ఈ భాగంలో అనుభవాలు:
1. దృఢమైన నమ్మకం వల్ల పొందిన బాబా అనుగ్రహం
2. సొంతూరుకి ట్రాన్స్ఫర్ అనుగ్రహించిన బాబా
3. ఊదీయే పరమ ఔషధం
దృఢమైన నమ్మకం వల్ల పొందిన బాబా అనుగ్రహం
సాయి బంధువులందరికీ నా మనఃపూర్వక నమస్కారాలు. నా పేరు సాయిదీపశ్రీ. నా జీవితంలో సాయినాథుడు ప్రసాదించిన అనుభవాలు చాలానే వున్నాయి. ఆయన గత 25 సంవత్సరాలుగా ఎన్నో విధాలా నన్ను రక్షిస్తూ వున్నారు. 2023వ సంవత్సరంలో ఒక డాక్టర్ చేసిన చిన్న తప్పు వలన నేను 54 రోజులపాటు హస్పిటల్లో ఉండవలసి వచ్చింది. మా కుటుంబమంతా మానసికంగా. ఆర్థికంగా చాలా కృంగిపోయాము. అంతటి విపత్కర పరిస్థితి నుండి నన్ను కాపాడారు బాబా. నేను కోలుకొని సాధారణ స్థితికి వస్తానని ఎవ్వరూ అనుకోలేదు. కానీ బాబాపై నాకున్న దృఢమైన నమ్మకం వలన నేను మరలా సాధారణమైన జీవితాన్ని అనుభవిస్తున్నాను. ఇదిలా ఉండగా మేము భూమి కొనదలచి ఒకతనిని నమ్మి పెద్ద మొత్తంలో డబ్బు అతనికి ఇచ్చాము. కానీ దురదృష్టవశాత్తు ఆ డబ్బులు స్ట్రక్ అయిపోయాయి. అతను మాకు భూమి ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వులేదు. అదీకాక మా అక్క చిన్నకొడుకు బెట్టింగ్‌కి అలవాటు పడి చాలా పెద్ద మొత్తంలో ఉబ్బులు పోగొట్టాడు. ఇటువంటి పరిస్థితుల్లో నేను మా అక్క పెద్ద కొడుకుకి త్వరగా పెళ్ళి అవ్వాలని బాబాకి మొక్కుకొని 'సాయి దివ్యపూజ' మొదలుపెట్టాను. ఆ పూజ అయ్యేలోపు బాబుకు పెళ్లి కుదిరింది. మేము పోగొట్టుకున్న డబ్బులో కొంత మొత్తం మాకు అందింది.
2025, అక్టోబర్ 2న ఫుడ్ అబ్స్ట్రక్షన్(పేగులో అడ్డంకి) వల్ల నాకు కడుపునొప్పి తీవ్రంగా వచ్చింది. అదివరకే ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోన్న నాకు డాక్టర్ కొన్ని టెస్టులు చేసి మళ్ళీ సర్జరీ చేయవలసి వస్తుందని చెప్పారు. నేను బాబాని, "నన్ను ఈ సమస్య నుండి సర్జరీ లేకుండా గట్టెక్కించమ"ని దృఢంగా ప్రార్థించాను. బాబా దయవల్ల సర్జరీ లేకుండా నేను హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
సొంతూరుకి ట్రాన్స్ఫర్ అనుగ్రహించిన బాబా
శ్రీసాయినాథుని పాదపద్మములకు శతకోటి నమస్కారాలు. నా పేరు ప్రభాకరరావు. మాది ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి. నేను బాబాని నమ్ముకొని 29 సంవత్సరాలు పూర్తయింది. నాకు ప్రతిరోజూ అనకాపల్లిలో 1953లో నిర్మించిన బాబా గుడికి వెళ్ళి ఆయనను దర్శించుకొని రావడం అలవాటు. అయితే నాకు ప్రమోషన్ వచ్చి చింతపల్లికి బదిలి అయిన తరువాత బాబా గుడికి వెళ్లడం కుదరలేదు. నాకు చాలా బాధగా అనిపించి, "ఏంటి బాబా నాకు ఈ పరీక్ష? నీ దర్శనం చేసుకోకుండా నేనుండలేనని నీకు తెలుసు కదా!" అని ప్రతిరోజూ బాబాని అడుగుతూ ట్రాన్స్ఫర్ కోసం చాలా ప్రయత్నించాను. కానీ, ట్రాన్స్ఫర్ అవ్వలేదు. చివరికి నేను, "బాబా! మీ మీదే భారమేసాను. మీరు ఏమి చేస్తారో నాకు తెలియదు. నేను ప్రతిరోజూ మీ గుడికి వచ్చి మీ దర్శనం చేసుకోవాలి" అని బాబాను వేడుకున్నాను. అంతే, బాబా నన్ను కరుణించి నా సొంత ఊరికి ట్రాన్స్ఫర్ చేయించారు. ఆయన మహిమ ఎంత చెప్పినా తక్కువే. పిలిస్తే పలికే దైవం సాయినాథుడు. నా చేయిపట్టి నన్ను నడిపించే దైవం నా సాయినాథుడు. నేను ఎన్ని జన్మలెత్తినా ఆయన ఋణం తీర్చుకోలేను. సదా ఆ సాయినాథుని ఆశీస్సులు మన అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. "బాబా! మీ ప్రేమ, కరుణాకటాక్షాలు నామీద, నా కుటుంబం మీద ఎల్లప్పుడూ ఉండాలని మిమ్మల్ని మనస్పూర్తిగా వేడుకుంటున్నాను. నాకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి బాబా. నా శిరస్సు వంచి మీకు పాదాభివందనాలు చేస్తున్నాను తండ్రీ".
ఊదీయే పరమ ఔషధం
సాయి భక్తులందరికీ నా నమస్కారాలు. నా పేరు కోమలవల్లి. 2025, జూన్ నెలలో నేను ఇన్ఫెక్షన్‌తో బాధపడ్డాను. మావారికి చెపుదామంటే ఆయన రకరకాలుగా ఊహించుకొని అరుస్తూ ఉంటారు. డాక్టరు దగ్గరకు వెళదామంటే, నేను ఎప్పుడూ చూపించుకునే డాక్టరు సాయంత్రం మాత్రమే ఉంటారు. సాయంత్రం పూట వెళ్ళడానికి నాకు వీలు పడదు. అందుకని నేను డాక్టరు దగ్గరకు వెళ్ళలేదు. కానీ ఆ ఇన్ఫెక్షన్ బాధ భరించలేక చాలా బాధను అనుభవించాను. అప్పుడు బాబాను శరణువేడి, "బాబా! నేను డాక్టరు దగ్గరకి వెళ్ళలేను. అలాగని ఈ బాధ భరించలేకున్నాను. మీ ఊదీనే మందుగా భావిస్తున్నాను" అని చెప్పుకొని కొద్దిగా ఊదీ నా కడుపుకు పూసుకొని, మరికొంత ఊదీ నా నోట్లో వేసుకున్నాను. ఇలా ఒక 4, 5 రోజులు చేశాను. బాబా దయవల్ల క్రమేణా నా బాధ తగ్గింది. డాక్టరు దగ్గరకు వెళ్ళకుండనే పూర్తిగా నయమైంది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
