1. అంతా సాయి దయ2. పది నిముషాల ముందే పూజ అయిపోయేలా ఆశీర్వదించిన బాబా
అంతా సాయి దయ
సాయిభక్తులకు నమస్కారం. నా పేరు లలిత. 2023, జూన్ 13న మా కుటుంబం, మా తమ్ముడు కుటుంబం, మా నాన్నవాళ్ళ కుటుంబం, మా చిన్నమావయ్యవాళ్ళ కుటుంబం అరుణాచలం, తిరుపతి, శిరిడీ దర్శించి వద్దామని 15 రోజుల యాత్ర ప్లాన్ చేసుకున్నాము. అయితే అది నా నెలసరి సమయం. అందువలన నేను, "బాబా! ప్రయాణానికి ముందే నాకు నెలసరి వచ్చేలా దయ చూపండి" అని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. సాయి దయవలన నెలసరి ముందుగానే వచ్చింది. మేము బయలుదేరే రోజుకి నాకు ఐదురోజులు స్నానం కూడా అయిపొయింది. నిజంగా ఇది ఒక అద్భుతం. ఎందుకంటే, నాకు ఇదివరకేప్పుడూ ముందుగా నెలసరి రాలేదు. ఇదంతా నా సాయితండ్రి దయవలనే సాధ్యమైంది. లేకుంటే నెలసరి రాకుండా ఉండటానికి నేను చాలా మాత్రలు వేసుకోవాలి వచ్చేది. సాయి దయవలన మాత్రలు వేసే బాధ తప్పింది.
సంతోషంగా 2023, జూన్ 13న యాత్రకు బయలుదేరాము. ముందుగా అరుణాచలం వెళ్ళాము. వెళ్లేటప్పుడు మా అమ్మకి కన్ను మీద ఎలర్జీ వచ్చింది. అప్పుడు నేను బాబా ఊదీ అమ్మ కన్ను మీద రాశాను. అలా రెండు రోజులు రాసాక 'అమ్మకి తొందరగా ఎలర్జీ తగ్గిపోవాల'ని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. అరుణాచలంలో దర్శనమై మేము తిరుపతి వచ్చేసరికి మా పెద్ద మావయ్య స్వర్గస్తులయ్యారని మాకు ఫోను వచ్చింది. దాంతో మేము స్వామి దర్శనం చేసుకోకుండానే తిరిగి ఇంటికి వచ్చేసాము. మేము వైజాగ్ వచ్చిన తర్వాత అమ్మని డాక్టరుకి చూపిస్తే, "ఇది మామూలు ఎలర్జీనే, పర్వాలేదు తగ్గిపోతుంది" అని ఒక ఆయింట్మెంట్ ఇచ్చారు. దాంతో అమ్మకి తొందరగానే తగ్గిపోయింది.
ఇకపోతే నేను అరుణాచలం నుండి వచ్చినప్పటినుండి రోజూ, "తొందర్లోనే తిరుపతి, శిరిడీ వెళ్లేలా అనుగ్రహించమ"ని బాబాని ప్రార్థిస్తుండేదానిని. బాబా దయవలన జూలై 13న మేము తిరుపతి దర్శనానికి వెళ్ళాము. కాలినడకన కొండ ఎక్కుతామని మొక్కుకున్నందువల్ల మేము నడక మొదలుపెట్టాము. కానీ పిల్లలు నడవడానికి చాలా ఇబ్బందిపడ్డారు. అప్పుడు నేను, "సాయిని తలుచుకొని మెట్లు ఎక్కండి" అని పిల్లలతో చెప్పి నేను కూడా 'సాయి సాయి' అనుకుంటే మెట్లు ఎక్కాను. ఆ సాయి దయవలన అంత కష్టం అనిపించలేదు. మూడు గంటల్లోనే కొండ పైకి చేరుకున్నాం. దర్శనానికి 3:30కి వెళితే, ఆరు గంటలకల్లా బయటికి వచ్చేసాము. స్వామి దర్శనం కూడా చాలా బాగా అయింది. 'ఇంత వేగంగా దర్శనమెలా అయింద'ని అందరూ ఆశ్చర్యంగా అడిగారు. అంతా సాయి దయ. "ధన్యవాదాలు సాయి. మీ పాదాలందు స్థిరమైన భక్తివిశ్వాసాలు కలిగి ఉండేలా నన్ను ఆశీర్వదించండి. ఎప్పుడూ నేను మిమ్మల్ని మరువకుండా చూడండి బాబా" .
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!!
పది నిముషాల ముందే పూజ అయిపోయేలా ఆశీర్వదించిన బాబా
సాయిబంధువులకు నమస్కారం. నా పేరు స్వాతి. నేను 2023, ఆగష్టు నెల ఆరంభంలో 11 రోజులపాటు రోజుకు 11 సార్లు హనుమాన్ చాలీసా చదవాలని అనుకున్నాను. నేను రోజూ ఉదయం 4 గంటలకే పూజ మొదలుపెట్టి హనుమాన్ చాలీసా చదివి 5.10 కల్లా పూజ ముగించి యోగ క్లాసుకి వెళ్తుండేదాన్ని. ఇలా జరుగుతుండగా 2023, ఆగస్టు 10న, గురువారం వచ్చింది. అయితే మాములుగా ప్రతి గురువారం చేసే బాబా పూజతోపాటు హనుమాన్ చాలీసా పఠనం కూడా చేయాల్సి ఉండడంతో 'నేను సమయానికి యోగ క్లాసుకి వెళ్లలేనేమో! నాతోపాటు యోగ చేసేవాళ్ళు ఎదురుచూస్తారు, వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి?' అని టెన్షన్ పడ్డాను. చివరకి, "మీ దయ బాబా" అని బాబా పూజ చేసి, హనుమాన్ చాలీసా పఠనం మొదలుపెట్టాను. మొత్తం పూర్తయ్యాక టైం చూస్తే, 5 గంటలే అయింది. నాకు చాలా ఆశ్చర్యమేసింది. ఎందుకంటే, రోజూ పూజ అయ్యేసరికి 5.10 ఖచ్చితంగా అయ్యేది. అలాంటిది ఆరోజు 10 నిమిషాల ముందే అయిపోయింది. ఏమైనా మర్చిపోయానేమో అని చెక్ చేసుకుంటే అంత సరిగానే జరిగింది. ఏమీ మిస్స్ కాలేదు. అప్పుడు అంతా బాబా ఆశీర్వాదమని బాబాకి దణ్ణం పెట్టుకొని యోగ క్లాసుకి వెళ్ళాను. ఇంకో చిన్న ఆనందం, ముందురోజు ఎప్పటిలాగే నేను బాబా గుడికి వెళ్ళాను. అప్పుడు బాబా చాలాసేపు నన్నే చూస్తున్నట్టు అనిపించి చాలా ఆనందమేసింది. ఈ బ్లాగు రూపంలో మనందరికీ మన అనుభవాలు పంచుకొనే ఒక వేదికను బాబా ఇచ్చారు. "శతకోటి వందనాలు బాబా. ధైర్యంగా 2 వీలర్ నడిపే ధైర్యాన్ని ఇవ్వు బాబా".

