సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1322వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా ఆశీస్సులు
2. సాయినాథుడు తీర్చిన అద్దె ఇంటి సమస్య

బాబా ఆశీస్సులు


ఓం శ్రీ శిరిడీ సాయినాథాయ నమః!!! ఓం శ్రీసాయి సిద్ధసంకల్పాయ నమః!!! సాయిబంధువులకు నమస్కారాలు. ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా కృతజ్ఞతలు. నేను ఒక సాయిభక్తురాలిని. నా పేరు స్రవంతి. నేను మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయిని. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను. నేను మా ఇంటి పూజగదిలో బాబా ఫోటో ముందు సచ్చరిత్ర పుస్తకం ఉంచి నిత్యం చదువుతున్నాను. రాఖీపౌర్ణమిరోజు చదువుదామని పుస్తకం తీస్తే, దాని అట్టమీద ఉన్న బాబా కళ్ళ నుంచి తేనె వచ్చింది. అది చూసి నేను, మా అమ్మ చాలా షాక్ అయ్యాం. నిజంగా బాబా మా ఇంట్లో అద్భుతం చేసి మా కుటుంబాన్ని ఆశీర్వదించారు. "ధన్యవాదాలు బాబా".


మా తమ్ముడి పేరు సందీప్. తను దుబాయి వెళ్లాలని ఏజెంట్ వద్ద వీసా కోసం అప్లై చేసి చాలాసార్లు వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాక తను సెలెక్ట్ అయ్యాడు. ఏజెంట్ ఒక నెలలో వీసా వస్తుందని చెప్పారు. కానీ నెల, రెండు నెలలు, చివరికి ఒక సంవత్సరం గడిచినా వీసా రాలేదు. ఆ కారణంగా మా అమ్మానాన్నలు చాలా బాధపడుతుండేవాళ్లు. నేను మా తమ్ముడి కోసం ప్రతిరోజు బాబాను ప్రార్థిస్తూ ఉండేదాన్ని. చివరికి ఈమధ్య ఒకరోజు, "బాబా! నువ్వు ఉన్నావని నిరూపించు. తమ్ముడికి వీసా రావడం లేదని అమ్మానాన్నలు చాలా బాధపడుతున్నారు. మీ దయతో గురువారం లోపు మా తమ్ముడికి వీసా వస్తే, 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. సాయి కృపతో నేను కోరుకున్నట్లే గురువారం లోపు 2022, ఆగస్టు 16న తమ్ముడికి వీసా వచ్చింది. ఏజెంట్ ముంబాయి వెళ్లి, అక్కడినుండి దుబాయి వెళ్లాలని చెప్పాడు. అయితే, 'తమ్ముడు మొదటిసారి దుబాయి వెళ్లడం, తనకి ముంబాయి అస్సలు తెలీద'ని అమ్మ చాలా భయపడింది. అందువలన నేను, "బాబా! మీ వలన ఏదైనా సాధ్యమవుతుంది. తమ్ముడ్ని హైదరాబాద్ నుంచి దుబాయి వెళ్లేలా అనుగ్రహించు" అని బాబాను వేడుకున్నాను. బాబా అలాగే అనుగ్రహించారు. మా తమ్ముడి జీవితానికి సంబంధించి బాబా చేసిన ఈ అద్భుత అనుభవం మీ అందరితో పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. "థాంక్యూ సో మచ్ బాబా".


ఇప్పుడు 2022, ఆగస్టు 18న జరిగిన మరో అనుభవాన్ని పంచుకుంటాను. నేను కానిస్టేబుల్ అవ్వాలని అందుకు సంబంధించిన పరీక్షకు ప్రిపేర్ అయ్యాను. ఆ పరీక్ష 2022, ఆగస్టు 28న జరగాల్సి ఉండగా, 'పరీక్షాకేంద్రాన్ని ఏ జిల్లాలో వేస్తారో!' అని నాకు చాలా భయమేసింది. వెంటనే, "బాబా! మీ దయతో నిజామాబాద్ జిల్లాలోనే పరీక్షాకేంద్రం వచ్చేలా అనుగ్రహించి నాకు సహాయం చేయండి" అని బాబాను వేడుకున్నాను. బాబా నాకు తెలియని జిల్లాలో కాకుండా తెలిసిన జిల్లాలో, అది కూడా నాకు తెలిసిన కాలేజీలోనే  పరీక్షాకేంద్రం వచ్చేలా అనుగ్రహించారు.


ఇకపోతే, నేను నా హాల్‌టికెట్లో పొరపాటున ఫోటోని పెట్టాల్సిన చోట కాకుండా వేరే చోట పెట్టాను. ఆ హాల్ టికెట్ తీసుకుని పరీక్ష వ్రాయడానికి పరీక్షాకేంద్రానికి వెళ్ళినప్పుడు, 'పరీక్ష వ్రాయడానికి నన్ను అనుమతిస్తారో, లేదో!' అని చాలా భయమేసింది. అయితే అక్కడున్న సార్, "ఏం కాదు. పరీక్ష వ్రాయొచ్చు" అని చెప్పారు. అప్పుడు నేను, "బాబా! మీ దయతోనే నన్ను పరీక్ష వ్రాయడానికి అనుమతించారు. ధన్యవాదాలు బాబా" అని బాబాకు చెప్పుకుని చాలా బాగా పరీక్ష వ్రాశాను. పరీక్ష అయిపోయాక 'తేనె సాయిబాబా' మందిరానికి వెళ్లి సాయికి ధన్యవాదాలు చెప్పాను. అప్పుడు బాబా ఫోటో నుంచి తేనె వచ్చింది. నేను అంతకుముందు చాలాసార్లు ఆ గుడికి వెళ్ళాను కానీ, అప్పుడెప్పుడూ తేనె కారడం  చూడలేదు. ఆనందంతో, "బాబా! మీరు నాకు మిరాకిల్ చూపించారు. థాంక్యూ సో మచ్ బాబా" అని బాబాకి చెప్పుకుని ధుని చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి బాబా ఆశీస్సులతో ఇంటికి తిరిగి వచ్చాను ."బాబా! మీ కృపతో నేను కానిస్టేబుల్ ఎంట్రన్స్ పరీక్ష వ్రాశాను.  నాకు మంచి మార్కులు వచ్చేలా అనుగ్రహించండి. అదే జరిగి మీ దయతో నాకు ఆ ఉద్యోగం వస్తే నా అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను. ప్రతి ఒక్క మీ భక్తునికి మీ ఆశీస్సులు ఉండాలి తండ్రీ". సాయిభక్తులందరూ కూడా దయచేసి నాకు కానిస్టేబుల్ ఉద్యోగం రావాలని బాబాను ప్రార్థించండి. అందరికీ ధన్యవాదాలు.


ఆగస్టు నెలలో ఒక 2 వారాల పాటు నా మొబైల్ ఫోన్లో వాట్సాప్ పనిచేయలేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా వాట్సాప్ ఓపెన్ కాలేదు. చివరికి నేను, "బాబా! వాట్సాప్ ఓపెన్ అయితే, మీ కృపను 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. అంతే, వాట్సాప్ ఓపెన్ అయింది. "థాంక్యూ బాబా. నన్ను ఆశీర్వదించండి బాబా"


నేను మొదటిసారి శ్రీగురుచరిత్ర పారాయణ చేసినప్పుడు బాబా ఎలాంటి ఆటంకం లేకుండా నా పారాయణ పూర్తిచేయించారు. అంతేకాదు, పారాయణ జరుగుతున్న నాల్గవరోజు సాయిబాబా, దత్తస్వామి నాకు స్వప్నదర్శనమిచ్చారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. "థాంక్యూ సో మచ్ బాబా".


సాయినాథుడు తీర్చిన అద్దె ఇంటి సమస్య


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!! ముందుగా సాయిభక్తులకు నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నేను గతంలో ఒక అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవాన్ని పంచుకుంటాను. మేము హైదరాబాదులో ఉంటాము. మా ఇంటి యజమాని 5,000 రూపాయలు అద్దె పెంచడంతో మేము, "ఇల్లు ఖాళీ చేస్తామ"ని చెప్పాము. అతనొక NRI, డబ్బు మనిషి. మేము ఇల్లు ఖాళీ చేస్తామని చెప్పేగానే, "ఆగస్టు 4 కల్లా ఇల్లు ఖాళీ చేయమ"ని చెప్పేశాడు. దాంతో మేము ఇల్లు వెతకడం ప్రారంభించాము. మావారు తూర్పు ద్వారం ఇల్లు అయితే గాలి, వెలుతురు బాగా ఉంటాయని అన్నారు. అయితే సమయం దగ్గర పడుతున్నా మాకు నచ్చేవిధంగా మంచి ఇల్లు దొరకలేదు. దాంతో నాకు చాలా బాధేసింది. అప్పుడు అదివరకు మేము చూసిన ఒక ఇల్లు గుర్తు వచ్చింది. ఆ ఇల్లు నేను కోరుకున్నట్లే ఉంది, కానీ ఆ ఇంటి యజమాని అద్దె కొంచెం ఎక్కువ చెప్పినందువల్ల మేము వద్దని చెప్పి వచ్చేశాము. అయితే మాకు సమయం లేనందున ఆ ఇంటి యజమానికి ఫోన్ చేసి, "మీ ఇల్లు మాకు కావాలండీ" అని అడిగాము. అందుకతను, "ఇల్లు వేరేవాళ్లకు ఇచ్చేశాను" అని చెప్పాడు. అది విని నేను, "ఎందుకు ఇలా చేశావు బాబా?" అని కన్నీళ్లు పెట్టుకున్నాను. అరగంట తర్వాత ఆ ఇంటి యజమాని ఫోన్ చేసి, "అమ్మా! మీరు ఇల్లు కావాలని అడిగారు కదా! గంట ముందు అడ్వాన్స్ ఇచ్చినతను వర్క్ ఫ్రమ్ హౌమ్ అని ఇల్లు తీసుకున్నారట. కానీ ఇంతలోనే అతనికి బెంగళూరు రమ్మని తన ఆఫీసు నుండి ఫోన్ వచ్చిందట. అందువలన ఇంక హైదరాబాదులో ఉండలేనని అతను చెప్పారు. అందుకే మీకు ఇల్లు ఇస్తాను, రండి" అని అన్నారు. బాబా వద్ద కన్నీళ్లు పెట్టుకున్న కొద్దిసేపట్లోనే ఆయన తమ మహిమను చూపినందుకు నా మనసు ఆనందంతో నిండిపోయింది. "అద్భుతం చేశావు బాబా. మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఈ అనుభవాన్ని కొంచెం ఆలస్యంగా పంచుకున్నందుకు నన్ను క్షమించండి బాబా. సదా నన్ను మీ భక్తిలో లీనమైపోయేలా చేసి నా జీవితం ఆనందక్షణాలతో నింపండి బాబా. అందరినీ చల్లగా చూడు తండ్రీ". మరికొన్ని అనుభవాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.


5 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Jaisairam bless supraja for her neck pain and shoulder pain and help her to get better Jaisairam 🙏

    ReplyDelete
  3. ఓం శ్రీ సాయి రామ్ సాయి అనుగ్రహం చాలా బాగుంది.సాయి నిన్ను నమ్మి తే మాకు అంతా ఆనందంగా వుంది.ను‌వే అన్ని చూస్తావు.మాకు శ్రద్ధ స్ఫూర్తి యిల్లు తండ్రి

    ReplyDelete
  4. Jai Ram 🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo