సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 20వ భాగం.


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 20 వ భాగం.

శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.

అనుభవం - 21

శ్రీ హరిసీతారాం దీక్షిత్ గారికి 4/3/1918 వ తారీఖున శ్రీ గణేష్ గోవింద్ నార్కే గారు వ్రాసిన ఉత్తర సారాంశం

మొన్నటి రోజు (2 మార్చి, 1918) నాథ్ షష్టి  (శ్రీ ఏకనాథ్ మహారాజ్ గారి పుణ్యతిథి) జరిగింది. మధ్యాహ్నం బాబా చాలామంది భక్తులను ఆజీబాయి(వృద్దురాలు) చేసే పురాణ పఠనానికి పంపారు. అక్కడ బాయి తమ మధురమైన స్వరంతో నాథ్ చరిత్రను వివరించారు. ఇక్కడ అల్పాహారం తరువాత బాబా కొన్ని విషయాలను చెప్పారు. అందులో నామ్ దేవ్ మరియు  కబీర్ల గురించిన ఉల్లేఖనం ఉంది. సాయంకాలం భోజన సమయంలో బాబా తాత్యాతో గొడవ పడ్డారు. భోజన పళ్ళాన్ని విసిరి వేసారు. పండ్లు తినబోయే ముందు బాబా ఉగ్రనరసింహావతారం ఎత్తారు. దాదాతో “వీడిని బయటకు నెట్టివేయండి. లేదంటే నేను క్రిందకు వెళతాను” అని బాబా అన్నారు. ఆవేశంలో తాత్యాను కొట్టడానికి రెండు రాళ్ళను తీసుకున్నారు. ఎంతో కోపంతో తాత్యా క్రిందకు వచ్చాడు. కానీ తాను “బాబా పండ్లను తినకుంటే చావడికి వెళ్ళనివ్వను” అని మొండి పట్టుపట్టాడు. సాయంకాలం 8-45 గంటలకు గంట మ్రోగింది. అందరూ ప్రోగయ్యారు. భజన ప్రారంభమైంది. కానీ తాత్యా అలిగి ఉన్నాడు. బాబా, దాదా ద్వారా తాత్యాకు కబురు పంపారు. కానీ తాత్యా తాను పట్టిన పట్టు విడువలేదు మరియు బాబా పండ్లు తినడానికి ఇష్టపడలేదు. 9.30 అయింది. 10.30 అయింది. మండపం అంతా స్త్రీ, పురుషులతో నిండిపోయింది. పల్లకీని తయారు చేసి ఉంచారు. భజన ఉచ్చస్వరంతో జరుగసాగింది. బాబా  తమ ఆసనం పైనుండి లేచి కలశం ఉంచిన బల్లవద్దకు వచ్చారు. తరువాత స్తంభం వద్దకు వెళ్ళి కూర్చొన్నారు. బాబా శాంతంగా ఉన్నారు. ఏమీ మాట్లాడలేదు. “పైఠాన్లో పల్లకీ బయలుదేరేంత వరకు బాబా అలాగే ఆలస్యం చేస్తారు” అని కొందరన్నారు. అసలు పైఠాన్లోనే ఉన్నట్లు ఈ కొందరు భక్తి పారవశ్యంతో నాట్యం చేస్తూ భజన చేయసాగారు. 11 గంటలయింది. ఇంటికి వెళ్ళడానికి దాదా అనుమతిని అడిగాడు. “ఎక్కడకు వెళతావు? కూర్చో” అని బాబా అన్నారు. ఆ తరువాత బాబా  జబ్బులోనున్నప్పుడు ఒకసారి దర్బార్ నిర్వహించారు, ఇప్పుడు కూడా అలాగే నిర్వహిస్తారా ఏమిటి? అని అందరికి అనిపించసాగింది. తేడా ఏమిటంటే ఆ రోజు ఎంతో శాంతంగా ఉన్నారు. ఈ రోజు భజన ఎంతో ఉత్సాహంగా జరుగుతూ సర్వత్రా ఆనందమే ఆనందం! రెండూ కూడా చావడి ఉత్సవరోజులే! చివరకు తాత్యా తన మొండి పట్టును వదిలాడు. తాత్యా తన పట్టును వదిలాక బాబా మొండి పట్టు వేసుకొని కూర్చొన్నారు. “వెళ్ళేది లేదు” అని అన్నారు. దాదాతో “బాగా రాత్రయింది, ఇక వెళ్ళు” అని అన్నారు. భజన చేసేవారిని తిట్టి భజన ఆపించారు. మహల్సాపతితో “పద, మనం తకియాకు వెళదాం” అని అన్నారు. తాత్యా పైకి వెళ్ళాడు. బాబా తనతో “అందరినీ బయటకు నెట్టు” అని చెప్పారు. కొంతసేపటి తరువాత తాత్యాను కూడా వెళ్ళమని చెప్పారు. అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. బాపూసాహెబ్ కూడా వెళ్ళాడు. బాబా (నేను, ఖడకే వగైరా వంటి వారం ద్వారకామాయిలోనే ఉన్నాము) తమ ఆసనం పైన కూర్చున్నారు. మరలా ఎంతో కోపం తెచ్చుకున్నారు. విపరీతంగా తిట్టసాగారు. ఆయన తిట్టిన వాళ్ళల్లో మా పేర్లు కూడా ఉన్నాయి. చివరకు రాత్రి సుమారు 12 గంటల ప్రాంతంలో “పద” అని అన్నారు. హడావుడిగా గంటను మరలా మోగించారు. తాత్యా మరియు బాపూసాహెబ్ వచ్చారు. ఎప్పటిలాగానే చావడి  ఎంతో ఆనందంగా జరిగింది. నాథ్ షష్టియే ఈ లీల అని అందరికీ అనిపించసాగింది. మరుసటిరోజు ఉదయం దర్బారులో ఈ విషయం పైనే సుదీర్ఘంగా చర్చ జరిగి లేచేటప్పటికి 10:30 అయింది. గోడ వద్దకు తాత్యా వచ్చాడు. అప్పుడు తాత్యా "ఏమిటి బాబా, రాత్రి 12 గంటల వరకు భజన చేయమని మాకు మాములుగా చెపితే వినమా? మహా చతురుడివి” అని అడిగాడు. “నీవేరా, నీవే చతురుడివి. నీవు,  ఆ బాపూసాహెబ్ ఎప్పుడూ చతురత ప్రదర్శిస్తూనే ఉంటారు” అని బాబా సమాదానం ఇచ్చారు. లెండీ నుండి తిరిగి వెళ్ళేటప్పుడు బాబా అందరినీ “నిన్న ఆలస్యమైందా?" అని అడగసాగారు. ఆ విధంగా ఇక్కడ అంతా ఆనందమే ఆనందం.

తరువాయి భాగం రేపు.

సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo