సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహ సుమాలు - 17వ భాగం


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 17వ భాగం

శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.

అనుభవం - 8

నా మిత్రుడొకరు ఒక రోజు బాంద్రాలో బాబా చిత్రపటానికి పూజ చేసుకుంటున్నారు. బాబాకు అలంకరించడానికి పూలను సిద్ధం చేసుకున్నారు. వాటిలో ఉత్తమమైన మోగ్రా పూలు కూడా ఉన్నాయి.  పూలను బాబా చిత్రపటానికి అలంకరించాలని తన కోరిక. కానీ పూలు పెద్దవిగా ఉండటం వలన గంధంలాగ అతుక్కునే అవకాశం లేదు. బాబా ఎప్పుడూ పూలను ముక్కు వద్ద ఉంచుకొనే వారనే విషయం తనకు గుర్తుకు వచ్చింది. అప్పుడు పూలను ముక్కు వద్దకు తీసుకు వెళ్లి మరలా క్రింద పెట్టాలనేది తన ఆలోచన. కానీ ఆ పూలు  ముక్కు వద్ద అతుక్కోన సాగాయి. ఆ పూలు సాయంకాలం వరకు అలాగే అతుక్కునే ఉన్నాయి.

అనుభవం - 09

శిరిడీలో బాబూ ఖరండీకర్ అనే పేరు గల బ్రాహ్మణుడు ఉండేవాడు. శాంతి అనే మూడేళ్ళ వయసు కలిగిన తన కూతురు  సాఠెవాడా వెనుక భాగంలోనున్న బావిలో పడింది. చాలాసేపు బావిలోనే ఉంది. తరువాత తనను బయటకు తీసి చూస్తే, తనకు ఏమాత్రం చిన్న దెబ్బ కూడా తగలలేదు. “బాబా నన్ను కిందపడకుండా పట్టుకున్నారు” అని తను చెప్పసాగింది. తనకు తాను బాబా సోదరినని చెప్పుకొనేది. బాబాకు తన పట్ల ఎంతో ప్రేమ.

అనుభవం - 10

చిదంబర్ కేశవ్ గాడ్గిల్  అనే పేరు కలిగిన బాబా భక్తుడు ఒకరు ఉండేవారు. ఆయన ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసేవారు. కొన్నిరోజులు నగర్ జిల్లా కలెక్టర్ కు కార్యదర్శిగా పని చేసారు. తరువాత సిన్నూర్ లో  మమ్లేదార్ గా పని చేసారు. తనకు తరచు బాబా దర్శనభాగ్యం కలుగుతుండేది. సిన్నూర్ నుండి తనకు చాలా దూరానికి బదిలీ అయింది. వెంటనే వెళ్ళి చేరవలసిందిగా ఉత్తర్వులు వచ్చాయి. బాబా దర్శనానికి వెళ్ళే అవకాశం లేకుండా పోయింది. తాను కోపర్గాం నుండే రైలులో వెళ్ళాడు. కాని బాబా దర్శనానికి వెళ్ళలేకపోవడంతో చాలా చింతించసాగాడు. తరువాత బండి వెళుతున్నప్పుడు ఒక్కసారిగా కిటికీ ద్వారం నుండి ఒక కాగితపు పొట్లం వచ్చి తన శరీరంపై పడింది. విప్పిచూస్తే అందులో ఊదీ లాంటి పొడి కనపడింది. ఆ పొట్లాన్ని తాను జాగ్రత్తగా దాచుకున్నాడు. తరువాత కొన్ని రోజులకు బాబా దర్శనానికి వెళ్ళే భాగ్యం కలిగింది. అప్పుడు బాబా తమకు తామే “నీవు రాలేదని నీకు ఊదీ పంపించాను. నీకు చేరింది కదా?” అని అన్నారు. ఆ మాటలు వినిన గాడ్గిల్ ఎంతో ఉద్వేగానికి లోనయ్యాడు. తరువాత తాను ఆ ఊదీని ఒక తాయెత్తులో పోసి ఉంచాడు. చివరి వరకు ఆ తాయెత్తు తనవద్దే ఉండేది.

అనుభవం - 11

నాకు పని మీద ఇండోర్ కు వెళ్ళవలసి ఉంది. మన్మాడ్ మీదుగా వెళ్ళవలసి ఉండటంతో శ్రీ సద్గురు సాయిబాబా దర్శనం చేసుకొని తరువాత ముందుకు వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. నా స్నేహితులు నన్ను శిరిడీకి వెళ్లవద్దని చాలా దూరం చెప్పి చూసారు. “బాబా సమయానికి బయలుదేరడానికి అనుమతి ఇవ్వరు" అని వారి   అభిప్రాయం. అప్పుడు నేను వారితో “ఇండోర్ కు వెళ్ళడానికి ఇంకా రెండు రోజుల సమయం ఉంది. ఈ లోపల వెళ్ళి బాబా దర్శనం చేసుకొని తరువాత ఇండోర్ కు  వెళ్ళాలని నిర్ణయించుకున్నాను” అని చెప్పాను. నేను సంకల్పం చేసుకున్న విధంగానే శిరిడీ వెళ్ళాను. శ్రీ సద్గురు సాయిబాబా దర్శనం కోసం ద్వారకామాయిలోకి వెళ్ళాక బాబా నన్ను “ఎప్పుడు బయలుదేరుతున్నావ్?” అని అడిగారు. “మీరు ఈ రోజు వెళ్ళమని ఆజ్ఞాపిస్తే, ఈ రోజే బయలుదేరి వెళతాను” అని చెప్పాను. కానీ నాకు రెండు రోజులు ఉండే సమయం ఉంది. ఆ విషయాన్నే బాబాకు చెప్పాను. ఆ విషయం చెప్పగానే “రెండు రోజులు ఉండి వెళ్ళు” అని బాబా ఆజ్ఞాపించారు. బాబా ఆజ్ఞ ప్రకారం నేను రెండు రోజులు ఉండి తరువాత ఇండోర్ కు వెళ్ళాను. అర్థమేమిటంటే నా మిత్రుల భయం నిరర్థకమైంది.

అనుభవం - 12

సఖారామ్ హరి ఉరఫ్ బాపుసాహెబ్ జోగ్ గారి మాతృశ్రీ మరణించారు. ఆవిడ ఉత్తరక్రియల కోసం తాను నాసిక్ వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. అందుకోసం బాబాను అనుమతి ఇవ్వమని అడిగాడు. బాబా అనుమతి ఇవ్వడం ఒక్కొక్కరోజు వాయిదా వేస్తూ వచ్చారు. అప్పుడు బాపూసాహెబ్ బాబాతో “బాబా, మా శాఖ యొక్క బ్రాహ్మణులు ఇక్కడ ఉండరు. అందువలన నేను ఈ రోజు నాసిక్ బయలుదేరి వెళ్ళాలి” అని చెప్పాడు. అందుకు బాబా “ఇంకో రెండు ప్రహరీలు (ప్రహరి= మూడు గంటలు) చూద్దాం” అని చెప్పారు. బాబా చెప్పి అరగంట అయిందో, లేదో అంతలోనే ఒక మంచి విద్వానుడైన మరియు జోగ్ శాఖకు చెందిన ఒక వైదిక బ్రాహ్మణుడు శిరిడీకి వచ్చాడు. సర్వ ఉత్తరక్రియలు శిరిడిలోనే జరిగాయి. చివరిరోజు నాసిక్ వెళ్ళడానికి శ్రీ బాపూసాహెబ్ జోగ్ బాబా అనుమతిని అర్థించాడు. ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను. అప్పుడు నేను “బాబా, మీరు కూడా రండి. బాపూసాహెబ్. నేను అందరం బయలుదేరుదాం. దారిలో బాపూసాహెబ్ ను నాసిక్ లో  వదులుదాం. తరువాత మనం బొంబాయికి వెళదాం” అని బాబాతో అన్నాను. అందుకు బాబా "నేను ఎప్పుడూ ఎవరినీ మధ్యలో వదిలేరకం కాదు” అని అన్నారు.

తరువాయి భాగం రేపు.

సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo