సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 690వ భాగం.....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా అనుగ్రహంతో నాన్నకి ఆరోగ్యం
  2. మూడేళ్ళ బాధనుండి ఉపశమనాన్ని ప్రసాదించిన బాబా

బాబా అనుగ్రహంతో నాన్నకి ఆరోగ్యం


హైదరాబాదు నుండి సాయిభక్తురాలు ఉష తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి కుటుంబసభ్యులకు నా నమస్కారాలు. నాపై సాయి చూపిన దయను ఇంతకుముందు మీ అందరితో పంచుకోవడం జరిగింది. ఇప్పుడు మరోసారి సాయి దయను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.


2021, జనవరి నెలలో భోగి పండుగనాడు నేను మా అమ్మానాన్నలతో ఫోన్లో మాట్లాడి వారికి పండుగ శుభాకాంక్షలు అందజేశాను. మాటల్లో మా తమ్ముడి కుటుంబసభ్యులంతా పండక్కి ఊరికి వచ్చి అమ్మానాన్నలతో ఉన్నారని తెలిసి ఎంతో సంతోషించాను. సంక్రాంతి పండుగ మధ్యాహ్నం వరకూ బాగానే వున్న నాన్నకు ఉన్నట్టుండి ఆరోగ్యం దెబ్బతిని, ఆరోజు రాత్రికల్లా ఆందోళనకరంగా మారింది. దాంతో అప్పటికప్పుడు నాన్నను మా ఊరికి దగ్గరలోని తిరుపతికి తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో చేర్చారు. డాక్టర్లు నాన్నను ICU లో ఉంచి, సమస్య ఏమిటో తెలుసుకోవడానికి అన్ని టెస్టులూ చేస్తున్నారు. కానీ సమస్య ఇదీ అని చెప్పలేక గందరగోళం సృష్టిస్తున్నారు. నాలుగైదు రోజులైనా నాన్నకు బి.పి కంట్రోల్ కావటం లేదు. దాంతోపాటు నాన్నకు యూరినరీ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు. అదీ కూడా కంట్రోల్ అవటం లేదు.


6వ రోజుకి కూడా నాన్నకున్న సమస్యలు ఏమాత్రం తగ్గకపోవటంతో, తాము ఏమీ చేయలేమనీ, అపోలో వంటి పెద్ద హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళమన్నారు డాక్టర్లు. ఆ సంగతి తెలిసి ఆరోజే నేను, మావారు హైదరాబాదు నుండి తిరుపతికి వెళ్లి 7వ రోజున చెన్నైలోని అపోలో హాస్పిటల్లో నాన్నను చేర్చడానికి అంబులెన్స్ సిద్ధం చేసి, నాన్నకు తోడుగా తమ్ముడిని రమ్మని చెప్పి, మేము మా అమ్మను తీసుకొని చెన్నై వెళ్ళాము. ముందుగానే మావారు చెన్నై అపోలో హాస్పిటల్లోని ఇన్‌ఛార్జ్ డాక్టరుతో మాట్లాడటం వల్ల నేరుగా నాన్నను ఎమర్జన్సీ వార్డులో చేర్చుకొని కొన్ని టెస్టులు చేసి, ఒక రాత్రంతా ICU లో ఉంచారు. మరుసటిరోజుకి రూముకి షిఫ్ట్ చేసి అన్ని సమస్యలనూ కంట్రోల్లోకి తీసుకొని వచ్చారు. ఆ తరువాత మా నాన్న ఆరోగ్యం కాస్త మెరుగయ్యాక తనను డిశ్చార్జ్ చేశారు. మూడు రోజుల తర్వాత మరలా రీ-చెకప్‌కి వెళ్లినప్పుడు నాన్నను పరీక్షించిన డాక్టర్లు, “అంతా బాగుంది, మీరింక ధైర్యంగా ఉండవచ్చు” అని చెప్పగానే మేమంతా ఎంతో సంతోషించాము. మా నాన్నను హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళినప్పటినుండి, “బాబా! మా నాన్న ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వస్తే నా ఈ సంతోషాన్ని సాయి కుటుంబసభ్యుల బ్లాగులో పంచుకుంటాను” అని రోజూ బాబాను తలుచుకుంటూ గడిపాను. బాబా అనుగ్రహంతో నాన్న ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. ఈ బ్లాగును నిర్వహిస్తూ, అందరి సంతోషాలను మనకు అందజేస్తున్న సాయికి మనసారా శతకోటి నమస్కారాలను తెలియచేస్తున్నాను.


ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథాయ నమః


మూడేళ్ళ బాధనుండి ఉపశమనాన్ని ప్రసాదించిన బాబా


గుర్గాఁవ్‌ నుండి సాయిభక్తురాలు శ్రీమతి రమణి తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


సాయిభక్తులందరికీ సాయిరాం! నా పేరు రమణి. నేను సాయిభక్తురాలిని. మేము గుర్గాఁవ్‌లో నివాసం ఉంటున్నాము. నా వయసు 63 సంవత్సరాలు. నా కష్టసమయాలలో బాబా ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉన్నారు. “బాబా! ఇలాగే ఎప్పుడూ నా చేయి వదలకుండా నాకు తోడునీడగా ఉండు తండ్రీ!” ఇటీవల బాబా నాకు ప్రసాదించిన అనుభవాన్ని ఆయనకిచ్చిన మాట ప్రకారం మీతో పంచుకుంటున్నాను.


నేను గత మూడేళ్ళుగా మూత్రపిండాలకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నాను. నా సమస్యను పరిష్కరించడానికి డాక్టర్లు ఎన్నో రకాల చికిత్సలు చేశారు. కానీ ఫలితం లేకపోయింది. డాక్టర్లు సూచించిన మందుల వలన నా శరీరంలో నీరు నిల్వ ఉండిపోయి మూత్రపిండాలలో వాపు వచ్చేసేది. అది ఎక్కువైతే నా గుండెకి కూడా ప్రమాదం. ఈ సమస్య వలన ఆయాసంతో నేను చాలా ఇబ్బందిపడుతూ నరకయాతన అనుభవించేదాన్ని. వెంటనే నన్ను హాస్పిటల్లో చేర్చేవారు. వైద్యంతో తాత్కాలికంగా ఉపశమనం లభించినా మళ్ళీ ఎప్పటికప్పుడు ఆ సమస్యతో నేను ఎంతో బాధపడుతుండేదాన్ని. ఆ కష్టంతో విసిగిపోయిన నేను ప్రతిరోజూ బాబా ముందు నిల్చుని బాబాకు నమస్కరించుకుని, “బాబా! మీరే నాకు సమస్తం. మీ ఈ బిడ్డకి ఏది మంచో, ఏది చెడో మీకు తెలుసు. దయచేసి నా అనారోగ్య సమస్యను పరిష్కరించండి” అని బాబాను వేడుకుని, బాబా ఊదీని పెట్టుకునేదాన్ని. నా ఈ సమస్య తీరితే నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటానని బాబాకు చెప్పుకున్నాను. ఆ తరువాత బాబా ప్రేరణగా నేను వేరే డాక్టర్ని సంప్రదించాను. ఆ డాక్టర్ నాకు మెరుగైన చికిత్సను అందించారు. బాబా అనుగ్రహంతో నా ఆరోగ్యం ఇప్పుడు చాలావరకు మెరుగైంది. ఇంకా సమస్య ఉన్నా మునుపటి అంత కష్టం లేదు .“థాంక్యూ సో మచ్ బాబా! సరైన సమయంలో మీరు నాకు డాక్టర్ రూపంలో దర్శనమిచ్చి నన్ను కాపాడారు. మిమ్మల్ని నమ్ముకున్నవారెవరూ నిరాశచెందరు. మీ అభయహస్తం వారికి ఎప్పుడూ ఉంటుంది సాయీ!”



7 comments:

  1. RamuJuly 21, 2020 at 6:52 AM
    🙏🌹🙏 ఓం సాయిరాం🙏🌹🙏
    మధురం మధురం శ్రీ సాయి లీలామృతం
    సుమధురం సాయి దివ్య నామం!!
    !!ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి!!
    !!ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి!!
    !!ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి!!
    🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

    ReplyDelete
  2. Om sai ram 2 anugrah of sai is very nice. He cures our health. I also experienced my health problem. I have etching problem. I suffered more than one year. My son is doctor. He treated me, he gave injections and tables. Long time it took to cure. I suffered very much. Red big rashes appeared on my body. I went to skin doctor also. That treatment never gave relief to me

    ReplyDelete
  3. జై సాయిరాం! జై గురుదత్త!

    ReplyDelete
  4. Baba amma arogyam manchiga cheyi thandri pleaseeee

    ReplyDelete
  5. ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథాయ నమః

    ReplyDelete
  6. OM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH..Om Sai Ram

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo