1. బాబా కృపతో అబ్బాయి పెళ్లి
2. దిక్కు తోచని స్థితిలో అర్థించినంతనే బాబా చేసిన సహాయం
బాబా కృపతో అబ్బాయి పెళ్లి
శ్రీసాయి భక్తులు అందరికీ నా హృదయపూర్వక ప్రణామములు. నా పేరు కాళీపట్నపు లక్ష్మీనారాయణ. నేను విశాఖపట్నంలోని చినముషిడివాడ వాస్తవ్యుడిని. మాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. బాబా దయవల్ల ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మా అమ్మాయి పెళ్లి ఘనంగా జరిగింది. తర్వాత బాబా మీద భారమేసి మా అబ్బాయి పెళ్లి చేయాలని 2022, నవంబర్ నుంచి ప్రయత్నాలు ప్రారంభించాము. కానీ ఏ సంబంధమూ కుదరక దాదాపు విసిగిపోయాము. మా అబ్బాయి ప్యాకేజీ(జీతం) తక్కువగా ఉండటం ఒక కారణం. ఆ కారణంగానే ఒక్క అమ్మాయి కూడా ఒప్పుకోలేదు. అప్పుడు నేను, "మా అబ్బాయికి పెళ్లి కుదిరితే, బాబాకి ఎంతో కొంత డొనేట్ చేస్తాన"ని అనుకున్నాను. తర్వాత 2024, ఏప్రిల్ నెలలో శ్రీరామనవమినాడు ఒక సంబంధం వచ్చింది. మాకు అన్ని విధాలా నచ్చింది. బాబా దయవల్ల అబ్బాయి ప్యాకేజీ కూడా పెరిగింది. కానీ మూఢము వలన పెళ్లిచూపులు కుదరదన్నారు. తర్వాత ఆగస్టు నెల వచ్చాక శ్రావణమాసంలో పెళ్లిచూపులు జరగడం, వాళ్ళు మా అబ్బాయిని నచ్చడం చకచకా జరిగిపోయాయి. వియ్యాలవారు 2024, డిసెంబర్ 6న వివాహంగా ఘనంగా జరిపించారు. అమ్మాయి పేరు 'సాయి లలిత', ద్రాక్షారామంలోని కళ్యాణ మండపం పేరు 'సాయి మాధవానంద'. నేను నమ్మిన 'సాయి' పేరు కలిసి ఉండటం వల్ల నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ విధంగా బాబా అనుక్షణం నా వెంటే వుంటూ నన్ను నడిపిస్తున్నారు. పెళ్ళైన వెంటనే నా అనుభవం మీతో పంచుకుందాం అనుకున్నాను. కానీ అలసత్వం వల్ల వ్రాయలేకపోయాను. 2025, నవంబర్ 20న అనుకోకుండా శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకొని దూప్ హారతిలో పాల్గొనడం నాకు చాలా ఆనందం కలిగించింది. మా అబ్బాయి పేరు మీద డొనేషన్ కట్టి మొక్కు తీర్చుకున్నాను. శిరిడీలోని బాబా సన్నిధిలో కూర్చుని ఈ అనుభవాన్ని ఇలా మీతో పంచుకున్నాను. ఆలస్యానికి బాబా నన్ను క్షమిస్తారని తలుస్తున్నాను. నా వెంటే ఉండి నన్ను అడుగడుగునా రక్షిస్తున్న బాబాకి ఏమివ్వగలను, నా శిరస్సు వంచి పాదాభివందనం చేయడం తప్ప. "బాబా! మీ లీలలు అర్థం చేసుకోలేని మూర్ఖున్ని. నేను ఏదైనా తప్పు చేసి ఉంటే మన్నించండి. నా చేయి మాత్రం వదలకండి బాబా".
దిక్కు తోచని స్థితిలో అర్థించినంతనే బాబా చేసిన సహాయం
సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. నా పేరు మనోజ. నా జీవితంలో బాబా లీలలు ఇన్ని అని చెప్పలేను. ఎందుకంటే, నిత్యం నా వెన్నంటే వుండి, నన్ను ప్రతి విషయంలోనూ ముందుకు నడిపిస్తున్నారు బాబా. ఆయనకు నా శతకోటి నమస్కారాలు. ఇక ఇప్పుడు ఈమధ్య జరిగిన ఒక అనుభవం చెప్తాను. ఒకరోజు నేను బాత్రూం లోపలికి వెళ్ళినప్పుడు 3ఏళ్ళ నా కూతురు ఆడుతూ బయట నుండి బాత్రూం గడియ పెట్టేసింది. నేను ఎన్నిసార్లు బ్రతిమిలాడినా తనకి తీయడం రాక గడియ తీయలేదు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. నేను ఒక గంటసేపు బాత్రూం లోపలే ఉండిపోయాను. ఇక అప్పుడు బయట ఉన్న పాప ఎంతసేపని అలా ఒంటరిగా ఉంటుందని నాకు చాలా కంగారుగా అనిపించింది. ఇంటి ప్రధాన ద్వారం కూడా లాక్ చేసి ఉంది. ఎవరినైనా పిలవడానికి, ఎవరితోనైనా విషయం చెప్పడానికి నాకు ఏ మార్గం కనిపించలేదు. నేను తలుపు లాగుతూ ఎంత ప్రయత్నించినా తెలుపు తెరుచుకోలేదు. ఇంకా నేను ఏడుస్తూ బాబాని తలుచుకొని, "స్వామీ! నాకు దిక్కు తోచడం లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీరు తప్ప వేరే దిక్కు లేదు. నన్ను ఈ పరిస్థితి నుంచి బయటకు తీసుకురండి స్వామి" అని అర్ధించాను. అంతలో అనుకోకుండా మావారు బాత్రూం బయట ఉన్న నా ఫోన్కి కాల్ చేసారు. నేను బాత్రూం లోపలి నుంచి పాపని ఫోన్ లిఫ్ట్ చేయమని చెప్పాను. తనకి నా మాటలు అర్థమై ఫోన్ లిఫ్ట్ చేసి, స్పీకర్ ఆన్ చేసింది. నేను లోపలి నుంచి గట్టిగా 'అమ్మని లోపల లాక్ చేశానని' చెప్పమన్నాను. తను అది విని, నేను చెప్పమన్నట్లే వాళ్ళ నాన్నతో చెప్పింది. నాకప్పుడు ఆయనకి విషయం తెలిసింది కాబట్టి, ఏదో ఒకటి చేస్తారని కొంచెం ధైర్యం వచ్చింది. మా ఆయన, "ఎందుకైనా మంచిది నేను వచ్చేలోపు ఇంకోసారి తలుపు లాగి ప్రయత్నించు, రావచ్చేమో!" అన్నారు. నేను, "ఇప్పటికే చాలాసార్లు ప్రయత్నించాను కానీ, రాలేదు" అని చెప్పాను. అయినా మావారు "ఇంకోసారి ప్రయత్నించు" అన్నారు. నేను ఎందుకు చెప్పారో, మళ్ళీ ప్రయత్నిద్దామని రెండుసార్లు గట్టిగా తలుపు లాగేసరికి తలుపు తెరుచుకుంది. ఇందులో బాబా ఆశీర్వాదం, ఆయన కరుణ తప్ప నాకు ఇంకేమి కనిపించలేదు. కన్నీళ్లతో ధన్యవాదాలు అర్పించుకున్నాను. ఎందుకంటే, బయట ఉన్న పాప గురించి ఎంత భయపడ్డానో బాబాకే తెలుసు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా, ఎప్పటికీ మీ నామస్మరణ మరువను స్వామి. వెన్నంటి కాపాడండి".
సర్వం శ్రీసాయినాథ చరణారవిందార్పణమస్తు!!!

Baba me daya valana Kalyan ki marriage ipoindi na health bagu cheyandi pl house problem solve cheyandi Rashmi ki marriage chai thandi meku sathakoti vandanalu
ReplyDeleteబాబా దయ చేసి నా పిల్లలు బాగా చదువుకుని ఆరోగ్యం గా ఉండాలి బాబా, నేను నా భర్త ఆరోగ్యం గా ఉండి మా మధ్యలో వేరే వాళ్ళ వల్ల గొడవలు రాకుండా నా కుటుంబాన్ని కాపాడు తండ్రి. నాన్న కి చేయి నొప్పి అమ్మ కి మానసిక ఆందోళన తగ్గించు బాబా. నేను చక్కగా ఉద్యోగం చేయనుకునేలా చూడు తండ్రి. మీరు ఎన్ని సూచనలు చేసిన నేను పెడ చెవిన పెడుతున్నాను సమయం వృధా చేస్తున్న.. ఈ ఫోన్ వ్యసనం తగ్గిపోయేలా నా సమయం మీ పాద సేవ లో గడిపేలా నన్ను మార్చు తండ్రి. ఓం సాయి నాథ దత్త ప్రభు. నన్ను మార్చు బాబా నా పిల్లలని వృద్ధి లోకి తెచ్చేలా చూడు అయ్యా
ReplyDeleteతండ్రి నేను మంచిగా ఉద్యోగం చేసుకునేలా సహాయం చేయి బాబా బాబా బాబా🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
ReplyDeleteఫోన్ వ్యసనం పోయేలా చూడు బాబా. సమయాన్ని పిల్లలకి కేటాయించి నీ పాద సేవ చేసుకునేలా చూడు దయామయా. పాహిమాం పాహిమాం రక్షా రక్షా ప్రభో సాయి నాథ..
ReplyDelete