సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1316వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శ్రీసాయి అనుగ్రహవీచికలు
2. విఘ్నాలు లేకుండా కోరుకున్నవి నెరవేర్చిన బాబా

శ్రీసాయి అనుగ్రహవీచికలు


ఈ బ్లాగ్ నిర్వాహకులకు మరియు బ్లాగుని ప్రతిరోజు చదువుతున్నవారికి నా నమస్కారాలు. నేనొక సాయిభక్తురాలిని. ప్రస్తుతం నేను గర్భవతిగా ఉన్నాను. ఒకసారి నాకు కడుపులోని బిడ్డ కదలికలు తెలియలేదు. అప్పుడు భయమేసి, "బాబా! మీ దయతో ఏమీ కాకుండా ఉండి, బిడ్డ కదలికలు తెలిస్తే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల బిడ్డ కదలికలు తెలిసి అంతా మంచిగా ఉంది. "థాంక్యూ బాబా. థాంక్యూ వెరీ మచ్".


ఒక్కసారి మా సిస్టర్ వాళ్ళ పాప చైన్ కనిపించలేదు. ఎంతగానో వెతికారు, కానీ అది దొరకలేదు. అప్పుడు వాళ్ళు జాతకాలు చెప్పేవాళ్ళ దగ్గరకి వెళితే, "ఆ చైన్ ఇక దొరకదు" అని చెప్పారు. కానీ మా సిస్టర్ బాబా మీద నమ్మకంతో పారాయణ చేసి, 'రెండు నెలలు మాంసాహారం తినడం మానేస్తాన'ని అనుకుంది. ఆ రెండునెలలు పూర్తయిన తరువాత ఒకరోజు ఏదో ఫంక్షన్‌కి వెళదామని హ్యాండ్ బ్యాగ్ తెరిస్తే, అందులో కనపడకుండాపోయిన చైన్ ఉంది. అంతకుముందు అదే హ్యాండ్ బ్యాగ్‌లో చాలాసార్లు చూశారుగానీ, అప్పుడెప్పుడూ ఆ చైన్ అందులో లేదు. అలాంటిది అందులోనే చైన్ ఉండటం చాలా అద్భుతం. "థాంక్యూ బాబా, థాంక్యూ వెరీ మచ్".


తరువాత కొన్నిరోజులకు మా సిస్టర్ వాళ్ళు శిరిడీ వెళ్లడానికి ప్లాన్ చేసుకున్నారు. ప్రయాణానికి రెండు రోజులు ముందు వాళ్ళ అబ్బాయికి వాంతులు అయ్యాయి. ఆహారం పెడితే చాలు, వాంతి అయిపోతుండేది. అప్పుడు నేను, "బాబా! బాబుకి వాంతులు తగ్గిపోయి వాళ్ల శిరిడీ ప్రయాణం ఎలాంటి సమస్యా లేకుండా జరిగితే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవల్ల బాబుకి వాంతులు తగ్గాయి. వాళ్ళు ఎలాంటి ఇబ్బందీ లేకుండా సంతోషంగా శిరిడీయాత్ర పూర్తిచేసుకుని వచ్చారు. "థాంక్యూ బాబా, థాంక్యూ వెరీ మచ్".


ఒకరోజు మా బాబు సాయి ఆడుకుంటూ ఉన్నప్పుడు తలకి దెబ్బ తగిలింది. తరువాత వాడి చేతికి గాజులు గుచ్చుకుని బాగా రక్తం కారింది. అలా వరుసగా మూడు రోజులు తనకి ఏదో ఒక దెబ్బ తగిలి రక్తం కారుతుంటే నాకు చాలా భయమేసింది. అప్పుడు బాబా గుడికి వెళ్ళి, "బాబా! బాబుకి ఎలాంటి సమస్యా లేకుండా త్వరగా తగ్గిపోతే, మీ కృపను బ్లాగులో పంచుకుంటాన"ని అనుకున్నాను. బాబా దయవల్ల బాబుకి తొందరగానే నయమైపోయింది. "థాంక్యూ బాబా, థాంక్యూ వెరీ మచ్ బాబా".


మేము మా అత్తగారింట్లో ఉన్నప్పుడు ఏసీ పాడైతే, దాన్ని బాగుచేయడానికి చాలా డబ్బులు ఖర్చుపెట్టాం. అయితే తరువాత కూడా ఏసీ ఆన్ అవలేదు. అప్పుడు నేను, "బాబా! ఏసీ వర్క్ అయితే బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల ఏసీ పనిచేసింది. "థాంక్యూ బాబా, థాంక్యూ వెరీ మచ్ బాబా".


ఒకసారి మా సాయికి జలుబు, దగ్గు ఎక్కువగా వచ్చాయి. జ్వరం కూడా వచ్చే సూచనలు కనిపించాయి. అప్పటికే మా ఇంట్లో జ్వరాలు ఉన్నందున సాయికి కూడా వస్తే చాలా ఇబ్బంది అవుతుందని నాకు భయమేసింది. వెంటనే, "బాబా! సాయికి ఎలాంటి సమస్యా లేకుండా త్వరగా తగ్గితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల బాబుకున్న లక్షణాలు త్వరగా తగ్గిపోయాయి. "థాంక్యూ బాబా, థాంక్యూ వెరీ మచ్".


విఘ్నాలు లేకుండా కోరుకున్నవి నెరవేర్చిన బాబా


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. ఓం శ్రీసాయిబాబా నమో నమః. ముందుగా శ్రీసాయిబాబాకి పాదాభివందనాలు. ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరు ఈ బ్లాగును నిర్వహిస్తుండటం వల్ల బాబాపై మాకున్న ప్రేమను, భక్తిని మరియు బాబా మాపై చూపే అనుగ్రహాన్ని సాయిభక్తులందరితో మరియు సాక్షాత్తూ శ్రీసాయినాథునితో పంచుకోగలిగే భాగ్యం దక్కింది. నా పేరు ఉమ. మాది కృష్ణాజిల్లాలోని ఘంటసాల గ్రామం. నేను గత 15 సంవత్సరాలుగా శ్రీసాయిబాబా భక్తురాలిని. నాకు ఈ బ్లాగ్ గురించి తెలిసినప్పటినుంచి నేను ఇందులో ప్రచురితమవుతున్న భక్తుల అనుభవాలను చదువుతూ ఉన్నాను. తద్వారా నాకు శ్రీసాయిబాబా మీద భక్తి మరింత స్థిరపడింది. నేను కూడా అప్పుడప్పుడు నా అనుభవాలను ఈ బ్లాగులో పంచుకుంటూ ఉన్నాను. ఆ క్రమంలోనే నేను ఇప్పుడు మరో రెండు అనుభవాలను తోటి భక్తులతో పంచుకుంటున్నాను. బాబా నాకు ఈ అవకాశం ప్రసాదించినందుకు నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. ఇంక నా అనుభవాలకు వస్తే... ఈమధ్య నాకు ఒక పిచ్చి కల వచ్చింది. దాంతో ఒక్కసారిగా నాకు మెలకువ వచ్చి, బాగా దడ పుట్టింది. నేను వెంటనే కొంచెం మంచినీళ్ళు తాగి, శ్రీసాయిబాబాకి నమస్కరించుకుని, "ఈ దుస్స్వప్నంలో వచ్చినట్లుగా నాకు ఎలాంటి సమస్య, ఏ కష్టం రాకుండా ఉంటే, నేను ఈ శ్రావణమాసం పూర్తయ్యేలోపు శ్రీశైలం మల్లన్న గుడికి వెళ్తాన"ని మొక్కుకున్నాను. కానీ వ్యాపారరీత్యా నా భర్తకి సమయం దొరకలేదు. అందువలన నేను శ్రీశైలం ఎలా వెళ్ళాలని ఆలోచిస్తుండగా శ్రీసాయిబాబా గుర్తొచ్చి, వెంటనే ఆయనకు నమస్కరించుకుని, "ఎలాంటి విఘ్నాలు లేకుండా నేను మా కుటుంబంతో ఈ శ్రావణమాసం పూర్తయ్యేలోపు శ్రీశైలం వెళ్ళేలా చూడండి" అని మనసులోనే ప్రార్థించాను. ఇంకా, "నా కోరిక నెరవేరితే, నా అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను" అని కూడా అనుకున్నాను. తరువాత మా నాన్నగారు వాళ్ళింట్లో శ్రావణమాసమని కొన్ని పూజాకార్యక్రమాలు నిర్వహించారు. బాబా దయవలన అవి నిర్విఘ్నంగా జరిగాయి. తరువాత 2022, ఆగస్టు 23, మంగళవారంనాడు మేము మా కుటుంబంతో ఎలాంటి విఘ్నాలు లేకుండా శ్రీశైలం దర్శించి, మొక్కు తీర్చుకునేలా శ్రీసాయిబాబా అనుగ్రహించారు. ఆ తండ్రి దయవల్ల మాకు చక్కటి దర్శనమైంది. "శ్రీసాయిబాబా! మీకు ఈ బ్లాగ్ ద్వారా నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఎల్లపుడూ మా కుటుంబాన్ని చల్లగా కాపాడాలని ప్రార్థిస్తున్నాను".


వినాయకచవితి వస్తుందంటే చాలు, నా మనసంతా భయంభయంగా ఉంటుంది. ఎందుకంటే, వినాయకచవితికి వారం, పది రోజుల ముందు మా బాబుకి చిన్నప్పటినుంచి ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తూ ఉంటుంది. అందుచేత నేను ప్రతి సంవత్సరం మా బాబుతో శ్రీవినాయకునికి ఉండ్రాళ్ళు నివేదన చేయిస్తాను. ఈ సంవత్సరం కూడా వినాయకచవితికి మూడురోజుల ముందు ఆదివారంనాడు మా బాబుకి జ్వరం వచ్చింది,  వాంతులు కూడా అయ్యాయి. నేను వెంటనే బాబుని హాస్పిటల్‌కి తీసుకెళితే, "రక్తంలో ఇన్ఫెక్షన్ ఉండటం వలన ఇలా జరిగింది" అని చెప్పి ఒక వారం రోజులకు మందులిచ్చారు. నేను మనసులో, "బాబా! బాబుకి త్వరగా తగ్గిపోవాలి" అని బాబాను వేడుకున్నాను. ఇకపోతే, గర్భవతిగా ఉన్న మా తోడికోడలికి డెలివరీ డేట్ సెప్టెంబర్ నెలలో ఇచ్చినప్పటికీ ఆగస్టులోనే ఆమెకు కొద్దిగా నొప్పులు వచ్చాయి. ఆ హఠాత్ పరిణామంతో మా కుటుంబంలో అందరమూ భయపడ్డాము. ఒకవేళ ఆమెకి డెలివరీ అయితే వినాయకచవితి జరుపుకోవడానికి ఉండదు. నేనేమో మా పిల్లలతో వినాయకచవితినాడు ఇంట్లో వినాయకుడికి, మరుసటిరోజు మా ఇంటి పక్కనే ఉన్న రామాలయంలో పెట్టబోయే వినాయకునికి ఉండ్రాళ్ళు నివేదన చేయించాలని అనుకున్నాను. అందువలన నాకు ఏమీ తోచక నా మనసులో శ్రీసాయిబాబాకి దణ్ణం పెట్టుకుని, "మా తోడికోడలికి నొప్పులు తగ్గిపోయేలా అనుగ్రహించి, నేను అనుకున్నట్లు వినాయకచవితినాడు, ఆ మరుసటిరోజు మా పిల్లలతో వినాయకునికి నిర్విఘ్నంగా ఉండ్రాళ్ళు నివేదించుకోగలిగేలా చూడండి బాబా" అని వేడుకున్నాను. నేను కోరుకున్నట్లు మా తోడికోడలికి నొప్పులు తగ్గి, తను ఆరోగ్యంగా ఉండటంతో మా పిల్లలు నిర్విఘ్నంగా వినాయకునికి ఉండ్రాళ్ళు నివేదించారు. ఇదంతా బాబా దయతోనే సాధ్యమైంది. అందువలనే నేను ఎప్పుడూ ఆ తండ్రిని మరువను. వారి దయతో ప్రస్తుతం మా బాబు ఆరోగ్యం కుదుటపడింది. "ధన్యవాదాలు బాబా. తెలిసో, తెలియకో చేసిన తప్పులు, పొరపాట్లు ఏవైనా ఉన్నా నన్ను, నా కుటుంబాన్ని క్షమించి ఎల్లవేళలా చల్లగా కాపాడండి బాబా. మా తోడికోడలి ఆరోగ్యం బాగుండేలా చూసి తనకి సుఖప్రసవమయ్యేలా అనుగ్రహించండి బాబా. అలాగే నా మనసులో వున్న చెడు ఆలోచనలను, ఈర్ష్య, అసూయలు అన్నీ తొలగిపోయేలా చేసి నా మనసు ప్రశాంతంగా ఉండేలా అనుగ్రహించండి. ఇంకేవైనా అనుభవాలు పంచుకోవటం మరచిపోయి ఉంటే నన్ను క్షమించండి బాబా".


ఓం శ్రీసాయిబాబా!!!

సర్వం సాయిమయం!!!


3 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Bless supraja for her neck pain and shoulder pain and help her to get better Jaisairam 🙏

    ReplyDelete
  3. ఓం సాయి రామ్ రెండవ సాయి అనుగ్రహం చాలా బాగుంది.వినాయకునికి అన్ని సమర్పించిన నివేదన చేయడం బాగుంది

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo