సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 733వ భాగం....




ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా సర్వాంతర్యామి, పంచభూతాలూ బాబాకు దాసోహమే!
  2. అడిగినంతనే నాన్న మనసు మార్చిన బాబా

బాబా సర్వాంతర్యామి, పంచభూతాలూ బాబాకు దాసోహమే!


పేరు వెల్లడించని ఒక సాయి భక్తుడు బాబా తమకి ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:


ప్రియమైన సాయిభగవత్ బంధువులకు నా నమస్కారములు. ఈ బ్లాగ్ ద్వారా ఎంతోమంది సాయిభక్తులు తమ తమ అనుభవాలను మరియు సాయి వారిపై కరుణ చూపిన సందర్భాలను సాటి సాయిభక్తులతో పంచుకునే అవకాశం కల్పించినందుకు బ్లాగ్ నిర్వాహకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను హైదరాబాద్ వాసిని. బాబా నాకు, నా కుటుంబానికి చేసిన మేలును మీతో పంచుకోవాలని భావించి ఈ అనుభవాన్ని వ్రాస్తున్నాను. ఇది చదివినవారికి కాస్త విస్మయం, ఆశ్చర్యం కలగవచ్చు. కానీ బాబా అనుగ్రహం అనన్య సామాన్యం.


మాకు ఇద్దరు కుమారులు. మా మొదటి కుమారుడు డిగ్రీ ఫైనలియర్ (ఉస్మానియాలో) చదువుతున్నాడు. మొదటి రెండు సంవత్సరాలు వాడు చదువును కాస్త నిర్లక్ష్యం చేయటం వల్ల ఫైనల్ సెమిస్టరుకి వచ్చేసరికి 7 బ్యాక్‌లాగ్స్ మిగిలివున్నాయి. వాటికి తోడు ఫైనల్ సెమిస్టరులోని 8 సబ్జెక్టులతో కలిపి మొత్తం 15 సబ్జెక్టులలో పరీక్షలు వ్రాయాలి. అన్నీ ఒకేసారి పాస్ కావాలి, లేకపోతే పరీక్షా ఫలితం సప్లిమెంటరీ క్రిందకి వస్తుంది. దానివల్ల ఒక సంవత్సరం వృధా అయిపోతుంది. అంతేకాదు, తను డిగ్రీ ఫెయిలయ్యాడని బంధువులలో చులకనైపోతాడేమోని చాలా భయపడ్డాము. అంతా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, మా ఆరాధ్య దైవమైన బాబా మీద భారంవేశాము. బాబా దయవుంటే తప్ప మా వాడు డిగ్రీ ఒకేసారి పాస్ కాడు, కాలేడు. ఈ పరిస్థితులలో మావాడికి కూడా చెప్పాము, ‘మనం బాబా పాదాలు పట్టుకోటం తప్ప మనకు వేరే మార్గం లేదు, మనం చేసేది ఏమీలేదు’ అని.  


2020, మే నెలలో మావాడు ఫైనల్ సెమిస్టర్ (8 పేపర్లు) పరీక్షలు మరియు మిగిలివున్న బ్యాక్‌లాగ్స్ (7 పేపర్లు) పరీక్షలు ఒకేసారి వ్రాయాల్సివుంది. ఇంతలో మేము 2020, జనవరి 26వ తేదీన సెలవుదినం కావటం వల్ల హైదరాబాదుకి దగ్గరలోని చింతపల్లి (నల్లగొండ జిల్లా) సాయిబాబా గుడికి వెళ్ళాము. అక్కడ బాబాకు మా బాధనంతా చెప్పుకుని, “ఎలాగైనా మా అబ్బాయిని సప్లిమెంటరీ లేకుండా, ఒక సంవత్సరం వృధా కాకుండా డిగ్రీ పాస్ చేసి మా పరువు కాపాడమ”ని కోరుకున్నాము.


ఇక అప్పటినుండి బాబా ఏమి లీల చేస్తారో, ఎలా మా మొర ఆలకిస్తారో అని ఎదురుచూస్తూ గడిపాము. ఎందుకంటే, సాధారణంగా ఎప్పుడూ జరిగే పద్ధతిలో పూర్తి సిలబస్‌తో పరీక్షలు జరిగితే మావాడు పాస్ కావడం అసంభవం. కానీ బాబా ప్రణాళిక, పథకం వేరు. ఇంతలో రానే వచ్చింది బాబా ప్రణాళికలో ఒక మలుపు, అదే కరోనా మహమ్మారి. ఆ తర్వాత అంతా మీకు తెలిసిందే. 2020, మార్చి 23 నుండి భారత్ బంద్, కర్ఫ్యూ, పూర్తిగా లాక్‌డౌన్. స్కూళ్ళు, కాలేజీలు అన్నీ మూసివేశారు, పరీక్షలన్నీ వాయిదాపడ్డాయి. అంతా అస్తవ్యస్తం అయిపోయింది. ఎట్టకేలకు ప్రభుత్వ నిర్ణయం, యూజీసీ వారి ఉత్తర్వులమేరకు గత నవంబరు-డిసెంబరు మాసాలలో, కుదించిన సిలబస్‌తో, ఫుల్ టైట్ షెడ్యూల్‌తో డిగ్రీ పరీక్షలు నిర్వహించారు ఉస్మానియా యూనివర్సిటీవారు. (అలా మ్రొక్కుబడిగా పరీక్షలు నిర్వహించి యూనివర్సిటీవారు చేతులు దులిపేసుకున్నారనిపించింది.) దాంతో పాపం మావాడు ఒక్కోరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు 3 పరీక్షలు వ్రాయవలసి వచ్చింది. చివరకు ఒకటి, రెండు పరీక్షలు తప్ప మిగిలిన పరీక్షలన్నీ బాగా వ్రాశానన్నాడు. అప్పుడు నేను, నా భార్య అనుకున్నాము, ‘నువ్వు కాదురా పరీక్ష వ్రాసేది,  బాబా పెట్టిన పరీక్ష మేము వ్రాస్తున్నాము’ అని.


ఇక అప్పటినుండి పరీక్షాఫలితాలు ఎప్పుడు వస్తాయా అని వేయికళ్ళతో ఎదురుచూడసాగాము. ఆరోజు (డిసెంబరు, 2020) రానే వచ్చింది. యూనివర్సిటీవారు డిగ్రీ ఫలితాలు ప్రకటించారు. నిజంగా ఆరోజు బాబా తమ అనుగ్రహవర్షాన్ని మాపై కురిపించారని చెప్పాలి. మావాడు 15 సబ్జెక్టులు (81.05% తో) ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యాడు. మా ఆనందానికి అంతులేదు. కృతజ్ఞతలతో బాబాకు శతకోటి ప్రణామాలు తెలియజేసుకున్నాము.


బాబా దయవల్ల మావాడు డిగ్రీ పాసయ్యాడు, కానీ ఒక సంవత్సరం వృధా కాకుండా పీజీ చేయాలంటే ఎంట్రన్స్ పరీక్ష వ్రాసివుండాలి, కానీ మావాడు అది వ్రాయలేదు. ఇప్పుడెలాగా అని ఆలోచిస్తున్న సమయంలో బాబా దయవల్ల ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో పీజీ అడ్మిషన్స్ తేదీని పొడిగించటం జరిగింది. చివరకు అడ్డువచ్చిన అవరోధాలన్నిటినీ అధిగమించి ఆఖరి తేదీకి రెండురోజుల ముందు యాజమాన్య కోటాలో మావాడికి పీజీ సీటు సంపాదించాము. ఈరోజున మావాడు రోజూ కాలేజీకి వెళ్లి వస్తుంటే చూసే మాకు ‘ఇది కలా, నిజమా?’ అనిపిస్తుంది. మేము కోరుకున్న చిన్న కోరికను తీర్చటం కోసమే ఒక పథకం ప్రకారం బాబా ఈ కరోనా అనే వైరస్‌ను సృష్టించి ప్రపంచాన్నే ఒక భయానకమైన చట్రంలోకి నెట్టి, మావాడు పాసయ్యేలా చేశారా అనిపిస్తుంది. లేకపోతే, అసలు అది అసంభవం.


అందుకే, సాయిభక్తులందరికీ సవినయంగా మనవి చేసేది ఒక్కటే, బాబా సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు, వారికి సాధ్యంకానిదంటూ ఏమీలేదు. మన కష్టాలను, బాధలను బాబాకు వదిలేద్దాం. అప్పుడు బాబా వాటిని దూదిపింజలాగా ఎగరగొడతారు. మనం అనుభవించిన బాధలు, కష్టాలు ఏవీ మనకు గుర్తుకు కూడా రానివిధంగా మన జీవితాల్ని నిలబెడతారు. మనకు ఏం కావాలో, అది ఎప్పుడివ్వాలో బాబాకు తెలుసు. మనకు ఉండవలనసినదల్లా శ్రద్ధ, సబూరి (సంతోషంతో కూడిన ఓపిక), బాబాపై అచంచలమైన భక్తి.


“బాబా! అన్యాథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ!”

మీ జీవితాలు కూడా బాబా వెలుగులతో నిండాలని కోరుకుంటూ...


ఇట్లు,

మీ భవదీయ సోదరుడు.


అడిగినంతనే నాన్న మనసు మార్చిన బాబా


పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


ముందుగా ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా నమస్సుమాంజలి. నేను బాబా భక్తురాలిని. మేము హైదరాబాదులో నివసిస్తున్నాము. కొన్నిరోజుల క్రితం ఒక్కసారిగా మా ఇంట్లో చాలా సమస్యలు చుట్టుముట్టాయి. ఉన్నట్టుండి మా నాన్న తాను చేస్తున్న వ్యాపారాన్ని వదిలేసి వేరే ఊరికి వెళ్ళిపోదామని అనుకున్నారు. అది మా ఇంట్లో ఎవరికీ ఇష్టంలేదు. దానివలన ఇంట్లో ఎవరికీ ప్రశాంతత లేకుండా పోయింది. అంతా సమస్యలమయంగా మారింది. ఆ సమయంలో నేను బాబాను ప్రార్థించి, "ఈ సమస్యలన్నీ తీరితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని చెప్పుకున్నాను. అలా ప్రార్థించిన రెండు మూడు రోజుల్లో నాన్న మనసు మారింది. దాంతో అందరి మనసులు కుదుటపడ్డాయి. ఇదంతా బాబా లీల. ఇప్పుడు మేము చాలా సంతోషంగా ఉన్నాము. "అడిగిన వెంటనే సహాయం చేసినందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు బాబా. మీ కృపతో ఇలాంటి అనుభవాలు మరిన్ని పంచుకోవాలని కోరుకుంటూ..  మీ భక్తురాలు".


4 comments:

  1. Om sai ram please bless my family with love and grace. Sai we suffered very much from corona.you only saved us from this mahammari. Many people died to this corona.save my kodalu from surgery. Be with her and bless her. Om sai ram������ ❤��

    ReplyDelete
  2. Om sai ram baba nenne namukuna ma amma ki problem tondarga cure cheyi baba pleaseeee thandri

    ReplyDelete
  3. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATHAYA NAMAH..OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo