ఈరోజు భాగంలో అనుభవాలు:
- చివరి నిమిషంలో అందిన బాబా సహాయం
- బాబాయందు విశ్వాసంతో అన్నీ సాధ్యమే
చివరి నిమిషంలో అందిన బాబా సహాయం
సాయిభక్తురాలు శ్రీ తన అనుభవాలను ఇలా తెలియజేస్తున్నారు:
నేను సాయిభక్తురాలిని. సాయిబాబా పరీక్షించి, చివరి నిమిషంలో నన్ను కాపాడిన రెండు అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటాను.
మొదటి అనుభవం:
ఒకసారి ఉద్యోగంలో నాకొక వర్క్ అప్పగించారు. రోజుల తరబడి నేనెంత కష్టపడినా ఆ వర్క్ కి సంబంధించి సరైన పరిష్కారం కనుక్కోలేకపోయాను. ఆ విషయమై సీనియర్స్‌ని కూడా సహాయం చేయమని అడిగాను. కానీ వాళ్లు కావాలనే సహాయం చేయకుండా ఊరుకున్నారు. నాకేం చేయాలో తెలియలేదు. చివరికి ఒకరోజు మేనేజ్‌మెంట్ వాళ్లు 'రేపు వర్క్ ని చూస్తామ'ని చెప్పారు. ఇక నేను నా ఉద్యోగాన్ని కోల్పోయే సమయం వచ్చిందని అనుకున్నాను. దిగులుతో బాబాని ప్రార్థించి, చివరిసారిగా నావంతు ప్రయత్నం చేయడం మొదలుపెట్టాను. ఆశ్చర్యం! బాబా కృపతో సమస్య అరగంటలో పరిష్కారమైంది. మేనేజ్‌మెంట్ నా వర్క్ చూసి చాలా సంతోషించారు. అలా బాబా నన్ను చాలా తీవ్రంగా పరీక్షించి చివరికి నన్ను కాపాడారు.
రెండవ అనుభవం:
ఈ సమస్య గురించి పూర్తిగా వివరించలేను గానీ, అది నాకు జీవన్మరణ సమస్య. ఆ సమస్య గురించి ఎవరితోనూ చెప్పుకోలేక నాలో నేనే ఆందోళనపడ్డాను. ఆ దిగులుతో గుండెల్లో దడ, శరీరంలో వణుకు మొదలయ్యాయి. బాబా ముందు కూర్చుని ప్రార్థన కూడా చేయలేక ఏడ్చేశాను. భయంతో నిద్రకూడా పట్టలేదు. బాబా ఫోటో గుండెలకు హత్తుకుని పడుకొనే ప్రయత్నం చేశాను కానీ, నిద్రపట్టలేదు. ఇక పూజగదిలోకి వెళ్లి బాబా ఊదీ పెట్టుకున్నాను. దాంతో కాస్త ఉపశమనంగా అనిపించింది. మరుసటిరోజు కూడా అదే ఆందోళన. మనసారా బాబాను ప్రార్థించాను. తర్వాత సరిగ్గా మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఆశ్చర్యంగా నా ఫ్రెండ్, "ఏదో ఒక విధంగా నేను నీకు సహాయం చేస్తాను" అని మెసేజ్ పెట్టాడు. తననుండి వచ్చిన సానుకూల స్పందన 'సాయి లీలే' అని నేను గుర్తించాను. తన ద్వారా కొంత సమస్యనుండి బయటపడ్డాను. మిగతా సమస్యను కూడా బాబా పరిష్కరించి నన్ను కాపాడతారని నా నమ్మకం. ఆయన ఎప్పుడూ తన భక్తులను విడిచిపెట్టరు. ఆయనెప్పుడూ మనకు తోడుగా ఉంటారు. ఏ విషయంలోనూ అధైర్యపడకండి.
బాబాయందు విశ్వాసంతో అన్నీ సాధ్యమే
ఖతార్ నుండి ఒక సాయిభక్తురాలి అనుభవం:
మా కుటుంబమంతా సాయిబాబా భక్తులం. 2017లో మా అమ్మాయి యూనివర్సిటీ పరీక్షలు వ్రాస్తూ, "కఠినమైన పరీక్షా పద్ధతి కారణంగా ఈ సెమిస్టర్‌లో ఉత్తీర్ణురాలిని కాలేన"ని దిగులుగా చెప్పింది. నేను, "సాయిబాబాయందు నమ్మకముంచి నిజాయితీగా నీవంతు ప్రయత్నం నువ్వు చేయి. ఫలితాన్ని బాబాకు విడిచిపెట్టు. అంతా ఆయనే చూసుకుంటారు" అని చెప్పాను.
పరీక్షలు పూర్తైన తర్వాత 2017, డిసెంబరులో బాబా ఆశీర్వాదాల కోసం మేము శిరిడీ వెళ్ళాం. మేము కారులో మందిరం వద్దకు చేరుకుని కారు దిగబోతుండగా మా అమ్మాయి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుని, "ఇప్పుడే యూనివర్సిటీనుండి నేను తర్వాత సెమిస్టర్‌కి ప్రమోట్ చేయబడ్డానని మెయిల్ వచ్చింది" అని చెప్పింది. మేము శిరిడీ చేరుకునేసరికి ఈ అద్భుతమైన మెసేజ్ మాకు అందింది. అంతా బాబా లీల. మేమంతా ఆనందంలో మునిగిపోయాము. తరువాత నేను మా అమ్మాయితో, "అధికారికంగా కాలేజీనుండి ఈ విషయం మనకు లెటర్ ద్వారా అందిన వెంటనే ఈ అద్భుతమైన అనుభవాన్ని బ్లాగులో పంచుకుందాము" అని చెప్పాను. ఆ కోరిక ఇన్నిరోజులకు తీరింది. మీకు బాబాయందు పూర్తి విశ్వాసం ఉంటే, మీరు మీవంతు 100% కృషి చేసి ఫలితాన్ని బాబాకు విడిచిపెట్టండి. ఎటువంటి పరీక్షా సమయమైనా అంతా బాబా చూసుకుంటారు.
మరో అనుభవం:
నేను ఏడునెలలుగా నెలసరి రాక చాలా ఇబ్బందిపడ్డాను. ఆ సమయంలో నేనెంతోమంది డాక్టర్లను సంప్రదించి ఎన్నో మందులు వాడాను. అయినా కూడా ఎటువంటి ఫలితం కనబడలేదు. చివరిగా నేను, "బాబా! నా ఈ సమస్య పరిష్కారం అయితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని మ్రొక్కుకున్నాను. అలా మ్రొక్కుకున్న తర్వాత నా నెలసరి మొదలైంది. దాంతో దాదాపు ఏడునెలల తర్వాత నా ఆరోగ్యం మామూలు స్థితికి వచ్చింది. "థాంక్యూ సో మచ్ బాబా!"