- శ్రీసాయి అనుగ్రహ లీలలు - పదవ భాగం
సాయిబాబుగారు తమకు బాబా ప్రసాదించిన కొన్ని అనుభవాలు గతవారం పంచుకున్నారు. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకుంటున్నారు.
‘బాబా’ అనే రెండు అక్షరాలలో ప్రపంచమే ఉంది. ఆయనని మనస్ఫూర్తిగా ధ్యానిస్తే, ఆయన మన దగ్గరకు వస్తాడు, మన సమస్యలు పరిష్కరిస్తాడు. దైవచింతన ఎంత దృఢంగా ఉంటుందో, మన సమస్యల పరిష్కారం అంత సుళువుగా, తేలికగా ఉంటుంది. ఒకసారి దసరా సెలవుల్లో నేను, నా భార్య బాబా అనుమతి తీసుకుని రాములవారి దర్శనం కోసం భద్రాచలం వెళ్ళాము. అక్కడ మూడు రోజులుండి, చూడవలసిన ప్రదేశాలు చూసి మూడవరోజు సాయంత్రం 6 గంటలకు భద్రాచలం బస్టాండుకు వెళ్ళాము. తీరా చూస్తే, నా జేబులో 198 రూపాయలు మాత్రమే ఉన్నాయి. నా దగ్గర డబ్బులున్నాయని నా భార్య, ఆమె దగ్గర ఉన్నాయని నేను ప్రసాదాలకు, ఇతరత్రా ఖర్చులకు ఖర్చుపెట్టేశాము. ఆ రోజుల్లో సెల్‍ఫోన్లు, ఏటిఎమ్‍లు లేవు. 'ఉన్న డబ్బులు ఇంటికి వెళ్ళడానికి సరిపోవు, ఇప్పుడెలా? కనీసం విజయవాడ వరకైనా చేరుకుంటే, అక్కడ స్నేహితుల ఇంటికి వెళ్ళొచ్చు. కానీ వాళ్ళు అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మరి అప్పుడెలా? ఏమి చేయాలి? ఎవరినీ అడగలేము' అని మా మదిలో ఎన్నో ఆలోచనలు. ఈ ఆలోచనలతో సమయం 7 గంటలయ్యింది. ఒకప్రక్క బాగా చీకటి పడుతోందనే కంగారు. అంతలో విజయవాడ బస్సు వచ్చింది. బస్సు ఎక్కబోతుండగా ఎవరో తుమ్మారు. బహుశా ఆ బస్సు ఎక్కవద్దని బాబా నిర్ణయం కాబోలునని మేము ఆ బస్సు ఎక్కలేదు. అరగంట తర్వాత గుంటూరు బస్సు వచ్చింది. మా దగ్గరున్న 198 రూపాయలతో ఇద్దరమూ గుంటూరు చేరుకోవచ్చని, ఆ బస్సులో ఎక్కి కూర్చున్నాము. కానీ మనసులో, 'బస్సు తెల్లవారుఝామున మూడు గంటలకు గుంటూరు చేరుతుంది. కానీ అక్కడినుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న నారాకోడూరులోని మా ఇంటికి ఎలా చేరుకోవాలి? తెల్లవారితే గురువారం. ఇంట్లో పూజ చేసుకోవాలి' అన్న ఆలోచనల మధ్య బస్సు బయలుదేరింది. నేను రాత్రి 11 గంటల సమయంలో తలవంచుకుని ఆలోచిస్తూ, "ఈ సమస్య నుండి గట్టెక్కించండి" అని బాబాను ప్రార్థిస్తూ అప్రయత్నంగా తల పక్కకి త్రిప్పి చూశాను. నా ప్రక్కనే నడివయస్కుడైన ఒక వ్యక్తి నిల్చొని ఉన్నారు. ఆయన భుజాల చుట్టూ కప్పుకుని ఉన్న శాలువా అంచుబారున 'సాయి సేవక్, సాయి సేవక్' అని తెలుగులోనూ, ఇంగ్లీషులోనూ అచ్చువేసిన అక్షరాలు కన్పించాయి. అవి చూడగానే నాకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. నేను నా సీటులో నుండి పైకి లేచి నిలబడి, "మీరు సాయిభక్తులా?" అని ఆయనను అడిగాను. అందుకాయన, “అవును, నేను సాయి సేవకుడను” అని జవాబిచ్చారు. అప్పుడు నేను ఆయనతో మా ఇబ్బంది చెప్పి, “మా ఇంటికి చేరటానికి అవసరమైన పైకం ఇవ్వండి. ఆ పైకాన్ని మేము ఇంటికి చేరిన తర్వాత బాబా మందిరంలోని హుండీలో వేస్తాము" అని చెప్పాను. ఆయన 'అలాగే'నని అన్నారు. ఒక అరగంట తర్వాత ఆయన ఒక ప్రదేశంలో బస్సు ఆపమని, నాకు 10 రూపాయల నోటు ఇచ్చి బస్సు దిగారు. నేను ఆయనకు కృతజ్ఞతలు చెప్పాను. తర్వాత మేము ఆయనకు లడ్డు ప్రసాదం ఇద్దామని, బస్సు కిటికీ గ్లాసు తెరిచి చూస్తే, చుట్టూ చీకటి, పొలాలు తప్ప ఇళ్ళు లేవు. అలా చూస్తూనే ఉన్నాము. ఆయన ఆ పొలాల్లో ఒక నిమిషం నడిచి అదృశ్యమైపోయారు. ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న మమ్మల్ని అలా తమ సేవకుడిని పంపి ఆదుకున్నారు బాబా. వెంటనే మాకు శ్రీసాయిసచ్చరిత్రలోని 'జామ్నేరు లీల' గుర్తుకు వచ్చింది. తెల్లవారుఝామున 4 గంటలకు మేము మా ఇంటికి చేరుకున్నాము. బాబా పూజ అయ్యాక, గుడికి వెళ్లి, బాబా దర్శనం చేసుకుని 10/- రూపాయలు హుండీలో సమర్పించాము. మరుసటిరోజు ఊరికి తీసికెళ్ళిన బట్టలను బ్యాగులో నుండి తీసి సర్దుతుంటే, బ్యాగు అడుగున 500 రూపాయల నోటు కన్పించేసరికి మేము ఆశ్చర్యపోయాము. అప్పటివరకూ ఆ 500/- జాగ్రత్తగా అడుగున పెట్టిన విషయం మాకు గుర్తురాలేదంటే బాబా లీల జరగడానికేనేమో అనిపించింది! ఎందుకంటే, మేము ఆ నోటు బయటికి తీసి చిల్లర మార్చుకుని ఇంటికి వచ్చినట్లయితే ఈ లీల జరగడానికి ఆస్కారం ఉండేది కాదు. ఏదేమైనా అద్భుతమైన బాబా లీల గనుక ఇన్ని సంవత్సరాలైనా మా మనస్సులో చిరస్మరణీయంగా ఉండిపోయింది.
ఒకసారి నేను, నా భార్య గుంటూరులో ఉన్న మా బంధువుల ఇంటికి వెళ్ళాం. బాబా గురించి మాట్లాడుతూ సమయం చూసుకోలేదు. తీరా చూసుకునేసరికి రాత్రి 11 గంటలైపోయింది. ఆ సమయంలో నేను, నా భార్య మా కారులో నారాకోడూరులో ఉన్న మా ఇంటికి బయలుదేరాం. బాగా దాహమేస్తుంటే, 'కూల్‌డ్రింక్స్ త్రాగము కాబట్టి, ఎక్కడైనా చెఱకురసం స్టాల్ కనిపిస్తే దాహం తీర్చుకోవచ్చు' అనుకున్నాం. మళ్ళీ అంతలోనే, 'ఈ సమయంలో ఏ చెఱకురసం స్టాల్ తెరచి ఉండదు కదా!” అని కూడా అనుకున్నాం. కానీ బాబా చెఱకురసంతోనే మా దాహం తీర్చారు. ఎలాగంటే, మా కారు గుంటూరు స్టేడియం వద్ద మలుపు తిరగ్గానే, ఎదురుగా చెఱకురసం స్టాల్, అందులోనూ పెద్ద బ్యానరు మీద బాబా ముఖచిత్రం కన్పించింది. మేం కారు ఆపి చెఱకురసం త్రాగాము. మేము ఆ షాపతనిని, “నువ్వు బాబా భక్తుడివా? షాపులో బాబా ఫోటో పెట్టుకున్నావు” అని అడిగాము. అందుకతను, “అలాగే అనుకోండి” అని అన్నాడు. మేము, “నీ వ్యాపారం బాగా జరగాలంటే, రోజూ మొదట తీసిన ఒక గ్లాసుడు చెఱకురసం ముసలివాళ్ళకెవరికైనా ఉచితంగా ఇవ్వు” అని చెప్పాము. అతను, “ఒకరికి కాదు. నేను మొదటి ఒక గ్లాసు చెఱకురసం తీసి దేవునికి నివేదించి, దాన్ని తిరిగి మిగిలిన చెఱకురసం గిన్నెలో పోసి అంతా కలిపి అందరికీ ఇవ్వటం మొదలుపెడతాను” అని అన్నాడు. మేము ఇంటికొచ్చాక ఆ సంఘటనను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, 'ప్రత్యక్షంగా డబ్బు రూపంలో ఆ స్టాల్ అతనికి, పరోక్షంగా ప్రసాదరూపంలో భక్తులను అనుగ్రహిస్తుంది బాబానే కదా!' అనిపించి, ఏదేమైనా వేళకానివేళలో అనుకోగానే చెఱకురసంతో బాబానే స్వయంగా మా దాహం తీర్చారనుకున్నాం.
2001, మే నెలలో ఒకరోజు మధ్యాహ్నం 3 గంటలవుతుండగా, 'సెలవులు కదా! వైజాగ్ చూడాలని ఉంది. వెళ్ళాలా? వద్దా?' అని బాబాను అడిగాను. బాబా వెళ్ళమని అనుమతినిచ్చారు. ఆ రాత్రి 9 గంటలకు గుంటూరు స్టేషనుకి వెళ్ళాము. రైలు చాలా రద్దీగా ఉంది. చిన్నప్పటినుంచి రిజర్వేషన్ లేకుండా వెళ్లడం అలవాటు లేకపోయినప్పటికీ ఎలాగోలా ఆ రైలు ఎక్కి మరుసటిరోజు ఉదయం 6 గంటలకు వైజాగ్ చేరుకున్నాము. వెంటనే ప్రక్క ఫ్లాట్‌ఫారం మీద ఉన్న మరో రైలు ఎక్కి మధ్యాహ్నం 3, 4 గంటల ప్రాంతంలో అరకులో దిగాము. అక్కడ మాకు ఏమీ తెలీదని అనుకుంటున్నంతలో 16, 17 సంవత్సరాల వయస్సున్న ఒక కుర్రాడు మా వద్దకు వచ్చి, మాకు ఒక రూము ఇప్పించి, అక్కడ చూడవలసిన ప్రదేశాల గురించి వివరంగా చెప్పి వెళ్ళాడు. మేము ఒక్కరోజులో అవన్నీ చూసి, మరుసటిరోజు ఉదయం బస్సులో బొర్రాగుహలు చూడటానికి బయలుదేరాము. ఆ దారిలో శ్రీఆంజనేయస్వామి విగ్రహం ఒకటి ఉంది. అక్కడ మేము కొబ్బరికాయ కొట్టి మొక్కు తీర్చుకోవాల్సి ఉంది. ఆ విషయం కండక్టరుతో చెపితే, "అక్కడ ఒక్క నిమిషం బస్సు ఆపుతాను. వెళ్లి, కొబ్బరికాయ కొట్టి రండి” అని అన్నాడు. మాకేమో ఒక 10, 15 నిమిషాలైనా ఆ గుడి వద్ద గడపాలని ఉంది. అయితే శ్రీఆంజనేయస్వామి గుడి పది గజాల దూరంలో ఉందనగా బస్సు టైరు పంక్చరు అయి, టైరు మార్చటానికి ఒక గంట సమయం పట్టింది. ఈ లోపల మేము ఆనందంగా కొబ్బరికాయ కొట్టి, చాలాసేపు అక్కడ గడిపాము. ఒకానొక సందర్భంలో నా భార్య ఆ ఆంజనేయస్వామికి "కొబ్బరికాయ కొడతాన"ని మొక్కుకుంది. దానిని తీర్చటానికి బాబా చేసిన లీల ఇది. తరువాత మేము బొర్రాగుహలు చూసి వైజాగ్ వెళ్ళడానికి రైలు ఎక్కాము. మా ప్రక్కన కూర్చునవాళ్ళని అడిగితే, "వైజాగ్ స్టేషన్ వరకు వెళ్లకుండా, ముందొచ్చే స్టేషన్లో దిగి సింహాచలం వెళ్ళటం తేలిక” అని చెప్పారు. అప్పుడు రాత్రి తొమ్మిది గంటలైంది. 'వాళ్ళు చెప్పిన చోట దిగాలా, వద్దా?' అని బాబాని అడిగితే, 'వద్దు' అని జవాబు వచ్చింది. అందువలన మేం సరాసరి వైజాగ్ వెళ్ళిపోయాము. మరుసటిరోజు ఉదయాన్నే బస్సులో ఒకరోజు యాత్ర అని వైజాగ్ సిటీతోపాటు సింహాచలం దర్శించేలా బాబా అనుగ్రహించారు.
మూడు రోజుల తర్వాత రాత్రి 9 గంటలకి తిరుగు ప్రయాణం కోసం వైజాగ్ రైల్వేస్టేషన్ చేరుకున్నాము. రైలు బయలుదేరటానికి సిద్ధంగా ఉంది. కానీ కాలు పెట్టడానికి కూడా వీలులేనంత రద్దీగా ఉంది. ఖాళీగా ఉన్నది రైలు గార్డు రూము మాత్రమే. మేము, "అందులో ఎక్కవచ్చా?" అని అడిగితే, “గార్డు ఉద్యోగం పోతుంది. అందువలన పర్మిషన్ ఇవ్వరు" అని అన్నారు. మాకు ఏం చేయాలో పాలుపోక బాబాని అడిగితే, “మీరు గార్డు రూములోనే ప్రయాణిస్తారు" అని సమాధానం వచ్చింది. ఇంక బాబా మీద భారమేసి గార్డు రూము దగ్గరే వేచివుండమని మావాళ్లతో చెప్పి, నేను మాత్రం అతి కష్టం మీద జనరల్ బోగీలో ఎక్కాను. అంతలో గార్డు వచ్చి, మావాళ్ళని, “మీరు ఇక్కడ ఎందుకు వేచి ఉన్నార"ని అడిగాడు. నా భార్య, “రైలు చాలా రద్దీగా ఉంది. మమ్మల్ని ఈ గార్డు రూములో ప్రయాణం చేయనివ్వండి" అని ఆయన్ని రిక్వెస్ట్ చేసింది. ఆయన ఇంకేమీ ఆలోచించకుండా, “దానికేముంది, మీరు నిరభ్యంతరంగా మాతోపాటు ప్రయాణం చేయొచ్చు” అని తన గార్డు రూములో ఎక్కించుకున్నాడు. ఆ గార్డు ఎంత మంచి వ్యక్తంటే, మధ్యలో రైలు ఆగినప్పుడు నాకోసం వెతికి టీ పంపించాడు. ఆ టీ నా వద్దకు చేరటానికి ఆ బోగీలో 10 మంది చేతులు మారాల్సి వచ్చింది. అంత రద్దీగా ఉంది ఆ రైలు. ఆ గార్డు నన్ను కూడా తన రూముకే రమ్మన్నాడు. కానీ నేను బయటకు దిగటానికి వీలులేకపోయింది. మేము తెల్లవారి 5 గంటలకి విజయవాడ చేరుకుని ఆ గార్డుకి కృతజ్ఞతలు చెప్పి, ఒక కప్పు కాఫీ ఇప్పించాము. ఆయన స్టేషను బయట వరకూ వచ్చి మమ్మల్ని సాగనంపారు. ఆయన చేసిన మేలు, కాదు..కాదు, ఆయన ద్వారా బాబా చేసిన సహాయం మరువలేనిది.
ఒకరోజు ఉదయం 9 గంటలకు నేను, నా భార్య బెంగళూరు నుండి విజయవాడ వెళ్లేందుకు రైలు ఎక్కాము. అది సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు అయినందున నెల్లూరు తర్వాత విజయవాడలోనే ఆగుతుంది. విజయవాడ చేరుకునేసరికి రాత్రి రెండు గంటలవుతుంది. అయితే ఒంగోలు దాటిన తర్వాత తోటి ప్రయాణీకులు, "ట్రైన్ తెనాలిలో బాగా స్లో అవుతుంది. దిగిపోండి" అని అన్నారు. అప్పుడు మేము బాబాని అడిగితే, "నిడుబ్రోలులో దిగండి" అని చెప్పారు. నిడుబ్రోలు నుండి మా ఊరికి 40 నిమిషాల ప్రయాణం మాత్రమే. కానీ 'నిడుబ్రోలులో సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగవు. అయినప్పటికీ 'బాబా చెప్పారు కాబట్టి అంతా ఆయన చూసుకుంటార'ని మేము వేచి ఉన్నాము. రాత్రి ఏడు గంటలు అవుతుండగా రైలు 'నిడుబ్రోలు' స్టేషను ఔటరులో ఆగింది. చుట్టూ చీకటి, ఏమీ కనిపించట్లేదు. బాబాని, “ఇక్కడ దిగాలా?" అని అడిగితే, “వద్దు” అని సమాధానం వచ్చింది. అంతలో రైలు కదిలి నెమ్మదిగా వెళ్తూ 'నిడుబ్రోలు' స్టేషనుకి వెళ్లి ఆగింది. బాబా మాట అక్షర సత్యమైంది. మేము హాయిగా, సంతోషంగా రైలు దిగి రాత్రి 8 గంటలకల్లా ఇల్లు చేరుకున్నాము. అలా జరగకుంటే మేము విజయవాడ వరకు వెళ్లి, అర్థరాత్రి 2 గంటలకి విజయవాడలో దిగేవాళ్ళం. అక్కడినుండి వెనక్కి 2 గంటలు ప్రయాణం చేస్తే మరుసటిరోజు ఉదయానికి ఇంటికి చేరేవాళ్ళము. అలాంటిది బాబా మాకోసం రైలుని నిడుబ్రోలులో ఆపి, తక్కువ సమయంలోనే మమ్మల్ని ఇంటికి చేర్చారు. మేము ఇల్లు చేరుకున్న తరువాత రాత్రి 9 గంటలకు మా అల్లుడు ఫోన్ చేసి, “ఏ స్టేషన్ దాటారు?” అని అడిగితే, "మేము గంట క్రితమే ఇల్లు చేరామ"ని చెప్పాము. అది విని మా అల్లుడు, “నిజమా!” అని ఆశ్చర్యపోయాడు.
2018, దసరా సెలవుల్లో బెంగళూరులో ఉన్న మా మనవడు 'సాయీష్'ను మా ఇంటికి తీసుకు రావాలని నేను బాబాని అనుమతి అడిగితే, బెంగళూరు వెళ్ళడానికి బాబా అనుమతి ఇవ్వలేదు. నాకు, 'ఏదో కారణం ఉండే ఉంటుంది. అందుకే బాబా అనుమతి ఇవ్వలేదు' అనిపించింది. ఒక వారం గడిచిన తరువాత హఠాత్తుగా మా అమ్మాయివాళ్లే బెంగళూరు నుండి గుంటూరు వచ్చి సెలవులు గడిపి వెళ్లారు. వాళ్ల రాక గురించి బాబాకి తెలుసు గనకే బెంగళూరు వెళ్లడానికి నాకు అనుమతినివ్వలేదు. అయినా నేను వెళ్లుంటే, మనవడిని మాత్రమే తీసుకొచ్చేవాడిని. కానీ బాబా మొత్తం కుటుంబాన్ని మా వద్దకు పంపారు.
చిన్నవైనా, పెద్దవైనా వస్తువులు కొనే విషయంలో కూడా మేము బాబా నిర్ణయం ప్రకారమే వాటిని తీసుకుంటాము. సరైన ధరకు మంచివి ఇప్పిస్తారు బాబా. 2010లో ఒకరోజు నాలుగు బర్నర్లు ఉన్న గ్యాస్ స్టవ్ కొందామని నేను, నా భార్య, మా అమ్మాయి బెంగళూరులోని బిగ్‍బజారుకు వెళ్ళాము. లోపలికి వెళ్ళేముందు, 'పని అవుతుందా?' అని బాబాని అడిగితే, 'అవుతుంద'ని చెప్పారు. సరేనని, లోపలికి వెళ్ళి చూస్తే, రేట్లు వేలల్లో ఉన్నాయి. అంత డబ్బు మేము తీసుకెళ్లలేదు. అయినా మూడు గంటలసేపు వెతికాము. కానీ మాకు కావాల్సిన రేటులో స్టవ్ దొరకలేదు. ఏం చేయాలో తెలియక మళ్ళీ బాబాని అడిగితే, 'ఇక్కడే ఉంది' అని సమాధానం వచ్చింది. కానీ మాకు కనపడట్లేదు. వెతికి వెతికి చివరికి, "తిరిగి వెళ్ళిపోదామని” మా అమ్మాయి అంది. కానీ, ‘బాబా చెప్తే, అది ఖచ్చితంగా ఉంటుంద’ని మాకు గట్టి నమ్మకం. నా భార్య బాబా మీద విశ్వాసంతో వెతుకుతూ ఉండగా ఒక మూల చిందరవందరగా పడేసి ఉన్న అట్టపెట్టెల మధ్య ఒక బాక్స్ ఆమె కంటపడింది. అందులో ఏముందని బయటికి లాగి చూస్తే, అదే మాకు కావలసిన గ్యాస్ స్టవ్. బాబాని అడిగితే, దాన్ని తీసుకోమన్నారు. బిల్ వేస్తే కేవలం 1200 రూపాయలే అయింది. చూశారా! బాబా వేలల్లో ఉన్న స్టవ్‍ను, వందల్లోనే ఎలా మాకు ఇప్పించారో! సహనం ముఖ్యం.
2010లోనే ఒకసారి మేము మా మనుమడికి ఒక చిన్న సైకిల్ కొనిద్దామని బెంగళూరులోని ఒక షోరూమ్‍కి వెళ్లి ధర అడిగితే, 4000 రూపాయలు చెప్పారు. 'చిన్న సైకిల్ అంత రేటా?' అని మేము నిరుత్సాహపడ్డాము. బాబా కూడా అనుమతి ఇవ్వలేదు. మేము వెనక్కి తిరిగి వచ్చేశాము. వారంరోజుల తర్వాత బెంగళూరులోని ‘ఫినిక్స్' మాల్‍లో ఉన్న బిగ్‍బజారులో అలాంటి సైకిలే మాకు కన్పించింది. దాని వెల మూడువేల రూపాయలు ఉంది. బాబాని అడిగితే 'కొనమని' చెప్పారు. బాబా చెప్పారు కనుక అది మూడువేలు అయినా, పదివేలు అయినా తీసుకోక తప్పదు. కానీ బాబా మనల్ని నష్టపోనివ్వరు కదా! సైకిల్ తీసుకుని బిల్ వేయించాక చూస్తే, కేవలం 1800 రూపాయలే బిల్‍లో ఉంది. బిల్లు వేస్తే ఎంత పడుతుందో అది బాబాకే తెలుసు. మాకు తెలియదు కదా! అందుకే మేము ఏదైనా బాబా నిర్ణయం ప్రకారం నడుచుకుంటాము.
2018, మే నెలలో సుమారు 47 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో ఎండలు మండిపోతుండేవి. స్నానం చేసినట్టు ఒళ్ళంతా చెమటలు కారిపోతుండేవి. ఆపరేషన్ జరిగిన నా భార్య ఆ వేడిని అస్సలు తట్టుకోలేకపోతుండేది. ఏసీ తీసుకుందామని షోరూంకు వెళ్లి అంతా మాట్లాడుకున్న తర్వాత, "తీసుకోమంటారా?” అని బాబాని అడిగితే, “వద్దు” అని సమాధానమిచ్చారు. దాంతో చేసేదిలేక ఇంటికి తిరిగి వచ్చాము. ఇరవైరోజుల తర్వాత ఒక ముఖ్యమైన ఫంక్షనుకు వెళ్ళి, తిరిగొస్తూ మళ్ళీ అదే షోరూంకు వెళ్ళి, "ఇప్పుడైనా అనుమతిస్తారా బాబా?" అని బాబాని అడిగితే, మళ్ళీ “వద్దు” అని బాబా సమాధానమిచ్చారు. "బాబా మన మంచికోసం ఏదైనా చేస్తుంటారు" అని నేను, నా భార్య ఇంటికి తిరిగి వచ్చేసాము. ఇంట్లో కూలర్ ఉంటే దాన్ని శుభ్రం చేసి అదే వాడుకుంటుండేవాళ్ళము. అలా నాలుగైదు రోజులు గడిచాక ఒకరోజు మిట్టమధ్యాహ్నం నా ఫోన్‍కి ఏదో మెసేజ్ వచ్చిన శబ్దం వచ్చింది. నేను రోజూ వచ్చే ఏదో మెసేజై ఉంటుందిలే అనుకున్నాను. కానీ ఎందుకో ఒకసారి చూద్దామని ఫోన్ చేతిలోకి తీసుకుని మెసేజ్ చదివితే, “డబ్బులు అందాయి, రెండు రోజుల్లో ఏసీ డెలివరీ అవుతుంది” అని ఉంది. అది ఫ్లిఫ్ కార్ట్ నుండి వచ్చిన మెసేజ్. అందులో ఏసీ కంపెనీ పేరు మొదలైన వివరాలు కూడా ఉన్నాయి. ఒక్క నిమిషం నన్ను నేను నమ్మలేకపోయాను. వెంటనే బాబా ఫోటో వైపు చూసి, “మీరే ఏదో లీల చేసుంటారు" అని అనుకుంటుండగా నా కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. అసలు విషయమేమిటంటే, బెంగుళూరులో ఉన్న మా అమ్మాయికి ఒక ఎయిర్ కూలర్ కొని మాకు ఇవ్వాలనిపించింది. కానీ బాబాను అడిగితే, ఏసీ ఇవ్వమని చెప్పారు. అంతే, తను ఫ్లిప్ కార్ట్ లో ఆర్డర్ పెట్టింది. రెండుసార్లు షోరూంకి వెళ్లి కూడా బాబా నిర్ణయానికి కట్టుబడి వెనక్కి తిరిగి వచ్చినందుకు ఆ ఏసీ ఆయన ఇచ్చిన బహుమతిలా మాకు అనిపించింది. "ధ్యాంక్యూ బాబా".
ఆకాశంలో ఎగిరే రెండిటిలో మనకు తెలిసినవి ఒకటి పక్షి, రెండవది విమానం. ఆ విమానంలో ఒకసారైనా ప్రయాణం చేయాలని ఎవరికి ఉండదు! బాబా ఆ కోరికను ఎలా తీర్చారో ఇప్పుడు చెప్తాను. 2014, ఆగష్టులో నా పుట్టినరోజున మేము బాబా మాకు బహుమతిగా ఇచ్చిన కారులో విజయవాడ వెళ్ళాము. విజయవాడ చేరిన తర్వాత ఎందుకో తలవని తలంపుగా గన్నవరం విమానాశ్రయం చూడాలనిపించి బాబాని అడిగితే, “వెళ్ళమ”ని సమాధానం వచ్చింది. సరే అని విమానాశ్రయానికి వెళ్లి, కారు పార్క్ చేసి, లాంజ్ వైపు వెళ్తుంటే ఒక సెక్యూరిటీ గార్డు మమ్మల్ని చూసి, “పేపర్లో ఆఫర్ చూసి వచ్చారా?" అని అడిగాడు. నిజానికి మాకు ఏ ఆఫర్ గురించి తెలీదు. కానీ చాలామంది అదేదో ఆఫర్ చూసి ఎయిర్ పోర్టుకు వచ్చి, అది తప్పుడు సమాచారమని తెలుసుకుని తిరిగి వెళ్లిపోతున్నారు. మేము 'స్పైస్ జెట్' కౌంటర్ వద్దకు వెళితే, అక్కడున్న ఆఫీసరు, “ప్రస్తుతానికి ఆఫర్ ఏమీ లేదు. హైదరాబాదు వెళ్ళడానికి ఒక్కరికి నాలుగువేల రూపాయలు అవుతుంది. ఈ రోజే వెళ్లాలంటే పదివేలు అవుతుంద"ని చెప్పాడు. మేము కొంచెం సేపు అక్కడే వేచి ఉండి ఆయనకు కృతజ్ఞతలు చెప్పి తిరిగి వచ్చేస్తుంటే ఆయన మాతో “ఒక నిమిషం” అని, తన ఫోన్లో ఉన్న ఎవరిదో ఒక నెంబర్ పేపర్ మీద వ్రాసి, పేరు, అడ్రస్ చెప్పి, “అక్కడికి వెళ్ళి విచారించండి. మీ అదృష్టం” అని చెప్పి, తనే ఆ వ్యక్తికి ఫోన్ చేసి, మేము వస్తున్నట్లు చెప్పి, సహాయం చేయమన్నారు. సరేనని మేము ఆ అడ్రసుకు వెళ్తే, అక్కడున్న అతను పది రోజుల తర్వాత హైదరాబాద్ వెళ్లడానికి టిక్కెట్లున్నాయని, నాకు, నా భార్యకు, మా అత్తగారికి మూడు టికెట్లు ఆఫర్ మీద చాలా తక్కువ ధరకి రిజర్వేషను చేసిచ్చాడు. దూరం నుండి చూసి వచ్చేద్దామని వెళ్ళిన మమ్మల్ని బాబా ఏకంగా విమానమే ఎక్కించే ఏర్పాటు చేశారు. ఇదంతా ఆయన వాత్సల్యం కాక మరేమిటి? ఇకపోతే, హైదరాబాద్‍లో నా భార్య చిన్ననాటి స్నేహితురాళ్ళు, బంధువులు చాలామంది ఉన్నారు. 'ఎవరిని ఎయిర్ పోర్టుకు కారు తీసుకురమ్మని చెప్పాలి? ముందు ఎవరింటికి వెళ్ళాలి? ఎవరు పనుల్లో బిజీగా ఉన్నారో, ఎవరు ఖాళీగా ఉన్నారో తెలుపమ'ని బాబాను అడిగితే, ఆయన ఒకరి పేరు సూచించారు. వాళ్ళకి విషయం చెబుదామని ఫోన్ చేస్తే రింగ్ అవ్వలేదు. వేరే ఎవరికైనా ఫోన్ చేద్దామంటే, బాబా వాళ్ళ పేరు చెప్పలేదు. అందువల్ల మేము బాబా సూచించిన వాళ్ళకే ఫోన్ చేస్తుండేవాళ్ళము. కానీ ఎన్నిసార్లు చేసినా ఆ ఫోన్ రింగ్ అయ్యేది కాదు. మేము 'ఎలా ఎలా' అనుకుంటూ విషయం వాళ్ళకి తెలియజేయకుండానే రోజులు గడిచిపోయాయి. ఆశ్చర్యం! ఇంకా రేపే ప్రయాణమనగా ఆ ముందురోజు రాత్రి వాళ్లే మాకు ఫోన్ చేశారు. చూశారా! మేము ఎన్నోసార్లు వాళ్ళకి ఫోన్ చేసి, ఆ ఫోన్ రింగు అవ్వకపోయినా వేరే స్నేహితులకు చెప్పకుండా బాబా మాట మీద గురితో పది రోజులు ఓపిక పట్టినందుకు బాబానే ఆ వ్యక్తితో ఫోన్ చేయించారు. మేము వాళ్లతో, "రేపు ఉదయం పది గంటలకు ఎయిర్ పోర్టుకు వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకోవాల"ని చెప్పాము. వాళ్ళు సరేనని వచ్చి, మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. వారం రోజులు స్నేహితులందర్ని కలిసి ఆనందంగా గడిపి వచ్చాము. ఆ సమయంలో వినాయక నిమజ్జనం జరుగుతున్నా మా ప్రయాణానికి ఏ ఆటంకం లేకుండా చూసుకున్నారు బాబా. అలా జీవితంలో మొదటిసారి విమాన ప్రయాణం చేశాము. అలా నా భార్యను, అమ్మను విమానం ఎక్కించాలని నాకు ఎప్పటినుండో ఉన్న కోరిక తీరింది.
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha