సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శ్రీ సఖదేవ్ వాఘ్‌‌తో సాయిపథం ఇంటర్వ్యూ.

బాబాను ప్రత్యక్షంగా దర్శించిన ఆ తరం భక్తులను ఎందరినో కలసి 'సాయిపథం' బృందం నిర్వహించిన ఇంటర్వ్యూల నుండి ఈరోజు సాయిపథం వాల్యూమ్ - 4లో ప్రచురించబడిన యావలా వాస్తవ్యులైన శ్రీ సఖదేవ్ తాత్యాబా వాఘ్ గారితో తేది: 15-12-91న చేసిన ఇంటర్వ్యూ విశేషాలు ప్రచురిస్తున్నాం.
                           
శ్రీ వాఘ్ సుమారు 105 - 110 సంవత్సరాల వయసున్న వృద్ధుడు. వయస్సులో ఉన్నప్పుడు ఆయన మంచి పేరున్న పహిల్వాను. శ్రద్దగా సాముగరిడీలు, వ్యాయామం చేసినందువల్ల కాబోలు అంత వయస్సులో కూడా చక్కగా మాట్లాడగలుగుతున్నారు. బాబాతో తనకు గల అనుభవాలను వివరించేటప్పుడు బాబా ఎలా మాట్లాడేవారో, ఆయన హావభావాలెలా ఉండేవో నాటకీయంగా ఆయన చెప్పిన వైనం 'సాయిపథం' బృందాన్ని ముగ్ధులను చేసింది. శ్రీ సఖదేవ్ పూర్వం ఒక చక్కెర ఫ్యాక్టరీలో హెడ్ గార్డుగా పనిచేసి రిటైరైనారు. ప్రస్తుతం శిరిడీకి సమీపంలో ఉండే కానేగాంలో తన కుమారుడు శ్రీ సుధాకర్ ఎస్. వాఘ్ ఇంట విశ్రాంతి తీసుకుంటున్నారు.

సాయి సన్నిధిలో కుస్తీ పట్టిన సఖదేవ్ 

శ్రీసాయిబాబాను సశరీరులుగా ఎన్నో పర్యాయాలు దర్శించిన శ్రీ సఖదేవ్ తనకు బాబాతో గల అనుభవాలను గూర్చి 'సాయిపథం'తో ఇలా చెప్పారు:

“నేను మొట్టమొదట బాబాను శిరిడీకి సుమారు 7 - 8 కి.మీ. దూరంలో గోదావరి నది ఒడ్డున ఉన్న రామ్ టేకడీలో చూసాను. అప్పుడు బాబా అక్కడున్న రామాలయం ప్రక్కన ఒక దిబ్బమీద కూర్చుని ఉన్నారు. ఆ రామాలయం ఇప్పుడు లేదు. అప్పుడు బాబాను చూచి ఆయన పిచ్చివాడనుకొని పిల్లలు ఆయనపై రాళ్ళు విసిరారు. పిల్లల గొడవకు బాబా అక్కడనుండి లేచి గోదావరి అవతల ఒడ్డుకి వెళ్ళి అక్కడ వున్న ఒక వేపచెట్టు క్రింద కూర్చున్నారు.”

“ఆ తరువాత నా 16వ ఏట కుస్తీపోటీలలో పాల్గొనడానికి మొదటిసారి శిరిడీ వెళ్ళాను. బాబాను శిరిడీలో దర్శించడం అదే మొదటిసారి. కుస్తీపోటీలు రెండు రోజులపాటు జరిగాయి. శిరిడీ గ్రామస్థులు మా కుస్తీ క్రీడాకారుల బృందం యొక్క భోజన సౌకర్యాలు మొదలైనవి చాలా చక్కగా చూసుకున్నారు. రాత్రంతా అక్కడ జరిగే 'తమాషాలు' చూచేవాళ్ళం (తమాషాలంటే అశ్లీలమైన సంభాషణలు, పాటలతో కూడిన వీధి నాటకాలు). మధ్యాహ్నం 12 గంటల వరకు కుస్తీ పోటీలు సాగేవి. భోజనాలైన తరువాత మళ్ళీ మొదలై సాయంత్రం వరకు జరిగేవి. కుస్తీ పోటీలలో పాల్గొనేముందు క్రీడాకారులంతా కలిసి బాబా వద్దకు వెళ్ళి బాబా ఆశీస్సులు తీసుకునేవాళ్ళం. బాబా మా నెత్తిమీద చెయ్యిబెట్టి ఆశీర్వదించేవారు. తరువాత ప్రసాదంగా మాకు 'రేవడి' పంచేవారు. (రేవడి' అంటే కుస్తీ పోటీలలో పాల్గొనే వారికి ఆచారంగా ఇచ్చే నువ్వు ఉండల వంటి తినుబండారం). కుస్తీ పోటీలు బాబా ముందే జరిగేవి. పోటీ జరిగే స్థలం దగ్గర ఒక గోనెపట్టాపై బాబా కూర్చునేవారు. ఆయనెప్పుడూ గోదాలోకి అడుగుపెట్టేవారు కాదు.”

“నేను మొదటిసారి శిరిడీ వెళ్ళినపుడు నావద్ద రెండున్నర పైసలు మాత్రం వున్నాయి. ఆ పైకం పెట్టి రేవడికొని మసీదులో బాబా ముందుంచాను. బాబా ఆ రేవడిని అందరికీ పంచారు. మమ్మల్ని “కూర్చోండి! కూర్చోండి!” అన్నారు. మేమందరం కూర్చొనగానే 'ఇక వెళ్ళండి' అన్నట్లు, “ఎప్పుడు బయలుదేరుతున్నారు?” అన్నారు. "ఇంకా కుస్తీపోటీలు మొదలవడానికి చాలా సమయం ఉంది" అని మేం అన్నాం. "అయితే ఉండండి” అని అంటూ, ఆయనే అక్కడినుండి లేచి వెళ్ళిపోయారు.”

“బాబా చాలా తక్కువగా మాట్లాడేవారు. ఎప్పుడయినా ఉన్నట్లుండి కోపంగా కేకవేసేవారు. ముతకమిల్లు 'కోరాగుడ్డ' (మాంచర్ పాట్)తో కుట్టిన కఫ్నీ ధరించేవారు. తలకు ఒక గుడ్డ కట్టుకునే వారు. అయితే అప్పుడప్పుడు తలకట్టు లేకుండా కూడా కనిపించేవారు. తలగుడ్డ లేకుండా కూడా ఆయన్ను నేను చూచాను. నేను చూచినప్పుడు ఆయన తలపై ఒత్తుగా వెంట్రుకలున్నాయి. బాబా చిలిం పీల్చేవారు. ఆ చిలింను అక్కడ ఆయన ప్రక్కనున్న వారందరికీ అందించేవారు.”

“ఎందరో గొడ్రాళ్ళు - ముఖ్యంగా పెద్ద వ్యాపారస్తుల కుటుంబాలకు చెందిన స్త్రీలు - సంతానం కలుగడానికి ఆయన ఆశీస్సుల కోసం వచ్చేవారు. మొదట బాబా వాళ్ళను కసిరి కొట్టేవారు. కొంతసేపైన తరువాత ఆశీర్వదించేవారు. “సంతానం కలుగుతుంది పో!" అని బాబా ఆశీర్వదించిన తరువాత పిల్లలు కలుగకపోవడమంటూ జరిగేది కాదు. ఆయన ఆశీర్వాదం వ్యర్ధమైన (తప్పిన) సందర్భము నాకు తెలిసి ఒక్కటి గూడా లేదు.”

“నేను ఎన్నోసార్లు శిరిడీ వెళ్ళి బాబా ముందు కుస్తీ పోటీలలో పాల్గొన్నాను. ఎన్నిసార్లు వెళ్ళానో అన్న విషయం నాకే జ్ఞాపకం లేదు. అప్పట్లో శ్రీరామనవమి ఉత్సవాలు 9 రోజులు జరిగేవి. ఆ తొమ్మిది రోజులు పెద్ద ఎత్తున ఉత్సవాలు, కుస్తీ పోటీలు నిర్వహించబడేవి.”

“అప్పట్లో నా ధ్యాస అంతా కుస్తీలమీదే వుండేది. ప్రతిసారి కుస్తీ పోటీలకు సంబంధించి మాత్రమే నేను శిరిడీ వెళ్ళేవాడిని. అంతకుమించి బాబాతో నాకెటువంటి అనుభవాలు లేవు.”

('సాయిపథం' అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ... )

నాకు తెలిసి బాబా ఎప్పుడూ కుస్తీ పోటీలలో పాల్గొనలేదు. శిరిడీలో మొహిద్దీన్ తంబూలీ నాకు తెలుసు. అతనిది ఖాందేష్ జిల్లా. మొహిద్దీన్ తంబూలీ పహిల్వాన్ కాదు. అతనెప్పుడూ కుస్తీలు పట్టలేదు. ఎక్కువగా 'తమాషాలు' నటించేవాడు.”

“బాబా సమాధి చెందినప్పుడు నేను శిరిడీ వెళ్ళలేదు. నేను విన్నంతలో బాబా సమాధియైన తరువాత భక్తులు ఇంగ్లీష్ (ఆంగ్లేయ) వైద్యులను పిలిపించారని, వారు వచ్చి బాబా దేహత్యాగం చేశారని నిర్ధారించిన తరువాతనే ఆయన దేహాన్ని సమాధి చేశారనీ తెలిసింది.”

మూలం: సాయిపథం వాల్యూమ్ - 4

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo