఆరతి దర్శనాన్ని అనుగ్రహించారు. నా కళ్ళు ఆనందభాష్పాలతో నిండిపోయాయి. నేను నా అనుభూతిని వివరించలేను. భక్తులందరికీ ఇలాంటి అద్భుతమైన బాబా ఆశీస్సులను అనుభవించే అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నాను. బాబా నన్ను ఇతర ప్రదేశాల దర్శనానికి ఎందుకు అనుమతించలేదో నేను అప్పుడు గ్రహించాను. ముందురోజు నేను కోల్పోయిన మధ్యాహ్న ఆరతి దర్శనాన్ని బాబా నాకోసం ప్లాన్ చేశారని చాలా ఆనందించాను. అదివరకు 2-3 దర్శనాలు పొందడమే నాకు చాలా కష్టమయ్యేది. అలాంటిది మొత్తం ఏడుసార్లు ఆనందకరమూ, ప్రశాంతమూ అయిన దర్శనాలతో బాబా నన్ను అనుగ్రహించారు. కానీ చివరికి శిరిడీ వదిలి రాలేక భారమైన హృదయంతో గురువారం ఇంటికి తిరిగి వచ్చాను. ఇది నా జీవితంలో అత్యంత ఉత్తమమైన శిరిడీ యాత్ర. "బాబా! చాలా చాలా ధన్యవాదాలు. నా అనుభవాన్ని పంచుకోవడంలో ఆలస్యం చేసినందుకు దయచేసి నన్ను క్షమించండి. అందరిపై మీ అపారమైన ఆశీస్సులు కురిపించండి. అందరికీ ఇటువంటి అద్భుతమైన అనుభవాలను ప్రసాదించండి".
Very nice sai leela.we also went to Tirumala to have darshan of lord Srinivasa.we had nice darshan.i also felt very happy to have darshan of lord.with baba blessings my wish fulfilled. Thank you sai.om sai ram ❤❤❤��
ReplyDeleteJai sairam
ReplyDeleteఓం సాయిరాం!
ReplyDeletejai sairam
ReplyDeletejai sairam
jai sairam
Om Sairam
ReplyDeleteSai always be with me
716 days
ReplyDeletesairam
Om sai ram
ReplyDeleteOm sai ram baba amma arogyam bagundali thandri pleaseeee
ReplyDeleteమీ అనుభవం ద్వారా మమ్మల్నందరినీ మరోసారి షిరిడి యాత్ర చేయించినందుకు ఖచ్చితంగా ధన్యవాదాలు మీరు ద్వారకామాయి లో బాబా ని చూసి కన్నీళ్లు పెట్టిన సందర్భం చదువుతున్నప్పుడు డు హృదయపూర్వకంగా మా కళ్ళ నుంచి కూడా కన్నీళ్ళు వచ్చాయి. ఇంతకుమించి బాబా భక్తుడు ఏమి ఆశిస్తారు. మీ కథను ఎంత ఆస్వాదించాను మీ కథ ద్వారా దర్శనం మాటల్లో వర్ణనాతీతం హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు.
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI.. OM SAI RAM
ReplyDelete