ఈ భాగంలో అనుభవాలు:
1. బాబా తన బిడ్డలను ఎప్పుడూ విడిచిపెట్టరు
2. బాబా దయతో తగ్గిన జ్వరం
3. కష్టాలను దూరం చేసే సాయి
బాబా తన బిడ్డలను ఎప్పుడూ విడిచిపెట్టరు
నా పేరు కామేశ్వరి. నాకు పెళ్ళైన 8 సంవత్సరాల వరకు సంతానం కలగలేదు. డాక్టర్లు మాకు పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పారు. అయినా నేను సాయి మీద నమ్మకంతో 'సాయి దివ్యపూజ' చేశాను. అలాగే రోజూ 'సచ్చరిత్ర' చదివాను. సాయి నన్ను ఎప్పుడూ విడిపెట్టలేదు. ఆయన అద్భుతం చేసారు. 2022, జనవరిలో నేను గర్భవతినని నిర్ధారణ అయింది. సెప్టెంబర్ 8, గురువారం నాకు ఒక పాప పుట్టింది. అలా బాబా కృపతో నా ప్రార్థనలకు సమాధానమిచ్చి నా జీవితంలో జరగదన్న విషయాన్ని జరిపించి తామున్నామని నిరూపించారు.
2025, నవంబర్‌లో మా అమ్మ అనారోగ్యం పాలైంది. డాక్టర్లు స్కాన్ చేసి, "బ్రెస్ట్ లో కణితి ఉంది. క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంద"ని చెప్పారు. మా అమ్మ చాలా భయపడిపోయింది. నేను, "బాబా! మా అమ్మ చాలా భయపడుతుంది. మీరు తప్ప నాకు వేరే దిక్కు లేదు సాయి" అని సాయి పాదాలు పట్టుకొని వేడుకున్నాను. అప్పుడు డాక్టర్ మరోసారి టెస్ట్ చేయాలని చెపితే, సాయి దేవుని వేడుకొని చేయించాను. కానీ, రిజల్ట్ మళ్ళీ క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుందని వచ్చింది. అప్పుడు నేను నాకు తెలిసిన స్నేహితురాలి ద్వారా క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరకు అమ్మను తీసుకెళ్లి చూపించాను. ఆ డాక్టర్ కణితి తొలగించి టెస్టుకి పంపించారు. నేను, "సాయీ! మీ నామజపము చేస్తున్నాను. రిపోర్టు క్యాన్సర్ కాదని ఇవ్వండి తండ్రీ. ముందు ఇచ్చిన రిపోర్టు తప్పు అని నిరూపించండి బాబా" అని బాబాను వేడుకున్నాను. ఒక వారంలో రావలసిన రిపోర్టు రాకపోవడంతో నాలో చాలా భయం పెరిగిపోయింది. ఆందోళన చెంది బాబాని ప్రార్ధిస్తూ గడిపాను. రెండు వారాల తర్వాత బాబా కృపవల్ల రిపోర్ట్ క్యాన్సర్ కాదని వచ్చింది. ఈ అనుభవం ద్వారా బాబా తన బిడ్డలను ఎప్పుడూ విడిపెట్టరని, అవసరంలో ఎప్పుడూ మనతో ఉంటారని నేను తెలుసుకున్నాను. బాబా నా విషయంలో చూపిన కృప నేను జీవితంలో ఎప్పుడూ మరువలేను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
బాబా దయతో తగ్గిన జ్వరం
సాయి భక్తులందరికీ నా నమస్కారాలు. నా పేరు సాహిత్య. నాకు ఒక బాబు, పాప. ఒకసారి పాపకి జ్వరమొచ్చి రెండు రోజులకి తగ్గింది. తర్వాత రెండు రోజులకి మా రెండేళ్ల బాబుకి ఉన్నట్టుండి జ్వరం 102 డిగ్రీలు వచ్చింది. ఆ సమయంలో మావారికి డ్యూటీ ఉండటం వల్ల నేనే బాబుని ఆటోలో హోమియో హాస్పిటల్‌కి తీసుకెళ్లాను. డాక్టర్ మందులిచ్చి "తగ్గకపోతే, మళ్ళీ బాబుని తీసుకొని రమ్మ"ని అన్నారు. నేను బాబుకి బాబా ఊదీ పెట్టి, మందులు వేశాను. కానీ ఎందుకో జ్వరం తగ్గలేదు సరికదా, 103 డిగ్రీలకి పెరిగింది. బాబు ఆయాస పడుతున్నట్టు, వణుకుతున్నట్టు అనిపించింది. పరిస్థితి అలాగే ఉండటం వల్ల అర్థరాత్రి ఇంగ్లీష్ హాస్పిటల్‌కి తీసుకెళ్దామనుకున్నాము. కానీ నా భర్త "ఒకసారి హోమియో హాస్పిటల్‌కి కాల్ చేసి అడగమ"ని అన్నారు. సరేనని కాల్ చేస్తే, లక్కీగా వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసి మెడిసిన్ డోస్ మార్చి వేయమని, దాంతోపాటు 5 నిమిషాల వ్యవధిలో పారాసెటమాల్ సిరప్ 2.5ml వేయమన్నారు. వాళ్ళు చెప్పినట్లే చేసి, "బాబుకి జ్వరం తగ్గేలా చూడమ"ని బాబాని వేడుకున్నాను. అంతే! అరగంటలో జ్వరం 100.99కి తగ్గి, మర్నాటికి పూర్తిగా తగ్గింది. బాబు కొంచెం డల్‌గా ఉన్నా ఆ తర్వాత రోజు పూర్తిగా కోలుకున్నాడు. అంతా బాబా దయ. "ధన్యవాదాలు బాబా. నా భర్త, పిల్లల్ని, నన్ను, నా కుటుంబాన్ని, నా అనుకున్న వాళ్ళని, అలాగే అందరినీ ఇలాగే చల్లగా చూడు తండ్రీ. నా భర్త మానసిక అశాంతిని తొలగించు తండ్రీ".
కష్టాలను దూరం చేసే సాయి
నా పేరు మల్లారెడ్డి. నేను హైదరాబాద్ వాస్తవ్యున్ని. 2025, నవంబర్ నెలాఖరులో నేను కిడ్నీలో విపరీతమైన నొప్పితో బాధపడ్డాను. బాధ భరించలేక, "బాబా! నొప్పి తగ్గేలా దయ చూపండి" అని బాబాను వేడుకొని ఊదీ నీళ్లలో వేసుకొని పొద్దున్న, సాయంత్రం తాగడం ప్రారంభించాను. బాబా దయవల్ల మూడు రోజుల్లో నొప్పి తగ్గిపోయింది. తర్వాత నాకు మరో కొత్త సమస్య వచ్చింది. నా పాదం, అలాగే కాలి చిటికెన వేలు మధ్యలో పగిలి విపరీతమైన నొప్పి పెట్టాయి. మా అమ్మాయి ఊదీ నా పాదంపైన, చిటికెన వేలుపై వేసింది. 2025, డిసెంబర్ 2 రాత్రి ఊదీ వేస్తే, మర్నాడు ఉదయానికి నొప్పి 80% తగ్గిపోయింది. ఇటీవల మా అమ్మాయి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాలేదు. 2025, నవంబర్ 6న తను నవగురువార వ్రతం మొదలుపెట్టింది. బాబా దయవల్ల మొదటి గురువారం నాడే మా అమ్మాయికి పూణేలో ఉద్యోగం వచ్చింది. మేము చాలా సంతోషించాము. మనలా ఆ దయగల తండ్రి ఎప్పటికీ చేయి వదలరు. ఆ సర్వాంతర్యామి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. "ధన్యవాదాలు బాబా. నా కోరికలు గురించి మీకు తెలియంది కాదు, అన్నీ మీకు తెలుసు. వాటిని నెరవేర్చి ఎప్పటికీ మీ పాదాల చెంత నా మనసు నిలిపేటట్టు అనుగ్రహించండి స్వామి. నేను ఏమైనా తప్పులు చేసుంటే మన్నించి మీ ఈ బిడ్డపై కరుణ ఎప్పటికీ ఉంచండి".

Om Sai Ram 🙏🙏🙏
ReplyDeleteOm Sai Ram 🙏
ReplyDeleteOmsairam
ReplyDelete