ఈ భాగంలో అనుభవాలు:
1. చార్ధామ్ యాత్రలో అడ్డంకులు తొలగించిన బాబా
2. టికెట్ కన్ఫర్మ్ అయ్యేలా అనుగ్రహించిన బాబా
3. బాబా దయతో సంతానం
చార్ధామ్ యాత్రలో అడ్డంకులు తొలగించిన బాబా
సాయి బంధువులందరికీ నమస్సులు. నా పేరు గురుమూర్తి. 2025, జూన్‌లో నేను, నా భార్య చార్ధామ్ యాత్రకు వెళ్లాము. ఆ యాత్ర చాలా రిస్క్‌తో కూడుకున్నదైనందువల్ల ముఖ్యంగా కేదార్నాథ్ వెళ్లి, రావడానికి చాలా భయపడ్డాం. మేము కేదార్నాథ్ వెళ్లే ముందురోజు రాత్రి గుప్త కాశీలో అర్ధరాత్రి నుండి విపరీతమైన వర్షం పడింది. అనుక్షణం మారే వాతావరణ పరిస్థితుల వలన హెలికాప్టర్ బుక్ అయినప్పటికీ యాత్ర చాలా ఇబ్బందికరంగా మారింది. యాత్ర సాగుతుందా, లేదా అని చాలా భయమేసింది. వర్షం వలన ఎలాంటి ఆటంకాలు లేకుండా కేదారనాథుని దర్శనం కావాలని సాయినాథుని వేడుకున్నాము. దేవదేవుడైన సాయినాథుని అనుగ్రహం వల్ల మా ప్రయాణానికి ఒక గంట ముందు నుంచి వర్షం పూర్తిగా ఆగిపోయింది. దాంతో ఇబ్బంది లేకుండా హెలికాప్టర్లో కేదార్నాథ్ వెళ్ళాము. మాకు కేదారనాథుని స్పర్శ దర్శనం చాలా బాగా జరిగింది. కానీ తిరుగు ప్రయాణమయ్యేటప్పుడు ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడటంతో హెలికాప్టర్ సర్వీస్ ఆపేసారు. మేము చాలా కలత చెంది సాయినాథుని, శ్రీనివాసుని ప్రార్థించాం. దైవానుగ్రహం వలన ఒక రెండు గంటల తరువాత హెలికాప్టర్ సర్వీస్ పునరుద్ధరించారు. మేము క్షేమంగా హెలికాప్టర్లో గుప్తకాశీ చేరుకున్నాము. మా తోటి ప్రయాణికులు చాలామంది హెలికాప్టర్ సర్వీస్ లేక చాలా ఇబ్బందిపడ్డారు. చార్ధామ్ యాత్రలో నాలుగు క్షేత్రాలలో మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనాలు చాలా బాగా అయ్యాయి. క్షేమంగా ఇంటికి వచ్చాము. ఈ యాత్ర కేవలం సాయినాథుని, శ్రీనివాసుని, కేదారేశ్వరుని కృపవలనే సజావుగా జరిగింది. "ధన్యవాదాలు సాయినాథా! శ్రీనివాసా! మాకున్న ఒక జఠిలమైన సమస్య నుండి బయటపడేసి మమ్మల్ని రక్షించండి".
టికెట్ కన్ఫర్మ్ అయ్యేలా అనుగ్రహించిన బాబా
నా పేరు శ్రీనివాస్. మేము సోలాపూర్‌లో ఉంటాము. మేము పిల్లలతో కార్తీక పౌర్ణమికి మా ఊరు పలాస వెళదామని ట్రైన్ టికెట్లు బుక్ చేసుకొని, "మేము క్షేమంగా వెళ్ళొస్తే, ముగ్గురు నిరుపేదలకు అన్నదానం చేస్తాను" అని బాబాకి మొక్కుకున్నాను. బాబా దయవల్ల మేము సోలాపూర్ నుండి పలాస వెళ్లడానికి ఏ సమస్య లేకుండా టికెట్లు కన్ఫర్మ్ అయ్యాయి. కానీ మేము తిరుగు ప్రయాణంలో సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేసుకొని విశాఖపట్నంలో ట్రైన్ ఎక్కుదామని '11020' నెంబర్ గల ట్రైన్‌కి బుక్ చేస్తే, ఒక టికెట్ కన్ఫర్మ్ అయి, మరో టికెట్ వెయిటింగ్ లిస్ట్ వచ్చింది. అయితే వెయిటింగ్ లిస్ట్ 1 కదా కన్ఫర్మ్ అయిపోతుందిలే అని ధీమాగా ఉన్నాము. కానీ ప్రయాణ తేదీ దగ్గరకి వస్తున్నా వెయిటింగ్ లిస్ట్ 1 అలానే ఉంది. దాంతో తరచూ ప్రయాణమవుతుండే మా కొలీగ్ని అడిగితే, "అది కన్ఫర్మ్ అవ్వడం చాలా కష్టం. దాని గురించి మర్చిపోండి" అని అన్నాడు. నేను, "బాబా! మీ దయతో ఆ టికెట్ కన్ఫర్మ్ అయితే మందిరంలో మీకు పాలకోవా నివేదించి అందరికీ పంచిపెడతాను" అని బాబాతో చెప్పుకొని భారం ఆయన మీద వేసాను. తర్వాత సికింద్రాబాద్ హెడ్ ఆఫీసులో పని చేస్తుండే మాకు తెలిసిన అతన్ని ఎమర్జెన్సీ కోటాలో ప్రయత్నించమని చెప్పాను. తర్వాత నేను అనుకున్న తేదీ పలాస నుండి నా భార్య కన్నవారి ఊరు విజయనగరం వెళ్ళి, అక్కడినుండి నా భార్యాపిల్లలతో సింహాచలం వెళ్ళడానికి బయలుదేరాను. అదే సమయంలో ఆ తండ్రి సాయినాథుని మరియు వరాహ లక్ష్మీనరసింహస్వామి దయవల్ల టికెట్ కన్ఫర్మ్ అయిందని మెసేజ్ వచ్చింది. అదే జరగకుంటే ఇద్దరు చిన్న పిల్లలతో విశాఖపట్నం నుండి హైదరాబాద్‌కు రాత్రి ప్రయాణం చాలా అంటే చాలా కష్టమయ్యేది. "బాబా! మీకు ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే". మేము హైదరాబాద్‌లో దిగి నా భార్య తాలూకు పెద్దక్క, మూడో అక్క కుటుంబాల్ని కలిసి సోలాపూర్ క్షేమంగా వచ్చేసాం. కానీ రైలులో మా ట్యాబు ఎవరో దొంగిలించారు. "బాబా! అది నేను నా భార్యకు ప్రేమతో ఇచ్చిన బహుమతి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. ఎలాగైనా అది దొరికేలా చేయండి. ఐదుగురు నిరుపేదలకు అన్నదానం చేశాను తండ్రీ".
బాబా దయతో సంతానం
ముందుగా అందరికీ నమస్కారాలు. నా పేరు నాగలక్ష్మి. మా స్వస్థలం ఖమ్మం పక్కన ఉన్న ఒక పల్లెటూరు. కానీ మేము వృత్తిరీత్యా విజయవాడ దగ్గర ఒక పల్లెటూరిలో ఉంటున్నాము. నా జీవితాతంలో బాబా ఇచ్చిన అనుభవాలు చాలా ఉన్నాయి. అందులో నుండి ఒకటి పంచుకుంటున్నాను. నాకు పెళ్ళై 3 సంవత్సరాలైనా పిల్లలు కలగలేదు. మేము ఎంతో నిరుత్సాహపడ్డాము. ఇలా ఉండగా మా వదినవాళ్లతో కలిసి మేము శిరిడీ వెళ్ళాము. అప్పుడు మావారు, "మాకు బాబో, పాపో పుడితేనే మళ్ళీ శిరిడీ వస్తాం" అని అనుకున్నారు. మేము శిరిడీ నుండి వచ్చిన మరుసటి నెల నేను గర్భవతినయ్యాను. బాబా దయవలన మాకు బాబు పుట్టాడు. వాడు గురవారంనాడు పుట్టాడు. మేము తనకి 'సాయి' వచ్చేలా పేరు పెట్టుకున్నాము. ఆ తరువాత బాబా దయవల్ల మాకు పాప కూడా పుట్టింది. ఇప్పుడు మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. ఇదంతా ఆ బాబా దయ. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

Om Sai Ram 🙏🙏🙏
ReplyDelete