- ప్రేమతో పూలమాల సమర్పణ - బాబా ఆశీర్వాదం
- బాబా దయ
ప్రేమతో పూలమాల సమర్పణ - బాబా ఆశీర్వాదం
సాయి భక్తుడు పార్థసారథి తమకి బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు:
నా పేరు పార్థసారథి. మేము విజయవాడలో నివసిస్తున్నాము. ఎవరైనా శిరిడీ వెళుతున్నట్లు తెలిస్తే వారికి ఒక వందరూపాయలు ఇచ్చి, “వీలైతే ఈ డబ్బుతో ఒక పూలమాల కొని బాబాకు సమర్పించండి. ఒకవేళ వీలుకాకపోతే ఆ డబ్బును బాబాకు దక్షిణగా హుండీలో వేయండి” అని చెబుతుంటాను. వాళ్ళు శిరిడీ నుండి తిరిగివచ్చాక, బాబా పూలమాలను ఎలా స్వీకరించిందీ చెబుతూవుంటే ఆ ఆనందం చెప్పనలవి కాదు. ఒకసారి మురాల రామాంజనేయులు తన తల్లిదండ్రులతో కలిసి శిరిడీ వెళుతున్నానని నాతో చెప్పారు. నేను ఆయనకు 200 రూపాయలు, ఒక ఊదీ ప్యాకెట్టు ఇచ్చి, ఎప్పటిలాగే ఆ డబ్బులతో ఒక పూలమాల కొని బాబాకు సమర్పించమని చెప్పాను. (ఆ రోజుల్లో ప్రతిరోజూ శిరిడీ నుండి 2, 3 ఊదీ ప్రసాదం ప్యాకెట్లు వస్తూ ఉండేవి.) కొంతసమయం తరువాత రామాంజనేయులు మళ్ళీ నా వద్దకు వచ్చి, “ఈ సమయంలో శిరిడీలో చాలా రద్దీగా ఉంటుంది కదా, అంత రద్దీ ఉండే సమయంలో పెద్దవాళ్ళని ఎలా తీసుకెళ్తావని అందరూ కోప్పడుతున్నారు” అని చెప్పారు. ఎందుకంటే, ఆయన శిరిడీ వెళ్ళేరోజు శ్రీరామనవమి. అప్పుడు నేను ఆయనతో, “నీకు ఊదీ ప్యాకెట్టు ఇచ్చి దానితో పాటుగా ఒక పని అప్పజెప్పాను. మీకు ఏ విధమైన ఇబ్బందీ కలుగదు. మీరు ఎవరి మాటా వినవద్దు, ముందుగా అనుకున్నట్లుగా ఆనందంగా శిరిడీ వెళ్ళిరండి” అని చెప్పాను. తరువాత ఆయన తన తల్లిదండ్రులతో కలిసి శిరిడీ వెళ్ళారు. శిరిడీ నుండి తిరిగివచ్చాక ఆయన ఆనందం అంతా ఇంతా కాదు. నేనిచ్చిన డబ్బులకి ఒక పెద్ద గులాబీపూల దండ వచ్చిందట. దాన్ని ఆయన ఒక్కరూ మోయలేక తలా కాసేపు మోసుకుంటూ బాబా సమాధిమందిరానికి తీసుకువెళ్ళారట. అక్కడ పూజారులు ఆ హారాన్ని బాబా సమాధిపై చక్కగా అలంకరించారట. అంతేకాదు, అంత జనసమ్మర్థం ఉన్నప్పటికీ బాబా దయవల్ల వాళ్ళు ఏ విధమైన తొక్కిసలాటకూ లోనవలేదట. బాబా చూపిన ప్రేమకు ఎంతో ఆనందంతో మనసంతా నిండిపోయింది.
అలా జరుగుతుండగా, ఈమధ్యకాలంలో సాయిబాబా సంస్థానంవారు భక్తులు సమర్పించిన పూలమాలలను బాబా మెడలో అలంకరించటం ఆపేశారు. ఒకసారి ఎందుకనో బాబాకు మల్లెపూలమాల (శిరిడీలో ఎక్కువగా కాగడామల్లెల పూలమాలలు దొరుకుతాయి.) ఇవ్వాలని తోచి ఒక పూలమాల కొని బాబాకు సమర్పిస్తే అక్కడి పూజారి దానిని బాబా పాదాల వద్ద పదిలంగా ఉంచారు. అప్పట్నించి ఆ మల్లెపూలమాలలను బాబాకు సమర్పణ చేస్తూ ఉన్నాను.
ఈ విధంగా జరుగుతూ ఉండగా, ఈమధ్య జరిగినదే కనకాంబరం పూలమాల ఉదంతం. 2021, ఫిబ్రవరి 12వ తేదీన మా అపార్టుమెంటులో ఉండే శ్రీమతి లత శిరిడీ వెళ్తూ ఆ ముందురోజు మా ఇంటికి వచ్చారు. బాబాకు నివేదించమని ఒక మిఠాయిల పెట్టెతో పాటుగా 200 రూపాయలు ఇస్తూ, ‘బాబాకు మల్లెపూలమాల సమర్పించమ’ని చెప్పాను. మళ్ళీ ఎందుకో ఆ రాత్రి, ‘కనకాంబరాల పూలమాల అయినా పరవాలేదు’ అని ఆవిడకి మెసేజ్ చేశాను. శిరిడీ వెళ్ళిన తరువాత ఆవిడ పూలమాల కొందామని బజారుకు వెళ్తే ఆ సమయంలో అక్కడ పూలు అమ్మేవారెవరూ కనపడలేదట. కొంచెం పరిశీలించినమీదట, ఒక మూలన ఒక అమ్మాయి కనకాంబరాల మాలతోనూ, ఇంకొక అబ్బాయి రామాఫలాలతోనూ కనపడ్డారట. వెంటనే ఆవిడ కనకాంబరాల మాల తీసుకుని సమాధిమందిరంలో బాబాకు సమర్పించగా అక్కడి పూజారులు దానిని బాబా సమాధిపైన, బాబా పాదాలచెంత అలంకరించారట. ఆవిడ శిరిడీ నుండి తిరిగి వచ్చి నాకు బాబా ప్రసాదం ఇస్తూ ఈ విషయం చెప్పారు. బాబా ప్రసాదించిన ఆ ఆనందాన్ని దాచుకోలేక వెంటనే మీతో పంచుకుంటున్నాను.
బాబా దయ
పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ మహరాజ్ చరణారవిందములకు శతకోటి నమస్కారాలు. సాయిబంధువులకు, ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయి బృందానికి నా నమస్కారములు. బాబాపై భక్తి, శ్రద్ధలు బలపడేందుకు ఈ బ్లాగ్ ఎంతో దోహదం చేస్తుంది. ఇప్పుడు నేను పంచుకునే అనుభవం మా చెల్లెలి భర్తకు సంబంధించినది.
2020, ఫిబ్రవరిలో మా మరిదికి కిడ్నీ స్టోన్ ఆపరేషన్ చేయవలసి వచ్చింది. బాబా దయవలన ఆపరేషన్ ఏ ఇబ్బందీ లేకుండా జరిగింది. అయితే తను డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన వెంటనే, తనకి తప్ప ఇంట్లో ఉన్న అందరికీ (అమ్మకి, నాన్నకి, తమ్ముడికి, చెల్లికి) డెంగ్యూ జ్వరం వచ్చింది. బాబా దయవలన డెంగ్యూ నుండి మా మరిది మాత్రం తప్పించుకున్నారు. అదలా ఉంటే, ఆపరేషన్ సమయంలో వేసిన స్టెంట్ కొద్దిరోజుల తర్వాత తీసేయాలి. కానీ, అప్పటికే కరోనా తీవ్రంగా విజృంభించింది. కనీస అవసరాలకు కూడా బయటకు వెళ్ళడానికి ఆలోచించే ఇలాంటి సమయంలో హాస్పిటల్‌కి వెళ్లి స్టెంట్ తీయించాలంటే చాలా భయం వేసింది. అప్పుడు నేను, "బాబా! ఏ కష్టమూ లేకుండా స్టెంట్ తీయించే పని పూర్తయితే ఆ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయ చూపారు. ఏ కష్టం లేకుండా స్టెంట్ తీయించే పని పూర్తయింది. నా అనుభవాన్ని పంచుకోవడంలో చాలా ఆలస్యం చేసినందుకు బాబాకు క్షమాపణ చెప్పుకుంటున్నాను. ఈ సమస్యతోపాటు తనకు ఉన్న ఇంకొక ఆరోగ్య సమస్యను కూడా పరిష్కరించమని బాబాను వేడుకున్నాను. అది కూడా పరిష్కారమైతే రెండు కలిపి పంచుకుందామని ఎదురుచూశాను. "బాబా! మీ అనుగ్రహం కోసం ఎదురుచూస్తూ ఉన్నాము. మీ కృపాకటాక్షాలు మా అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను".
Om Sairam
ReplyDelete🙏🙏🙏
Om Sairam
ReplyDeleteSai always be with me
696 days
ReplyDeletesairam
OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI.. OM SAI RAM
ReplyDelete