సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 23వ భాగం.


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 23వ భాగం.

శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.

అనుభవం - 26

ఒక గృహస్థు యొక్క కుమారుడు కొన్ని సంవత్సరాలు అదృశ్యమయ్యాడు. ఆ గృహస్థు బాబా వద్దకు వెళ్ళి తన కుమారుని గురించి ప్రార్థించాడు. “తాను నీకు తొందరలోనే కలుస్తాడు” అని బాబా అన్నారు. రెండురోజుల తరువాత ఆ గృహస్తుకు ఇంటికి వెళ్ళడానికి బాబా అనుమతిని ప్రసాదించారు. ఆ గృహస్థు ఠాణేలో ఉండేవాడు. తాను ఠాణే స్టేషనులో దిగాడు. అదే సమయంలో బొంబాయి నుండి రైలు వచ్చింది. ఆ బండిలో నుండి ఆ గృహస్థు యొక్క కుమారుడు దిగాడు. అంటే బాబా వద్ద నుండి తిరిగి రాగానే తన ఊరిలోనే, స్టేషనులోనే తండ్రీకొడుకులు కలిసారు.

అనుభవం - 27

ఒకసారి మాధవరావు దేశ్ పాండేకు స్వప్నం వచ్చింది. స్వప్నంలో బాబా కనిపించి “గోవర్ధన్ దాస్ వద్దకు వెళ్ళావా? తన తల్లి మరణించింది. తన వద్దకు నీవు వెళ్ళిరావాలి” అని అన్నారు. ఆ విధంగానే మూడవ పొద్దులో గోవర్ధన్ దాస్ వద్దకు వెళ్ళాడు. అక్కడకు వెళ్ళాక నిజంగానే గోవర్ధన్ దాస్ తల్లి ఒకటి, రెండు రోజులకు ముందే మరణించింది అని తెలిసింది. 

అనుభవం - 28

ద్వారకానాథ్ ప్రధాన్ ఒకసారి బాబా దర్శనానికి వెళ్ళాడు. తాను తమ అత్తగారి వద్దనుండి ఒక ఉత్తరాన్ని బాబా పేరుతో తీసుకు వచ్చాడు. ఆ ఉత్తరాన్ని ద్వారకానాథ్ బాబాకు ఇచ్చారు. బాబా ఆ ఉత్తరాన్ని తిరగత్రిప్పి పట్టుకుని “వెళుతున్నావా?” అని అన్నారు. బాబా యొక్క మాటలు నేను విన్నాను, కానీ మిగిలినవారు వినలేదు. అయినప్పటికీ ఉత్తరం చదివి వినిపించమని చెప్పారు. ఆ ఉత్తరంలో ద్వారకానాథ్ భార్య అనారోగ్యం గురించి వ్రాసి ఉంది. ఉత్తరం చదివిన తరువాత ద్వారకానాథ్ “నా భార్యను ఇక్కడకు ఎప్పుడు తీసుకువస్తారు?” అని అడిగాడు. అప్పుడు బాబా “నాలుగు రోజులలో వస్తుంది” అని అన్నారు. ఆ తరువాత సరిగ్గా నాలుగు రోజులకు ద్వారకానాథ్ భార్య చనిపోయింది. అందరూ ఆశ్చర్యపోయారు. కాని నేను బాబా ఉచ్చరించిన మాటలు విన్నాను. అందువలన జరిగిన విషయం నాకు ఆశ్చర్యం అని అనిపించలేదు.

అనుభవం - 29

ఒక గురుపూర్ణిమనాడు గోవింద్ రఘునాథ్ దాభోళ్కర్ సకుటుంబ సమేతంగా శిరిడీకి వెళ్ళినప్పుడు తన వద్దనున్న డబ్బులన్నీ అయిపోయాయి. తరువాత ఒకటి రెండు రోజులకు శ్రీ హరిసీతారాం దీక్షిత్ మరియు మోరేశ్వర్ ప్రధాన్లు శిరిడీకి వెళ్ళారు. బాబాకు దక్షిణ సమర్పించడంతో ప్రధాన్ యొక్క డబ్బులు మరుసటి రోజే అయిపోయాయి. బాబా మరలా ప్రధాన్ ను దక్షిణ అడిగారు. అప్పుడు ప్రధాన్ “డబ్బులు లేవు” అని చెప్పాడు. అప్పుడు బాబా “ఆ అణ్ణా వద్దకు వెళ్ళి అడుగు” అని అన్నారు. ముందటిరోజువరకు కూడా అన్నాసాహెబ్ వద్ద డబ్బులు లేవు అనేది అందరి అభిప్రాయం. అది నిజం కూడా! అయినప్పటికీ బాబా ఆజ్ఞాపించడం వలన ప్రధాన్ తన వద్దకు డబ్బులు అడగడానికి వెళ్ళాడు. ప్రధాన్ డబ్బులడగడం చూసి అణ్ణాసాహెబ్ ఆశ్చర్యపోయాడు. కారణం తాను ఇంటి నుండి (బాంద్రా నుండి) తెప్పించుకొన్న రొక్కం కొంచెం సేపటి ముందరే ఒక గృహస్థు తెచ్చి ఇచ్చినట్లుగా మూడో వ్యక్తికి ఎవరికీ తెలియదు. అప్పుడు అణ్ణాసాహెబ్, ప్రధాన్ తో “నాకు ఇప్పుడే డబ్బులు వచ్చాయన్న విషయం నీకు ఎట్లా తెలుసు?” అని అడిగాడు. అప్పుడు ప్రధాన్ “నాకేం తెలుసు, నన్ను బాబా పంపించారు కాబట్టి వచ్చాను” అని సమాధానం ఇచ్చాడు. “బాబాకు సర్వం తెలుసు” అనే అనుభవం ఇద్దరికీ వచ్చింది.

అనుభవం - 30

షహదేలోని ఒక బ్రాహ్మణునికి ఉరిశిక్ష పడింది. తన మిత్రుడైన ముసల్మానుకు బాబాపై పరిపూర్ణ శ్రద్ద ఉండేది. తాను బాబా వద్దకు వెళ్ళి, తన మిత్రుని వృత్తాంతమంతా బాబా చరణాలకు నివేదించారు. అప్పుడు బాబా "నాలుగురోజులలో అల్లా మంచి చేస్తాడు” అని అన్నారు. ఆ ముసల్మానును శిరిడీలోనే ఉంచేసారు. ఆ ముసల్మాను అక్కడ ఉన్నప్పుడు తన మిత్రుడు చేసుకున్న అప్పీలుతో తనను నిర్దోషిగా విడుదల చేసారనే వార్త వచ్చింది.

తరువాయి భాగం రేపు 

సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo