సర్వజీవులలో భగవద్దర్శనం
మొదటినుంచి కాకాసాహెబ్ ఎంతో ఉదారస్వభావుడనీ, ఎంతోమంది అతిథులను ఆదరించేవాడనీ అందరూ అనుకునేవారు. లోనావాలాలో ఉన్నప్పుడు ప్రతిరోజూ తన స్నేహితులనేకాక నూతన పరిచయస్థులను కూడా తన ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తుండేవాడు దీక్షిత్. అతని బంగ్లాను ‘అన్నదాన సత్రం’ లేదా ‘హిందూ ధర్మదాన సత్రం’ అని పిలిచేవారు. ఆ కారణంగా దీక్షిత్ ఉన్నంతకాలమూ లోనావాలా ప్రాంతంలో హోటల్ వ్యాపారాన్ని మొదలుపెట్టే సాహసం ఎవరూ చేయలేకపోయారు. శిరిడీలో కూడా తన వాడాలో అన్నసత్రాన్ని నడిపేవాడు దీక్షిత్. ఉపాసనీతో సహా ఎంతోమందికి తన స్వంత ఖర్చులతో భోజనం పెట్టేవాడు. సాటి మానవులే కాదు, పిల్లులు, కుక్కలు, చీమలు, ఈగలు మొదలైన ఇతర జీవులు కూడా అతని అతిథులుగా ఉండేవి. అతనికి సర్వజీవులపట్ల కరుణ ఉండేది. ఏ జీవికైనా బాధ కలిగిందంటే అతని మనసు చలించిపోయి ఎంతో సానుభూతి కలిగేది. అలా ఉండగలగటం చాలా ముఖ్యమైన దశ. తద్వారా అహంకార, మమకారాలు అధిగమించడం సాధ్యమవుతుంది. ఆ రెండింటినీ జయించకుండా సిద్ధి పొందడం అసాధ్యం. వాస్తవానికి అతను, ‘ఎందరో మరణానికి కారణభూతమయ్యే పాములను కనిపించగానే చంపేయాల’న్న ఒక సాధారణ ఆలోచననుండి బాబా బోధనల వలనే బయటపడ్డాడు. అదెలా అంటే, ఒకరోజు అతను బాబాను, "పాముకాటు నుండి తమను తాము రక్షించుకోవడానికి ప్రజలు సర్పాలను చంపకూడదా?" అని అడిగాడు. అప్పుడు బాబా, "లేదు, మీరు వాటిని చంపకూడదు. భగవంతుని ఆజ్ఞ లేకపోతే పాము మనల్ని చంపదు. ఒకవేళ భగవంతుడు ఆజ్ఞాపించినట్లయితే మనం దానినుండి తప్పించుకోలేము" అని చెప్పారు. అంతటితో పాములను చంపాలనే అతని అభిప్రాయం పూర్తిగా పోయింది.
బాబా తరచూ, "ఏ ఋణానుబంధం లేకుండా ఎవరూ మన వద్దకు రారు. కుక్క, పంది, ఈగ మొదలైనవి ఏవైనా అంతే. కనుక ఛీ, ఛీ, పో, పొమ్మని ఎవరినీ తరిమివేయకండి. ఎవరైనా మీ వద్దకు వస్తే అలక్ష్యం చేయక ఆదరించండి" అని చెప్పేవారు (శ్రీసాయి సచ్చరిత్ర 3వ అధ్యాయం). బాబా ఎన్నడూ అనవసరమైన ఉపన్యాసాలు ఇవ్వలేదు. ప్రత్యేకమైన లీలల ద్వారా తాము బోధించిన వాటిని భక్తులతో ఆచరింపజేసేవారు. ఒకరోజు నోట చొంగ కారుతున్న రోగగ్రస్తమైన కుక్క ఒకటి తోకాడించుకుంటూ మహల్సాపతి దగ్గరకు వచ్చింది. అతను దాన్ని ఛీదరించుకొని రాయి విసిరి తరిమికొట్టాడు. అది అరుస్తూ పారిపోయింది. తరువాత అతను బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు బాబా అతనిని చూపిస్తూ ఇతర భక్తులతో, "నేను ఆశతో కొద్దిపాటి ఆహారం కోసం ఈ భగత్ (బాబా మహల్సాపతిని ‘భగత్’ అని పిలిచేవారు) వద్దకు వెళ్ళాను. కానీ నాకు లభించింది రాయి మాత్రమే" అని అన్నారు.
పై సంఘటన జరిగిన రెండుగంటల తరువాత కాకాసాహెబ్ దీక్షిత్ కొంతమంది స్నేహితులతో కలిసి వాడా వద్ద కూర్చొని ఉండగా ఒక కుక్క వచ్చి వాడా మెట్లమీద కూర్చుంది. దీక్షిత్ దాన్ని తరిమేస్తే అది పరిగెత్తుకుంటూ వెళ్లి కాస్త దూరంలో మరోచోటనున్న మెట్ల మీద కూర్చుంది. ఈసారి దీక్షిత్ దాన్ని రాయితో కొట్టాడు. అది బాధతో అరుస్తూ భయపడుతూ పారిపోయింది. ఇంతలో అకస్మాత్తుగా అతనికి బాబా మాటలు గుర్తొచ్చి మనసు నొచ్చుకోగా బాధతో, "నేను ఆ కుక్కను తరిమికొట్టకుండా ఒక రొట్టెముక్క ఇచ్చివుంటే అది ఇలా నా చేతిలో గాయపడకుండా వెళ్లిపోయేది కదా" అని అనుకున్నాడు. అదేరోజు సాయంత్రం దాసగణు తన కీర్తనలో నామదేవునికి సంబంధించిన ఒక కథను ఆలపించాడు. దాని సారం: 'ఒకసారి నామదేవుడు విఠలుని విగ్రహం వద్ద నివేదించిన పళ్లెంలోని రొట్టెముక్కను ఒక కుక్క తన నోటిలో కరుచుకొని పరుగుతీసింది. అది చూసిన నామదేవుడు, "దేవా! ఎండురొట్టె తినకండి, ఈ నెయ్యితో తినండి" అంటూ ఒక గిన్నెతో నెయ్యి పట్టుకొని ఆ కుక్కకు అందించడానికి దానివెనుక పరుగుతీశాడు'. అదేరోజు రాత్రి మారుతి మందిరంలో మాధవరావు అడ్కర్ ‘భక్తలీలామృతం’ అనే గ్రంథాన్ని పఠించాడు. అతను చదివిన భాగంలో పైన చెప్పిన నామదేవుని కథే వచ్చింది. ఆ విధంగా బాబా ఆరోజు ఉదయం తాము బోధించిన విషయానికి బలాన్ని చేకూర్చారు.
బాబా సాంగత్యంలో క్రమంగా ‘సర్వజీవులలోనూ భగవంతుడున్నాడు’ అనే భావం అతనిలో స్థిరపడి ఏ జీవికీ హాని తలపెట్టని స్థాయికి ఎదిగాడు. ఒకసారి కాకాసాహెబ్ కొంతమంది స్నేహితులతో మాట్లాడుతుండగా ఒక నల్లతేలు అక్కడికి వచ్చింది. దాన్ని చంపడానికి ఎవరో ఒక బూటు తీసుకొచ్చారు. కానీ దీక్షిత్ వాళ్ళను వారించి, ఒక పొడవాటి కర్ర తీసుకొని ఆ తేలు ముందు ఉంచాడు. ఆ తేలు నెమ్మదిగా ఆ కరపైకి ఎక్కింది. దీక్షిత్ దాన్ని నెమ్మదిగా బయటకు తీసుకెళ్లి సురక్షితమైన ప్రదేశంలో విడిచి వచ్చాడు.
శిరిడీలో, ముఖ్యంగా దీక్షిత్ వాడాలో నల్లుల బెడద చాలా ఎక్కువగా ఉండేది. వాటి బాధ భరించలేక చాలామంది పౌడరు రూపంలో ఉండే ‘కీటింగ్స్’ అనే క్రిమిసంహారక మందును తీసుకొచ్చి వాళ్ళ పడకలపై చల్లుకొని నిద్రపోయేవారు. ఒకసారి ఒక స్నేహితుడు దీక్షిత్ పడకపై కూడా ఆ మందును చల్లబోతే, దీక్షిత్ అతనిని వారించి, "ఆ పౌడరు చల్లవద్దు. ఆ నల్లుల వల్ల నాకేమీ నిద్రాభంగం కలగదు. మానవ రక్తమే వాటికి ఆహారం. మహా అయితే అవి నా శరీరం నుంచి ఒక అర ఔన్స్ రక్తాన్ని త్రాగుతాయి, అంతే కదా! ఆ నష్టాన్ని నా శరీరం సులభంగా పూడ్చుకోగలదు. అయినా భగవంతుడు వాటిలో మాత్రం లేడా?" అని అన్నాడు. అది విన్న అక్కడివారంతా నివ్వెరపోయారు. దీక్షిత్‌కు కుక్కలు, పిల్లుల పట్ల కూడా అటువంటి సానుభూతే ఉండేది. విల్లేపార్లేలోని తన బంగ్లాలో ఎప్పుడూ చాలా కుక్కలు, పిల్లులు ఉండేవి. శిరిడీలో కూడా అతను భోజనానికి కూర్చుంటే పిల్లులు అక్కడికి చేరేవి. వాటిలో భగవంతుడున్నాడన్న పరిపూర్ణమైన భావంతో అతను అన్నంలో నేయి వేసి వాటికి పెట్టేవాడు. ఈ విధంగా దీక్షిత్‌కు సర్వజీవులపట్ల గొప్ప కారుణ్యభావం ఉండేది.
అచంచలమైన గురుభక్తి
ఒకసారి ఎవరో మరణానికి సిద్ధంగా ఉన్న ఒక కృశించిన ముసలి మేకను మసీదుకు తీసుకుని వచ్చారు. అప్పుడు బాబా అక్కడే ఉన్న మాలేగాం ఫకీరు పీర్ మహమ్మద్ ఉరఫ్ బడేబాబాతో, "దానిని ఒక్క కత్తివ్రేటుతో నరికి, బలివేయమ"ని చెప్పారు. 'అనవసరంగా దానిని చంపడం ఎందుక'ని తలచి బడేబాబా అక్కడినుండి వెళ్ళిపోయాడు. తరువాత బాబా అక్కడే ఉన్న షామాను ఆ పని చేయమన్నారు. వెంటనే అతడు రాధాకృష్ణమాయి వద్దకు వెళ్లి కత్తి తీసుకొని వచ్చాడు. అంతలో, బాబా ఆ కత్తిని ఎందుకోసం తెప్పించారో తెలుసుకున్న రాధాకృష్ణమాయి తిరిగి దానిని వెనక్కి తెప్పించుకుంది. మరొక కత్తి తేవడానికని సాఠేవాడాకు వెళ్లిన షామా తిరిగి రాలేదు. అప్పుడు బాబా కాకాసాహెబ్ దీక్షిత్‌ను, "ఒక కత్తిని తీసుకొచ్చి ఆ మేకను నరకమ"ని ఆజ్ఞాపించారు. అది విని అక్కడున్న భక్తులంతా ఆశ్చర్యపోయారు. ‘స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబములో పుట్టి, కలలో సైతం ఎవరికీ హాని తలపెట్టని అత్యంత కారుణ్య హృదయం గల అతనికి ఏమిటీ విషమ పరీక్ష?’ అని అనుకున్నారు. కానీ కాకాసాహెబ్ కించిత్తైనా సంకొంచించలేదు. అతను 'గురువు ఆజ్ఞ పరిపాలనే శిష్యుని పరమ ధర్మమని, దానిని మించిన పుణ్యం లేద'ని సద్గురు ఆజ్ఞను శిరసావహించి వెంటనే సాఠేవాడాకు వెళ్లి కత్తిని తీసుకొచ్చి, గుండె దడదడ లాడుతున్నప్పటికీ బాబా అనుమతించగానే దానిని నరకడానికి సిద్ధంగా నిలుచున్నాడు. ‘బడేబాబా, షామా, రాధాకృష్ణమాయిలే చావడానికి సిద్ధంగా ఉన్న ఆ ముసలి మేకను చంపడం ఎందుకని వెనకాడితే, మరి ఇతనెలా సిద్ధపడుతున్నాడా’ అని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. అంతలో బాబా, “ఏం ఆలోచిస్తున్నావు, మేకను నరుకు” అని కాకాను ఆజ్ఞాపించారు. ఇక దీక్షిత్ ఏ మాత్రమూ ఆలోచించక చేతిలోనున్న కత్తిని పైకెత్తి మేకను నరకడానికి పూనుకున్నాడు. సరిగ్గా అతను మేక మెడపై వేటు వేయబోతుండగా బాబా, ‘ఆగు, ఆగు’ అని, “ఎంతటి కఠినాత్ముడివి? బ్రాహ్మణుడివై ఉండి మేకను చంపుతావా?” అని అన్నారు. వెంటనే దీక్షిత్ కత్తిని ప్రక్కన పెట్టి బాబాతో, “అమృతమువంటి మీ పలుకే మాకు చట్టం. మాకింకొక చట్టమేమీ తెలియదు. మిమ్మల్నే ఎల్లప్పుడూ జ్ఞప్తియందుంచుకుంటాము. మీ రూపాన్నే ధ్యానిస్తూ రాత్రింబవళ్ళు మీ ఆజ్ఞలు పాటిస్తాము. అవి ఉచితమో, అనుచితమో మాకు తెలియదు. దానిగురించి మేము విచారించము. ‘అది సరియైనదా? కాదా?’ అని వాదించము, తర్కించము. గురువు ఆజ్ఞను అక్షరాలా పాలించటమే మా విధి, ధర్మము" అని అన్నాడు. ఈ ఘటన ద్వారా సద్గురు ఆజ్ఞను పాలించడంలో ఇష్టాఇష్టాలకు, ధర్మాధర్మాలకు తావివ్వని దీక్షిత్ ఔన్నత్యాన్ని లోకానికి చాటారు బాబా.
భక్తిప్రేమలతో శీరా నివేదన
ప్రతిరోజూ మధ్యాహ్న ఆరతికి ముందు భక్తులు తమ తమ నివేదనలు తీసుకొని మసీదుకి చేరుకొనేవారు. ఆ నివేదనలలో శీరా ఉన్నప్పుడల్లా బాబా అందులోనుండి కొద్దిగా శీరాను తీసుకుని తినేవారు. అది గమనించిన దీక్షిత్ తానే స్వయంగా శీరా తయారుచేసి ప్రతిరోజూ బాబాకు నివేదించాలని నిశ్చయించుకున్నాడు. అందుకు తగ్గట్టుగా తన దినచర్యను మలచుకొని, బాబా లెండీకి వెళ్ళగానే తన వాడాకు చేరుకొని శీరా తయారీలో నిమగ్నమయ్యేవాడు దీక్షిత్. అతనెంతో భక్తిశ్రద్ధలతో శీరా తయారీకి కావలసిన అన్ని పదార్థాలను కొలత ప్రకారం వేసి, కిరోసిన్ పొయ్యి మీద ఎంతో రుచికరంగా శీరాను తయారుచేసి మసీదుకు తీసుకొని వెళ్ళేవాడు. తరువాత అతను ఆ శీరా పాత్రను ఒక ప్రక్కన ఉంచి, ముందుగా బాబా పాదాలను ఒత్తి, తరువాత బాబా పాదాలకు పూజ చేసేవాడు. ఆ తరువాత ఆరతి జరిగేది. ఆరతి అనంతరం బాబా నింబారు వద్ద కూర్చునేవారు. భక్తులు తెచ్చిన నివేదనలన్నీ బాబా ముందుంచేవారు. బడేబాబా తమ ప్రక్కన కూర్చున్నాక అతనితో కలిసి బాబా తమ భోజనాన్ని ప్రారంభించేవారు. తాను నివేదించిన శీరాను బాబా కొద్దిగా రుచిచూడగానే దీక్షిత్ మహదానందభరితుడయ్యేవాడు. తరువాత బాబా వద్ద అనుమతి తీసుకొని, బాబా తినగా మిగిలిన శీరాను తీసుకుని వాడాకు తిరిగి వెళ్లి తన అతిథులతో కలిసి భోజనానికి కూర్చునేవాడు. బాబా ప్రసాదమైన శీరాను అందరికీ వడ్డించేవారు. ఈ విధంగా ప్రతిరోజూ అతనెంతో శ్రద్ధగా చేస్తుండేవాడు.
సద్గురు పంక్తి భోజనం
బాబా కొద్దిమంది భక్తులను మాత్రమే తమతోపాటు సహపంక్తి భోజనం చేసేందుకు అనుమతించేవారు. బడేబాబాను తమ ప్రక్కనే కూర్చుండబెట్టుకొనేవారు బాబా. అది చూసిన దీక్షిత్, గురువుతో కలిసి భోజనం చేయడం గొప్ప అదృష్టమని, గౌరవమని భావించి తనకు కూడా అటువంటి భాగ్యం దక్కాలని ఆరాటపడేవాడు. తాను ప్రతిరోజూ పారాయణ చేస్తున్న ఏకనాథుడు రచించిన భావార్థ రామాయణంలోని 88వ అధ్యాయం యుద్ధకాండలో, రాముని ఉచ్ఛిష్టాన్ని భుజించాలన్న ఆరాటం హనుమంతుడికి ఉండేదనీ, ఒకరోజు రాముడు తన భోజనాన్ని ప్రారంభించేవరకు ఓపిక పట్టి, హఠాత్తుగా రాముని ముందుకు దూకి ఆ పళ్లాన్ని పట్టుకొని ఆకాశంలోకి ఎగిరిపోయాడనీ, తరువాత ఒక చెట్టుమీద కూర్చొని రాముడు తినగా మిగిలిన ఆహారాన్ని తిని, ఆ తరువాత క్రిందకు దిగి రాముడి ముందు నిలుచున్నాడని, అతనికి తమపై ఉన్న పూర్ణమైన భక్తిప్రేమలు తెలిసిన రాముడు నవ్వుతూ చమత్కారంగా మాట్లాడాడనీ ఒక కథ ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని దీక్షిత్ ఒకరోజు బాబా భోజనం చేయడం ప్రారంభించేవరకు వేచివుండి, తాను నివేదించిన శీరాను బాబా తినడం ప్రారంభించగానే ఒక్క ఉదుటున ఆ శీరా పాత్రను అందుకొని వాడాకి వెళ్లి సాటి భక్తులతో కలిసి ఆ శీరా ప్రసాదాన్ని భుజించాడు. తరువాత అతను మసీదుకి వెళ్ళినప్పుడు బాబా నవ్వి అతను చేసిన పని గురించి చమత్కరించారు. దీక్షిత్ చేసిన ఆ చర్యకు అద్భుతమైన ఫలితం ఏమిటంటే, ఆ మరుసటిరోజే బాబా తమతో కలిసి భోజనం చేయడానికి దీక్షిత్‌కు అనుమతిని ప్రసాదించారు.
సాయి మాటపై సంపూర్ణ విశ్వాసం
ఒకసారి శిరిడీలో ఉన్నప్పుడు దీక్షిత్ జ్వరంతో అనారోగ్యం పాలయ్యాడు. అతను బాబా వద్దకు వెళ్ళినప్పుడు బాబా అతనితో, "నువ్వు విల్లేపార్లేలోని నీ ఇంటికి వెళ్లడం మంచిది. ఈ జ్వరం కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. ఏం భయంలేదు! అదే తగ్గిపోతుంది. నీకు పూర్తిగా నయమవుతుంది. మంచానికి అతుక్కోని పడుకోక, ఎప్పటిలాగే శీరా (రవ్వకేసరి) తింటూ ఉండు" అని అన్నారు. అంతటి జ్వరంలోనూ అతను బాబా ఆదేశానుసారం విల్లేపార్లేలోని తన ఇంటికి వెళ్ళాడు. అక్కడికి వెళ్లిన తరువాత జ్వరం ఎక్కువ అవుతుండటంతో డాక్టర్ డెమోంటేను పిలిపించారు. డాక్టర్ వచ్చి కాకాను పరీక్షించి, అతనికి వచ్చినది 'నవజ్వరం'గా నిర్ధారించి, కొన్ని మందులిచ్చి, వాటిని వాడుతూ పూర్తి విశ్రాంతి తీసుకోమనీ, అసలు మంచం దిగవద్దనీ చెప్పాడు. కానీ, కాకా మాత్రం ఏ మందులూ వేసుకోలేదు, ఎటువంటి పథ్యమూ పాటించలేదు. మంచానికి అతుక్కుని పడుకోవద్దన్న బాబా ఆదేశాన్ననుసరించి ఉయ్యాలబల్ల మీద కూర్చొని ప్రతిరోజూ శీరా తినసాగాడు. సాధారణంగా జ్వరంతో బాధపడుతున్న రోగి శీరా తినకూడదని వైద్యులు అంటారు. అయినప్పటికీ అతను ఎవరిమాటా వినక బాబాపై పూర్తి విశ్వాసముంచాడు. అయితే రోజురోజుకూ జ్వరతీవ్రత ఎక్కువ కాసాగింది. ఎంతగా చెప్పినా తన సూచనలను దీక్షిత్ గాలికి వదిలివేస్తుండటంతో డాక్టరు డెమోంటే భయపడి తోటి వైద్యుడికి కబురుపెట్టాడు. అతను కూడా దీక్షిత్‌ను పరీక్షించిన మీదట, ఆ డాక్టర్లిద్దరూ దీక్షిత్‌తో, “మీరు ఇలాగే నడుచుకుంటే పరిస్థితి విషమించి మరింత ప్రమాదకరమవుతుంద”ని హెచ్చరించారు. అందుకు దీక్షిత్ తన స్నేహితుడైన డెమోంటేతో, "నేను కొద్దిరోజులు మీతో సరదాగా గడపటానికి మిమ్మల్ని పిలిపించాను. బాబా చెప్పినట్లు ఈ జ్వరమెలాగూ నాలుగురోజుల్లో తగ్గిపోతుంది. కాబట్టి మీకు ఎటువంటి మాటా రాదు" అని చెప్పాడు. దీక్షిత్ ఎవరో ఫకీరు మాయలో పడి మోసపోతున్నాడనీ, ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాడనీ డాక్టర్ డెమోంటే అనుకున్నాడు. కానీ అందరూ ఆశ్చర్యపోయేలా, ప్రమాదకరస్థితికి చేరుకున్న దీక్షిత్ ఆరోగ్యం అకస్మాత్తుగా తొమ్మిదవరోజున తిరిగి సాధారణ స్థితికి వచ్చింది. ఈ అనుభవం ద్వారా దీక్షిత్‌కు తాను అపారమైన శ్రీసాయి రక్షణలో ఉన్నానని, బాబా పలికిన ప్రతి మాటా సత్యమై తీరుతుందని సంపూర్ణ విశ్వాసం కుదిరింది. ఈ విశ్వాసాన్నే ‘నిష్ఠ’ అంటారు. శిష్యుడు తన గురువుకు సమర్పించాలని బాబా చెప్పిన రెండు పైసల దక్షిణలో ఒకటి ‘నిష్ఠ’ కాగా, రెండవది ‘సబూరీ’. సబూరీ అంటే సంతోషం, పట్టుదల, ధైర్యములతో కూడిన ఓరిమి. ఈ లక్షణాలు దీక్షిత్‌లో క్రమంగా వృద్ధి చెందసాగాయి. తన సద్గురువైన శ్రీసాయికి నిష్ఠ, సబూరీలనే రెండు పైసలను సమర్పించాడు దీక్షిత్. ఈ లక్షణాలు కాకాలో మరింత దృఢపడటానికి కొన్ని సంఘటనలు దోహదపడ్డాయి.
source: లైఫ్ అఫ్ సాయిబాబా by బి.వి.నరసింహస్వామి, శ్రీసాయి సచ్చరిత్ర,
బాబా'స్ వాణి బై విన్నీ చిట్లూరి(Ref: Sai Leela year - 1923).
రిఫరెన్స్: దీక్షిత్ డైరీ బై విజయకిషోర్.
Om Sai
ReplyDeleteSri Sai
Jsaya Jaya Sai
🙏🙏🙏
Om sai ram baba Amma arogyam bagundali thandri pleaseeee
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteOm sai ram
ReplyDeleteOm sai ram
ReplyDeleteOmsaisri Sai Jai Jai Sai 🙏🙏🙏🙏 kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm sai ram
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteJai SAI🙏🙏🙏
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha