సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

కాకాసాహెబ్ దీక్షిత్ - రెండవ భాగం...



దీక్షిత్‌కు బాబాపై ఉన్న ప్రేమ కారణంగా తన సాటి భక్తులను కూడా ఎంతగానో ప్రేమించేవాడు. తాను శ్రీసాయి సన్నిధికి చేరుకున్న సంవత్సరంలోనే (1909) బాలాభాటే అనే భక్తుడు కూడా బాబా సన్నిధికి చేరుకున్నాడు. ఇద్దరూ బాబాపట్ల అంకితభావంతో ఉంటూ భాగవతం వంటి గ్రంథాలను కలిసి పఠించేవారు. అన్నీ విడిచి సాయిని అంటిపెట్టుకుని శిరిడీలో స్థిరపడిన భాటే అంటే దీక్షిత్‌కు ఎనలేని అభిమానం ఏర్పడింది. ఆ అభిమానం అతనితోనే ఆగలేదు, అతని కుటుంబంపై కూడా ప్రసరించింది. భాటే భార్యను 'భాభీ' అనీ, 'సాయిబా' అనీ ప్రేమగా పిలుస్తూ, పేదరికంలో అలమటిస్తున్న ఆ కుటుంబానికి అండగా నిలిచి వారి బాగోగులు చూసుకోసాగాడు దీక్షిత్. ఒక్కమాటలో చెప్పాలంటే భాటే కుటుంబంపై అతను చూపిన ప్రేమ, కరుణ వెలకట్టలేనివి.

కాకాసాహెబ్ దీక్షిత్ బాబా దర్శనం చేసుకున్నప్పటినుండి ఎక్కువగా శిరిడీలోనే ఉంటూ ఉండేవాడు. ఆ కారణంగా అతని కుటుంబసభ్యులు కూడా శిరిడీ వచ్చి అతనితోపాటు ఉండేవారు. దీక్షిత్ పెద్దకొడుకు రామకృష్ణ(బాబు దీక్షిత్)ను శిరిడీలోని మరాఠీ పాఠశాలలో చేర్చారు. బాలాభాటే పెద్దకొడుకైన బాబుభాటే కూడా అదే పాఠశాలలో చదువుతుండేవాడు. పిల్లలిద్దరూ ఒకే వయస్సువారు, ఒకే తరగతి చదువుతుండేవారు. పాఠశాలలో ఇచ్చిన హోమ్‌వర్కును కలిసి చేసుకుంటూ వాళ్ళిద్దరూ మంచి స్నేహితులయ్యారు. చావడిలో బాబా నిద్రించే రాత్రి ఈ పిల్లలిద్దరూ జరీటోపీలు ధరించి బాబా యొక్క చోప్‌దారుల వలే చేతిలో ఒక కర్ర పట్టుకుని చావడి ప్రవేశద్వారం వద్ద నిలబడి బాబాకు సెల్యూట్ చేస్తూ, "ఇక విశ్రాంతి తీసుకోండి మహారాజా" అని అనేవారు. పిల్లలిద్దరూ శిరిడీలో విద్యను పూర్తిచేశాక ఉన్నత చదువులకోసం నగరానికి వెళ్ళవలసి వచ్చింది. దీక్షిత్ భాటేతో సంప్రదించి తన భార్యతోపాటు పిల్లలిద్దరినీ ముంబైకి పంపారు. బాబుభాటేను తమ సొంతబిడ్డలా చూసుకునేవారు దీక్షిత్. ఆహారం, దుస్తులు వంటివి ఏవి తన కొడుకు బాబుకి ఇచ్చినా, వాటిని బాబుభాటేకు కూడా ఇచ్చేవారు. విల్లేపార్లేలోని వారి ఇంటిలోకి తరచూ తేళ్లు, పాములు చొరబడేవి. అందువలన పిల్లలిద్దరికీ ఇనుప మంచాలు కొని వేయించారు. పిల్లలిద్దరూ ముంబైలో పాఠశాల విద్యను పూర్తిచేశాక బనారస్ సెంట్రల్ హిందూ కళాశాలలో చేరారు. బాబుభాటే B.A. లో చేరగా, బాబుదీక్షిత్ B.Sc లో చేరాడు. ఇద్దరూ తెలివైనవారు, కష్టపడి చదివి మంచి గ్రేడ్‌లతో ఉత్తీర్ణులయ్యారు. అంతలా భాటే కుటుంబాన్ని ఆదరించారు దీక్షిత్. బాబాపై అతనికున్న అంతులేని ప్రేమే దీనికంతటికీ కారణం.

మరొక భక్తుడైన బడేబాబాకు బాబా అతిథి స్థానమిచ్చి ఎంతగానో గౌరవించేవారు. మొదట్లో భక్తులు ఆరతికి సన్నాహాలు మొదలుపెట్టగానే బడేబాబా లేచి క్రిందనున్న సభామండపంలోకి వెళ్ళిపోయేవాడు. అతడు ఆరతిలో పాల్గొనేవాడు కాదు. కాకాసాహెబ్ దీక్షిత్ అతనికి నచ్చజెప్పి సభామండపానికి వెళ్ళకుండా చేశారు. అయినప్పటికీ అతను ఆరతిలో పాల్గొనేవాడు కాదు. చాలామంది హిందూభక్తులకు అతని పద్ధతి నచ్చేది కాదు. కానీ కాకాసాహెబ్ మాత్రం, 'సాయిబాబా అతనిని తమవానిగా అంగీకరించారు. అంటే అతను మనలో ఒకడు. అలాంటప్పుడు అతనిపట్ల వివక్ష ఎందుకు? అతని ప్రవర్తనను చూసీచూడనట్లు వదిలివేయండి' అని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ బడేబాబాలో పెరిగిన అహం కారణంగా భక్తులు అతనిపట్ల విసుగుచెంది అతన్ని ద్వేషించసాగారు. బాబా మహాసమాధి చెందిన తరువాత కూడా బడేబాబా శిరిడీలోనే ఉండదలచాడు. కానీ శిరిడీలోని ఇళ్ళన్నీ దాదాపు హిందువులవే. అతనిపట్ల ద్వేషంతో వాళ్లెవరూ అతను బసచేయడానికి కనీసం ఒక గదిని కూడా ఇవ్వలేదు. అటువంటి పరిస్థితిలో, హిందూ యాత్రికుల వ్యతిరేకత తీవ్రంగా ఉన్నప్పటికీ దీక్షిత్ తన వాడాలో అతనికి వసతి కల్పించాలని నిశ్చయించుకున్నాడు. దీక్షిత్ అలా చేయడాన్ని నానా చాందోర్కర్ కూడా వ్యతిరేకించాడు. మొదటిసారి తనకు బాబా గురించి చెప్పిన నానాపై దీక్షిత్‌కు ఎంతో గౌరవమూ, అభిమానమూ ఉన్నప్పటికీ ఆ విషయంలో మాత్రం అతని మాటను లెక్కచేయలేదు. వాళ్ళందరితో దీక్షిత్ ఒకటే చెప్పాడు, "బాబా తనవారిగా అంగీకరించిన ప్రతి ఒక్కరినీ మనలో ఒకరిగా చూడాలి" అని. దీక్షిత్ సమతాభావం అంత ఉన్నతమైనది. అది బాబా ద్వారా పొందుపరచుకున్న గొప్ప సూత్రాలపై ఆధారపడి ఉంది. అందువలన అతను అన్ని జీవులలోనూ, పదార్థాలలోనూ భగవంతుడిని చూసేవాడు.

"నేను నా భక్తులకు ఏ హానీ జరగనివ్వను.  నేను వాళ్ళ గురించి ఆలోచించాలి. అవసరంలో వాళ్ళకు సహాయం అందించడానికి నేను నా నాలుగు చేతులను చాచాలి" అని బాబా అనేవారు. కానీ బాబా అప్పుడప్పుడు తమను తాము ఏమీ చెయ్యకుండా నియంత్రించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటి కొన్ని సంఘటనలు:

1911, డిసెంబరులో దీక్షిత్ కుమార్తె వత్సల జ్వరంతో బాధపడసాగింది. బాబాపై నమ్మకంతో దీక్షిత్ నిశ్చింతగా ఉన్నాడు. కానీ తీవ్ర జ్వరంతో బాధపడుతున్న వత్సలకి బాబా స్వప్నదర్శనమిచ్చి, "నువ్వు ఎందుకు ఇక్కడ పడివున్నావు? వచ్చి వేపచెట్టు క్రింద పడివుండు" అని అన్నారు. తను ఆ విషయం అందరికీ చెప్పగా అందరూ అది అశుభశూచకంగా భావించారు. మరుసటిరోజు ఉదయం బాబా షామాను, "దీక్షిత్ కుమార్తె మరణించిందా?" అని అడిగారు. షామా ఆ మాట వింటూనే ఆందోళనతో, "ఓ దేవా! ఎందుకలా అశుభం పలుకుతావు?" అని అన్నాడు. అప్పుడు బాబా, "తను ఈరోజు మధ్యాహ్నం మరణిస్తుంది" అని అన్నారు. బాబా చెప్పినట్లే ఆరోజు మధ్యాహ్నానికి వత్సల మరణించింది. అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ విపత్తును దీక్షిత్ తట్టుకోవాల్సి ఉంటుందని సర్వజ్ఞుడైన బాబాకు ముందే తెలుసు గనుకనే కొద్దిరోజుల ముందు భావార్థ రామాయణం గ్రంథ ప్రతిని తెప్పించమని అతనితో చెప్పారు బాబా. సరిగ్గా వత్సల మరణించిన సమయానికి ఆ గ్రంథం పోస్టులో అతనికి చేరింది. ఏ గ్రంథమైనా బాబా చేతుల మీదుగా తీసుకొని పారాయణ చేసే అలవాటున్న దీక్షిత్ భావార్థ రామాయణ గ్రంథాన్ని తీసుకొని మశీదుకు వెళ్లి, దాన్ని బాబా చేతిలో పెట్టాడు. బాబా దానిని పైకి, క్రిందికి తిప్పి, ఆ పుస్తకంలోని ఒక పేజీని తెరిచారు. ఆ పేజీలో, కిష్కిందకాండలో శ్రీరాముడు వాలిని వధించిన తరువాత, భర్త మరణానికి శోకిస్తున్న అతని భార్య తారని శ్రీరాముడు ఓదారుస్తున్న ఘట్టం ఉంది. “దాన్ని చదివి అర్థం చేసుకో” అని దీక్షిత్‌ని ఆదేశించారు బాబా. దానిని చదివాక దీక్షిత్ మనసుకు శాంతి చేకూరింది. అయితే, ‘దీక్షిత్ తమ సన్నిధికి వచ్చిన తొలిరోజుల్లో ఎక్కడో దూరాన విల్లేపార్లేలో జరిగిన ప్రమాదం నుండి వత్సలని కాపాడిన బాబా, ఇప్పుడు శిరిడీలో తమ సన్నిధిలోనే ఆమెకు మరణం సంభవిస్తే, తమనే అంటిపెట్టుకొనివున్న తమ భక్తునికోసం ఆమెను మరణం నుండి ఎందుకు కాపాడలేదు?’ అని ఎవరికైనా అనిపించవచ్చు. బాబా తలచుకుంటే ఆ పని చేయగలరు కూడా. ఒకసారి మాలన్‌బాయి అనే భక్తురాలు మరణించినప్పుడు బాబా ఆమెను తిరిగి బ్రతికించారు. మరి వత్సల విషయంలో బాబా ఎందుకు అలా చేయలేదనే ప్రశ్నకు సమాధానం మరో రెండు సంఘటనల ద్వారా మనకు లభిస్తుంది.  

ఒక వృద్ధురాలు తనకున్న ఒక్కగానొక్క కొడుకుతో శిరిడీలో ఉండేది. ఒకసారి అతనిని ఒక పాము కాటువేసింది. ఆ వృద్ధురాలు హృదయవిదారకంగా రోదిస్తూ పరిగెత్తుకుంటూ బాబా వద్దకు వచ్చి, తన కొడుకు ప్రాణాలు కాపాడటానికి ఊదీ ప్రసాదించమని అర్థించింది. అయితే, బాబా ఆమెకు ఊదీ ఇవ్వలేదు. దాంతో ఆమె వెళ్ళిపోయి మళ్ళీ కొద్దిక్షణాల్లోనే తన కొడుకు చనిపోయాడని పెద్దగా రోదిస్తూ గుండెలు బాదుకుంటూ తిరిగి వచ్చి, తన కొడుకును తిరిగి బ్రతికించమని బాబాను వేడుకుంది. బాబా ఆమెకు ఊదీ ఇవ్వలేదు, మరే సహాయమూ చేయలేదు. కనీసం ఆమెకు ఓదార్పు కలిగేలా ఏమీ మాట్లాడలేదు కూడా. అక్కడే ఉన్న దీక్షిత్ ఆమె రోదన చూసి చలించిపోయి బాబాతో, "ఆమెకేదైనా సహాయం చేయండి బాబా. ఆమె పరిస్థితి చాలా హృదయవిదారకంగా ఉంది. నా కోసమైనా చనిపోయిన ఆమె కొడుకును తిరిగి బ్రతికించండి" అని అర్థించాడు. అందుకు బాబా, "భావూ! ఇటువంటివాటిలో చిక్కుకోకు. ఏదైతే జరిగిందో అది మంచికోసమే జరిగింది. అతనిప్పుడు క్రొత్త దేహంలోకి ప్రవేశించాడు. కనిపించే ఈ దేహంతో అతను పూర్తిచేయలేని మంచిపనులను ఆ దేహంతో పూర్తిచేస్తాడు. నేను అతన్ని తిరిగి ఈ దేహంలోకి తీసుకొస్తే ఈ దేహంలో జీవం వస్తుంది, కానీ అతను ధరించిన ఆ క్రొత్త దేహం మరణిస్తుంది. నీకోసం ఆ పని నేను చేస్తాను. కానీ నువ్వు దాని పరిణామాల గురించి ఆలోచించావా? నీకు ఆ బాధ్యత గురించి ఏమైనా తెలుస్తుందా? ఆ బాధ్యతను తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా?" అని అన్నారు. బాబా మాటలలోని భావాన్ని అర్థం చేసుకున్న దీక్షిత్ మౌనంగా ఉండిపోయాడు.

మరోసారి, 1913లో ఎస్.బి.మొహిలే అనునతడు పైపెదవి చీలివున్న తన కుమార్తెకు నయం కావాలన్న ఉదేశ్యంతో ఆమెను తీసుకొని బాబా దర్శనానికి వచ్చాడు. బాబా అతనితో, "నేనీమెకు నయం చేయగలను. కానీ ప్రయోజనం లేదు. ఆమె దైవానుగ్రహం గలది. కాబట్టి ఆమె జీవితకాలం చాలా స్వల్పమే. ఆమె వచ్చే సంవత్సరం మూడవ నెలలో చనిపోతుంది" అని అన్నారు. బాబా చెప్పినట్లే 1914, మార్చిలో ఆమె చనిపోయింది. అదేవిధంగా వత్సల విషయంలో జరిగివుంటుంది. చిన్నవయస్సులోనే తనకి ప్రారబ్ధం ముగిసిపోయినందున మరణమే తనకు మంచిదని బాబా భావించి ఉంటారు. అందుకే మరణం అనివార్యమైనప్పుడు తమ భక్తులు దాని ఆవశ్యకతను గుర్తించి, వియోగాన్ని దృఢచిత్తంతో సహించాలని, మరణం ఎల్లవేళలా అమంగళకరం కాదని బాబా సూచించేవారు. ప్రాపంచిక వ్యక్తి యొక్క ఆలోచనకి మరణం ఎల్లప్పుడూ చెడుగా తోచినప్పటికీ మరణం ఎల్లవేళలా అమంగళకరం కాదని ఈ సంఘటనల ద్వారా తెలుస్తుంది.

బాబా విధించిన ఏకాంతవాసం:

ప్రాపంచిక వ్యక్తులు, పరిసరాల సాంగత్యంలో తలమునకలయ్యే వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక పురోగతి ప్రపంచానికి దూరంగా సత్పురుషుల సాంగత్యంలో పవిత్రమైన వాతావరణంలో ఏకాంతంగా గడపడంపై ఆధారపడి ఉంటుంది. అందుకే మన పవిత్రగ్రంథాలు కొంతకాలం గృహస్థాశ్రమంలో గడిపిన తర్వాత అన్నిటినీ విడిచిపెట్టి వానప్రస్థాశ్రమంలోకి (అడవులలో తపస్సు చేసుకుంటూ ఏకాంతవాసం చేయడం) వెళ్లాలని ఉద్బోధిస్తున్నాయి. 1912 నుండి, అంటే తన నలభైఎనిమిదవ ఏటనుండి దీక్షిత్ శిరిడీలో శ్రీసాయి సన్నిధిలో గడిపిన జీవితాన్ని వానప్రస్థాశ్రమంగా పరిగణించవచ్చు. శిరిడీ వచ్చేనాటికి అతను 25 సంవత్సరాల గృహస్థాశ్రమాన్ని గడిపి వానప్రస్థాశ్రమంలో అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే అరణ్యాలకి వెళ్ళవలసిన అవసరం అతనికి లేదు. 1912లో ఒకరోజు బాబా అతనితో, “కాకా! నువ్వు నీ వాడా పైఅంతస్తులోనే ఉండు. అక్కడికి, ఇక్కడికి తిరగకు. జనసందోహంతో మనసును కలవరపరిచే ఇక్కడికి (మశీదుకి) కూడా రావద్దు" అని చెప్పి అతనికి వానప్రస్థాశ్రమాన్ని విధించారు. బాబా ఆదేశాన్ని శిరసావహించి ఎంతో నిబద్ధతతో తన వాడాలోనే ఉండసాగాడు దీక్షిత్. అయితే కనీసం ఆరతి సమయంలోనైనా బాబా దర్శనం చేసుకోలేకపోతున్నందుకు అతనెంతో బాధపడ్డాడు. దాంతో అతను షామా ద్వారా బాబాను అర్థించి మధ్యాహ్న ఆరతికి, చావడిలో జరిగే ఆరతికి హాజరయ్యేందుకు అనుమతిని పొందాడు. ఈవిధంగా బాబా అతనిని తొమ్మిది నెలలపాటు ఏకాంతవాసంలో ఉంచారు. ఈ విషయం విల్లేపార్లేలో ఉన్న దీక్షిత్ భార్యకు తెలిసి తన భర్తకు తోడుగా ఉందామని శిరిడీ వచ్చింది. అయితే వాడా పైఅంతస్తులోకి ఆడవాళ్లు రాకూడనే నియమం ఉన్నందున ఆమె క్రిందనే ఉండాల్సి వచ్చింది. అప్పుడు షామా బాబా వద్దకు వెళ్లి, "ఆమె ఉన్నప్పుడు కాకా క్రిందకు వచ్చి నిద్రించవచ్చా లేక పైఅంతస్తులోనే నిద్రపోవాలా?" అని అడిగాడు. అందుకు బాబా, "కాకా పైఅంతస్తులోనే నిద్రపోవాల"ని గట్టిగా చెప్పారు. బాబా ఆదేశానుసారం దీక్షిత్ అలాగే చేశాడు. ఈవిధంగా కఠిన తపస్సును, బ్రహ్మచర్యవ్రతాన్ని దీక్షిత్ చేత బాబా చేయించసాగారు. దాంతో దీక్షిత్ భార్య తిరిగి విల్లేపార్లేకి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. వెళ్ళేముందు తన ప్రయాణానికి అనుమతి కోరడానికి ఆమె బాబా వద్దకు వెళ్ళింది. అప్పుడు బాబా ఆమెతో, “అమ్మా! కాకా గురించి నువ్వేం దిగలుపడవద్దు. అతని బాగోగులు నేను చూసుకుంటాను" అని అన్నారు. బాబా ఇచ్చిన భరోసాతో ఆమె ఆనందంగా తిరిగి ముంబాయి వెళ్ళిపోయింది. 

ఏకాంతవాసంలో ఉంటున్న దీక్షిత్ చేత బాబా నిత్యమూ సద్గ్రంథ పఠనం చేయించారు. తద్వారా అతనిలో భక్తిజ్ఞానాలు పెంపొందింపజేసి, హృదయాన్ని పరిశుద్ధం గావించి భగవత్ సాక్షాత్కారానికి సమాయత్తపరచసాగారు. కాకాసాహెబ్ ముందుగా భాగవతంలోని పదవ స్కంథానికి మరాఠీ వ్యాఖ్యానమైన హరివరద గ్రంథాన్ని పూర్తిచేసి బాబా వద్దకు వెళ్లి, "బాబా! గ్రంథ పారాయణ పూర్తయింది. మళ్ళీ దాన్నే చదవమంటారా లేక వేరే ఏ గ్రంథాన్నైనా చదవమంటారా?" అని అడిగాడు. అప్పుడు బాబా, "ఏకనాథ బృందావన గ్రంథాన్ని పారాయణ చేయి" అని చెప్పారు. అయితే ఏకనాథ్ మహరాజ్ రచించిన అనేక గ్రంథాలలో ఏ గ్రంథానికీ బృందావనమనే పేరులేదు. అందువల్ల దీక్షిత్‌కి బాబా మాటలలోని అంతరార్థం బోధపడలేదు. చివరికి అతను ఏకనాథ భాగవతంలోని 11వ స్కంథాన్ని బాబా వద్దకు తీసుకొని వెళ్లి, "బాబా! ఇదేనా మీరు చెప్పిన బృందావన గ్రంథం?" అని అడిగాడు. బాబా, "అవును" అన్నారు. అయితే ఆ గ్రంథాన్ని ఏకనాథ బృందావనమని బాబా ఎందుకన్నారో కాకాకు, మిగతా భక్తులకు అర్థం కాలేదు. ఏదేమైనా బాబా అజ్ఞానుసారం అతను ఆ గ్రంథ పారాయణ ప్రారంభించాడు. పారాయణ ముగింపుకొచ్చేసరికి బాబా మాటలలోని మర్మమేమిటో కాకాకు అర్థమైంది. ఆ గ్రంథంలోని 31వ అధ్యాయం చివరి శ్లోకంలో ఏకనాథ్ మహరాజ్ ఇలా చెప్పారు:

హా ఏకాదశ నవ్హే జాన్
ఏక తిసామ్ ఖనాచే బృందావమ
ఏత నిత్య బసే శ్రీకృష్ణ
స్వానంద పూమా నిజసత్ల’  
  
భావం: ఇది పదకొండవ స్కంథం కాదు, ఇది 31 అంతస్తుల బృందావనం. ఇక్కడ శ్రీకృష్ణుడు తన నిజతత్త్వంలో ఆనందస్వరూపుడై వసిస్తాడు.

దాంతో దీక్షిత్‌తో సహా భక్తులందరికీ 'ఈ గ్రంథంలోని చివరి శ్లోకాన్ని ఉద్దేశించే దీనిని బృందావన గ్రంథమని బాబా ప్రస్తావించార’ని అర్థమై, బాబాకు ఏకనాథ భాగవతమంతా పూర్తిగా తెలుసునని ఆశ్చర్యపోయారు.

దీక్షిత్ ప్రతిరోజూ ఉదయాన్నే లేచి, స్నానసంధ్యాదులు ముగించుకొని వాడాలోని తన గదిలో బాబా చిత్రపటానికి యథోచితంగా పూజ చేసి ధ్యాననిమగ్నుడయ్యేవాడు. ఒకసారి అలా ధ్యానంలో ఉన్నప్పుడు దీక్షిత్‌కు శివలింగ దర్శనమైంది. కాసేపటికి సరిగ్గా అటువంటి పోలికలతో ఉన్న ఒక శివలింగాన్ని మేఘ తీసుకొని వచ్చాడు. మరోసారి ధ్యానంలో దీక్షిత్‌కి విఠలుని దర్శనం అయింది. తరువాత అతను బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు బాబా అతనితో, "విఠల్ పాటిల్ వచ్చాడా? నువ్వు అతన్ని కలిశావా? అతడిట్టే తప్పించుకుపోతాడు. అతనిని గట్టిగా పట్టుకోకపోతే నీ దృష్టి ఒక్కక్షణం మరలినా అతను జారిపోతాడు" అని అన్నారు. ఇది ఉదయం జరిగింది. ఆ మధ్యాహ్నానికి విఠల దర్శనానికి సంబంధించి మరొక ఆధారం లభించింది. ఎక్కడినుండో ఒక వ్యక్తి ఇరవై, ఇరవైఐదు విఠలుని అందమైన చిత్రపటాలను అమ్ముకోవడానికి శిరిడీ వచ్చాడు. ఆ చిత్రపటాలలోని విఠలుని రూపం ముమ్మూర్తులా ఆ ఉదయం తనకు ధ్యానంలో దర్శనమిచ్చిన విఠలుని రూపాన్ని పోలివుండటం చూసి దీక్షిత్ ఆశ్చర్యపోతూ బాబా తనతో అన్న మాటలను గుర్తుచేసుకొని ఎంతో ప్రేమగా ఒక చిత్రపటాన్ని కొనుక్కొని భక్తితో తన పూజలో ప్రతిష్ఠించుకున్నాడు.

దీక్షిత్ ఏకనాథ భాగవతం పారాయణ పూర్తిచేసిన తరువాత, "వ్యాఖ్యానంతో కూడిన భగవద్గీత చదవమంటారా?" అని బాబాను అడిగాడు. అప్పుడు బాబా, "ఏకనాథ భాగవతం, భావార్థ రామాయణాలను మాత్రమే నిష్ఠగా పారాయణ చేస్తూ ఉండు. కేవలం చదవడం మాత్రమే కాకుండా చదివినదానిని మననం(నిధిధ్యాసనం) చేసి ఆచరణలో పెట్టు" అని అతనిని ఆదేశించారు. బాబా ముఖతః తనను పఠించమని చెప్పిన ఆ రెండు గ్రంథాలను అతను తన జీవితాంతం భక్తిశ్రద్ధలతో పఠించాడు. పూర్వసంస్కారాలకు తగిన సద్గ్రంథాల పారాయణ, మననము చేస్తేనే ప్రయోజనముంటుంది. అలాగాక స్వతంత్రించి మనకు తోచిన గ్రంథాలు చదువుకుంటే ప్రయోజనముండదు సరిగదా, అవి మన పూర్వసంస్కారానికి సరిపడనపుడు మనకున్న సంస్కారాలను కూడా వికలం చేస్తాయి. అటు తర్వాత మన సంస్కారానికి తగిన గ్రంథం చదివినా అంతటి ఫలితమీయజాలదు. మనస్సు వికలమయ్యాక సద్గురువు మాట గూడా హృదయంలో నాటుకోవడం చాలా కష్టం. అట్టివారు సద్గురువు లభించినా ఆశ్రయించటం కష్టమౌతుంది. ఎవరి పూర్వసంస్కారానికి తగిన గ్రంథ పారాయణను వారికి విధించడం సాయి వంటి సద్గురువులకు మాత్రమే సాధ్యమౌతుంది.

అలా పూజ, జపధ్యానాదులు, గ్రంథపఠనలతో తొమ్మిది నెలలు ముగిసిన తరువాత బాబా దీక్షిత్ చేత ఏకాంతవాసాన్ని, తీవ్రమైన సాధనను విరమింపజేసి బొంబాయి వెళ్లడానికి అనుమతి ఇచ్చారు. ఒకసారి వెన్న తీసి ముద్దచేశాక, దానిని మజ్జిగలో వుంచినా, వివేకవైరాగ్యాలనే నూనె పూసుకున్నాక సంసార సంరక్షణమనే పనసకాయ కోసినా, అందులోని మమకారమనే పాలు మనకంటుకునే ప్రమాదముండదని రామకృష్ణ పరమహంస చెప్పనే చెప్పారు. ప్రతి చిన్న విషయంలోనూ పరిమితమైన తన ధర్మాధర్మ విచక్షణ, ఇష్టాయిష్టాలు, అభిప్రాయాలకు తావీయక శ్రీసాయి చెప్పినట్లు తు.చ. తప్పకుండా నడుచుకున్నాడు గనుకనే దీక్షిత్ కృతార్థుడయ్యాడు.

source: లైఫ్ అఫ్ సాయిబాబా by బి.వి.నరసింహస్వామి.
రిఫరెన్స్: దీక్షిత్ డైరీ బై విజయకిషోర్.

 


ముందు భాగం కోసం
బాబా పాదుకలు తాకండి.




 


 


తరువాయి భాగం కోసం
బాబా పాదాలు తాకండి.


5 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo