1. నివేదించుకున్న తక్షణమే సమస్యలకు పరిష్కారం చూపిస్తున్న సాయితండ్రి2. బాబా నేర్పిన గుణపాఠం
3. కరెంట్ షాక్ నుండి కాపాడిన బాబా
నివేదించుకున్న తక్షణమే సమస్యలకు పరిష్కారం చూపిస్తున్న సాయితండ్రి
ఓం శ్రీ సాయినాథాయ నమః!!!
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
నా పేరు విజయ. ముందుగా, శ్రీసాయినాథుని దివ్యపాదాలకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా కృతజ్ఞతలు. నేను జూన్ 16న నా అనుభవాలు కొన్ని పంచుకున్నాను. అది ఆ సాయినాథుడు నాకు ప్రసాదించిన అదృష్టంగా భావిస్తున్నాను. అందుకు ఎంతో సంతోషిస్తున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకోవాలనుకుంటున్నాను. నేనొక కాంట్రాక్టు ఉద్యోగిని. శాశ్వత ఉద్యోగ నియామకాల కింద మమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకుని కూడా ఖాళీ లేక ముందుగా చెప్పిన స్థానాలలో కాకుండా అందరినీ ఏదో ఒక చోట సర్దుబాటు చేసే ప్రక్రియలో నన్ను జీతం రాని పోస్టులో వేశారు. ఆ పోస్టుకు పైనుండి అనుమతి వస్తేగానీ జీతం రాదు. ఆ పోస్టులో జాయిన్ అయి మూడు నెలలు గడుస్తున్నా జీతం రాక ఇబ్బందిపడుతూ చివరికి నేను బాబాను ప్రార్థించి, "నాకు జీతం అందగానే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల వెంటనే ఒకదాని తర్వాత ఒకటి అన్ని సమస్యలు పరిష్కారమై ప్రభుత్వం నుండి అనుమతి వచ్చి, పై స్థాయి నుండి కింది స్థాయి అధికారుల వరకు అన్ని పనులు జరిగి 2022, ఆగస్టు 19న నాకు జీతం అందింది. అలాగే నేను నా ఉద్యోగానికి సంబంధించి ఇంకో సమస్య విషయంలో బాబాను, "నేను ఏ అధికారినీ సంప్రదించడంగానీ, ఎవర్నీ సలహా అడగటంగానీ, ఏ అభ్యర్థన చేయడంగానీ జరగకుండా నా సహోద్యోగి మనసు మర్చి నా యథాస్థానాన్ని నాకు ఇప్పించమ"ని వేడుకున్నాను. తక్షణం బాబా నేను కోరుకున్నట్లే నా సమస్యను పరిష్కరించారు. ఇకపోతే, మా ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగి అలసిపోయి ఇంట్లో బిడ్డలని చూసుకునే ఓపిక లేకుండా పోతుండేది. అందువలన అందరమూ పైఅధికారి మారితే బాగుంటుందని అనుకునేవాళ్ళము. నేను ఈ విషయం గురించి బాబాకు నివేదించుకోగానే ఆయన పైఅధికారిని మార్చి అద్భుతం చూపించారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
గత రెండు సంవత్సరాలుగా నేను ఒక మంచి ఉద్యోగం కోసం ఎన్నో పుస్తకాలు చదివి చాలా పరీక్షలు వ్రాశాను. ఆ క్రమంలో నేను ఈమధ్య ఒక ఉద్యోగం కోసం దరఖాస్తు పెట్టుకున్నప్పుడు, "బాబా! ఇంటికి దగ్గరగా పరీక్ష కేంద్రం వచ్చేలా, అలాగే పరీక్షలో తెలిసిన ప్రశ్నలు వచ్చేలా చూడు తండ్రీ" అని వేడుకున్నాను. తరువాత నేను హాల్‌టికెట్ తీసుకుని చూస్తే, మా ఇంటి నుండి పది నిమిషాల దూరంలోనే పరీక్ష కేంద్రం వచ్చింది. పేపర్ కూడా చాలా సుళువుగా వచ్చి బాగా రాశాను. ఈ పరీక్ష పాస్ అయితే మెయిన్స్ అవకాశం వస్తుంది. అంతా బాబా దయ.
మేము 16 సంవత్సరాలుగా అద్దె ఇంట్లో ఉంటున్నాము. మేము ఎప్పుడూ ఎవరితోనూ వివాదాలు పెట్టుకోవడంగానీ, ఎక్కువగా మాట్లాడడంగానీ చేసేవాళ్ళం కాదు. అయితే ఒక రెండు సంవత్సరాల క్రితం మా పక్కింట్లోకి ఒక క్రిస్టియన్ కుటుంబం అద్దెకు వచ్చారు. ఆవిడ వచ్చిన మూడోరోజు నుండి నీళ్లకోసం, దారికోసం ఇలా ఏదో వంకతో నా భర్తను, నన్ను నిందించడం, గొడవ పెట్టుకోవడం చేస్తుండేది. మేము గొడవ పెంచుకోవడం ఎందుకని సర్దుకుపోతుండేవాళ్ళం. ఇలా ఉండగా ఒకసారి ఆవిడ మమ్మల్ని తిట్టడమే కాకుండా మా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. అప్పుడు నేను, "బాబా! సమస్యను మీ చేతుల్లో పెడుతున్నాను. ఆవిడ నుండి మాకు విముక్తి ప్రసాదించు, చాలు" అని బాబాను ప్రార్థించాను. ఎస్సైగారు ఆవిడకు బుద్ధి చెప్పి, మా జోలికి రాకుండా సమస్యను పరిష్కరించారు. ఆవిధంగా మమ్మల్ని ఆదుకున్నారు బాబా. ఇలా నా బాధలను నివేదించుకున్న తక్షణమే ఆయా సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నారు సాయితండ్రి. "మీకు పాదాభివందనాలు బాబా. నాకు, నా కుటుంబానికి ఆరోగ్యాన్ని, సొంత ఇంటిని, స్థిరమైన ఉద్యోగాన్ని, బిడ్డను పెంచుకునే ఓపికను, సహనాన్ని ఇచ్చి నన్ను ఆదుకుంటావని నమ్ముతున్నాను తండ్రీ".
శ్రీ శిరిడీ సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
బాబా నేర్పిన గుణపాఠం
నేనొక సాయిభక్తురాలిని. ఒకరోజు నా ఆఫీసు లాప్టాప్‍లో లాగిన్ అవుదామని పిన్ నెంబర్ ఎంటర్ చేస్తుంటే 6కి బదులు 556 అని పడుతూ ఎన్నిసార్లు ప్రయత్నించినా లాగిన్ కాలేకపోయాను. ఆరునెలల నుంచి అదే లాప్టాప్ ఉపయోగిస్తున్నా అటువంటి సమస్యను నేను ఎప్పుడూ ఎదుర్కోలేదు. మరి ఇప్పుడెందుకు అలా అవుతుందో నాకు అర్థం కాలేదు. దాదాపు రెండు గంటలు ప్రయత్నించాక, "బాబా! లాప్టాప్ లాగిన్ అయితే ఈ అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. అంతే, పది నిమిషాల్లో లాగిన్ అయింది. ఇకపోతే, 2022, ఆగస్టు 15 నుంచి నాకు వర్క్ ఎక్కువగా ఉంటుంటే నేను, "బాబా! వర్క్ ఎక్కువై చేయలేకపోతున్నాను. దయచేసి నాకు సహాయం చేసి నేను ప్రశాంతంగా ఉండేలా అనుగ్రహించండి బాబా. మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకుని మా మేనేజరుని, "ఈ వర్క్ ఇప్పుడే చేయాలా లేక తర్వాత చేయొచ్చా?" అని అడిగాను. బాబా దయవల్ల ఆమె, "తర్వాత చేయమ"ని చెప్పారు. బ్లాగులో పంచుకుంటామంటే అనుకున్నవన్నీ ఎంతో సుళువుగా పరిష్కారమవడం చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ బ్లాగ్ రూపంలో బాబా మనతోనే ఉన్నారనిపిస్తుంది నాకు. ఈ బ్లాగును ఏర్పాటు చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. "ధన్యవాదాలు బాబా. అనుకున్నట్టుగా ఈ అనుభవాలను బ్లాగులో పంచుకున్నాను".
ఇప్పుడు బాబా నాకు నేర్పిన ఒక గుణపాఠం గురించి చెప్తాను. శ్రీవినాయకచవితి రోజు ఉదయం 7:30 ప్రాంతంలో మా ఇంట్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 15 నిమిషాలు వేచి చూసినా పవర్ రాలేదు. అప్పుడు నేను నా మనసులో, 'బ్లాగులో పంచుకుంటానని బాబాకి చెప్తే, బాబా పవర్ తెప్పిస్తారు' అని అనుకొని, "బాబా! రెండు నిమిషాల్లో పవర్ తెప్పించండి. ఈ విషయాన్ని బ్లాగ్‍లో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. నిజానికి నాకు కావాల్సింది పవర్ రావడమే. కానీ నేను బాబా మీద నమ్మకంతో కంటే, బ్లాగులో పంచుకుంటే చాలు పవర్ వచ్చేస్తుందన్న అతి విశ్వాసంతో విషయాన్ని చాలా తేలికగా తీసుకున్నాను. అందుకే నేను బాబా మీద నమ్మకంతో కాకుండా బేరం ఆడినట్లు ఆయనతో చెప్పుకున్నాను. అందుకు బాబా నాకు సరైన బుద్ధి వచ్చేలా చేసారు. ఆరోజు ఉదయం 7:30కు పోయిన పవర్ సాయంత్రం 7 గంటలకిగానీ రాలేదు. అంతకుముందు నేను ఎప్పుడు బాబా మీద నమ్మకంతో, 'ఈ బ్లాగులో పంచుకుంటాన'ని చెప్పుకున్నా అవన్నీ జరిగాయి. కాబట్టి నమ్మకంతో బాబాని ఏదైనా వేడుకుంటే, అది నెరవేరుతుంది. అంతేగానీ, నమ్మకం లేకుండా ఏదో కావాలని అడిగితే, నా పరిస్థితిలాగే అవుతుంది. "అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు బాబా".
కరెంట్ షాక్ నుండి కాపాడిన బాబా
ఓం శ్రీ సాయినాథాయ నమః!!! ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!! 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగును నిర్వహిస్తున్న సాయికి మరియు సాయిబంధువులకు నా నమస్కారాలు. నా పేరు రాంబాబు. నేను గత 24 సంవత్సరాల నుండి సాయిభక్తుడిని. నేను ఇప్పుడు శ్రీసాయినాథుని దివ్యపాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ నా అనుభవాన్ని మీతో పంచుకోబోతున్నాను. మా అబ్బాయి హాస్టల్లో ఉంటూ ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. ఇంట్లో నేను, నా భార్య మాత్రమే ఉంటాము. 2021, డిసెంబర్ 30న నా భార్య కొన్ని బట్టలు మా డాబాపై ఆరేసింది. అవి గాలికి ఎగిరిపోయి కింద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ మీద పడ్డాయి. మరుసటిరోజు ఉదయం 6:30 అప్పుడు నా భార్య మా బెడ్‌రూమ్ కిటికీలో నుండి ఆ బట్టలను నాకు చూపించి, ఇంట్లో ఉన్న బూజు దులిపే కర్ర ఇచ్చి, "ఆ బట్టలు తీయండి" అని చెప్పింది. నేను ఏదో ఆలోచనలో ఉండి కిటికీలోంచి ఆ కర్రను పెట్టాను. ఆ కర్ర బయటకి ప్లాస్టిక్‍లా కనిపిస్తున్నప్పటికీ లోపల మెటల్ ఉండటం వల్ల 11KV ట్రాన్స్‌ఫార్మర్‌కు తగలగానే షాక్ కొట్టి నేను గిలగిలా కొట్టుకోసాగాను. నా వెనుక ఉన్న నా భార్య కూడా నాతోపాటు కొట్టుకుంటోందని నాకు తెలుస్తోంది. 'ఈరోజు నేను చనిపోతున్నాను' అని నాకు అనిపిస్తున్నప్పటికీ, 'ఇది కల, నిజం కాద'ని ఏదో తెలియని ధైర్యం నా మనసుకి ఉండి ఆఖరి నిమిషంలో 'సాయి ఉన్నార'ని అనిపించింది. అంతే, ఎప్పుడు పడిపోయామో మాకే తెలియదు. ఎవరి సాయం లేకుండా 20 నిమిషాల తర్వాత నా అంతట నేనే నిద్రలేచినట్లు లేచి చూస్తే, నా పక్కన నా భార్య కూడా పడిపోయి ఉంది. ఆమెకు ఇంకా స్పృహ రాలేదు. నేను ఆమెకు స్పృహ వచ్చేటట్లు చేశాను. తరువాత చూస్తే నా చేయి, కాలు, నా భార్య పొట్ట, కాలు కాలిపోయి ఉన్నాయి. వెంటనే నేను మా ఫ్రెండ్‍కి ఫోన్ చేసి, "కారు తీసుకుని రా" అని చెప్పాను. తరువాత నాకు తెలిసిన డాక్టరుకి ఫోన్ చేస్తే, అతను తక్షణమే స్పందించి, "క్లినిక్‍కి రండి" అని చెప్పారు. ఇంకా మేము వెళ్లి క్లినిక్‍లో జాయిన్ అయ్యాము. సాయి కృపవల్ల మాకు మంచి చికిత్స జరిగింది. సర్జరీలు జరిగేటప్పుడంతా మేము బాబానే వేడుకుంటూ ఆయన మీదే నమ్మకం ఉంచాము. బాబా దయవల్ల సర్జరీలు విజయవంతమయ్యాయి. ఇది జరిగిన కొద్దిరోజులకి నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో మాకు తెలిసిన ఒకతను, "మిమ్మల్ని ఎవరు కాపాడారు?" అని అడుగుతుంటే నేను చుట్టూ చూసి బాబా గుడిని అతనికి చూపించి, "అందులో ఉన్న ఆయన కాపాడారు" అని చెప్పాను. నిజమే, ఆ బాబా చల్లని చూపు వల్లే మేము ఈరోజు బ్రతికి ఉన్నాము. ఆ తండ్రి దయతో మేము ఇప్పుడు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాము. "బాబా! మీకు మేము మా జీవితాంతం ఋణపడి ఉంటాము. మా బాబుకి మంచి మార్కులు వచ్చి, తదుపరి చదువులకి మంచి కాలేజీలో సీటు వస్తే, 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ ద్వారా నా అనుభవాన్ని తోటి భక్తులతో పంచుకుంటాను. ఇంకా నాకున్న ఒక కోరిక గురించి మీకు తెలుసు. అది తీరుతుందని ఎదురుచూస్తాను. అది జరిగితే నేను మీకు కృతజ్ఞుడనై ఉంటాను".
ఓం శ్రీ సాయినాథాయ నమః!!!
Jaisairam bless supraja for her neck pain and shoulder pain and help her to get better 🙏
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
ఓం సాయి రామ్ ఈ రోజు సాయి అనుగ్రహం చాలా బాగుంది.కరెంటు షాక్ అను అనుభవం చాలా బాగుంది.మీరు అందరిని యిలా గే కాపాడుతూ ఉండండి.మీరు తండ్రి లాగే దయ చూపాలి
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete